‘
నిన్న మొన్నటి దాకా అసెంబ్లీ అంగడి జరిగింది తెలంగాణలో. యిప్పుడు వచ్చే నెల్లో పంచాయితీ ఎన్నికలు రాబోతున్నాయి. నిన్న మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు రెండు వేల మంది మగ అభ్యర్ధులు బరిలో వుంటే… కేవలం నలబైమూడు (43) మంది మహిళలు మాత్రమే ఎన్నికల బరిలోవున్న వివక్షలు, అవమానాలు చూసినం. మహిళల పట్ల వారి రాజకీయ ప్రాతినిద్యాలపట్ల వారి నాయకత్వాల పట్ల కమ్యూనిస్టులు, సోషలిస్టులు, మతవాదులు, కులవాదులు అణగారిన వాదులు అందరిదీ ఒకటే లెక్కగా సాగుతున్నది. రిజర్వేషన్ కోటాలు గూడా మహిళలకు చెందడం లేదు. మగవాళ్ళే కొట్టేస్తున్నరు. యీసారి జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్సీ మహిళలే లేరు. ఎస్సీ రిజర్వుడు స్థానాలన్నీ మగ అభ్యర్ధులే దక్కించుకున్నరు. గెలిచిన మహిళలు మొత్తంలో ముగ్గురు రెడ్డి మహిళలు, ముగ్గురు ఎస్టీ మహిళలు. యిక ఎస్సీ, బీసీ, మైనారిటీ ముస్లిమ్ మహిళల ప్రాతినిద్యమే అసెంబ్లీలో లేకుండాపోయింది. స్వాతంత్ర మొచ్చి ఎనిమిది దశాబ్దాలు దాటినా పార్లమెంట్‌లో 11% మహిళా ప్రాతినిద్యం.
వీటన్నిటి నేపద్యంలో జనాభాలో సగంగా వున్న మహిళలు మానసికంగా చాలా గాయపడివున్నరు. యింకో వైపు మహిళా రిజర్వేషన్ బిల్లు, పాతికేండ్ల నుంచి ఎలాంటి చలనం లేకపోవడానికి ఎదిగిన సవర్ణ మహిళా సమూహాల వైఫల్యంగా చెప్పొచ్చు. మహిళా దామాషా ప్రకారం వల్లనే అది ఆగిపోయింది. మహిళా జనాభా దామాషా ప్రకారం బిల్లు పెట్టాలనే మగ బీసీ పార్టీలు కూడా మాట్లాడకపోవడం అన్యాయం. బిల్లు గురించి లేవనెత్తినప్పుడే దామాషా గురించి మాట్లాడ్తున్నారు కానీ దామాషా ప్రకారం బిల్లు పాస్ కావడానికి ఎలాంటి ప్రయత్నాలు
ఉద్యమాలు జరగడం లేదు. యిక ఆధిపత్య మగవాళ్ళకు గుత్తగుండుగా తమ ఆడవాళ్ళే చట్టసభల్లో వుండాలి మిగతా బీసీ మహిళల్ని రానివ్వొద్దనే కుల, మగ వివక్షలుండడం వల్ల బిల్లు పాస్ కానివ్వడం లేదు. దీనికి భిన్నంగా సవర్ణ మహిళలు లేరని యిన్నాళ్ల వీరి కార్యాచరణలో తేలింది.
కులాలవారిగా పార్టీలున్నప్పుడు సమాజంలో సగం జనాభాగా వున్న మహిళలకు కూడా ఒక పార్టీ ఎందుకుండొద్దు? మహిళలు ఒక రాజకీయ పార్టీ ఎందుకు పెట్టుకోకూడదనే ఆలోచనలు మహిళలనందరిని తొలిచినయి. యీ సందర్భంగా ‘నేషనల్ వుమెన్ పార్టీ’గా జాతీయ రాజకీయ పార్టీని అధికారికంగా ప్రకటించిన డాక్టర్ శ్వేతాశెట్టిని అందరం బొయి అభినందించాలి. యిది చాలా సంతోషకరమైన వార్త మహిళలకు. మగ సమాజము, మగ రాజకీయ పార్టీలు మహిళలకు రాజకీయ రిజర్వేషన్స్ కల్పించడంలో, మహిళల కోసం చట్టాలు ‘వుమెన్ ఫ్రెండ్లీ’గా రూపొందించడంలో, వాటిని అమలు చేయడంలో విఫలమైనయి. చట్ట సభల్లో యాభైశాతం (50%) స్థానాల్లో జనాభా దామాషా ప్రకారం అంటే కోటాలో కోటాగా మహిళలు ఎన్నిక కావడమే లక్ష్యంగా పెట్టుకొని పంజేయాల్సిన అవసరముంది. జనాభాలోనే కాదు చట్ట సభల్లో కూడా సగభాగంగా వున్నపుడే మహిళల చుట్టూతవున్న ఆర్థిక, సామాజక, జెండర్ హక్కుల్ని సాధించుకుంటారు. ఆ దిశగా ‘నేషనల్ వుమెన్ పార్టీ’ సాగుతుందని ఆశిద్దాము.
73వ రాజ్యాంగ సవరణను అనుసరించి పంచాయితీరాజ్ చట్టంలో ముందు 1/3 వంతు రిజర్వేషన్స్ కల్పించబడితే యిప్పుడు 50% స్థానాలు మహిళలకు రిజర్వు చేయబడినయనేది సంతోషమే. యిపుడు తెలంగాణలో యాభై శాతమంటే… మొత్తం పంచాయితీ స్థానాలు తెలంగాణలో 12,751. దీంట్ల 6,378 స్థానాలు మహిళలకు వస్తాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసి, మహిళలందరికి కలిసి స్థానాల్ని మహిళలకు కేటాయించడం, స్థానిక సంస్థల్లో సగం మంది మహిళలు వార్డు మెంబర్లుగా, సర్పంచులుగా, జెడ్‌పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్‌పి ఛైర్‌పర్సన్‌లుగా చూడ్డము ఆనందమేకానీ…. యీ మహిళలు తమ స్వయం ప్రతిపత్తిగా స్వయం నిర్ణయాధికారులుగా, సాధికారతతో కూడిన నిర్వహణలు యీ మగ ప్రపంచం, అధికార మగ ప్రపంచం చేయనిస్తుందా! యిప్పటికే ఎస్సీ, ఎస్టీ మహిళా ప్రతినిధుల మీద పటేండ్లు పెత్తనం జేస్తూ…. అధికారాలు చిక్కకుండా చేస్తున్నవి, పంచాయితీ ఆఫీసుల్లో కుర్చీ మీద కూడా కూర్చోనివ్వని సంగతులు, పంచాయితీ ఫండ్స్ అన్నీ బొక్కి ఎస్సీ ఎస్టీ మహిళల అమాయకత్వాల్ని ఆసరాగ చేస్కొని అధికార దుర్వినియోగ అగచాట్లన్నీ వాళ్ళమీదేసి, వాళ్ళను దోషులుగా నిలబెట్టడం చేస్తుండ్రు. మహిళలు కొంచెం తెలివిగా వుండిన కాడ వాళ్ళమీద అవిశ్వాస తీర్మాణాలు పెట్టి పదవులు వూడబీకిన కేసులు కోకొల్లలు. వాళ్ళ మగవాళ్ళ అండవున్నా వాళ్ళు కూడా పటేండ్ల ముందు అసహాయులే. అట్లా యిక్కడ ఎస్సీ, ఎస్టీ మహిళల మీద ఓ దిక్కు భర్తల పెత్తనం కొంచెమైనా…. పటేండ్ల పెత్తనాలు, కుర్చీమీద కుచొని వ్యవహారాలు నడపనివ్వని కుల వివక్షలు అడుగడుగున హేళనలు ‘పేనుకు పెత్తనమిస్తే’ అనే అవహేళనలు యిటు కుటుంబాల, భర్తల నుంచి కూడా అనుమానం వేధింపులు, సాధికారికంగా తిరగలేని సంకెళ్లు ఆవరించి వుంటయి. యీ మహిళలకు వారి శక్తి సామర్థ్యాలు పెంచే శిక్షణలుండాలి. తమిళనాడులో లాగ రిజర్వుడు స్థానాల్లో రెండవసారి కూడా రిజర్వ్‌డ్ చేసి అవకాశాలు కల్పిస్తే కొంత రాజకీయంగా రాటుతేల్తారు.