ఆ అరుణోదయం హద్దుల మీద
మనసు భాష పంచుకుందామనుకున్నా!
చరవాణి పలుకక సతమతమయ్యా!
ఇంతలోనే!
విషాదం విస్తృతమయింది
ఎంతపని చేశావు తల్లీ!
ఇహలోక యాత్ర
అర్థాంతరంగా ముగిస్తావనుకోలేదు
మొన్నమొనన్ననే తిరుపతిలో
మీతో మాటలు పంచుకున్నట్లుగానే వుంది
మా ఇంటికి ఆహ్వానించినట్లుగానే వుంది
నిన్ను ఎలా మరువగలం
అమ్మలా ఆదరించిన దానివి
పరిశోధక వలస పక్షులకు
ఆకలి తీర్చిన మహావృక్షానివి
కష్టాల్ని బడిసి పట్టుకొని
పురిటి ధర్మాన్ని ఆచరించిన దానివి
మహిళాభ్యోదయం కోసం
‘వేకువ రాగం’లా
విహంగ వీక్షణం చేసినదానివి
బద్దలవుతున్న అగ్నిపర్వతాన్ని
పూర్ణాకాశంలా భద్రంగా దాచుకున్నదానివి
నిబ్బరాన్ని గంభీరంగా నటిస్తూ
లోలోపల కుప్పకూలి పోతున్న
వర్తమానపు నిషిద్ధమానవుణ్ణి చూడమ్మా!
దిగులు పిట్టలా కూర్చోని
ఒంటికి పోరాటం చేస్తున్నాడు,
పుట్టెడు దుఃఖంతో
కన్నీటిని వశీకరించుకున్న
ఈ నాన్నబిడ్డల్ని చూడమ్మా
ఏకాంత శిధిలాలమీద
మౌనంగా రోధిస్తున్నారు.
మీజ్ఞాపకాలతో ఊరడించు
ఊహల ఊయలలో చిరునవ్వుతో పలుకరించు.
గ్రీష్మ గోదావరి అడుగుతుంది
కవిని బడి చేర్చి ఓదార్చిన అమ్మ పదని
ఎమని చెప్పను
ఎలా చెప్పను
ఎదురు చూస్తున్నాం.
నెత్తుటి వారసత్వానినై
మళ్ళీపుడతావనే! చిన్నఆశ.