స్తీలపై లైంగిక వేధింపులు ఇంకానా? -భండారు విజయ

ప్రపంచం మొత్తంగా 21వ శతాబ్దం అంచులకు నెట్టివేయబడుతున్న సందర్భంలో భారతదేశంలో స్త్రీలు ఇంకా రెండవ స్థాయి పౌరులుగా ఉండవలసి రావడం శోచనీయం. ఈ రోజుకి కూడా దేశ రాజకీయాలు మహిళల చుట్టూ, వారికి సంబంధించిన అంశాల చుట్టూ చర్చలు, ఆందోళనలు, పోరాటాలు జరగటం బాధాకరమైన విషయం. సమాజంలో స్త్రీలకు పురుషుల అవసరాలు తీర్చే వస్తువులుగా, పిల్లల్ని కని పెంచే యంత్రాంగాలుగా, ఇంటి పనులు, వంట పనులు చేసే పనిమనుషులుగా చూస్తున్నారే తప్ప స్త్రీలు తమతో కలిసి జీవించే సహచరులుగా పురుషులు ఈనాటికీ చూడకపోవడం విచారకరం. పురుషులతో పాటు స్త్రీలకు సమాన హోదా, సమాన పనికి సమాన వేతనం లాంటివి కనుచూపు మేరలో కనబడకపోయినా, స్త్రీ, పురుషుల మధ్య ఉండాల్సిన సమానత్వం ఎండమావిగానే మిగిలిపోతున్నది. సమానత్వం లేకపోగా కనీసం స్త్రీలు సాటి మనుషులే అన్న మానవీయ విలువలు కూడా లేకుండా పోయాయి. ఇంటా, బయట, పనిచేసే ప్రదేశాలలో… స్త్రీలకు ఎక్కడా రక్షణ లేకుండా పోయింది. అనేక సందర్భాలలో స్త్రీలు శారీరక, మానసిక, లైంగికంగా అణచివేతలు, వివక్షలు, వేధింపుల బారిన పడటం మనం గమనిస్తున్నాం.

స్త్రీలపై బయట సమాజంతో పాటు అధికారికంగా కుటుంబ వ్యవస్థలో అత్యధిక హింస జరుగుతున్న విషయం ప్రభుత్వ నివేదికలు మనకు చెబుతున్నాయి. ఆ నివేదికల ఆధారంగానే చూసినట్లయితే రోజువారీ జీవనంలో స్త్రీలు దుర్భరమైన జీవితాలను గడుపుతున్నారు. కుటుంబంలో స్త్రీలు ఇంటి పెద్ద లేదా ఇంటి అధికారి లేదా యజమాని ఆధీనంలో ఎల్లప్పుడూ ఉండవలసి రావటం, వారి జాలి, దయల మీద ఆధారపడటం, ఆర్థిక స్వేచ్ఛ అనేది నామమాత్రపు భద్రతను అందించడం నిజంగా సిగ్గుపడాల్సిన అంశం. ప్రజాస్వామిక విలువలు లేని కుటుంబ వ్యవస్థలో మహిళలు ఈ రోజుకు కూడా భర్త, అత్త, మామ, ఆడబిడ్డలు మరియు ఇతర కుటుంబ సభ్యుల అనాగరిక వేధింపులను, అణచివేతలను, వివక్షలను ఎదుర్కొంటూ అటు ఇళ్ళలో జీవించలేక, బయటకు వచ్చి స్వతంత్రంగా బతకలేమన్న నిరాశ, నిస్పృహలతో అర్థాంతరంగా జీవితాలను ముగించటం గమనిస్తున్న సందర్భం.

ఇటీవలి కాలంలో మహిళలకు సంబంధించిన సమస్యలు, చట్టాలు, చట్ట సవరణలు, గృహ హింస చట్టంలో వచ్చిన మార్పులు, చేర్పులు అలాగే ముస్లిం స్త్రీలు ఎదుర్కొంటున్న త్రిబుల్‌ తలాక్‌ లాంటి విషయంలో జరిగిన పరిణామాలు, 497 వంటి వివాహేతర సంబంధాల చట్టంలో మార్పులు, చేర్పులు, శబరిమల దేవాలయంలోకి స్త్రీల ప్రవేశం గురించి వచ్చిన తీర్పులు, ఆ తర్వాత మతతత్వ శక్తులు వాటిని అడ్డుకున్న తీరు మనం చూసాం. దేశాన్నే కాదు ప్రపంచాన్ని కూడా గడగడలాడిస్తున్న లైంగిక వేధింపులపై నిశ్శబ్దాన్ని వీడి గొంతులు సవరించుకుంటున్న ‘మీ టూ’ ప్రచారాలు ప్రజల్లో ముఖ్యంగా మగవాళ్ళల్లో వేడిని పుట్టించడం… మహిళలను కేంద్రంగా చేస్తూ చర్చలు, వాదోపవాదాలు, ఆందోళనలు వివిధ రకాల నిరసన, ప్రతి నిరసనలు సాగుతున్న వర్తమాన సందర్భంలో నవంబరు 25వ తేదీని అంతర్జాతీయ మహిళ హింస వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటున్నాం.

1960 సంవత్సరంలో డొమైన్‌ రిపబ్లిక్‌ కార్యకర్తలయిన మిరాబుల్‌ సిస్టర్స్‌ను డొమైన్‌ రిపబ్లిక్‌ నియంత రాఫీల్‌ ట్రుజిల్లో హత్య చేయించగా అప్పట్లో పెద్ద ఎత్తున ఉద్యమం చెలరేగింది. ఆ నేపధ్యాన్ని పురస్కరించుకొని ఆనాటి సంఘటనకు స్పందించిన ఉద్యమకారులు నవంబరు 25వ తేదీని స్త్రీలపై జరుగుతున్న అన్ని హింసలకు వ్యతిరేక దినంగా పాటించాలని నిర్ణయించటం జరిగింది. 1999లో ఐక్యరాజ్యసమితి దీన్ని అధికారికంగా ప్రకటించింది. అప్పటినుండి నవంబరు 25న అంతర్జాతీయ మహిళా హింస వ్యతిరేక దినోత్సవంగా దాదాపుగా అన్ని దేశాలు అనేక కార్యక్రమాలు నిర్వహించటం జరుగుతోంది. యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ఫర్‌ ఉమెన్‌ (ఖచీIఖీజువీ) పరిశీలించి ఇతర సంస్థలకు కొన్ని సలహాలను ఇవ్వటం జరుగుతుంది. ఆ సలహాలను పాటించి ప్రతి సంవత్సరం మన దేశంలో కూడా కొన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు అనేక కార్యక్రమాలు నిర్వహించటం జరుగుతోంది.

మారుతున్న జీవన శైలి దాంపత్య జీవనంపై ఎక్కువ ప్రభావం చూపుతోంది. కష్టసుఖాల్లో కలిసి జీవిస్తామని ప్రమాణాలు చేస్తూ వివాహాలు చేసుకుంటున్న నవదంపతులు, మత ఆచారాల ప్రకారం పెళ్ళిళ్ళు చేసుకున్న యువత కూడా భార్యలను మోసం చేస్తూ పర స్త్రీలతో వివాహేతర సంబంధాలు పెట్టుకుని కట్టుకున్న భార్యలను హింసిస్తూ కాపురాలను కూల్చుకుంటున్నారు. ఫలితంగా పోలీస్‌ స్టేషన్లలో బహు భార్యత్వం కింద నమోదయ్యే కేసులే ఎక్కువ. అందులో గృహహింస కేసులు 40% దాకా ఉంటున్నాయి. అలాగే వరకట్న వేధింపు కేసులలో బలయ్యేవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉన్నాయి.

మహిళలపై జరుగుతున్న అత్యాచారాలన్నింటిలో భౌతికంగా కనబడేవి చాలా తక్కువ. కంటికి కనబడని విధంగా మూడో కంటికి తెలియకుండా చాప కింద నీరులా మౌనంగా జరిగే లైంగిక వేధింపు చర్యలు చాలా ఎక్కువే అని చెప్పవచ్చు. అసభ్యకర పదజాలాన్ని ఉపయోగించి కించపరచటం, కన్నార్పకుండా చూడటం, సైగలు చేయటం, అనుచితమైన పరివర్తన కలిగి ఉండటాన్ని లైంగికపరమైన వేధింపులుగా చెప్పవచ్చు. అలాగే పని ప్రదేశాలలో అత్యాచారానికి పాల్పడినా, శారీరక సంబంధం పెట్టుకోమని బలవంతం చేసినా, అశ్లీల పదజాలం వాడినా, అశ్లీల, అభ్యంతకర చిత్రాలు చూడమని, అలా చేయమని బలవంతం చేసినా, లేదా మరే ఇతర శారీరకంగా, మానసికంగా, లైంగికంగా స్త్రీల మనోభావాలను కించపర్చుతూ చేసే ఎటువంటి పనులయినా అవి వేధింపుల కిందకే వస్తాయి.

భారతదేశ ప్రభుత్వ గణాంకాల ప్రకారం ప్రతి నలుగురు స్త్రీలలో ఒక మహిళ లైంగిక వేధింపులకు గురికాబడుతోంది. ప్రతి సంవత్సర గణాంకాలు చూసినట్లయితే సభ్యసమాజం తలదించుకునేట్లుగా రోజురోజుకు ఆ సంఖ్య తగ్గకపోగా పెరిగిపోతున్నది. మహిళలు అంటే గౌరవ, మర్యాదలు అటుంచి కనీసం స్త్రీలను మనుషులుగా కూడా గుర్తించకుండా మనువాదం ముసుగును కప్పుకొని పితృస్వామ్య భావజాలాన్ని ప్రతి పురుషుడిలో నింపే ప్రయత్నం నిరంకుశ హిందుత్వ ప్రభుత్వం చేస్తోంది. ఫలితంగా పసిపిల్లలను మొదలుపెట్టి పండు ముసలి వారిని కూడా వదలకుండా అత్యాచారాలు చేసే విధంగా కులాన్ని, మతాన్ని ప్రోత్సహిస్తోంది. కుల, మత రాజకీయాల బారిన పడకుండా కొంతమంది స్త్రీలు బయటకు వచ్చే ప్రయత్నం చేసినా, నిండుగా బట్టలు వేసుకోకపోయినా, కట్టు, బొట్టు సాంప్రదాయాలను విడిచినా మిమ్మల్ని లైంగికంగా వేధించి, చంపుతామని బెదిరిస్తున్నారు. తమ ఆధీనంలో లేకున్నా, తమను ఎదిరించినా, తమకు లొంగకున్నా పురుష అహంకార ఉన్మాదం స్త్రీల ఎడ అనుచిత ప్రవర్తనతో బాధిస్తున్నది. స్త్రీల మనోభావాలను దెబ్బతీస్తూ బలవంతంగా అయినా సంప్రదాయాలు, సంస్కృతులు అంటూ వారిని కట్టడి చేస్తూ ధన, మానాలతో చెలగాటమాడుతూ ప్రాణాల్ని హరిస్తున్నది.

నగర, పట్టణ ప్రాంతాలతో సంబంధం లేకుండా మారుమూల పల్లెలలో సైతం ప్రేమల పేరుతో వేధింపులు, అత్యాచారాలు, హత్యోన్మాదాలు పెరిగిపోతున్నాయి. బలవంతపు పెళ్ళిళ్ళ పేరుతో వేధింపులు, కట్నాల పేరుతో దాడులు, హింసలు చేస్తూ అనేకమంది స్త్రీలు పోలీసు స్టేషన్ల చుట్టూ తిరగటం, కోర్టులలో పడిగాపులు కాసినా కేసులు ఒక కొలిక్కి రాక, నానా ఇబ్బందులు పడటం జరుగుతోంది. అలాగే ప్రేమిస్తే అనుమానంతో దాడులు, ప్రేమించకపోతే యాసిడ్‌ దాడులు, నమ్మి వెంటవస్తే మూకుమ్మడి అత్యాచారాలు చేయటం, గుట్టుచప్పుడు కాకుండా హత్యలు చేయటం కూడా మనం అనేకసార్లు, పలుచోట్ల చూస్తున్నాం. ఇక కులాంతర వివాహాలు చేసుకున్న దంపతులను కూడా విడవకుండా కాఫ్‌ పంచాయితీలు, కుల పంచాయితీలు పెట్టి చట్ట వ్యతిరేకంగా తీర్పులు జారీ చేయటం, వినకపోతే అమానుషంగా వెంటాడి వేధించటం, సంఘ బహిష్కరణలు, గ్రామ బహిష్కరణలు, కుల బహిష్కరణలు చేస్తూ స్త్రీలను తమ పురుష అహంకార ధోరణులతో అణచివేస్తున్నారు. అవసరమైతే పరువు హత్యలైనా చేసి తమ కులాలు, మతాల పరువును కాపాడుకుంటున్నామన్న ధీమాతో హత్యలు చేస్తున్నారు. తల్లిదండ్రులకు మనఃక్షోభాన్ని కల్గిస్తూ ఫత్వాలు జారీ చేస్తున్నారు. ఎవరికి చెప్పుకోవాలో తెలియని వేధింపులు, ఎక్కడ న్యాయం జరుగుతుందో తెలియక మనోవేదనలకు గురవుతూ దేశ సగభాగమైన మహిళలు తలదించుకుని బతుకు వెళ్ళదీస్తున్నారు. ఏ పేపరు తిరగేసినా, ఏ వార్తా ఛానల్‌ చూసినా అనుక్షణం స్త్రీలపై జరుగుతున్న భౌతిక, మానసిక, రాజకీయ, సామాజిక దాడులు భయాందోళనను కలుగజేస్తున్నాయి. స్త్రీలపై జరుగుతున్న అనేక నేరపూరితమైన వేధింపులు, వివక్షలు, అణచివేతలను స్త్రీలు ఈనాటికీ ఎదుర్కొంటూనే ఉన్నారు.

ముఖ్యంగా స్త్రీలపై జరిగే కుటుంబ హింసలు రోజువారీ జీవితంలో చాలా రకాలుగా ఎదుర్కోవడం జరుగుతోంది. 1. శారీరక హింస ః అంటే శరీరానికి నొప్పి, హాని, గాయం చేయడం, తన్నడం, కొట్టడం, నెట్టడం లాంటివి శారీరక హింస కిందకు వస్తాయి. 2. లైంగిక హింస ః అంటే బలవంతంగా సంభోగానికి ప్రయత్నించటం, స్త్రీలకు ఇష్టం లేకుండా బలవంతంగా లైంగిక చర్యలకు పాల్పడటం, ఆమె గౌరవానికి భంగం కలిగించే ఏ చర్య అయినా లైంగిక వేధింపు కిందకే వస్తాయి. 3. మానసిక హింస ః అంటే అవమానకరంగా, హేళనగా మాట్లాడటం, పిల్లలు పుట్టలేదని నిందించటం, మగపిల్లవాడిని కనలేదని బాధించటం, బెదిరింపు చర్యలకు పాల్పడటం, ఆమె మనసును నొప్పిస్తూ క్షోభకు గురిచేయటం లాంటి వేధింపులన్నీ మానసిక హింసలోకి వస్తాయి. 4. ఆర్థిక హింస ః అంటే కుటుంబ నిర్వహణకు అవసరమైతే డబ్బు, వనరులను ఆమెకు అందించలేకపోవడం, చట్టప్రకారం హక్కుగా ఉన్న వాటిని ఆమెకు హక్కు లేకుండా చేయటం, ఆమెకు సంబంధించిన డబ్బు, నగలు, స్త్రీ ధనం లాంటివి ఆమెకు దక్కకుండా చేయటం, ఇంటి అద్దె చెల్లించకపోవటం, అదనపు కట్నం తెమ్మని హింసించటం లాంటి ఏ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడినా అవి ఆర్థిక హింస కిందకే వస్తాయి.

గృహ హింస నుండి మొదలుపెడితే వరకట్న వేధింపులు, భ్రూణహత్యలు, వ్యభిచారం, మహిళలు, పసిపిల్లల అక్రమరవాణా, రోడ్లపై టీజింగులు, పనిచేసే ప్రదేశాల్లో లైంగిక వేధింపులు… ఇలా చెప్పుకుంటూ పోతే పలుచోట్ల, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో మనకు ప్రతిరోజూ వినిపించటం సహజమైపోయాయి. క్రైమ్‌ రిపోర్టుల ప్రకారం పని ప్రదేశాలలో స్త్రీలు దాదాపుగా 60% వేధింపులకు గురవుతున్నారు. మిగిలిన 40% స్త్రీలు గృహ హింస ద్వారా భర్తలు, అత్తా మామలు, లేదా ఇతర కుటుంబ సభ్యుల వేధింపుల బారిన పడుతున్నారు. షీ టీములు వచ్చాక సైబరాబాద్‌ పరిధిలో ఈవ్‌ టీజింగ్‌ల పేరుమీద దాదాపు 900 కేసులు నమోదయ్యాయి. అలాగే హైదరాబాద్‌, పరిసర ప్రాంతాలలో 1000 మందికి పైగా పోకిరీలను పట్టుకొని జ్యుడిషియల్‌ కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. 500కు పైగా కేసులు విచారణ నిమిత్తం కోర్టులలో ప్రవేశపెట్టబడ్డాయి.

భారతదేశ ప్రభుత్వం వేధింపులకు గురవుతున్న మహిళల రక్షణ నిమిత్తం గృహ హింస నిరోధక చట్టాన్ని రూపొందించింది. 2005లో ఈ చట్టానికి పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. 2007 నుండి ఈ చట్టం కొన్ని రాష్ట్రాల్లో అమల్లోకి వచ్చింది. జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ దీన్ని అమలుపరచుతోంది. ఈ శాఖ జిల్లా ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ను రక్షణాధికారిగా నియమించింది. బాధితుల కేసుల నమోదు, కౌన్సిలర్‌ మరియు న్యాయవాదిని కూడా ప్రభుత్వం నియమిస్తుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని గుర్తించి, వారిని కోర్టులో ప్రవేశపెట్టేందుకు పోలీసుల సహకారాన్ని ఈ శాఖ అందిస్తుంది. అలాగే చట్టపరమైన అన్ని అంశాలను పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేంతవరకు రక్షణాధికారి వారికి అండగా ఉండాలి. అదే విధంగా వేధింపుల దరఖాస్తు అందిన మూడు రోజుల్లోగా మేజిస్ట్రేట్‌ తన వాదనను వినిపించాల్సి ఉంటుంది. 60 రోజుల లోపు తుది తీర్పును ఇవ్వాల్సి ఉంటుంది. బాధ్యులపై కేసును నమోదు చేయటం, కోర్టు దృష్టికి తీసుకువెళ్ళి 60 రోజుల్లో కేసును పరిష్కరించాల్సి ఉంటుంది. కానీ ఈ చట్టం వలన కూడా స్త్రీలు పూర్తి న్యాయాన్ని పొందలేక పోతున్నారని చెప్పడానికి చాలా ఆధారిత కేసులు మనకు కనబడతాయి.

ముఖ్యంగా పరువు, ప్రతిష్టల కోసం, భవిష్యత్తులో అండదండలు ఉండవన్న బాధతో చాలామంది బాధితులు కుటుంబ వ్యవస్థను వదలలేక గృహ హింసలోనే మగ్గిపోవడానికి సిద్ధపడుతున్నారు. కేసుల పరిష్కారం త్వరగా జరగక పోవడంతో అమూల్యమైన భవిష్యత్తును పోగొట్టుకుంటున్నారు. న్యాయ వ్యవస్థ విచారణలో జాప్యం జరగటం స్త్రీలను మానసికంగా ఎదగకుండా చేస్తోంది. కొన్ని సందర్భాలలో కౌన్సిలింగ్‌ అనంతరం గృహ హింస కేసులలో భార్యాభర్తలు రాజీ మార్గాన్ని అవలంబిస్తున్నారు. మరికొందరు భయాందోళనలకు గురయి అర్థాంతరంగా కేసులను విరమించుకుంటున్న సందర్భాలు చాలా ఉన్నాయి. కొంతమంది బాధిత మహిళలకు మధ్యంతర భృతి కోర్టులలో నిర్ణయించబడినప్పటికీ సంబంధిత వ్యక్తుల నుండి ఆ భృతిని పొందలేక పోతున్నారు. కోర్టు ధిక్కార నేరం అమలు కాక నానా ఇబ్బందులకు గురవుతున్నారు. న్యాయ నిర్ణయాల అమలును ఏ న్యాయ వ్యవస్థ సంపూర్ణంగా అమలు చేయలేకపోవటం బాధితులకు నిరాశ, నిస్పృహలను కలుగజేస్తున్నది. ఫలితంగా మానసిక ఒత్తిడికి లోనై చాలా మంది మహిళలు తమ భవిష్యత్తు జీవితాన్ని కోల్పోతున్నారు. కడుపున పుట్టిన పిల్లల్ని సైతం వదలకుండా తమ క్షణికావేశాల అగ్ని జ్వాలల్లో పడేసి దారుణంగా పసి ప్రాయంలోనే తుంచేసిన ఎంపి రాజయ్య కోడలు సారిక ఆత్మహత్యలు లాంటివి మనకు ఉదాహరణలుగా మిగిలిపోతున్నాయి.

ఒకవైపు ఈ చట్టం బాధిత స్త్రీలకు సంపూర్ణ న్యాయం జరగటం లేదని బాధపడుతున్న సమయంలో ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని భార్యా బాధిత సంఘాల్లాంటివి పుట్టుకొచ్చి బాధితుల్లో పురుషులు కూడా ఉన్నారని గగ్గోలు పెడుతున్నాయి. సంసారాల్లో నిరంతర ఘర్షణలు చోటు చేసుకోవడం వల్ల కొందరు స్త్రీలు పోలీసులను నమ్మి కేసులు చేయటంతో, అదే సమయంలో పోలీసులు కూడా అత్యుత్సాహం చూపుతూ ఉన్నవి, లేనివి ఎఫ్‌ఐఆర్‌లో జోడిస్తూ బాధితులను తప్పుదారి పట్టించిన సందర్భాలు అనేకం. దానివల్ల ఒకవైపు న్యాయ వ్యవస్థను, మరోవైపు బాధిత స్త్రీల జీవితాలకు రావాల్సిన న్యాయాన్ని కూడా అడ్డుకోవటం మనం పలు కేసుల్లో చూస్తున్నాం. ఫలితంగా ఒకప్పుడు 498 ఎ కింద నమోదు చేయబడిన కేసుల్లో బెయిల్‌ మంజూరు ఉండేది కాదు. బాధితుల తెలివితక్కువ తనం, పోలీసుల అత్యుత్సాహ తప్పిదాలతో కొన్ని 498ఎ కేసులలో దుర్వినియోగం జరిగినట్లు సుప్రీంకోర్టు గుర్తించి 498ఎ చట్టాన్ని కుదించివేస్తూ నిర్ణయాలు తీసుకోవటంతో అసలైన బాధిత మహిళల పరిస్థితి పెనం మీదనుంచి పొయ్యిలో పడిన సామెతలా అయిపోయింది. ఫలితంగా అసలైన బాధిత స్త్రీలకు న్యాయం సత్యదూరమై పోయింది. ఈ సందర్భంలో ‘మీ.. టూ’ అంటూ మరో కొత్త వివాదం దుమారం రేపుతోంది. నేను కూడా లైంగిక వేధింపులకు గురయ్యానని చెబుతూ లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఉద్యమం మొదలైంది.

ఇప్పుడు ప్రపంచంలోని మహిళలందరూ లైంగిక వేధింపుల మౌనాన్ని వీడి ‘మీ… టూ’ అంటూ తమపై జరిగిన, జరుగుతున్న లైంగిక వేధింపులను బయటపెడుతున్నారు. పనిచేసే హక్కుతో పాటు పనిచేసేచోట గౌరవం పొందడం కూడా మా హక్కే అంటూ చాటుతున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా పెల్లుబికిన ఈ ఉద్యమం సమాజంలో పెద్దమనుషులుగా చెలామణి అవుతూ పేరు, ప్రతిష్టలు, డబ్బు, హోదాల మాటున దాగిన వారి చీకటి కోణాలను చీల్చి చెండాడే వైపుగా సాగటం మనందరం ఇప్పుడు గమనిస్తున్నాం. శతాబ్దాలుగా అన్ని రంగాలలో స్త్రీలపై జరుగుతున్న అణచివేత, వివక్షలను స్త్రీలు ఇన్ని రోజులూ భయంతోనో, పరువు పోతుందనో భావించి మౌనంగా భరించడానికి అలవాటుపడ్డారు. ఉద్యోగ వ్యవస్థలో లేదా పనిచేసే ప్రదేశాలలో పై అధికారులు జరిపే ప్రత్యక్ష, పరోక్ష లైంగిక వేధింపులకు నియంత్రణ లేకుండా పోవటం వలన చాలామంది మహిళలు బయటకు చెప్పుకోలేక, కక్కలేక, మింగలేక మానసిక వత్తిడికి లోనయి ఆ ప్రదేశాలను వదలడమో లేదా పనిచేసే ఉద్యోగాలను లేదా పనులను వదిలేసి పారిపోవటమో చేసిన వారు అనేకమంది ఉన్నారు. ఉన్నతాధికారులు, తమ సహోద్యోగులపై జరిపే లైంగిక వేధింపులకు అంతే లేకుండా పోవడంతో స్త్రీలు అభద్రతా భావంలోకి నెట్టివేయబడుతున్నారు. ప్రతిక్షణం భయంతో పనిచేసే పరిస్థితి ఏర్పడడం వలన వారిని వారు సంస్థాగతంగా కూడా

ఉన్నతీకరించుకోలేని స్థితిలోకి ఒరిగిపోయి ఉన్నత పదవులను పొందకుండా కింది స్థాయిలోనే ఒదిగిపోవటం జరుగుతోంది. అలాగే పాఠశాలల్లోనో, కాలేజీల్లోనో లేదా విశ్వవిద్యాలయాల్లోనో మార్కుల కోసం, గ్రేడుల కోసం, పరిశోధనా పేపర్ల కోసం లేదా డిగ్రీల కోసం ఉన్నతస్థాయి అధ్యాపకులు పరీక్షా ఫలితాల వంటి ప్రలోభాలు చూపి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. వీటన్నింటి వెనుక పితృస్వామిక భావజాల పురుష అహంకార ధోరణులు సమాజంలో పాతుకొని పోవటం ఒక కారణంగా చూడాలి. అలాగే పురుషులు తమకు తాము ఎక్కువగా భావిస్తూ, స్త్రీలు తాము చెప్పినట్లు వినే బానిసలుగా భావించటం మరో కారణంగా చెప్పవచ్చు. ఆ ధోరణులతోనే పురుషులు స్త్రీలను రెండవ స్థాయి పౌరులుగానే చూస్తున్నారు. చాలా సందర్భాలలో వారిని అణచివేస్తూ ఎదగకుండా తమ ఉక్కు పాదాల కింద నలిపి వేస్తున్నారు.

‘మీ టూ’ ఉద్యమానికి ఆద్యులుగా ముందుగా మనం ”తరానా బుర్కే”ను చెప్పాల్సి ఉంటుంది. ఆఫ్రికన్‌ సంతతికి చెందిన అమెరికన్‌ సామాజిక కార్యకర్త ”తరానా బుర్కే” అమెరికాలో నల్లజాతి బాలికలు, మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాడుతూ తొలిసారిగా 2006 సంవత్సరంలో ‘మీ టూ’ పదబంధంతో తనను కలిసి వివరించిన ఒక నల్లజాతి బాలిక కథనాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం జరిగింది. ”మై స్పేస్‌” అనే సోషల్‌ నెట్‌వర్క్‌ సైట్‌లో ఆమె పెట్టిన పోస్టు ఆ రోజు పెద్దగా ప్రాచుర్యం పొందలేకపోయినా, ఆ తర్వాత ఆమె ‘మీ టూ’ గురించి రూపొందించిన ఒక డాక్యుమెంటరీ ప్రపంచ చరిత్రలో నిలిచిపోయింది. కాలక్రమేణా ఆ ఉద్యమం విశ్వవ్యాప్తమయింది. ఆ తర్వాత 2017 సంవత్సరంలో హాలీవుడ్‌ నటి ”అలుసా మిలానో” తనపట్ల జరిగిన లైంగిక వేధింపులపై తన ట్విట్టరులో ఒక పోస్టు పెట్టింది. రెండు లక్షలకు పైగా నెటిజన్లు ఆ పోస్టును చూడడం జరిగింది. ‘మీ టూ’ హ్యాష్‌ బ్యాగ్‌తో మొదలైన మొదటి 24 గంటల్లోనే ఫేస్‌బుక్‌లో ఏకంగా 47 లక్షల మందికి పైగా నెటిజన్లు తమకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి సుమారు 1.20 కోట్ల పోస్టులను పెట్టడం జరిగింది. మహిళలకు నిత్యం వెంటాడుతున్న వేధింపు చర్యల తీవ్రతకు ”టైం ఆఫ్‌” అనే పేరుతో మరో ఉద్యమం హాలీవుడ్‌లో ప్రారంభమయింది. సుమారు 300కు పైగా హీరోయిన్‌లు, రచయితలు, డైరెక్టర్లు ఈ ఉద్యమంలో భాగస్వామ్యమయ్యారు. అలాగే ఇప్పుడు ‘మీ టూ’ ఉద్యమానికి సహాయకంగా సిస్టర్‌ హుద్‌ హ్యాష్‌ ట్యాగ్‌ మొదలయింది. రుతువర్ణ ఛటర్జీ అనే మహిళా జర్నలిస్టు ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది.

‘మీ టూ’ ఉద్యమం మన తెలంగాణా రాష్ట్రంలో 2018 సంవత్సరంలో మొదట టాలీవుడ్‌ నటి శ్రీ రెడ్డి పరోక్షంగా ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత నుండి మళయాళ నటి తనుశ్రీ దత్తాతో సామాజిక మాధ్యమాల ద్వారా బాగా వెలుగులోకి వచ్చిందని చెప్పవచ్చు. ఆమె తర్వాత ఆ ఉద్యమం ఇంతింతై వటుడింతై అన్నట్లుగా అన్ని రంగాలలోని ప్రముఖుల పేర్లను బయటపెడుతూ సామాన్య జనుల ముక్కుపై వేలు వేసుకునే స్థాయికి వెళ్ళిందని చెప్పక తప్పదు. మనం ఎంతో గొప్పగా ఊహించుకున్న ఉన్నత స్థాయి వ్యక్తుల దగ్గర నుండి మొదలుపెట్టి సామాన్య స్థాయి ఉద్యోగుల వరకు ‘మీ టూ’ ఉద్యమం పాకిన తీరు ఆశ్చర్యపరచక మానదు. ఈ ఉద్యమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రముఖ పారిశ్రామిక రంగ వ్యక్తులు, సినిమా రంగ ప్రముఖులు, పత్రికా రంగ ప్రముఖులు, ఇంకా ఇతర క్రీడా, రాజకీయ, న్యాయ వ్యవస్థలకు సంబంధించిన పెద్దలతో పాటు మత గురువులు కూడా అత్యధిక ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఉండటం సిగ్గుపడాల్సిన విషయం.

స్త్రీలపై తరతరాలుగా పురుషులు చూపుతున్న వివక్ష, అణచివేతలకు, లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ప్రతి ఒక్క మహిళా గళం విప్పాల్సి ఉంది. స్త్రీలు వ్యక్తిగతంగా తమ గౌరవానికి భంగం వాటిల్లినప్పుడే కాదు, సమాజంలో జీవిస్తున్న ఏ మహిళ గౌరవానికి భంగం వాటిల్లినా గళం విప్పాల్సి ఉంటుంది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా స్త్రీలపై జరిగిన లేదా జరుగుతున్న వేధింపులపై కూడా తమ స్వరం కలపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్త్రీలు పురుషులతో పాటు సమానులే అన్న సమాజం కోసం నిరంతరం కృషి చేయవలసి ఉంది. స్త్రీల హక్కులన్నీ మానవ హక్కులుగా గుర్తెరిగి శ్రమ దోపిడీ లేని సమ సమాజ స్థాపనకు పునాదులు వేసిన రోజు స్త్రీలు గౌరవంతో జీవించగలుగుతారు. తమ మేధస్సుతో ప్రపంచంలో చిరస్థాయిగా నిలబడగలుగుతారు.

 

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.