మనలో చాలామంది స్త్రీలు భర్తలు తమపట్ల నిరాదరణ చూపుతున్నారని మధన పడుతుంటారు. సమాజంలో 67 శాతం మంది మధ్యతరగతి వాళ్ళు ఉంటారు. వాళ్ళలో ఇంచుమించు అందరూ తమ భర్తలు తమను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. తమతో సఖ్యతగా, సామరస్యంగా ఉండరనీ, వారితో మనస్ఫూర్తిగా కొద్దిసేపయినా గడపరని ఆరోపిస్తున్నారు. ఓస్! ఇంతేనా అని తీసి పారేయకండి.
కొందరు మగవారైతే భార్యతో మనసు విప్పి మాట్లాడరు సరికదా సదరు స్త్రీ మాట్లాడుతుంటే విననైనా వినరు. ఒక్కోసారి భర్తలు అక్కడినుండి చల్లగా జారుకుంటారు కూడా. భార్యలు చిన్నబుచ్చుకున్నారని కూడా గమనించరు. (ఇది చూడడానికి చిన్న విషయమైనా కోతి పుండు బ్రహ్మ రాక్షసి లాగా తీవ్ర పరిణామాలు దాల్చుతుంది. సదరు భార్యలు చిన్నబుచ్చకున్నా, ముఖంలో రంగులు మారినా మగవారికి పట్టకపోతే ఆమెలో మెల్లిమెల్లిగా కసి పెరుగుతుంది. కనీసం ఆడది నిందిస్తున్నా కూడా లక్ష్యపెట్టరు. ఈ నిర్లక్ష్యం పెరుగుతూనే ఉంటే స్త్రీ సన్నసన్నగా సణుగుడు, ఆడిపోసుకోవడం మొదలవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో పిల్లలు పెరుగుతుంటారు. వాళ్ళు కూడా తల్లిని తీసిపారేయడం, విసుక్కోవడం మొదలుపెడతారు. ఈ విధమైన పరిస్థితి నెలకొంటే, రోజురోజుకీ ఒకరిపట్ల ఒకరికి విముఖత పెరిగిపోతుంటుంది. భర్త అనే పెద్ద మనిషి నిత్యకృత్యం సవ్యంగానే సాగుతోంది కదా అన్న ధోరణిలో ఉంటారు. పూర్తిగా అపార్థం చేసుకుని భార్యకి తృప్తి లేదని, భార్య గయ్యాళి అనే తీర్మానానికి వచ్చేస్తారు. వారిరువురి మధ్య దూరం పెరిగిపోతూ రోజూ భరించలేని బాధతో పొరుగింటి వాళ్ళకి, ఉద్యోగస్థులైతే సహోద్యోగులకు తమ బాధను వెళ్ళబోసుకుంటారు. పరస్పరం ఓదార్చుకుంటారు. ఈ సమస్య చివరికి వాళ్ళ విధుల్లో ఉద్యోగ ధర్మం సరిగ్గా చేయకుండా అన్యమనస్కంగా ఉంటారు. అది చినికి చినికి గాలివానగా మారుతుంది. ఇది చాలదన్నట్లు కొందరు మగవాళ్ళు భార్యని ఆటపట్టిస్తున్నామనుకుని ఆమె పుట్టింటివారిని ఎగతాళి చేస్తుంటారు. ఇలా చేస్తే తీవ్రపరిణామాలు ఎదురవుతాయని గమనించరు. అంతేనా?! భార్యని నలుగురి ముందు తీసిపడేసే చెడ్డ అలవాటు కూడా చేసుకుంటారు. ఇలా ఏళ్ళ తరబడి కొనసాగిస్తే భార్య అలిగి పుట్టింటికి వెళ్ళిపోవడం, తత్ఫలితంగా విషయం విడాకుల వరకూ వెళ్తుండడం కూడా మనం చూస్తున్నాం.
పడిశం పది రోగాల పెట్టు అన్నట్లు ఆలిని ఆటపట్టిస్తే వాళ్ళకే ముప్పు అని గ్రహించాలి. అంటే ఒక విషయంలో గాడి తప్పితే చాలు బండి నడవడం సాధ్యంకాని జఠిలమైన సమస్య అవుతుందని తెలుసుకోవాలి. కొంతమంది మగవాళ్ళు తమ ప్రేమను చెప్పడం చాతకాదని కూడా సమర్ధించుకుంటారు. ఒకవేళ అది నిజమైతే మాట్లాడడం నేర్చుకోవాలి. కొంతయినా నేర్చుకోవడాన్ని పెంపొందించుకోవాలి.
భర్త ప్రేమలో నిజాయితీ కనిపిస్తే ఆడవాళ్ళు తప్పక అర్థం చేసుకుంటారు. ప్రేమ అన్నంలాంటిదైతే నిజాయితీ నీళ్ళలాంటిది. అన్నం తిని మంచినీళ్ళు తాగకుండా ఉండగలమా? సంస్కారం లేని సంసారంలో సుఖశాంతులు ఉండవు.
ఈ సమస్య గుండె లోతు ఉన్నవాళ్ళకే అర్థమవుతుంది. ”ఆఁ ఆడవాళ్ళు కబుర్ల పుట్టలు, చాడీకోరులు” అని అనుకోకూడదు. ఈ సమస్య విద్యాధికులలో కూడా దర్శనమిస్తోంది. ”శాంతమూ లేక సౌఖ్యమూ లేదు”. మనసు కుతకుత ఉడుకుతుంటే స్త్రీ ప్రవర్తన మొత్తానికే దోషపూరితం అయిపోతుందని గుర్తుపెట్టుకోవాలి.