నేను మొదటిసారిగా హేమక్కను 2013లో రాజమండ్రిలో కలిశాను. ఆ సంవత్సరం ఫిబ్రవరి 17, 18 తేదీలలో బొమ్మూరు సాహిత్య పీఠంలో ప్రరవే 3వ రాష్ట్రస్థాయి సదస్సు జరిగింది. అదే సదస్సులో మహిళా ఉద్యమ గాథలపై నేను రాసిన కథల సంపుటి ”పోరాడితేనే రాజ్యం” పుస్తక ఆవిష్కరణ జరిగింది. నన్ను నేను పరిచయం చేసుకుంటూ నా కలం పేరు కవిని అని చెప్పాను. ఆవిడ చాలా స్నేహంగా మాట్లాడుతూ మాటల్లో ”కవి” అని సంబోధించారు. గత అనుభవాల వల్ల నా పేరు చెప్పగానే ఏమంటారో అనుకున్నాను. దానికి భిన్నంగా ఆవిడ నాతో స్నేహంగా మాట్లాడడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. నా పేరు ఎవరికైనా చెప్పటానికి నేను ఎంతో సంకోచించేదాన్ని. ఎందుకంటే ఈ పేరు ఎందుకు పెట్టుకున్నావు అని చాలా మంది సాహితీ మిత్రులు / మిత్రురాళ్ళు అభ్యంతరం చెప్పారు. పేరు మార్చుకోమని సూచించారు. ఒక సాహితీ మిత్రురాలు ”ఈ పేరు పెట్టుకున్నది ఎవరో చూద్దామనుకున్నాను. జెంట్స్ ఏమో అనుకున్నాను. నువ్వా” అన్నారు. మరొకరు ”ఈ పేరు ఎందుకు పెట్టుకున్నావు?” అని అడిగితే మా నాన్నగారు పెట్టారు అని చెప్పా. అయితే మీ నాన్నగారు పెడితే పెట్టేసుకుంటావా? ముందు పేరు మార్చేయి అన్నారు. ఇలా అన్నీ చేదు అనుభవాలే…! వాళ్ళలా అనకుండా నన్ను ఓన్ చేసుకుంటూ, ఆత్మీయంగా ”కవి” అని పిలిచిన ఆమె పిలుపు, నా పట్ల చూపిన ఆత్మీయతానురాగాలు ఎప్పటికీ మర్చిపోలేనివి. నాటి సాహితీ మిత్రురాలిగా నాతో వ్యవహరిస్తూ పుస్తకావిష్కరణకు సంబంధించిన సూచనలు, సలహాలు ఇచ్చారు. ధారావాహికంగా విహంగలో ”పోరాడితే రాజ్యం”లోని కథలను వేశారు. 2014లో ఢిల్లీలో జరిగిన ప్రరవే సదస్సులో నేను హిందీలో రాసి చదివిన నారీ ముక్త్ కవితను, అలాగే దాని తెలుగు అనువాదాన్ని విహంగలో వేశారు. అలాగే అనేక కథలను, కవితలను వేశారు.
జి-మెయిల్ యూనికోడ్‌లో టైపింగ్ చేయడం నాకు రాదు. హేమక్క ఫోన్‌లోనే ఎలా టైప్ చేయాలో వివరంగా చెప్తుండేవారు. ఎప్పుడు ఫోన్ చేసినా రిసీవ్ చేసుకునేవారు. జి-మెయిల్‌లో తెలుగు టైపింగ్‌ను హేమక్క వల్లే నేర్చుకున్నాను. తెలుగు టైపింగ్ నాకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఆవిడ నన్ను సొంత చెల్లెల్లాగా భావించేవారు. 2016 సంవత్సరంలో మా కాలేజి వార్షికోత్సవానికి ముఖ్య అతిధిగా పిలిచాము. విద్యార్థినులను ఉద్దేశించి వాళ్ళు టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందవలసిన అవసరాన్ని వివరించారు. తన అద్భుతమైన ఉపన్యాసంలో విద్యార్థినులకు చాలా విలువైన విషయాలను తెలిపారు.
హేమక్క ఒక గృహిణిగా, ఒక సాహిత్యకారిణిగా, ఒక అధ్యాపకురాలిగా, అంతర్జాల మహిళా పత్రిక ”విహంగ” సంపాదకురాలిగా సార్థకమైన జీవితాన్ని గడిపారు. స్నేహశీలత్వం, తోటివారిపై మమకారం, ఆత్మీయత, ప్రోత్సహించే మనస్తత్వం… ఇవన్నీ ఆవిడ వ్యక్తిత్వానికి వన్నె తెచ్చాయి. ఆమె స్ఫూర్తితో… కన్నీటి పర్యంతమవుతూ… నివాళులు అర్పిస్తూ…