ఎట్టకేలకు ‘మీ టూ’ ఉద్యమం ద్వారా ఒక కేంద్రమంత్రి ఎం.జె.అక్బర్ తన పదవికి రాజీనామా చేశాడు. ఇది ఓ పాత్రికేయుడు అభివర్ణించినట్లు ‘అనేక విపత్కర పరిస్థితుల్లో చిక్కిన ఆధునిక భారత మహిళకు దక్కిన అరుదైన విజయంగా మనం దీనిని భావించాలి’. అక్బర్ రాజకీయాల్లోకి రాకమునుపే వేర్వేరు మీడియా సంస్థల్లో ఎడిటర్‌గా పనిచేస్తున్న తరుణంలో తమను లైంగికంగా వేధించినట్లు మహిళా జర్నలిస్టులు పలువురు రకరకాలుగా ఆరోపించిన విషయం తెలిసిందే.
ముఖ్యంగా జర్నలిస్టు ప్రియా రమణి 20 ఏళ్ళ క్రితం తనతో అక్బర్ అసభ్యంగా ప్రవర్తించారని తెలపడంతో ఇది మొదలైంది. అందుకు ప్రతిగా ఆమెపై అక్బర్ ఢిల్లీ పాటియాలా కోర్టులో పరువు నష్టం దావా వేశారు. కాగా ప్రియారమణికి మద్దతు పలికేవారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. అంతేకాకుండా ‘మీ టూ’ అంటూ తమపై కూడా అక్బర్ అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధించేవాడని చెప్పేవారి సంఖ్య ముప్ఫైవరకు చేరుకుంది. నిజమే మరి నిజానిజాలు నిగ్గు తేలవలసి ఉంటుంది. లైంగిక ప్రవర్తన విషయంలో మగవాడిని ‘రసరాజు’గాను, స్త్రీని హేయంగాను చూసే ఫ్యూడల్ నీచ సంస్కృతి నేటికీ కొనసాగుతున్నది, పెచ్చుమీరుతున్నది కూడా.ఏ రీత్యానైనా మహిళ, వేధింపునకు గానీ, అత్యాచారానికి కానీ గురైతే బాధితురాలినే తప్పుపట్టి చులకనగా చూసే దుస్థితి నుండి మన సమాజం ఇంకా బయటపడలేదు. రక్షణ కోసం రక్షకభటణాలయాలకెళ్తే ఇక సరేసరి. ఇప్పుడిప్పుడే వీటిన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొంటూ, ముందుకు వచ్చి తమకు అన్యాయం జరిగిందని చెప్పుకోవడం, ఫిర్యాదు చేయడం, వాటితోపాటు మనకెందుకులే అని అనుకోకుండా బాధితులకు సంఘీభావం ప్రకటించడం ఓ ఉద్యమంలా తీసుకువస్తున్నది. నిస్సందేహంగా ఇది హర్షించదగ్గ పరిణామం.
ఈ పరిణామానికి మహిళాలోకం ప్రగతిశీలురు, బాధితులు ఒక ప్రక్క బ్రహ్మరథం పడుతుంటే, సంస్కారవంతుల ముసుగులో పెద్దమనుషుల్లా చెలాయిస్తున్న కొందరు తమ నీచ కార్యకలాపాలు ఎక్కడ, ఎప్పుడు, ఎలా బయటపడ్తాయోమోనని ఆందోళన చెందడం ఇక ఇప్పుడు వారి వంతైంది. ఒక్క పాత్రికేయ రంగమే కాదు, సినిమా రంగం, క్రీడా రంగం, ప్రభుత్వ రంగం, ప్రైవేటు రంగం – ఇలా ఒకటేమిటి… మత గురువులు, సైనికాధికారులు, రాజకీయ ప్రముఖులు… ఇలా అనేకమంది ఈ జాబితాలోకి వస్తున్నారు.
పశ్చిమాన ఈ ‘మీ టూ’ (నేను కూడా, నేను సైతం) ఉద్యమం ఇప్పుడు కార్చిచ్చులా అన్ని ఖండాలకు విస్తరిస్తున్నది. మన దేశంలోని అన్ని ముఖ్యమైన కేంద్రాలకు వ్యాపిస్తున్నది. సోషల్ మీడియా ఇందుకు ప్రధాన వేదిక అవుతోంది. అయితే ఇక్కడో చిక్కుముడి ఉంది. అది ఇద్దరి మధ్యన ఉండే ఓ లైంగిక సంబంధం. ‘అది వారిద్దరికే పరిమితం కావాలి తప్ప ఇలా బజారుపడడం ఎవరికీ మంచిది కాదుకదా’ అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు కొందరు. పులి-మేకను ఒక చోట కట్టేసి మేక అరిస్తే ఎలా? అన్నట్టు ఉంటుంది వీరి తంతు.అలాగే ఇంకొందరు వారిద్దరి మధ్య లైంగిక ‘బంధం’ ఇష్టమైనంతవరకు కొనసాగి ఉండవచ్చు. అప్పుడు మాట్లాడని వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారంటే వారి మధ్య వ్యవహారం చెడిందనే కదా అర్థం. దానికి పురుషుల్నే తప్పు పడితే ఎలా? అమ్మాయి మంచిదైతే ముందుగానే అలాంటి వాటిని త్రోసిపుచ్చేది కదా? ఇలా బయటకు వచ్చి బరితెగించి చెప్పుకుంటుందా? ఆధారాలు సంబంధించేలా నటించడం, రాబట్టడం అంటే ఇది మరో రకంగా మోసం కాదా? అంటూ.. ఆడవాళ్ళనే తప్పుపడుతున్నారు. వీరిలో పురుష పుంగవులే కాదు కొందరు మహిళా మణులు కూడా ఉన్నారు అమాయకంగా.
మహా భారత కీచక వధ ఘట్టంలో ఇందుకు సంబంధించి భీముడు ద్రౌపదితో ఇలా అంటాడు…. ‘వానికి నీవు ఒడంబడిక వైఖరిగా నటియించు నేర్పుగ రేయి రమ్మనము నర్తనశాలకు.
నిన్నువోలె నేనందు పరుండెద జనుదెంచునతండు లిప్తలో ప్రాణనీనర్తుకే చకున్ – అభంగురబాహుబలమ్ము పెంపునన్’ పంచమధాంధికారి (అధికారమదం, ధనమదం, వయసుమదం, ఆరోగ్యమదం మగమదం) కీచకుని వధించడానికి భీముడు తన భార్య ద్రౌపదికి సైతం నటించమని ఉపదేశించాడు. పురుషాధికారాన్ని, నరనరాన్ని సమర్ధించుకునే వారికి ఇలాంటి విషయాలు తలకెక్కవు, మింగుడుపడవు. పని ప్రదేశాలలో లైంగిక వేధింపులను నిరోధించడానికి 2013లో ఓ చట్టం వచ్చింది. మహిళలను తాకడం, వాంఛలు తీర్చమని వత్తిడి చేయడం, మర్మావయవాలను చూపడం లేదా అలాంటి దృశ్యాలను ఫోన్‌ల ద్వారా, నెట్‌ల ద్వారా చూస్తూ, చూపుతూ హేళనగా మాట్లాడడం, అసభ్యంగా ప్రవర్తించడం – ఇత్యాది చేష్టలన్నీ లైంగిక నేరాలుగానే పరిగణించాలి. మగవాడు తన హోదాను అడ్డుపెట్టుకుని మర్యాద ముసుగులో ఇలా మహిళలపై, బాలికలపై ఇలా నేరాలకు, ఘోరాలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. చట్టపరిధిలో ఈ నేరాలను రుజువు చేస్తే మూడేళ్ళ వరకు జైలు శిక్ష విధించవచ్చు.
కానీ ఇంత దూరం వరకు బాధిత మహిళ రావాలంటే చాలా తెగింపు రావాలి, ఆత్మ స్థైర్యం కావాలి. సాహసం చేయాలి. ఇది ఒక్క తన విషయమే కాదని తనలాగా బాధపడుతున్న చాలామంది విషయమని గ్రహించాలి. ఆ చైతన్యం లేదా గాయపడిన తీరే వారిని ముందుకొచ్చేలా చేస్తుంది. 1988లో చండీగఢ్‌లో అప్పటి డి.జి.పి. కె.పి.ఎస్.గిల్ తన సహోద్యోగి రూపన్ దేవల్ బజాజ్ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే సుదీర్ఘకాలం పోరాటం చేసింది ఆమె. కడకు పదిహేడేళ్ళ తర్వాత గిల్ సమర్ధవంతమైన అధికారి అయినప్పటికీ ఈ విషయంలో నేరస్థుడేనని కోర్టు తీర్పు చెప్పక తప్పలేదు.
క్రాంతిదర్శి అయిన మహాకవి గురజాడ అందుకనే ఆధునిక మహిళ చరిత్రను తిరగరాస్తుంది అని వందేళ్ళ ముందే ప్రకటించాడు. మహిళ కన్నీటి గాథలకు కారణం నాకు తెలుసు, వారికి వకాల్తా పట్టడానికే నేను నిశ్చయించుకున్నానని ధైర్యంగా తెలిపాడు. ఆ క్రమంలో మధుర వాణి పాత్రను ‘కన్యాశుల్కం’ నాటకంలో అధ్భుతంగా సృష్టించి మలిచాడు. యావత్ సమాజాన్ని ఆ పాత్ర వైపు నిలబెట్టేందుకు శతధా కృషి చేశాడు, విజయవంతం అయ్యాడు.
ఇప్పుడు వెల్లువలా పెల్లుబుకుతున్న ‘మీ టూ’ ఉద్యమాన్ని అలాగే శశబిషలు ఏ మాత్రం పెట్టుకోకుండా ప్రగతిశీల ప్రపంచం ధైర్యంగా ముందుకొచ్చి బలపరుస్తున్నది. కీచకాధములను ఉత్పత్తి చేసే పురుషాహంకారానికి గొడ్డలి పెట్టు అవుతున్నది.