కాలం తానేంటో ఒక్కసారిగా చూపిస్తుంది… జీవితం అంటే ఇదే… అని చరిచి చెబుతుంది.
ఈ మాటలు నాకు ఇప్పుడు అనుభవంలో ఉన్నాయి.
లక్ష్మణ్ ఆదిమూలంగా మాట్లాడితే… ఎన్నో ఏళ్ళ అనుభవం, పరిజ్ఞానం, సమాజంలో తనకంటూ ఒక స్థానం, పుస్తక ప్రపంచం, తెలిసిన మనుషులు, వ్యాపకాలు, ఆలోచనలు అన్నీ ఒక్కసారిగా ఏమైపోయాయి అనిపిస్తుంది.
కానీ…
అరసి శ్రీ గా…
అసలు అరసి నా కలం పేరు. అరసి శ్రీ సాహిత్య ప్రపంచంలోకి వచ్చింది హేమలత మేడం వల్లనే. మేడం అని పిలవడం పరిచయమయిన మొదట్లో అనుకుంట. తర్వాత తర్వాత మేమ్ అని పిలవడమే. ఎప్పుడూ పూర్తిగా మేడం అని పిలిచింది లేదు.
నాకు ఇప్పటికీ గుర్తే. పి.జి అయ్యాక కొన్ని సంవత్సరాల విరామం తర్వాత యూనివర్శిటీకి వెళ్ళాను ఎం.ఫిల్ చేయాలని. సుధాకర్ సార్‌తో మాట్లాడాలని ఆయన గదికి వెళ్ళాను. అక్కడే సార్ గదిలో కంప్యూటర్‌లో వర్క్ చేసుకుంటూ కనిపించారు హేమలత గారు. అప్పుడే నేను ఆమెను తొలిసారిగా చూశాను. ఇక్కడే పి.జి చేశాడు, డాన్సర్ అంటూ సార్ నన్ను మేడంకి పరిచయం చేశారు. మేడం మాటల్లో తాను ఒక కూచిపూడి డాన్సర్‌ని ముఖాముఖి చేస్తున్నట్లు చెప్పారు. సుమారు రెండు గంటలు మాట్లాడారు. నువ్వు ఏమైనా వ్రాయి అంటూ విహంగ గురించి చెప్పారు.
విహంగలో వర్క్ చేయడం మొదలు కాగానే ఎన్నో పుస్తకాలు చదివాను. ఎంతోమంది గురించి తెలుసుకున్నాను. మామ్ ఏమి రాసినా ఎలా ఉంది అరసి చూడు, ఇంకా మారుద్దామా అంటూ నాకు తెలియకుండానే నన్ను రచనా వ్యాసంగం వైపు తీసుకెళ్ళారు.
నేను ఏదైనా రాయాలి, ఒక పని చేయాలి అనుకున్నప్పుడు మామ్ ఇలా చేయాలని ఉంది అనగానే ‘హా బాగుంది చెయ్యి, నువ్వు చెయ్యగలవు, రాయగలవు అరసి’ అంటూ ఆ పనిని మరింత సులభతరం చేసేవారు. మామ్‌కి తెలిసిన ఏ ఒక్కరితోనైనా రెండు నిమిషాలు మాట్లాడినా నీ గురించి హేమలత మేడం చెప్పారు అరసి శ్రీ అంటూ చెప్పేవారు.
పత్రిక నిర్వహణలో భాగంగా సంపాదకీయాలు రాయాలన్నా, ఎవరైనా కథ పంపమని అడిగినప్పుడు కానీ, కవిత అడిగినప్పుడు కానీ ఏ అంశం తీసుకుందాం అంటూ నన్ను ఆలోచింపచేసేవారు. ఆ అంశం తీసుకుంటే ఎలా ఉంటుంది మామ్ అంటే సరే అదే రాద్దాం అంటూ సునాయాసంగా కథను, సంపాదకీయాలను పూర్తి చేసేవారు. మామ్ సంపాదకీయాలు రాసే సమయంలో ఎన్నో ఆలోచనలు, ఎన్ని ప్రశ్నలు, ఎన్ని ఛలోక్తులు. నాకింకా ఇప్పటికీ, ఎప్పటికీ పదిలమే. నేను ఏ వార్త చదివినా, ఏ విషయం విన్నా వెంటనే మామ్‌తో చెప్పాల్సిందే.
అంతర్జాలంలో ఏదైనా విషయాన్ని తెలుసుకోవాలన్నా, సమస్యని పరిష్కరించాలన్నా మామ్‌కే సాధ్యం. అదే పనిగా గంటలు గంటలు కంప్యూటర్ ముందే ఒదిగిపోయేవారు. చివరికి ఆ విషయాన్ని సాధించేవారు. హమ్మయ్య ఇప్పటికి అయింది అరసి అంటూ అర్థరాత్రి, తెల్లవారుఝామున ఎస్సెమ్మెస్ చేసేవారు. అదేంటి ఇప్పటివరకు పడుకోలేదా మామ్ అంటే లేదు అరసి ఆ విషయం వెతుకుతూ ఉన్నా, అయిపోయింది ఇక నిద్రపోతానులే అనేవారు. అంత పట్టుదల పని విషయంలో.
కానీ ఆరోగ్యం విషయంలో అజాగ్రత్తే. ఎప్పుడూ అంతే. ఎంత చెప్పినా వినలేదు. తిన్నారా, మందులు వేసుకున్నారా అని అడగాల్సిందే. పనిలో ఉన్నప్పుడు వాటి ఊసే ఉండదు అసలు. అలానే ఆరోగ్యం నిర్లక్ష్యం చేసుకున్నారు.
నాలా ఎవ్వరూ ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకండి, సమయానికి తినాలి అనేవారు. ఎంత పని ఉన్నా, పత్రిక వర్క్‌లో ఉన్నా అర్థరాత్రి వరకు చేస్తున్నా ఇద్దరం కలిసి పత్రిక పని చేసే సమయంలో చాలా సమయమయింది ముందు నువ్వు ఏదైనా తిను అంటూ నిలబడనిచ్చేవారు కాదు. కానీ తాను మాత్రం సమయం చూసుకునేవారు కాదు.
చివరగా వైజాగ్ వెళ్ళడానికి ముందు రోజు మామ్ కాలేజీకి వెళ్ళి వెంటనే వచ్చేద్దాం రా అరసి అంటే వెళ్ళాను. ఇద్దరం కాలేజీకి వెళ్ళేటప్పుడు ‘ఈ ఆటోలో వెళ్ళలేకపోతున్నా అరసి. మన ఇంట్లో కారు ఉంది. డ్రైవింగ్ నేర్చుకోవాలి. నేను ఊరు నుంచి వచ్చేటప్పటికి డ్రైవింగ్ స్కూల్ వాళ్ళతో మాట్లాడు’ అన్నారు. సరే మామ్ అన్నాను. తర్వాత మళ్ళీ 104 జ్వరంతో చూడడమే.
ఎన్ని రాయాలనుకున్నారో… అటు సాహిత్యం, ఇటు పత్రిక… ఎన్ని పనులు మొదలుపెట్టి ఉన్నాయో… ఏ పనినైనా పూర్తి కాకుండా వదిలిపెట్టని మీరు ఇలా ఎలా చేస్తారు మామ్ అని అడగాలని ఉంది…
ఒక్క మాటలో చెప్పాలంటే మదర్ ఆఫ్ అరసి శ్రీ….