ఢిల్లీలో ఆంధ్ర అసోసియేషన్ మరియు తెలుగు సాహితి వారు సంయుక్తంగా, కేంద్ర సాహిత్య అకాడమీ మరియు అప్పటి ఆంధ్రప్రదేశ్లోని ప్రరవేల సహకారంతో, తెలుగు సాహిత్యంలో స్త్రీ రచనలు నిన్న-నేడు-రేపు అన్న అంశంపై 2014 సెప్టెంబరు 13, 14 తేదీలలో నేను సమన్వయకర్తగా సదస్సు ఏర్పాటు చేసినపుడు, ప్రరవే అధ్యక్షురాలిగా పుట్ల హేమలత గారిని కలిశాను. తర్వాత ‘విహంగ’లో ఆవిడ అమూల్యమయిన సాహిత్య సేవ చూశాను. తరచూ మాట్లాడుకునేవాళ్ళం. ఆ సభల్లో పాల్గొనడానికి వచ్చిన సుమారు 30 మంది రచయిత్రుల్లో హేమలత గారు నాకెందుకో విశిష్టంగా కనిపించారు. ఆవిడ ప్రరవే అధ్యక్షురాలయినా కూడా ఆ దర్పం లేకుండా ఎప్పుడూ తన ప్రేమైక చిరునవ్వుతో చాలా నమ్రతగా ఉండేవారు.
ఇప్పటి సాహిత్య లోకంలో తమ గొప్పలను అందుబాటులో ఉన్న సోషల్ మీడియా ద్వారా చాటుకుంటున్న వ్యక్తులకు అతీతంగా ఉండే కొద్దిమంది సాహిత్యకారుల్లో పుట్ల హేమలత గారు ఖచ్చితంగా ఒకరు.
2014లో జరిగిన సదస్సు గురించి ఆవిడ ‘విహంగ’లో ప్రచురించారు. అంతా బాగా జరిగిన ఆ సదస్సుకు ఆవిడ ఒక్కరే తగిన గుర్తింపును కలుగజేశారు. అందుకు ఆవిడంటే నాకెప్పుడూ గౌరవమే.
2017 ఉగాది నాడు మేము కాకినాడలో బారిష్టర్ పార్వతీశం ప్రదర్శనకు వెళ్ళినపుడు ఎండ్లూరి సుధాకర్ గారిని, హేమలత గారిని కలవడం జరిగింది. పనుల ఒత్తిడి వల్ల వారు మా నాటకం చూడలేకపోయారు.
తన అంతర్జాలంలో తెలుగు సాహిత్యం పరిశోధన గ్రంథాన్ని ఎంతో ప్రేమగా నాకు పంపించారు ఆమె. అలాగే సుధాకర్ గారు కూడా ఆయన రాసిన ”కొత్త గబ్బిలం” కవితా సంపుటిని పంపించారు. మానస రాసే కథలను మెచ్చుకున్నప్పుడు ఆవిడ సంతోషపడేవారు.
అంత స్నేహమయిని కోల్పోవడం నిజంగా బాధాకర విషయమే. అయితే ఆవిడ జ్ఞాపకాలు ఎప్పటికీ ఉంటాయి.