మనుషులు శాశ్వతంగా భూమ్మీదే ఉండిపోరని తెలుసు కానీ ఇంత హఠాత్తుగా మాయమైపోతారని అస్సలు అనుకోలేదు. నిన్న హేమ ఇక లేరన్న విషయం తెలిసి మనసు పట్టేసేదాకా… ‘అయ్యో అయ్యో’ అంటూ ఎంత పరితపన, వేదన, ఎంతెంత మంది ప్రేమ సందేశాలు, ఎన్నెన్ని కన్నీటి చారికలు, ఎంతెంత బరువైన జ్ఞాపకాలు, ఎన్ని దిగుళ్ళు… చిత్రంగా ఇవేవీ కూడా హేమలతని వెనక్కి తీసుకురాలేవు.
ఒక్కమాట గాని తను ముందుగా చెప్పి ఉన్నట్లయితే సుధాకర్ గారు తన ప్రేమ తాళ్ళతో బంధించి వెనక్కి లాగి గుండెలకి హత్తుకుని ఉండేవారు కదా అని పదే పదే అన్పించింది. బహుశా తనకీ తెలిసి ఉండదు. అదేమిటో ప్రేమకి విడగొట్టడం లేదా అడ్డంగా పడగొట్టడం తప్ప నిలబెట్టడం చేతకాదు.
నేను సుధాకర్ గారి కవిత్వానికి పెద్ద ఫాన్‌ని.
అలా సుధాకర్ గారితో నెల్లూరులో రెండుసార్లు కలవడం తప్ప అంత దగ్గర పరిచయం లేదు హేమతో. కానీ ‘నీదీ నెల్లూరు-నాదీ నెల్లూరు’ అన్న లవ్ బాండేదో మా మధ్య నడుస్తుండేదేమో తెలీదు. అందుకే హేమలత ”ప్రతిమ గారూ…” అన్న పిలుపులో చాలా స్నేహం, ఆత్మీయత. అది పెదవుల్లో నుంచి కాకుండా హృదయంలో నుండి వచ్చినట్లుగా ఆ కళ్ళల్లోని మెరుపు చెప్పేది. హేమలత అందరితోనూ అంతే ఆత్మీయంగా ప్రేమగా ఉండేదని కూడా మనందరికీ తెలుసు. నిజంగా తనో ప్రత్యేకమైన వ్యక్తి.
వెబ్ మ్యాగజైన్స్ ఇంకా విరివిగా ప్రాచుర్యంలోకి రాకముందే ‘విహంగ’ని ప్రారంభించిందామె. విహంగలో రాయమని మా నెల్లూరు వారందరినీ ప్రోత్సహించేది. 2011లో అనుకుంటాను రాజమండ్రిలో అకాడెమీ సెమినార్‌లో బాగా దగ్గరయ్యాం. ఆ తర్వాత ప్రరవేలో భాగమయినప్పటి నుండీ తన పనులు, కార్యక్రమాలు, తన అంకిత భావం ఎప్పటికప్పుడు నాకు అర్థమవుతుండేవి. అభినందించేదాన్ని. విశాఖ సభలకి వెళ్ళి ఉంటే ఎంత బావుండేదా అని నాకు పశ్చాత్తాపం కలుగుతోంది.
ఏ మాటలు కూడదీసుకుని సుధాకర్ గారిని, మానస, మనోజ్ఞ మందారలని ఓదార్చగలం? ఆ ఉపరితలపు మాటలతో వారిని ఓదార్చలేమని తెలిసే సుధాకర్ గారికి ఫోన్ చేయడానికి వెనుక ముందులాడుతున్నాను. ఈ షాక్ నుండి వారు త్వరగా కోలుకోవాలని మనసారా కోరుకుంటున్నాను.
జనన, మరణాల మధ్య జీవితాన్ని గురించి పూర్తి అవగాహన చేసుకుని ఉన్న పరిస్థితుల్లోనే తాను ఆనందంగా జీవిస్తూ, చుట్టూ ఉన్నవారిని ఆనందంగా ఉంచే హేమలత ఒక ప్రత్యేకమైన వ్యక్తి.