ఓరోరి తమ్ముడు ఒక మాటినరా తమ్ముడు
మద్యానికి బానిసై కాయమంత చెదలైన
తాగుతూ, ఊగుతూ తైతక్కలాడుతూ
తాళి కట్టిన పెళ్ళాన్ని తరిమి తరిమి కొడతావ్
కట్టుకొన్న పాపానికి కర్మంటు సరిపెడితే
మైకమంత దిగినాక, బుజ్జగిస్తు, బులిపిస్తూ
నంగి, నంగి మాటలతో ఒట్టు, నిట్టూర్పులతో
నమ్మలేని నైజానికి న్యాయం దొరకని అతివ
అవనిలా భరిస్తూ సాగుతోంది ముందుకు
ధూమంలో దుముకుతూ,
గుట్కాలను నములుతూ,
పొగాకు కంపుతో పొగచూరిన నీకు,
సానుభూతి చూపిస్తూ, సపర్యలు చేస్తూ
మత్తుకు బానిసై, మంచి, చెడులు మరచినా!
మహరాజును నేనంటు విర్రవీగు నిన్ను చూసి
పోనీలే అనుకొంటు మనసు దిటవు చేసుకొంటు
మహిలో నిలుస్తున్న ‘మహిళ’లెందరో
రోగంతో, రొస్టుతో కాని పనులు చేసినా
కన్నవాళ్ళ కోసమే కన్నీళ్ళను దిగమింగి
ఇంటి గుట్టు కాపాడుతూ, ‘ఇహం’లో నిలుస్తు
‘అమ్మ’ అడుగుల్లో నడుస్తూ,
‘అవని’లో బతికే ‘అతివ’లెందరో
ప్రేమంతా ఇంకిపోయి, పేరుకే మిగిలి
మత్తుకు బానిసైన మగనితో వేగలేక
దూరంగా వెళ్తున్న ‘వనితా మణులు’ ఎందరో
అనర్థాకు నెలవైన, మాదక ద్రవ్యాల నొదిలి
మానవత్వంతో మనుతూ విలువలను
కాపాడుతూ
సంసార నావలో సారధిగా నిలుస్తే
సాగు నీ బతుకు బండి సవ్యమై ‘ఇల’లో