ఆమె ఓ బంగారు తీగ
హేమ-లత
అవును, ఆయన చెప్పుకున్నట్టుగా ఆమె ఆయన పాలిట ఓ బంగారు తీగ.
ఆ బిడ్డల పాలిట ఆదర్శగురువు, ఓ నేస్తం.
ఆ తీగ నేడు అన్ని అనుబంధాలను తెంచుకుని ఎవ్వరికీ అందని తీరాలకు శాశ్వతంగా తరలి వెళ్ళిపోయింది. ఎవ్వరూ ఊహించనూ లేదు; ఎవ్వరికీ ఏ కాస్తంత సూచనా లేదు. ఇదో ఆకస్మిక పయనం. అందరికీ దిగ్భ్రాంతి కలుగజేసిన పరిణామం.
ఇంతకాలంగా నీవు అంతర్జాలంలో తేలియాడుతున్నా, సాహితీ లోకాన్ని విస్మరించలేదు. ఇప్పడు అంతర్జాలంతో పాటు, ఆ సాహిత్య కార్యకలాపాలూ మూగబోయినయి.
ఇక ఆయన అయితే సాహితీ సామ్రాజ్యాన్ని ఏలుతున్నాడు. ఆయన అంటాడు గదా తన జీవిత సహచరిని తలుచుకుంటూ…
”… నువ్వు విడిచిపెట్టిన చెప్పుల్ని
రహస్యంగా ముద్దు పెట్టుకుంటున్నా
తోలు వాసన కాదు
ఈ చర్మకారుడికి
ప్రేమ వాసన గుబాళిస్తోంది”
కొలమానం లేని నీ ప్రేమను ఎంత చక్కగా విశదీకరించావయ్యా సుధాకర్! కొంత మర్మగర్భాన్నీ జోడించావ్! ఎంత మనోహరంగా ఉంది నీ జీవన సహచరి పట్ల నీ ప్రేమ!
కానీ ఒక్కటి అడుగుతున్నా సుధాకర్! ముద్దుపెట్టుకోవడానికి ఎందుకయ్యా ఆ రహస్యం. ముద్దుపెట్టుకునేది నీ ఎదురుగానే నీ మనోఫలకంపై యున్నది
నీ జీవన సహచరి హేమలత
తల్లీ హేమలతా!
ఇటు నీ జీవన సహచరుడు సాహితీ సామ్రాజ్యాన్ని ఏలుతుంటే, నీవు సవ్యసాచిలా అటు అంతర్జాలంలో తేలియాడుతూనే, ఇటు సాహితీ వ్యాసంగం కొనసాగిస్తూ దేశం నలుమూలలా కలియ తిరుగుతున్నావ్.
చాలా సంతోషమైంది నీ కార్యకలాపాలు చూచి. ప్రభువు నుండి పిలుపు వచ్చినప్పుడు ”ప్రభూ! నేను నిర్వహించవలసిన రెండు ముఖ్యమైన బాధ్యతలు మిగిలిపోయినాయి. అవి పూర్తి చెయ్యాలి. నా రచనా సామగ్రిలో అసంపూర్ణంగా ఉన్న కొన్ని రచనలను పూర్తి చెయ్యాలి. రెండవ అమ్మాయి మనోజ్ఞను ఒక ఇంటిదాన్ని చెయ్యాలి ప్రభూ. అంతవరకైనా గడువు దయచేయండి ప్రభూ!” అని కోరలేకపోతివి. పిలుపు వచ్చిందే తడవుగా ప్రయాణమై పోతివి.
ఇదో పిడుగుపాటు. అన్ని బంధాలను తృటిలో తెంపేసుకుని అంతర్జాలంలో పయనమై, ఆకాశమార్గాన, ఆ మబ్బు తెరల్లోకి విహరించుతూ ఆ ప్రభువు సన్నిధికి చేరావు.
నీ నిష్క్రమణను క్షణకాలం కూడ భరించలేని నీ బిడ్డలు మానస, మనోజ్ఞలను, నీ జీవన సహచరుని, ఉభయ రాష్ట్రాల నలుమూలలా ఉన్న నీ మిత్ర బృందాన్ని వీడి ఇక తిరిగిరాని లోకాలకు పయనమై వెళ్ళిపోయావు.
ఈ సుఖ దుఃఖ మిశ్రమ మహావలయంబను
సత్రశాలలో
నీ సతినై ముగించితిని నేటికి నాదు ప్రవాస
యాత్రయో
ధీ సముపేత! యిట్టి పరదేశులల చెల్మి తిరంబు
గాదుక్ష్మా
వాసకథా విశేషములు స్వాప్నికములళ్ చపలా
విలాసముల్
అంటుంది ముంతాజ్ తాను భర్త నుండి నిష్క్రమించుతూ.
లోకం పోకడ తెలియజెప్పుతూః
ఆవిరియోడలో జలధియానమొనర్చెడు
బాటసారులో
భూవర! రేవులందు దిగివోయెదరించుక
వెన్కముందుగా
నీ వసుధా పణంబు పనియెల్ల ముగించి
స్వదేశగాములై
పోవుచు వచ్చు చుంద్రు సతమున్
బ్రజలీ నరజన్మ వర్తకుల్
(జీవిత సత్యాలను ఎంత చక్కగా మన ముందు ఉంచారండీ కవి జాషువా)
హేమలతమ్మ అంటుంది నాతో…
”సుధాకర్ గారి పరిశోధనా గ్రంథం ‘జాషువా’ ప్రచురణ సందర్భంగా మీరు ఎంతో నోట్స్ వ్రాసి కృషి చేశారు. మరి నా పుస్తకం ‘అంతర్జాలం’ చదివారా? మీ స్పందన ఏమిటి? అని అడిగితే, నవ్వి ఊరుకోవడమే కానీ ఒక్క మాట చెప్పరేం” అని ప్రశ్నించావు ఒకరోజున. ఏమని చెప్పను! నీ పుస్తకం చదవాలని పేజీలు తిప్పాను. ఏ మాత్రం అర్థం చేసుకోలేని పరిస్థితి. అది నాకు ‘+తీవవస డ కూa్‌ఱఅ’ అటువంటప్పుడు ఏమని చెప్పగలను! అంతర్జాలం అనేది నాకు గజిబిజి. నా దగ్గరున్న టాబ్లెట్ అనేదాన్ని కూడా సరిగ్గా
ఉపయోగించుకోలేని పరిస్థితి నాది.
అప్పుడప్పుడూ మా ఇంట జరిగే సమావేశాలకు అధ్యక్షత వహించి కార్యక్రమం నడుపుతూ ఉండేదానివి. పుస్తకావిష్కరణలూ చేపడుతూ ఉండేదానివి. ధన్యవాదములు.
ఒక నెల రోజుల క్రిందట మీ ఇంటికి వచ్చినపుడు నీ దగ్గర ఉన్న లాప్‌టాప్‌లో అనేక వింతలు, విశేషాలు చూపించావు. మరి కొంతసేపటికి సమీపంలోనే ఉన్న నా నివాసమునకు బయలుదేరా. కొంతదూరం నీవూ వచ్చి ఆగిపోయావు. మరో నాలుగు అడుగులు ముందుకు వేశానో లేదో అడుగులు తడబడ్డాయి. పట్టు తప్పింది. అడుగులు వెనక్కి వేస్తూ తూలిపోతున్నా. ఒకే ఒక్క క్షణం వెనక్కి పడిపోవడానికి. ఇంతలో నా మునిమనుమరాలు తేజ నా చేతులు పట్టుకుని ఆపుచేసింది. కొద్దిదూరంలో ఉన్న నీవు ‘ఆ ఆ ఆ’ అంటున్నావు. నీవు ముందుకు వచ్చి నన్ను పట్టుకునే సమయం లేదు.
ఆ మర్నాడు నీవు మా ఇంటికి వచ్చి విషయమంతా చక్కగా వర్ణించుతూ మా కోడలికి చెప్పావు. ‘ఈయనగార్ని బయటకు వెళ్ళనీయకండి. ఇల్లు దాటనీయకండి. ఒకసారి పడిపోవడం, తుంటి విరగడం, ఆపరేషన్… ‘ అంటూ ఏమేమో చెప్పావు. నా పట్ల ఇంత శ్రద్ధ తీసుకున్న నీకు ధన్యవాదములు. ఈ విషయం లోగడనే సుధాకర్‌కు చెప్పియున్నాను.
తల్లీ హేమలతా! నాకు ఇన్ని హెచ్చరికలు చేసిన నీవు నాకన్నా ఒకటి, రెండు పదులు కాదు… నాలుగు పదులు చిన్నదానివి (1922 / 1962) చిన్నదానవు. సమాజానికి ఎంతో సేవ చేస్తూ, ఆ సేవలలోనే డస్సిపోయినావు. ఇక శాశ్వతంగా విశ్రాంతి తీసుకోక తప్పలేదు. సమాజానికి సేవచేస్తూ నీవు నిష్క్రమించావు. ఏ సేవా చేయలేని నేను మిగిలిపోయాను. ఏమిటీ ఈ వైపరీత్యం! ఇదే కాబోలు లోకం పోకడ!