ప్రియమైన సంధ్యా! ఎలా వున్నావ్? నిన్ను కలిసి, మాట్లాడి చాలా రోజులైంది. ఇప్పుడు అమెరికాలో వున్నాను. వచ్చాక తప్పకుండా కలుస్తాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. గౌరవం కూడా సమస్యలతో, డైరెక్ట్‌గా పోరాడి, ప్రజల పక్షాన, ముఖ్యంగా స్త్రీల పక్షాన పోరాడే నీ స్పూర్తి నా కిష్టం. ‘మల్లు స్వరాజ్యం’ గారంటే ఎంతప్రేమో, నువ్వన్నా అంతే. మొన్నీ మధ్య ‘నూరేళ్ళు సంతకం’గా మనముందు నిలిచిన కోండపల్లి కోటేశ్వరమ్మ గారిలా నిబద్ధతతో వుంటావు నువ్వు. మన తరంలో నువ్వొక జ్యాలవే నాదృష్టిలో. నేను రాయడం వరకూ, కాలేజీల్లో క్లాసుల వరకూ,
ఉపన్యాసాలవరకే పరిమితం నేను. మీలా ఫీల్డ్ వర్క్‌లో నిలబడి పోరాడిన స్థితిలేదు. ఒక ఆలోచనను అందివ్వగలనే కానీ, ఆచరణలో మున్ముందుకు పోయేది మీరేకదా! కొండవీటి సత్యవతి అన్నా అందుకే ఎక్కువ ఇష్టం నాకు. స్త్రీల కోసం, జనం కోసం పరిశ్రమిస్తున్నారంతా.
సంధ్య అనగానే ఇంటిపేరును పక్కన పడేసి ూూఔ సంధ్యగానే నీ పేరు స్థిరపడిపోయింది. ‘ప్రగతిశీల మహిళా సంఘం’ కార్యకర్తగానే, అధినేతగానే అందరికీ తెలుసు. నిజం సంధ్యా ఇవేవో మెరమెచ్చు మాటలు నీ కోసం చెప్పడం లేదు. బతుకంతా పోరాడుతున్న జ్వాలవు నువ్వు.
సంధ్యా! నిన్ను మొదటిసారిగా ఎక్కడ చూసానో చెప్పనా! మీ పెళ్ళిరోజున, దిల్షుక్నగర్ – కమ్యూనిటీ హాల్లో జరిగింది. రామకృష్ణగార్ని నిన్నూ అప్పుడే చూడడం. యాకూబ్ పిలిస్తే వచ్చాన్నేను. స్టేజ్ మ్యారేజ్లుంటాయని కూడా తెలియని అమాయకపు రోజులవి. అందుకని మీ నిరాడంబరత బాగా నచ్చింది. ఆ రోజు చిరునవ్వుతో ఎలా కన్పించావో, ఇప్పటికీ అలానే వున్నావు. నీ తెగింపు, ధైర్యం, చొరవ, అంతం చేసే వరకూ వదలని పట్టుదల, ఇవన్నీ కూడా నీమీద గౌరవం పెరగడానికి కారణమయ్యాయి. సమాజం కోసం బతకాలంటే బంధనాలొద్దనుకుని పిల్లలే ఒద్దనుకున్న నీ కమిట్మెంట్ ఎంత గొప్పదో తెలుసా! చాలామందికి నువ్వొక ధైర్యం. నీ ఊహే బలం. నువ్వున్నావన్న నమ్మకం. నువ్వు నేర్పిన ఆత్మ విశ్వాసం, నీ చేతుల్లో తయారైన కార్యకర్తలు, నిన్నొక ఉద్యమ నేతగానే చూస్తారు.
ఎవరు ఎవరు సంధ్యా! ఇంత ఇదిగా తోటి స్త్రీల కష్టాలను తీర్చడమే పనిగా పెట్టుకున్నది. చాలా అరుదుగా వున్నారు. వాళ్ళల్లో నువ్వు మొదటి పదిలో వుంటావు. నువ్వు నాకు తెలవడమే గర్వంగా భావించే రోజుల్నించి, నువ్వొక మంచి స్నేహితురాలిగా నాకు మిగిలిన క్షణాల వరకు సాగిన ఈ జీవిత ప్రయాణంలో నువ్వొక అపురూపం నాకు. ఏమివ్వగలను నీకు? అక్షరాలతో నిన్ను తలుచుకోవడం మినహా. ఈ మధ్య ‘షుగర్’ బాగా ఎక్కువై ఇబ్బంది పడుతున్నానని విన్నాను. ఇప్పుడెలావుంది? ఊళ్ళకు
ఊళ్ళు తిరుగుతూ, సమయానికి ఆహారం దొరకక, ఏది దొరికితే అది తిని, మందులు వేసుకోక మరింతగా పెంచేసుకున్నావ్? సంధ్యా! గుర్తొచ్చింది ఒకసారి మీ ఊరు ‘నేరెడ’ కూడా వెళ్లాం. మీతోటలు, అమ్మను చూసానప్పుడే. ఎంతో ప్రేమగా మాట్లాడారు. నువ్వు రాకున్నా, నీ స్నేహితులమని ఆప్యాయంగా చూసారు. ఆ అమ్మ ఇప్పుడు లేదుకదూ! మట్టి మడతల్లో కలిసిపోయింది, ఔను ఈ మధ్యకాలంలో తెలిసిన వాళ్ళల్లో చాలామంది వెంటవెంటనే వెళ్ళిపోతున్నట్లు అన్పిస్తోంది. ఒక దుఃఖం మరచిపోక ముందే మరో దుఃఖం వచ్చి చేరుతోంది.
ఒకసారి మా కాలేజ్‌లో కూడా సమస్య వస్తే, నిముషాల్లో వచ్చావు నువ్వు. నీ సహాయం పొందని వాళ్ళెవరు చెప్పు. నీ జీవితమంతా ఇలా ప్రజల పక్షాన నిలిచిన పోరాడిన నువ్వు నా దృష్టిలో గొప్పవ్యక్తిని. నువ్వు గుర్తొచ్చినప్పుడు కూడా ఒళ్లు గగుర్పోడుస్తుంది. నిజం సంధ్యా! నిన్నెప్పటికీ ప్రేమించే వాళ్ళల్లో ముందుంటాను. ఈ లేఖ ద్వారానైనా నా ప్రేమప్రకటనను నీకు తెలియజేయాల నిపించింది. ఆరోగ్యం జాగ్రత్త. మనం చేయాలనుకున్న పనులకు దేహమవసరం కదా! ఏమంటావ్? మరి ఉండనా ప్రస్తుతానికి.