సవాలక్ష వివక్షలపై సవ్వాల్‌… – పి. ప్రశాంతి

 

ఒప్పులగుప్ప… వయ్యారి భామ… చేతులు పెనవేసి, కాళ్ళు నేలకి తన్నిపెట్టి, వెనక్కి వాలి గుండ్రంగా తిరుగుతున్నారు కళ్యాణి, బాల. ఊళ్ళో బళ్ళో ఐదోక్లాసు వరకు కలిసి చదువుకున్నారు. సామాజిక వర్గాన్ననుసరించి ఊరు విడిపోవడంతో ఒకరిది ఊరికి ఈ పక్క మరొకరిది ఆ పక్క అయినా ఒకే తరగతిలో చదువుతున్న వాళ్ళిద్దరూ బడికి వెళ్ళినప్పట్నుంచి ఒకర్నొకరు అంటిపెట్టుకునే తిరిగేవారు. కలిసి తినేవారు కలిసి చదువుకునేవారు, ఆడుకునేవారు, పాడుకునేవారు. ఇప్పుడు ఆరో తరగతిలో హైస్కూల్లో చేరారు. పక్క ఊర్లో ఉన్న హైస్కూల్‌కి నడిచే వెళ్ళాలి. రోజూ బాల ఊరి ఆ చివర్నించి ఈ చివరికొచ్చే సరికి కళ్యాణి వాళ్ళఇంటినుంచి చూసి బాలతో చేరేది. ఇద్దరూ కలిసి చేలగట్లమీంచి గెంతుకుంటూ చెట్లతో, పిట్టల్తో, మేకల్తో, పశువుల్తో కబుర్లు చెప్పుకుంటూ బడికెళ్ళొచ్చేవారు. మధ్యలో పొలాల్లో ఉన్న మామిడి చెట్లో, జామ చెట్లో ఎక్కి కాయలు తెంపుకోవడం, పొలం పనులు చేసుకుంటున్న వారిని వరసలుపెట్టి పలకరించడం, ఇంటినించి తెచ్చుకున్న వేపిన పల్లీలో, జంతిక ముక్కలో, జొన్న పేలాలో వాళ్ళకీపెట్టడం… అందర్తో కలివిడిగా ఉండే ఈ జంటంటే వాళ్ళందరికీ ఎంతో ఇష్టం. స్కూల్‌కి సెలవులొచ్చినా రెండు మూడు రోజులకొకసారి బడికెళ్ళే దారిలో పరిచయమైన వాళ్ళందర్నీ పలకరించడానికే వస్తుండేవారు. వాళ్ళుకూడా సొంత బంధువుల్లాగా ఆప్యాయంగా ఇన్ని పెసరకాయలో, ఇన్ని చిలకడదుంపలో, అంత అటుకుల మిక్స్చరో కళ్యాణి, బాల రాగానే చేతిలో పెట్టేవారు.

కళ్యాణి సెలయేరైతే బాల పిల్లకాలువలాంటిది. కళ్యాణి బలంగా ఎత్తుగా ఉంటే బాల సన్నగా ఎత్తు తక్కువగా ఉండేది. ఎప్పుడైనా వర్షాలకి బురద ఎక్కువగా ఉంటే బడికేళ్ళేటప్పుడు బాలని కళ్యాణి వీపుమీద ఉప్పుబస్తాలా ఎక్కించుకుని ‘ఉప్పమ్మా ఉప్పూ..’ అంటూ హాస్యమాడుతూ ఆ పక్కకి చేర్చేది.

ఏడాది గడిచింది. ఏడోతరగతిలోకొచ్చారు. వర్షాలతో పాటు శ్రావణమాసమూ వచ్చింది. రెండు నెలల తేడాతో ఇద్దరూ మెచ్యూర్‌ అయ్యారు. బాల బడికి రావడం తగ్గింది. వచ్చినా మౌనంగా, కళ్యాణితో కూడా, ముభావంగా ఉంటోంది. ఆటలు, పాటలు అసలే లేవు. చెట్లెక్కడం మర్చేపోయినట్లుంది. ఎంత బతిమాలినా కళ్యాణిక్కూడా విషయం చెప్పదు. ఓరోజు ‘ఎందుకలా ఉన్నావో చెప్పకపోతే ఇందులో దూకేస్తా’ అంటూ దార్లో ఉన్న వ్యవసాయ బావి అంచుకెళ్ళిపోయింది కళ్యాణి. ఏడుస్తూ పరిగెత్తికెళ్ళి ఆపింది బాల. దగ్గర్లో ఉన్న వేపచెట్టు మొదట్లో కూలబడి ఎక్కెక్కి ఏడ్వడంతో కళ్యాణి ఖంగారుపడి బాలని ఒళ్ళోకి తీసుకుని గట్టిగా కావలించుకుంది. మెల్లగా తేరుకున్న బాల చెప్పడం మొదలుపెట్టింది.

తను పుష్పవతి అయినప్పట్నుంచి తనకంటే పదేళ్ళు పెద్దవాడైన మేనబావ తీరు మారిపోయిందని, ఏదో వంకపెట్టుకుని చీటికీ మాటికి ఇంటికి రావడం, రాత్రిళ్ళు కూడా

ఉండిపోడం, ఉన్నంతసేపూ తనని తినేసేలా చూడడం, అవకాశం దొరికితే చాలు ఒంటిమీద చేతులెయ్యడం, పట్టుకోవాలని చూడడం, తనకి చాలా చిరాగ్గా, అసహ్యంగా ఉందండి. ఇంకోపక్క, ఇది గమనించిన తల్లి తనని ఎటూ కదలనివ్వకపోవడం, తొందరగా మంచి సంబంధం చూసి ఈ ఏడు పెళ్ళి చేసేయాలని తండ్రిని ఒత్తిడి చేయడం, చదివింది చాలు ఇక బడికెళ్ళక్కర్లేదని, ఇంటి పని నేర్చుకోవాలని పనంతా తననే చెయ్యమనడం ఏకరువు పెట్టింది. పెళ్ళి ఇప్పుడే చేసుకోనని, చదువుకుంటానని, బావతీరు ఇబ్బందిగా ఉంది కనుక హాస్టల్లో చేర్చమని తండ్రితో చెప్తుంటే విన్న నానమ్మ చదువు పేరుతో ఊళ్ళెంట తిరగడానికి పెళ్ళి ఇష్టంలేదంటూ శ్రీరామ చంద్రుడిలాంటి తన మనవడి మీద అభాండాలేస్తోందని అరిచి గోలగోల చేసింది. ఇవన్నీ విన్న చుట్టుపక్కల వాళ్ళ చూపులు, ఆరాలు తనని కుచించుకుపోయేలా చేస్తున్నాయని ఏడ్చింది. ఆవేశపడ్డ కళ్యాణి బాలని పొదివి పట్టుకుని బడికి తీసుకెళ్ళింది. తిన్నగా హెడ్మాస్టరు గదికి తీసుకెళ్ళింది. అక్కడ ఆ ఊరి సర్పంచి, మరో ఇద్దరు ఊరి పెద్దలు కూడా ఉన్నారు. పెద్దలతో కలిసి న్యాయం చేస్తారని సంతోషంగా బాల పరిస్థితి చెప్పి ఆమె చదువు ఆగకుండా, బాల్యవివాహం జరగకుండా చూడాలని కోరింది. వెంటనే సర్పంచ్‌ ‘మంచిదే ముందు నీ గురించి నువ్వు చూస్కోమ్మా… చలాకీ తనంతో మగపిల్లల్ని ఆకర్షించి వాళ్ళ బతుకుల్ని నాశనం చేయకండి. నీ వైపు కళ్ళప్పగించి చూస్తున్నాడని, నువ్వెక్కడికెళ్తే అక్కడ కనిపిస్తున్నాడని మా ఊరి కుర్రాడ్ని మీవాళ్ళు చితక్కొట్టారు. చదువుకుని కుటుంబాల్ని పోషించాల్సిన కుర్రాళ్ళు మీ వెనక తిరిగి జీవితాల్ని పోగొట్టుకుంటున్నారు. వాళ్ళమీద ఆధారపడ్డ కుటుంబాలు ఏమవ్వాలి? ఎవడ్నో పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయే మీకు ఈ చదువు లెందుకమ్మా? నీతోపాటు ఆ పిల్లనీ పాడు చెయ్యకు’ అంటూ హెడ్మాస్టర్ని చూస్తూ ‘మా కులపోళ్ళంతా ఆవేశంగా ఉన్నారు. ఎక్కువ రోజులు నేనాపలేను. ఏం చేస్తావో చూడు మాస్టరూ…’ అనేసి ఖద్దరు చొక్కా సరిచేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ వెనకే పెద్దమనుషులు, హెడ్మాస్టరు కూడా లేచారు.

నిర్ఘాంతపోయిన కళ్యాణి, బాల అక్కడ్నుంచి కదలలేకపోయారు. ఇద్దరి బుర్రలో ఒకటే ఆలోచన. చలాకీగా ఉండడం, చదువు ఆటపాటల్లో ముందుండడం తప్పా? తమ ప్రమేయం లేకుండానే కుల, వర్గ రాజకీయాలకి తమని కేంద్రబిందువు చేస్తుంటే తామేంచేయాలి?? అసలు ఆడపిల్లగా పుట్టడమే మగవారికోసమన్నట్టున్న ఈ ప్రవర్తనల్ని, బూజుపట్టిన ఆలోచనల్ని, మురికి పట్టిన భావాల్ని ఉతికి ఆరెయ్యటం ఎలా???

ఈ సవాలక్ష సమస్యలు, వివక్షలు సమసిపోవాలంటే సవాల్‌ చేయడమే… చేసుకుంటూ పోవడమే…

Share
This entry was posted in పచ్చి పసుపు కొమ్ము. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.