ప్రియాతి ప్రియమైన హేమలతా,
బంగారు తీగా, పుట్ల హేమలతా తిరిగి రాలేని లోకంలోకి వెళ్ళిపోయావా? ఎందుకంత తొందరపడ్డావు. శరీర యుద్ధం చేస్తూనే ఉన్నావు. విజయం నిన్ను చేరేలోపుగా నువ్వే గెలుపు ప్రకటన చేస్తూ, శ్రమిస్తూ శ్రమిస్తూ, శ్రమను గౌరవిస్తూ, సాహిత్య సామాజిక యుద్ధభూములే నీ స్థావరాలనుకొని వాటిని వెలుగువైపు పయనింపే దిశలో నిన్ను నువ్వు మర్చిపోయావు.
మానసా, మనోజ్ఞలు పక్షిపిల్లల్లా నోరు తెరుచుకొని నీ రాక కోసం, నవ్వు కోసం, ప్రేమ కోసం, పలకరింపు కోసం ఎలా ఎదురు చూస్తున్నారో చూడు ఒక్కసారి. ఎండ్లూరి సుధాకర్ పరిస్థితేమిటి చెప్పు. బతుకంతా తీయని బంధంతో, బాధ్యతతో కలసి ఇన్నాళ్ళూ నడిచిన మీ తోవలో నువ్వొక చుక్కవై ముందే వెళ్ళిపోతావని అనుకోలేదు. అతను రాసిన ‘బంగారు తీగా’ కవిత గుండెను గాయపర్చింది. నీ పట్ల ఎంత ప్రేమో, ఎంత కరుణో అందులో స్పష్టంగా కన్పించింది. పాదాలు నీవి కనుమరుగైనా ఒకప్పుడు పాదరక్షలైన వాటిని ముద్దాడుతున్నాననడం కన్నీళ్ళను తెప్పించింది.
బంగారూ, నాకొక్కోసారి అన్పిస్తుంది. మంచి వాళ్ళను ఈ లోకం ఎక్కువ కాలం భరించలేదేమోనని. తన దగ్గరకు, నక్షత్రాల లోకంలోకి ఎప్పుడెప్పుడు పిల్చుకుందామా అని నిరీక్షిస్తూ, నిరీక్షిస్తూ ఒక్కసారిగా ఒడిలోకి లాగేసు కుంటుందనుకొంటా. లేకపోతే ఇంత చిన్నవయసులోనే అలా నడిచి వెళ్ళడం బాధగా ఉంది. మంచి కవయిత్రివి. కథకురాలివి. భారతదేశంలోనే మొదటి మహిళా వెబ్ పత్రిక ‘విహంగ’ వ్యవస్థాపకురాలివి. డిజి ప్లానెట్ సహ వ్యవస్థాపకురాలివి. డిజి ప్లానెట్‌లోనే అనుబంధంగా ‘డిజి ఆర్ట్స్’ను ఇక్బాల్ చంద్‌తో కలిసి రూపకల్పన చేశావు. తెలుగు కళాకారులందరినీ ఒకే వేదికపైకి తీసుకొని వచ్చి వారి రచనలను డిజిటలైజ్ చేసే ఆలోచనలో గత రెండు ఏళ్ళుగా అవిశ్రాంతంగా పనిచేశావు. అందర్నీ నువ్వు కలుపుకునే తీరు, ఆదరణ, కరుణ నిజంగా మరువలేనిది. రిసెర్చ్ విద్యార్థులందరికీ మీరు చేసిన సాయాలు, ఆదరణ చాలామంది చెప్తూనే ఉన్నారు.
‘అంతర్జాల పత్రికలు, సాహిత్యం’ అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించి దాన్ని పుస్తకరూపంలో తీసుకువచ్చావు. పరిశోధకులకు ఉపయోగపడే విధంగా వ్యాసాలను ‘లేఖన’ పేరుతో రెండు సంపుటాలను తీసుకొచ్చావు. లేఖన-3 ప్రస్తుతం ముద్రణలో ఉంది కదా! నిత్య చలనశీలివి నువ్వు. మొదట్లో నైతిక విలువలను బోధించే కథలు రాశావు. పరివర్తన, కరకు గుండె, కల్వరి వాణి, హరప్పా, హృదయజ్యోతి, తిరిగిరాని పయనం, కనలేని కలులు లాంటి మంచి కథలెన్నో రాశావు. ‘మిస్ పవిత్ర’ అనే నవల కూడా మంచి నవల. ‘నీలి మేఘాలు’ స్త్రీ వాద కవిత్వంలో కూడా ‘జ్ఞాపకాల తెరలు’ అనే కవిత ఉంది. అమ్మను తలచుకుంటూ రాసిన అద్భుతమైన కవిత అది. ‘ఇప్పుడు నేను / సమూహంలో ఏకాకినై / శూన్యపు రెక్కల కింద / పిల్లకాకినై ఒదిగి పోతుంటాను / ఒక్క అమ్మ మాత్రమే / నన్ను మనిషిని చేసి / జీవిత రహదారిని చూపుతుంది / నేను తప్పటడుగులు వేస్తూ / అమ్మ చిటికెన వేలు పట్టుకొని / జీవనరేఖల సరిహద్దులు కొలత వేస్తుంటాను. అప్పట్లో రచన పత్రికలో కూడా వచ్చిందిది. దళిత స్త్రీల కథలు, దళిత స్త్రీల సాహిత్యం మీద ప్రరవే కథల ఈ-బుక్ రూపొందించావు. అనేక ఆకాశాలు కథా సంపుటికి, బోల్షివిక విప్లవ స్ఫూర్తి వ్యాసాలకు సహసంపాదకురాలివి. అనేక ఇంటర్వ్యూలలో స్త్రీ సాధికారత గురించి అద్భుతంగా వివరిస్తూ పోయావు. నీ చుట్టూ ఉన్నవాళ్ళ సమస్యలన్నీ నీవిగా భావించి, అనారోగ్యాన్ని కూడా తోసిరాజని ధైర్యాన్ని నింపిన సంఘటనలెన్నో నీ జీవితంలో. సాహిత్య పిపాసివి. అత్మబంధువువి కూడా. ఇంటర్నేషనల్ సెమినార్లు ఎక్కడ జరుగుతున్నా అందరికీ తెలపడం బాధ్యత అనుకునేదానివి. ‘అంతర్జాలంలో తెలుగు సాహిత్యం’ అంశంపై పిహెచ్‌డి కూడా చేశావు. నీ గురించి ఎన్ని తలచుకున్నా అవన్నీ చిన్న చిన్న నీటి కుండలై కంట్లోనే చేరిపోతున్నాయి.
సుధాకర్ గారితో మీకున్న ప్రేమానుబంధం మరువలేనిది. మొదట్లో
ఉత్తరాలు, ప్రేమలేఖలై, స్నేహలేఖలై, వివాహ లేఖగా మారేంతగా గాఢమైన పరిచయం మీది. గొప్ప ఆరాధన మీరంటే, మీరిద్దరూ ఇష్టపడి చేసుకున్న వివాహంతో పరిపూర్ణ జీవితాన్ని అనుభవించారు. మనం ‘గగన్‌మహల్’ రోడ్డులోని మీ ఇంటికి వచ్చిన సందర్భాలెన్నో గుర్తొస్తున్నాయి. అవి ఎం.ఫిల్ చేసే రోజులు. మీ చేతిరాత చాలా అందంగా ఉండడంతో రిసెర్చ్ ఫెయిర్ కాపీ నువ్వే చేశావు. మీ ఇంట్లో మనం తిన్న అన్నం ముద్దలిప్పుడు గొంతుకడ్డం పడుతున్నాయి. నువ్వెన్నయినా చెప్పు. నువ్వు లేని జీవితం పగిలిన అద్దం లాంటిది. జ్ఞాపకాల గాజుముక్కలు గుచ్చుకుంటూనే ఉన్నాయి. ఒకసారి మనం కాకతీయ యూనివర్శిటీలో సెమినార్ పూర్తయ్యాక హైదరాబాద్ తిరిగొస్తున్నాము. బస్సులో జనం నిండి ఊపిరాడని పరిస్థితి. గీత, నేను, నువ్వు బస్సులో నిలబడే ఉన్నాం. అప్పటికే చాలా రాత్రయింది. ఊపిరాడక నువ్వు అల్లకల్లోలం అయిపోయావు. నీ స్థితి చాలా బాధనిపించిందప్పుడు. కానీ ఇంతలోనే ఊపిరి అందక అలా నిశ్చల సమాధిలో నిదురోతావని తెలీదు మిత్రమా!