అమ్మా ఆడదే
భార్యా ఆడదే
కూతురు మాత్రం వద్దా నాన్నా
నేనింకా భూమిపై పడకముందే
అమ్మ చెప్పే గాథలెన్నో విన్నా
నాన్న అంటే నమ్మకమని
నాన్నంటే భరోసా అని
నాన్నంటే ప్రేమసౌధమనీ
ఆడపిల్లలకు తొలి హీరో అని
అందుకే పెంచుకున్నా నీపై ప్రేమ
కానీ…
అమ్మ కడుపుపై తగిలే
నీ పాద ముద్రలు
అయ్యాయి నా నమ్మకాన్ని
తుంచే తూనికరాళ్ళు
అమ్మ తనువును గాయపరిచే
నీ పాద ముద్రలు నా గుండెను
తొలిచే మానని గాయాలు
రక్షకుడు అనుకున్న నాన్న
భక్షకుడైతే
మృగాల చూపుల గాయాల నుండి
నన్ను రక్షించేదెవరు…
నమ్మకమనుకున్న నాన్నే
అపనమ్మకమైతే
భూమిపై నా పాదముద్రలను
ఎలా ముద్రించాలి
అయినా పుడతా
నేనాగ్రహిస్తే ఈ సృష్టే ఉండదు
అందుకే మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటా
నా ”భూమిక”ను నెరవేర్చుతూనే ఉంటా…