ప్రియకవీ, రాజేశ్వరీ! ఎంతో దూరం వెళ్ళిపోయావు. నువ్వు వెళ్ళిపోయాక ఆవరించిన శూన్యపు మంచులో నేనిలా మిగిలిపోయాను. చీకటినీ, నిశ్శబ్దాన్నీ ప్రేమించే నువ్వు. మౌనమే ఆభరణంగా మిగిలిపోయావు. ఒక్కొక్కసారి అన్పిస్తూ వుంటుంది. నీలోవున్న అత్యంత సౌకుమార్యస్థితే నీవేదనకు మూలమేమోనని. ఆ మేడపైన పగలంతా సూర్యుడితో గొడవపడి నిద్రపోతూనే ఉండే దానివి. వెలుగును, వెచ్చదనాన్ని అనుభవించడం నీ కిష్టముండేది కాదు. రాత్రి కొరకు ఎదురుచూసే చకోరపక్షివి నువ్వు. నక్షత్రాలు నీ స్నేహితులు. వినీలాకాశం నీ మనోమందిరం. నిశ్శబ్దం నీ ఆప్త మిత్రురాలు. వెన్నెల నిన్ను నిలువెల్లా ఆవరించే చల్లదనం. చీకటి నిన్ను నీవు తవ్వుకుంటూ ఆవిష్కరింప జేసుకొనే మందుపాతర.
అందరిలా నువ్వు లేవు. అందుకే నువ్వెమీ కావు. అందుకే ఒంటరి ఆకాశంలో ఒంటరి పక్షిలా నువ్వు. కత్తిరించిన రెక్కలతో, గాయపడిన హృదయంతో, అన్వేషిస్తూపోయే బాటసారి నువ్వు. నిన్ను నువ్వు రాల్చుకున్న క్షణాల్లో జారిపడ్డ అక్షరాలే కవిత్వమై ప్రాణం పోసుకున్నాయి.
శివ వెంకటరాజేశ్వరీ దేవీ! చీకటి రాతిరిలో తెల్లని చుక్కవు నువ్వు. ఒక శూన్యపు చుక్క చుట్టూ జీవితం అల్లుకొని ఉంటుంది. ఉందనుకుంటే అంతా
ఉంటుంది. లేదనుకుంటే ఏమీ ఉండదు. చాలా చిత్రమైన సందర్భం జీవన యాత్ర. భౌతిక రూపమే నిజమా! మానసిక ప్రపంచమే నిజమా! అనే ఆశ్చర్యార్ధకాలు ఇంకా ఆ ముఖాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఆశ్చర్యపడుతున్నాయి. అందరిలా పుట్టినప్పటికీ, అందరిలా మామూలు జీవితం గడపలేక, తనలోతాను, తనతోతాను నిరంతరం అంతర్యుర్ధం చేస్తుండే కవియిత్రి శివవెంకటరాజేశ్వరీ దేవి. అందుకే నువ్వు తెలుగు సాహిత్యంలో ఒక విలక్షణమైన రచయిత్రిగా మిగిలిపోయావు.
నీతో స్నేహం, పరిచయం ఉన్న వాళ్ళవ్వరూ నిన్ను అంత తొందరగా మరిచపోలేరు. ఎందుకంటే నీ మాటలు అంత మెత్తగా, సున్నితంగా ఉంటాయి. పదాల లాలిత్యం నీకు తెలుసు. విస్తృతంగా నువ్వు చేసిన అధ్యయనమంతా నీ మాటల్లో ఒలికిపోతూ ఉండేది. దేహమనే శరీరాన్ని ధరించిన వాళ్ళు జీవిస్తున్నట్లా, మనసనే ఆత్మికభావాన్ని తొడుక్కున్న వాళ్ళు జీవిస్తున్నట్లా అనే ప్రశ్నలు నిన్ను నీడలా వెంటాడేవి. చాలా అల్పమైన వాటికోసం పాకులాడే వాళ్ళని, కీర్తి సింహాసనాలు తమకుతామే చెక్కు కుంటున్న వాళ్ళని చూసి గుంభనంగా నవ్వుకునే దానివి.
జీవితమంతా చర్చోపచర్చలతో, భావశూన్యుల పట్ల జాలితో, ఆత్మీయుల పలకరింపులతో, అన్వేషణతో, వేదనతో, ఒక శూన్యావర్తనాన్ని భుజానమోస్తూ, అలిసి సొలిసి ఆ వేదనార్తుల కలబోతతో మరణపు అంచును తాకడం కోసం తండ్లాడిన మార్మిపదానివి నువ్వు. సాధారణ మనుషులకు అందనంత ఎత్తులో చిటారు కొమ్మన కూర్చుండిపోయావు. కొందరంతే, వాళ్ళున్నా, లేకున్నా దహించివేస్తూనే
ఉంటారు. నీ జీవినతాత్వికతే కవిత్వమై అందరి కళ్ళ ముందు కొచ్చింది.
రాజేశ్శరీ! నాకేమనిపిస్తుందో చెప్పనా! శరీరాన్ని మార్చుకొని గొంగళి పురుగు దశను వీడి, సీతాకోక చిలుకై సాహిత్యపు ఇంద్రధనుస్సు వంతెనలో తెల్లచుక్కై మిగిలిపోయానని. నువ్విప్పుడు లేవు. కాదు ఉన్నావు. రూపం మారిందంతే, అక్షరపు చర్మాన్ని తొడుక్కొని కోటాను కోట్ల
ప్రశ్నలతో,
లక్షోపలక్షల
సమాధానాలతో ఈ
అక్షరాల్లోనే
ఒదిగి ఉన్నావు.
కవికి మరణం లేదు. స్నేహానికి అంతం లేదు. వ్యక్తుల కనుమరుగవ్వొచ్చు. కానీ వెంటనే హృదయపు పూలకుండీలో స్నేహపు పువ్వుగా మారి ఎప్పటికీ నిలిచిపోతారు. వారి జ్ఞాపకాల ఆవర్తనాలు మనచుట్టూ కమ్ముకొనే ఉంటాయి. నాదృష్టిలో నువ్వుకూడా అంతే. తాత్కాలికంగా కనుమరుగయ్యావంతే. శాశ్విత చిరునామాను రచించి వెళ్ళిపోయావంతే. ఒక మహా వాక్యానికి కామా పెట్టావంతే.
రాజేశ్వరీ! 1954 జనవరి 16న జగ్గయ్యపేటలో పుట్టిన నువ్వు. సంగీత సాహిత్యాలను ప్రాణప్రదంగా ప్రేమించేదానివి. 1970లో రచనా వ్యాసంగం మొదలై చివరి వరకూ రాస్తూనే ఉన్నావు. అద్భుతమైన కవితలురాసి అరుదైన కవిగా ఆదరణ పొందావు. నలభైఏళ్ళలో రేడియోలో, పత్రికల్లో అనేకం అచ్చయ్యాయి. నీ కలత, కలవరింతలే కవిత్వమైనాయి. స్వప్నం మీంచి కోకిలవలె పాడుతూ పాడుతూ 2015 ఏప్రిల్ 25న నక్షత్ర లోకంలోకి ఎగిరిపోయావు. నీ కవిత్వాన్ని ఎలాగైనా ఒకచోట చేర్చాలని నీ మిత్రులందరూ అనుకొని 2016లో నీ కోసం తెచ్చిన కవిత్వ బహుమతి ‘సత్యం వద్దు స్వప్నమే కావాలి’.
రేవతీ దేవి కంఠంలో మాదిరి కలత, కలవరింత నీ కవిత్వంలో ఉంటాయి. నీ కవిత్వాన్ని చదువుతుంటే సౌదామిని, బంగారమ్మ, విశ్వసుందరమ్మ, రేవతీ దేవిలే గుర్తొస్తూ ఉంటారు. రాజేశ్వరీ! నీ మాటలు ఫోన్‌లో వినడమేగానీ, నిన్నెప్పుడూ కలవలేకపోయినా, ఇలా అక్షరాల్తోనన్నా మాట్లాడాలనే కోరికే ఇది.. మరి ఉండనా?