చిన్నారి తల్లులారా, చిరు దీపపు వెలుగుల్లారా
అమ్మ కొంగు చాటు బిడ్డల్లారా
మనవాడేనంటూ, మగవాళ్ళను నమ్మి మోసపోకండి
ఏ పుట్టలో ఏముందో, మాయ మాటలకు లొంగి
చిక్కుల్లో పడి ఛిద్రం కాకండి
పసిపిల్లలను పాడుచేసి ప్రాణాలు తీసే పాపాత్ముల్లారా మీ కుటుంబం గుర్తురాదా!
ఐనా!
కరుడుగట్టిన కసాయిలకు విలువలేం తెలుసు
దివ్యాంగులను కూడా వదలని నీచ సంస్కృతవుతోంది
పసిపిల్లల నుండి పండు ముదుసలి వరకు
మీ వంకర చూపుల కుంపటికి ఆహుతౌతున్నారు
ప్రేమ, పెళ్ళంటూ వెంటపడి వేధిస్తూ,
అతివలను ఆనవాలు లేకుండా చేస్తున్నారు
తర తమ బేధాలకు తల ఒగ్గకుండా
మానవత్వం మంటగలిపే మారణాయుధాలౌతున్నారు
కట్నాల వలయంలో అక్రమ సంబంధాల
వేధింపులతో ఆడవాళ్ళ ఆయువు తీస్తున్నారు
గుండె పగిలిన ఆడపిల్లల ఆక్రోశం
బద్దలయిందంటే, మగవాడి పుట్టుకను
మొగ్గలోనే తుంచుతుందేమో,
ఆగి ఆలోచించండి
ఆడది అమ్మగా ఉన్నంతవరకే ఈ
కరుణ, దయ, దాక్షిణ్యాలు
‘అమ్మ’ అపర కాళి అయ్యిందంటే
‘మృగాళ్ళ’ ఆయువిక చెల్లు
తస్మాత్ జాగ్రత్త