హేమలత ప్రరవే ఆవిర్భావ సందర్భం నుంచి నాకు పరిచయం. తొలి కార్యవర్గం సభ్యులుగా ఉన్నాము. పదేళ్ళ క్రితం అదే చిరునవ్వు, అదే పసిపాప ముఖం.
అందరూ చెప్పుకుంటారు ఆమె ఇంటికెళ్తే తల్లిలా వడ్డించి తినిపిస్తుందని. నాకూ ఆ అనుభవముంది. కానీ అది అందరి అనుభవంలాంటిది కాదు. కొంచెం డిఫరెంటు. వినోదినితో కలిసి ఒకసారి ఊరికే పలకరించడానికి వెళ్ళాను. తన ఇద్దరు కూతుళ్ళకి చేపల కూర కలిపి ముద్దలు తినిపిస్తోంది హేమ. వాళ్ళతో పాటు నాకూ పెడతానంది. అబ్బే నాకు ఆకలిగా లేదు అని చెప్పినా వినదు. అవి వట్టి అన్నం ముద్దలు కాదు, ప్రేమ ముద్దలు. తినక తప్పలేదు. పెళ్ళి భోజనం చేసిన తర్వాత ఆమె ఇంటికి వెళ్ళిన నేను ఆమె ప్రేమతో గోరు ముద్దలు తినిపిస్తుంటే కాదనలేకపోయాను. ఆ దృశ్యం నాకింకా కళ్ళముందే మెదులుతోంది. కానీ ఇప్పుడు ఆ ప్రేమమూర్తి లేదు.
తిరుపతిలో జరిగిన ప్రరవే సమావేశంలో నేను వేసుకున్న పూసల దండ తనకి బాగా నచ్చింది. తీసుకోమని ఇచ్చా. కొంత కాలం తర్వాత ఏలూరు సభలకు వెళ్ళినపుడు ఆ దండను తిరిగి ఇచ్చేసింది. వద్దు నీ దగ్గరే ఉంచుకో అన్నా వినలేదు, కానీ నేను తీసుకోలేదు. ఎప్పుడు పెట్టిందో ఏమో హైదరాబాద్ వచ్చి చూసుకుంటే నా బ్యాగ్‌లో ఉంది ఆ పూసల దండ. నాకు కొంచెం బాధనిపించింది. ఎందుకలా తిరిగిచ్చేసింది? అని. కానీ నాకిప్పుడు ఆ దండ ఎంతో విలువయినది. ఎందుకంటే అది హేమ తిరిగిచ్చిన దండ. దండయితే ఉంది… హేమ లేదు.
రెండు నెలల క్రితం అర్థరాత్రి ఫోన్ చేసింది. యూరోపియన్ సాహిత్యంలో అణచివేతకు గురయిన మహిళా రచయిత్రుల గురించి రాసివ్వు. పుస్తకం వేస్తున్నాను అంది. నాకు పెద్దగా అవగాహన లేదు ఆ విషయం గురించి అని చెప్పా. నిజానికి నేను ఈ మధ్యన ఏమీ రాయడంలేదు. రాసే మూడ్ కూడా లేదు. ఒకలాంటి నిర్లిప్తత, డిప్రెషన్… ఏదైనా అనుకోండి. ‘అలా కాదు పోనీ ఇండియన్ దళిత రచయిత్రి గురించి రాయి, నువ్వు రాయాలి అంతే’ అంది. ఏ మంత్రం చల్లిందో, లేక ఆమె అడిగిన తీరులో ఉన్న మాయో మరి… తమిళ రచయిత్రి శివగామి ఆర్టికల్ నేననుకున్న దానికంటే త్వరగా రాసి పంపించా. ఆమెలో ఆ మేజిక్ ఉంది. కానీ ఇప్పుడామే లేదు.
మరోసారి ఫోన్ చేసి ఎలా ఉన్నావని అడిగింది. ‘ఏముంది, ఎలాగో ఉండడానికి? నేను, నా చుట్టూ నాలుగు గోడలు. ‘My lonelines is my only companion’ అన్నా. ‘అదేంటి అలా మాట్లాడతావ్? నేను నెలరోజుల్లో హైదరాబాద్ వచ్చేస్తున్నా. నీ దగ్గరకొచ్చి వారం రోజులుంటాను. కాసుకో’ అని చెప్పింది. బతికుంటే వచ్చేదేమో! నా చుట్టూ నవ్వుల పువ్వులు వెదజల్లేదేమో… ఏం లాభం… ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా వెళ్ళిపోయింది.
విహంగ వెబ్ పత్రిక ప్రారంభించిన తొలిరోజుల్లో నా స్నేహితురాలు సంధ్య (POW) ని ఇంటర్యూ చేసి పంపించమంది. అలాగే అని కొంత పంపించా. విహంగలో వచ్చింది. మిగతా సగం పంపలేదు. దానికి చాలా కారణాలున్నాయి. మామూలుగానే సంధ్య చాలా బిజీ. నేను ఉద్యోగానికి వికారాబాద్ పోవడం, రావడం; అసలు ఏదన్నా రాయాలనే కోరికే నశించడం (కొన్ని అనుకోని సంఘటనల వల్ల). ఏదేమైనా నేను ఆ ఇంటర్వ్యూను పూర్తి చేయలేదు. ఇప్పుడు ఏమైనా సరే అది పూర్తిచేసి విహంగకు పంపిస్తా. అదే నేను హేమకు ఇచ్చే నివాళి…
మరో విషయం… ఎవరైనా చనిపోతే స్నేహితులు, బంధువులు వారి కుటుంబానికి భరోసాగా వెళ్ళి అంత్యక్రియలలో పాల్గొంటారు. నేను రాజమండ్రిలో హేమ అంత్యక్రియలకు వెళ్ళలేదు. అలా వెళ్ళకపోవడానికి నా స్వార్ధమే కారణం.ఎందుకంటే హేమ నా కళ్ళముందు అదే పసిపిల్ల ఎక్స్‌ప్రెషన్‌లో చిరునవ్వులు చిందిస్తూ కనిపించాలని… అంతే… మరోలా కుదరదు.