అవి బొమ్మూరులో తెలుగు యూనివర్శిటీ ప్రారంభమైన కొత్త రోజులు. నన్నూ, మా గీతని సెమినార్లకు పిలుస్తుండే వాళ్ళు. కాలేజి మొహం ఎరగని నాకు యూనివర్శిటీకి వెళ్ళడం గొప్ప అద్భుతంగా ఉండేది. కాత్మాయనీ విద్మహేతో పాటు ఎందరెందరో ప్రొఫెసర్లు, కవులు, రచయితలు, పండితులు అక్కడే పరిచయమయ్యారు. అఫ్సర్, సీతారాం, ప్రసేన్, రమేష్ బాబు, ఐలయ్య, యాకూబ్, లక్ష్మిలతో గీత బాగా కలిసిపోయేది. ఎండ్లూరి సుధాకర్‌ది చాలా కలివిడి తత్వం. ఆయన తెలుగు యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా ఉండడమే కాదు రాజమండ్రిలో చాలా మందికి మిత్రుడయ్యాడు. ఎక్కడ ఏ సాహిత్య సభ జరిగినా తను తప్పక ఉండేవాడు. అలాంటి ఒక సందర్భంలో అందర్నీ తన ఇంటికి ఆహ్వానిస్తే వెళ్ళాం. అదే నేను హేమలతని మొదటిసారి చూడటం. అమాయకమైన కళ్ళు, స్వీట్ వాయిస్. మానసకి నడక వచ్చింది. మందార (మనోజ్ఞ) చంటి పాపాయి. రెండు గదుల అద్దె ఇంట్లో పిల్లల్తో సతమతమవుతున్న హేమలత తర్వాతి కాలంలో పట్టుదలతో ఎదిగి ప్రొఫెసరై ‘విహంగ’ వెబ్ మేగజైన్‌ను విజయవంతంగా నడుపుతూ స్నేహశీలిగా పేరు తెచ్చుకోవడం సాధారణ విషయం కాదు. కొందరికి అన్ని రంగాలలో ప్రతిభ ఉన్నా మృదువుగా మాట్లాడడం రాదు. హేమలత నొప్పింపక, తానొవ్వక అందరికీ ఆత్మీయురాలైంది. అందుకే తను అడిగితే కాదనలేక రాసిన వాళ్ళెందరో! నా ఆత్మకథ చదువుతూ చలించిపోయి ఎన్నోసార్లు ఫోన్ చేసి పలకరించేది. నా కష్టసుఖాలు అడిగి తెలుసుకుంటూ, తన విషయాలు చెప్తూ ఎంతో దగ్గరైపోయింది. అహం అనేది మచ్చుకైనా తన దరికి చేరలేదు. చిన్న చిన్న విషయాల్ని కూడా నవ్వుతూనే పట్టించుకునే తన నడవడిక ఎంతో బావుండేది. మొన్న మొన్నటి విశాఖ ప్రరవే సభల్లో ”మీరు, నేను ఆకలికి ఆగలేం. తినేసి వద్దాం రండి” అంటూ నా భుజం మీద చేయివేసి పిలిచిన హేమలత నా మనసులోంచి ఎప్పటికీ నిష్క్రమించదు. నన్నొక నిర్ఘాంతతకి గురిచేసి ఈ లోకం నుంచి నిష్క్రమించింది.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags