ఎగుడు దిగుడుగా నిర్మితమైన భారతదేశ సమాజంలో ప్రజలు అనేక కులాలుగా, సమూహాలుగా విడిపోయారు. కొందరు పుట్టుకతో అత్యున్నత గౌరవ మర్యాదలు, సంపద అన్ని అవకాశాలు అనుభవిస్తే, మరికొందరు కనీస హక్కులకు కూడా నోచుకోకుండా కటిక పేదరికం, అంటరానితనంతో దుర్భర జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. ఇలాంటి అసమాన సమాజంలో మహిళలు అత్యంత బాధితులు, అత్యంత హేయమైన కుల, పితృస్వామ్య సమాజంలో అనేక అవమానాలకు, అత్యాచారాలకు గురవుతూ కనీస మానవ హక్కులకు కూడా నోచుకోకుండా బానిసలుగా బతుకుతున్న మహిళా లోకానికి బాసటగా వారి జీవితాల్లో వేకువ పొద్దయి పొడిచింది క్రాంతి జ్యోతి సావిత్రిబాయి ఫూలే. ఆనాటి కరుడుగట్టిన సనాతన బ్రాహ్మణవాద సమాజంలో బహుజనులకు చదువొక ఫలించని కళ అయితే స్త్రీలకు అది పగటి కల. అలాంటి గడ్డు పరిస్థితులలో అస్పృశ్యులు, బాలికల జీవితాలను విద్యాదీపంతో వెలిగించిన విజ్ఞాన జ్యోతి సావిత్రిబాయి.
జనవరి 3, 1831న మహారాష్ట్రలోని కవాడి గ్రామంలో ఖండోజీ, లక్ష్మి దంపతుల కుమార్తెగా జన్మించింది సావిత్రిబాయి. తన 9వ ఏట 1940లో 13 ఏళ్ళ మహాత్మ జ్యోతిరావు ఫూలేతో వివాహం జరిగింది. అప్పటికే బ్రిటిషు మిషనరీలో ప్రాథమిక విద్యను పూర్తి చేసుకున్న జ్యోతిరావు ఫూలే తన భార్యకు చదువు అవసరాన్ని గుర్తించి, ఆమెకు చదవడం, రాయడం నేర్పించాడు. స్వతహాగా తెలివైన, చురుకైన సావిత్రిబాయి త్వరగానే చదవడం, రాయడం నేర్చుకుంది. నార్మన్ పాఠశాలలో చేరి విద్యను పూర్తి చేసుకుంది. సావిత్రికి చదువు పట్ల గల ప్రేమ, ఏకాగ్రత నేడు వివాహం తర్వాత చదవలేకపోతున్నామని బాధపడే ఎంతోమంది మహిళలకు ఆదర్శం.
తన 17వ ఏట 1848లో మొదటి బాలికల పాఠశాలను ఏర్పాటు చేసి అఖండ భారతదేశంలో మొదటి ఉపాధ్యాయురాలు, ప్రధానోపాధ్యాయురాలు అయింది. ఆనాటి సమాజంలో సనాతన బ్రాహ్మణవాద ఆచారాల ప్రకారం అస్పృశ్యులకు, స్త్రీలకు విద్యను అందివ్వడం ధర్మవిరుద్ధం. బాలికలు పాఠశాలకు రావడాన్ని తిరుగుబాటు చర్యగా భావించేవారు. కానీ అట్లాంటి సనాతన కట్టుబాట్లను ఎదిరించి ఎన్ని ఆటంకాలు, అవమానాలు, బెదిరింపులు ఎదురైనా పట్టు వదల అస్పృశ్యులకు, బాలికలకు విద్యనందించిన చదువుల తల్లి సావిత్రీబాయి. ప్రతి మనిషికి కావలసిన తిండి, నీరు, బట్టలు, నివాసం వంటి కనీస అవసరాలను సమకూర్చుకునేందుకు విద్య ఒక ఆవశ్యక వనరు అని బలంగా నమ్మింది. కనుకనే కింది కులాల వారికి, మహిళలకు చదువు ఎంత ముఖ్యమో నొక్కి చెప్పింది. చెప్పడమే కాదు 18 పాఠశాలలు స్థాపించి విద్యావ్యాప్తికి విశేషంగా కృషి చేసింది. ఈ రోజు లక్షలాది మంది దళితులు, మహిళలు స్వేచ్ఛ… స్వతంత్య్రాలతో ఒ ఉన్నతమైన జీవితాన్ని పొందుకుంటూ ఆత్మగౌరవంతో తమ కళలను, సుసంపన్నం చేసుకుంటున్నారంటే అందుకు కారణం సావిత్రి బాయి ఫూలే.
ఉపాధ్యాయురాలిగా సావిత్రి బాయి చేపట్టిన కార్యక్రమాలు ఈనాటికీ ఆచరణీయం. నేటి ప్రభుత్వాలు, ఆధునిక విద్యావేత్తలు గొప్ప గొప్ప సంక్షేమ పథకాలు, సరికొత్త విద్యాకార్యక్రమాలుగా చెప్పుకుంటున్న మధ్యాహ్న భోజన పథకం, అందరికీ విద్య, తల్లిదండ్రుల సమావేశాలు (ూవీజ), సంక్షేమ హాస్టళ్ళు (బోర్డింగ్ స్కూలు) వంటి వాటిని సావిత్రిబాయి 170 ఏళ్ళకు పూర్వమే విజయవంతంగా అమలు చేసింది. అంటరాని వాడల్లో, గుడిసె గుడిసెకు తిరిగి విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించే ఈనాటి ”బడిబాట” కార్యక్రమాన్ని ఆనాడే చేసింది. డ్రాపవుట్ సంఖ్యను తగ్గించడం కోసం బడికి రాని విద్యార్థుల కుటుంబాలను దర్శించేది. విద్యార్థుల గైర్హాజరీకి కారణాలు తెలుసుకునేది. ఒకవేళ వారు అనారోగ్యానికి గురయితే ఆస్పత్రిలో చూపించేది. పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నిర్వహించేది. ఆ పాఠశాలలు హాస్టళ్ళుగా కూడా వ్యవహరించేవి. ఈ విధంగా విద్యావ్యాప్తి ద్వారా అంటరానివారి జీవితాల్లో వెలుగు పూలు వికసింపచేసింది సావిత్రిబాయి. ఈనాటి ఉపాధ్యాయులకు మార్గదర్శి అయింది.
తొలితరం స్త్రీ వాది:
సమాజంలోని పాతకాలపు పాశవిక భావజాలంపై తీవ్ర పోరాటం చేసింది సావిత్రిబాయి. అందుకు ఆమెకు అందుబాటులో ఉన్న ఏ అవకాశం వదులుకోలేదు. మహిళలను చైతన్యపరచి బ్రాహ్మణ వితంతువులకు గుండు కొట్టించి చీకటి గదుల్లో బంధించే ఆచారానికి వ్యతిరేకంగా ఉద్యమించింది. బ్రాహ్మణ పూజారులు లేకుండా వివాహాలు జరిపించింది. అంతేకాక వివాహ సమయంలో పెండ్లికొడుకు చేత తన భార్యకు, స్త్రీలకు చదువును, సమాన హక్కును కల్పిస్తానని ప్రమాణం చేయించింది. దేశంలో మొట్టమొదటిసారి మహిళా హక్కుల సంస్థను 1852లో మహిళా మండలి పేరుతో ఏర్పాటు చేసింది. ఈ సంస్థలో కులాలకు అతీతంగా మహిళలకు స్థానం కల్పించింది.
స్త్రీల అస్తిత్వాన్ని, ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్న భ్రూణహత్యలకు వ్యతిరేకంగా నేడు ప్రపంచదేశాల మహిళలు ఉద్యమిస్తున్నారు. కానీ దశాబ్దన్నర క్రితమే సావిత్రిబాయి ఈ సమస్య గుర్తించి బాధిత మహిళలకు అండగా నిలబడింది. సనాతన బ్రాహ్మణ కుటుంబాలలో బాల్య, యవ్వన వితంతువులపై జరిగే లైంగిక దోపిడీవల్ల అనేకమంది గర్భం దాల్చేవారు. జరిగిన అవమానాలు భరించలేక గర్భస్రావాలకు, ఆత్మహత్యలకు పాల్పడేవారు. అలాంటివారిని చూసి చలించిన సావిత్రిబాయి ”బాల్య హత్య ప్రతిబంధక్ గృహ”ను స్థాపించి ఆశ్రయం కల్పించింది. అలాంటి ఒక వితంతువు కాశీబాయిని కాపాడి ఆమె కుమారుడ్ని దత్తత తీసుకుని యశ్వంతరావుగా నామకరణం చేసి పెంచుకుంది. అతడు పెరిగి పెద్దవాడయి డాక్టరయిన తర్వాత మాలి కుల ప్రముఖుని కుమార్తెతో కులాంతర వివాహం జరిపించింది. సావిత్రిబాయి ఉదార మాతృప్రేమ నేటి పిల్లలు లేని దంపతులకు దత్తత స్వీకరణ ద్వారా తల్లిదండ్రులయ్యేందుకు మార్గం చూపించింది. తద్వారా అనాధలు లేని సమాజాన్ని ఆమె ఆకాంక్షించింది.
అంటరానితనంలో మగ్గే అస్పృశ్యుల కోసం తన ఇంట్లోనే బావిని తవ్వించి తాగునీటిని అందించిన ప్రేమమయి సావిత్రిబాయి. తీవ్ర కరువు బారినపడి తిండిగింజలు దొరకలేని పరిస్థితులలో వివిధ వర్గాల నుండి ఆహారాన్ని సేకరించి 52 ఆహార కేంద్రాల ద్వారా వేలాదిమంది ఆపన్నులను ఆదుకున్న అన్నపూర్ణ ఆమె. తర్వాత ఈ ఆహార కేంద్రాలు హాస్టళ్ళుగా పనిచేశాయి. పక్కవాడు అలమటిస్తున్నా చలించలేని, మానవత్వం లేని మనుషులున్న నేటి సమాజం ఆనాడు సావిత్రిబాయి చేసిన నిస్వార్ధ సేవలనుండి చలనం తెచ్చుకోవాలి.
సావిత్రిబాయిని చాలామంది మహాత్మ జ్యోతిరావు ఫూలే భార్యగానే గుర్తిస్తారు. కానీ సావిత్రిబాయి భర్తను ఆరాధిస్తూనే, ఆయన అడుగుజాడల్లో నడుస్తూనే స్వతంత్ర వ్యక్తిత్వం కలిగిన మహిళ. తన ఆశయాలను కొనసాగిస్తూనే భర్తకు అన్నివేళలా అండగా ఉంటూ ఆయన ఆశయాలను ముందుకు నడిపిస్తూ నిజమైన భారత స్త్రీ ధర్మాన్ని నెరవేర్చిన మహిళ. భర్త మరణానంతరం ఆయన ఆశయాలను అన్నీ తానై కొనసాగించింది. సత్యశోధక్ సమాజ్‌కు విరాళం ఇచ్చిన మొదటి వ్యక్తి. ఈ దంపతులు ఒకరికి ఒకరు తోడై దాంపత్య ప్రేమకు నిర్వచనంగా నిలిచారు. నేటి యువతీ, యువకులు తమ వివాహ బంధాన్ని ఈ దంపతుల్లా సుసంపన్నం చేసుకోవాలి.
సావిత్రీబాయి తొలి తరం రచయిత్రి, కవయిత్రి.. ఈమె రచించిన కవితల సంపుటి ”కావ్యపూల్”,”బవన్న కాశి, సంబోధి రత్నాకరం”, జ్యోతిబాకు రాసిన లేఖలు చదివితే విద్యపట్ల, సమాజం పట్ల ఆమె నిబద్ధతకు, అస్పృశ్యుల పట్ల ఆమె ప్రేమకు, ఆమె విజ్ఞానానికి అద్దం పడతాయి. జ్యోతిబా ఫూలే రాసిన అనేక వ్యాస సంకలనాలను ప్రచురించి సంపాదకురాలిగా కూడా తన ప్రతిభను చాటుకుంది.
అంటరాని వారికి, బాలికల కోసం పాఠశాలలు నడపడం, వితంతువులకు గుండుకొట్టే ఆచారాన్ని వ్యతిరేకించడం, వితంతు గర్భిణులకు ఆశ్రయమివ్వడం, వితంతువులకు పునర్వివాహాలు, కులాంతర వివాహాలు నిర్వహించడం, దత్తత స్వీకరించడం, కరువు కాటకాల్లో పేదలకు అన్నంపెట్టి ఆదుకోవడం వంటి కార్యక్రమాలే కాకుండా భర్త మరణించినపుడు సనాతన ఆచారాలకు విరుద్ధంగా ఆయన చితికి నిప్పుపెట్టి నిజమైన అభ్యుదయ భావాలు కలిగిన సంస్కరణవాదిగా సావిత్రి బాయి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. చివరకు మహారాష్ట్రలో ప్లేగు వ్యాధి ప్రబలినపుడు తన కొడుకుతో కలిసి పేదలకు వైద్యసహాయం అందించిన దయామయి చివరకు అదే ప్లేగు వ్యాధి కారణంగా మరణించింది.
ఇలా తన ప్రేమ, లక్ష్యసాధన పట్ల తనకున్న నిబద్ధత వల్ల ప్రజల హృదయాలను గెలుచుకుంది. తన మానవతా హృదయంతో దళితులు, మహిళల జీవితాల్లో వెలుగులు నింపి తరతరాల అంధకారానికి ముగింపు పలికింది. మహిళా సాధికారత కోసం ఒక క్రూసేడర్‌లా పనిచేసిన సావిత్రి బాయి తరతరాలుగా మనువాదపు దాస్యంలో మగ్గిపోతున్న మహిళలు, అణగారిన వర్గాలు మెస్సయ్య. ఆనాడు సావిత్రిబాయి వ్యతిరేకించి పోరాడిన దురాచారాలు, నేటికీ కొత్త కొత్త రూపాల్లో కొనసాగుతున్నాయి. వాటిని సమూలంగా నిర్మూలించేందుకు దళిత యువత అమ్మ సావిత్రిబాయి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని సరైన కార్యాచరణతో ముందడుగు వేయాలి. ఇదే ఆమెకు మనమివ్వగలిగే ఘనమైన నివాళి.