నా పేరు పెరుమాళ్ళ రవికుమార్. నాది నంధ్యాల. నేను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. చదివే రోజుల్లో మాకు ఎండ్లూరి సుధాకర్ గారు ఆచార్యులుగా ఉండేవారు. నేను ఎం.ఫిల్ చేసే సమయంలో ”ఉభయ గోదావరి జిల్లా రచయితల జాతీయ సదస్సు” జరిగింది. హేమలత గారిని చూడడం అదే మొదటిసారి. చాలా గంభీరంగా కనిపించారు. మాట్లాడడానికి కొంచెం భయపడ్డాను. అయినా వెళ్ళి పలకరించాను. ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. నేను అంతవరకూ ఏ సభల్లోనూ పాల్గొనలేదు. అందరూ శాలువా, జ్ఞాపికతో సన్మానించబడుతుంటే నేనూ అలా సన్మానించబడాలని ఆశ కలిగింది. ఒకసారి జ్ఞాపికను తీసుకొని చూస్తాను మేడమ్ అని అడిగాను. ఆ జ్ఞాపికను, శాలువాను నాకు ఇచ్చేశారు. ఇప్పటికీ వాటిని నా బీరువాలో భద్రంగా దాచుకొన్నాను.
హేమలత గారితో అనుబంధాన్ని గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. వారితో పరిచయం పదేళ్ళు మాత్రమే, కానీ వంద సంవత్సరాలకు సరిపడా జ్ఞాపకాలను అందించారు. క్లుప్తంగా చెప్పడం చాలా కష్టం. కానీ ప్రయత్నిస్తాను. హేమలతగారు తన కూతురు మానస, మనోజ్ఞలతో సమానంగా నన్ను కొడుకుగా చూసుకున్నారు అనడం కంటే పెంచారు అనటం సమంజసంగా ఉంటుంది.
ప్రతి దసరా, సంక్రాంతి, వేసవి సెలవులు వచ్చాయంటే చాలు సొంతింటికి చేరినంత సంతోషంతో హేమలతగారి ఇంటికి చేరేవాణ్ణి. ఆ పదిరోజులు ఎంతో సంతోషంగా గడిపేవాళ్ళం. నచ్చినవి చేసుకొని తినటం, బయట సాహిత్య కార్యక్రమాలు ఉంటే వాటికి వెళ్లటం లేదంటే సాహిత్యంపై చర్చలు, అదీ కాదంటే నెల్లూరు నుండి వెలువడే ‘విశాలాక్షి’ పత్రికకు కాలమ్ రాసేవారు. తను చెప్తుంటే నేను రాస్తూ ఉండేవాడ్ని. ఒక్కోసారి తెల్లవారుజామున మూడు వరకు రాసుకున్న సందర్భాలు ఉన్నాయి. అప్పటివరకు నేను ఒక్క వ్యాసం కూడా రాయలేదు. ఎలా రాయాలో ఆమె నేర్పుతూ వచ్చారు. ఈ రోజు సాహిత్యం పట్ల అంతో ఇంతో అభిరుచి ఏర్పడిందీ అంటే అది హేమలత గారి వల్ల మాత్రమే. హేమలత గారితో ఎన్నో సభలకు, జాతీయ సదస్సులకు హాజరయ్యాను. ఎంతోమంది గొప్ప గొప్ప కవులను, రచయిత్రులను పరిచయం చేశారు. ఆ అనుభూతుల్ని ఎప్పటికీ మర్చిపోలేను.
హేమలత గారి వ్యక్తిత్వం గురించి చెప్పాలంటే, చూడడానికి ఎంత గంభీరంగా కనిపిస్తారో మనసు మాత్రం చాలా సున్నితం. చిన్న పిల్లల మనస్తత్వం. చిన్న చిన్న సరదాలను సైతం ఆస్వాదిస్తారు. నాకు తెలిసి అసలైన మానవతావాది. ఆత్మవిశ్వాసానికి రూపమిస్తే అది హేమలత గారిలా ఉంటుంది. కుల, మత భేదాలు లేకుండా అందరినీ ప్రేమించిన రచయిత్రి. ఎవరైనా కుల ప్రస్తావన తెస్తే చదువుకున్న మనం కూడా ఇలా ఆలోచించటం మంచిది కాదని సున్నితంగా ఆ విషయాన్ని దాటవేసేవారు.
హేమలతగారి చిన్ననాటి సంగతులు, తన స్నేహితుల వివరాలు వంటి ఎన్నో కబుర్లతో సమయమే తెలిసేది కాదు. 2017 డిసెంబరు 23వ తేదీన నా ఎం.ఫిల్ సిద్ధాంత వ్యాస పుస్తకావిష్కరణ జరిగింది. ఆ కార్యక్రమానికి ఎండ్లూరి సుధాకర్ గారే అధ్యక్షత వహించి హేమలతగారి చేతుల మీదుగా పుస్తకావిష్కరణ చేయడం నా జీవితంలో మరచిపోలేని సంఘటన. ఆ పుస్తకం ముద్రణ దగ్గర నుండి కవర్ పేజీ వరకు అన్నీ దగ్గరుండి ఆమే చూసుకున్నారు. అప్పటికీ మేడం పుస్తకాలు కొన్ని ముద్రణలో ఉన్నా అవి పక్కనపెట్టి నా పుస్తక ముద్రణ గురించి పట్టించుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద గ్రంథమే అవుతుంది.
ప్రతి ఒక్కరినీ ఎంతో ప్రేమించేవారు. వాళ్ళు చాలాసార్లు మోసం చేశారని తెలిసినా కూడా మొదట్లో ఎంత ప్రేమించేవారో తర్వాత కూడా అంతే ప్రేమను చూపేవారు. ఆ విషయంలో చాలాసార్లు వాదించినా వినేవారు కాదు. అంతటి నిస్వార్థ వ్యక్తిత్వం. ఎవరితోనైనా ఒక్కసారి మాట్లాడితే చాలు వాళ్ళు హేమలత గారి ఆప్యాయతకు ఆకర్షితులై పోతారు.
హేమలత గారు ఎప్పుడూ పరిశోధక విద్యార్థులకు ఉపయోగపడే విధంగా లేఖన పేరుతో మూడు పుస్తకాలు ముద్రించారు. ముద్రణకు సొంత డబ్బును ఖర్చుపెట్టారు. ఎప్పుడూ నలుగురికీ ఉపయోగపడడంలో ఉన్న ఆనందం వేరు అంటుండేవారు. ఆమె సన్మానం చేయించుకోవడానికి ఇష్టపడేవారు కాదు. ఏ విషయంపైనయినా అలవోకగా మాట్లాడేవారు. విషయాన్ని మరో కోణంలో విశ్లేషించి చెప్పేవారు. నేను ఏదైనా సంస్థ పెట్టి కృషి చేయాలని ఉంది అన్నప్పుడు నన్ను ఎంతో ప్రోత్సహించి సంస్థను ఎలా నడపాలో సవివరంగా తెలిపి సంస్థకు ‘సాహిత్య సీమ’ అని నామకరణ కూడా చేశారు. సాహిత్య సీమ హేమలత గారి సూచనలతో, సలహాలతో సంస్థ ప్రథమ వార్షికోత్సవం జరుపుకుని రెండవ సంవత్సరం కూడా విజయవంతంగా కొనసాగుతోంది.
హేమలత గారు ఎక్కడికి వెళ్ళినా మా అబ్బాయి అని పరిచయం చేసేవారు. నేను అమ్మా అని పిలిచేవాణ్ణి. ఫోన్ చేసినా ‘నాయనా’ అని ఎంతో ఆప్యాయంగా పిలిచేవారు. ఇప్పుడు ఆ పిలుపు లేదన్న బాధ మాత్రం ఎప్పటికీ తీరనిది. హేమలత గారు ఎంత అనారోగ్యంతో ఉన్నా చాలా ధైర్యంగా, ఉత్సాహంగా ఉండేవారు. తన పక్కనున్న వారిని ఉత్సాహపరిచేవారు. నాకు మొదట్లో కంప్యూటర్ టైపింగ్ రాదు. ఎలా చేయాలో దగ్గరుండి నేర్పేవారు. అలా నేర్పుతూ ‘విహంగ’ ఎడిటర్ స్థాయి వరకు తీసుకొచ్చారు. ఏదైనా తెలియని విషయాన్ని అడిగితే ఎంతో ఓపిగ్గా, విసుగు లేకుండా వివరంగా చెప్పేవారు. ఆమె ఎంతో ఓర్పు గలవారు.
హేమలత అమ్మ హాస్పిటల్‌లో ఉన్నారని తెలిసి వెంటనే వెళ్ళాను కానీ చివరగా కళ్ళారా చూడలేకపోయాను, మాట్లాడలేకపోయాను అన్న బాధ మాత్రం నన్ను వెంటాడుతూనే ఉంటుంది. హాస్పిటల్‌లో చలనం లేకుండా పడి ఉండడాన్ని చూసి తట్టుకోలేకపోయాను. మృత్యువుతో పోరాడి వస్తారనుకున్నాను కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదు. ఎప్పుడైనా ఊపిరి ఆడట్లేదు రవీ అని అంటుండేవారు. అలాంటిది సమాధి చేస్తున్నప్పుడు, ఆమెకు ఊపిరి ఆడకుండా చేస్తున్నారంటూ ఎంతో ఆవేదన చెందాను. రక్తం పంచుకు పుట్టకపోయినా ఆత్మీయత పంచిన అమ్మ. ఎక్కడున్నా ఆ నవ్వుల పువ్వులు వాడిపోవని, అమ్మ ఆత్మ శాంతించాలని, క్రైస్తవ నిరీక్షణ ఏంటంటే ఒకానొక దినాన కలుసుకుంటామనే శుభప్రద నిరీక్షణతో ఉన్నాను. ఎండ్లూరి సుధాకర్ గారి కుటుంబం, పుట్ల వారి కుటుంబం మానని గాయాన్ని త్వరగా మాన్పాలనీ దేవుణ్ణి కోరుకుంటూ….