డి. కామేశ్వరి కథలలో సమకాలీనత -శీలా సుభద్రాదేవి

సృజనాత్మకత సాహిత్యంలో ప్రతి పదీ పదిహేనేళ్ళకూ సామాజిక, సాంఘిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులననుసరించి వస్తు రూపాలలో గానీ, భాషా నిర్మాణంలో గానీ, శైలీశిల్పాల తీరులో గానీ మార్పులు వస్తుంటాయి. దీనికి కొంత కారణం తరాలు మారుతున్నప్పుడల్లా సమాజంలోనూ, జీవన విధానంలోనూ వచ్చే మార్పులే సాహిత్యంలోకి వస్తుంటాయి. సుమారు అరవై ఏళ్ళ సుదీర్ఘకాలం సాహిత్య సృజన చేస్తూ అనేక నవలలే కాకుండా పన్నెండు కథా సంపుటాలు వెలువరించిన డి.కామేశ్వరి గారి రచనలలో కూడా ఈ మార్పులు గమనించవచ్చును.

ఒకసారి కామేశ్వరి కథలనన్నింటినీ చదివినప్పుడు సాహిత్యోద్యమాల కారణంగా వచ్చిన రచనా ధోరణులలోని వస్తురూపాలలో సమాజ పరిణామమే కాకుండా సాహిత్య పరిణామం కూడా మార్పు చెందడం స్పష్టంగా తెలుస్తుంది.

ఆయా ఉద్యమాల ప్రభావం వ్యక్తిగతంగా కామేశ్వరిగారిపై లేకపోయినా సమాజాన్ని పరిశీలించే క్రమంలో రచయిత్రి రచనలలో మాత్రం సహజసిద్ధంగా ప్రతిబింబించాయి.

కామేశ్వరి జీవన విధానం మొదటినుండీ ఉన్నతవర్గ జీవితమే అయినా బడుగు, బలహీన, పేద వర్గ బతుకుల్ని అందుబాటులో ఉన్నంతవరకూ పరిశీలించి, కథాంశాల్ని చేజిక్కించుకుని కథలు రాశారు. అందుకే భరాగో గారు ‘కల్పనా సాహిత్య పాఠకులు ఎక్కువ మంది మధ్య తరగతి వారే ఉంటారు. జీవన విధానంలో కామేశ్వరి అప్పర్‌ మిడిల్‌ క్లాస్‌ వారే అయినా ఆలోచనాసరళిని ‘అప్పర్‌’గానూ, ‘లోయర్‌’గానూ ఉంచుకోగల చతురులు’ అంటారు.

కామేశ్వరి సాహిత్య వ్యవసాయానికి ఆరు దశాబ్దాల చరిత్ర ఉంది. ప్రతి పదేళ్ళకో, పదిహేనేళ్ళకో ముఖ్యంగా కథాసాహిత్యంలో వస్తువు ఎంచుకోవడంలో, శైలిలో, విస్తరణలో, భాషలో వచ్చిన మార్పులకు ప్రభావితమైన రచయిత్రిగా చెప్పుకోవాలి. కొందరు రచయితలు తమ కథా సంవిధానాన్ని మార్పులు చేసుకోకుండా ఉండడంతో కొంతకాలం తర్వాత సమకాలీన కథకులతో పోటీపడలేక అస్త్ర సన్యాసం చేసేస్తారు. కానీ కామేశ్వరి గారు తన కథారచనని అన్ని విషయాలలోను ఎప్పటికప్పుడు సమకాలీన సమాజ మార్పులకు అనుగుణంగా మెరుగులు పెట్టుకుంటూ సమకాలీన రచయితలతో పోటీపడుతూ అరవై ఏళ్ళకు పైగా అదే వేగంతో వర్తమాన సమస్యలను కలంలో నింపుకుంటూ సృజన సాగిస్తుండడం విశేషం.

పల్లెల్లోని రాజకీయ నేపథ్యాన్ని రాసినా, అగ్రకులంలో పుట్టి బహు సంతానంతో లేమిలో కూరుకుపోయిన రామ్మూర్తి జీవన పోరాటం రాసినా, బతుకుని వెనక్కి తెచ్చుకోలేని మనిషిని, నిరుపేద ముత్యాలు తన భర్త శరీరాన్ని కాల్చి బూడిద చేయకుండా పాతిక రూపాయలకు ఇచ్చేందుకు సిద్ధపడినా, ‘మనీ’ మనిషి దశ నుండి మామూలు మనిషిగా మారిన క్షణాన్ని ఒడిసిపట్టినా, ఇలా ఎన్నెన్నో ఆర్థిక ప్రాతిపదిక మీద నడిచిన బ్రతుకు చిత్రాల్ని డెబ్బయిలలోనే కథారూపంగా చెక్కారు రచయిత్రి.

1962 హాస్యకథతో కథన రంగంలోకి అడుగుపెట్టిన రచయిత్రి తన సుదీర్ఘ అక్షర యాత్రలో సమాజంలోని తీరు తెన్నులు ఏ రకంగా నగరీకరణ చెందాయో పరిణామ క్రమాన్ని కథలలో పొదిగారు. 1960-70లలో కుటుంబ నియంత్రణ లేకపోవడం, కుమారుడి కోసం ప్రయత్నాలలో వరుసగా ఆడపిల్లల్నే కనటం, బహు సంతానంతో ఉద్యోగి అయినా ఆర్థిక ఒడిదుడుకులతో ఆర్థిక రేఖకి దిగువకే జారిపోయిన పరిస్థితులు ఎక్కువగా కామేశ్వరి గారికి కథాంశాలుగా రూపుదిద్దుకున్నాయి.

70-80ల తర్వాత ఆడపిల్లలు చదువుపట్ల ఆసక్తి పెంచుకోవటం, ఉద్యోగాలు చేసి వాళ్ళ కాళ్ళమీద వాళ్ళు నిలబడాలనుకోవటం ఇవేకాక వరకట్న బాధితులుగా, పెళ్ళి ఒక సమస్యగా మారటం వంటివి వస్తురూపాలుగా మారాయి.

బడుగు జీవులు, మధ్య తరగతి, ఉన్నత మధ్య తరగతి, ఉన్నత తరగతులకు చెందిన నాలుగు కుటుంబాల జీవన విధానాన్ని డబ్బు ప్రభావం వారి జీవితాలలో చూపే వైవిధ్యాల్ని, ప్రలోభాలకు లొంగకుండా జీవితాన్ని ప్రశాంతంగా గడపటానికి కావలసిందేమిటో అనే విచికిత్స ‘నగరంలో నాలుగిళ్ళు’ కథలో చర్చించే విధానం చుట్టుపక్కల జీవితాన్ని పరిశీలించే లక్షణం దృగ్గోచరమవుతుంది.

చదువుకున్న స్త్రీలు, వివాహితులు, ఉద్యోగినులు వారి వారి కుటుంబ జీవితాలలో చదువుకోని గ్రామీణ అమాయక స్త్రీలాగా కుటుంబంతో రాజీపడి, భర్త అడుగుజాడలలో నడవలేక, తమ వ్యక్తిత్వాలను వదులుకోలేక, సాధికారత సాధించలేక, మానసికంగా, శారీరకంగా కొట్టుమిట్టాడుతూ, తమ వారిది పురోగమనమో, తిరోగమనమో అర్థం కాని జీవితాల్ని అనేక కథలలో కామేశ్వరి గారు రాశారు. ఏదో ఆషామాషీగా చిన్న చిన్న సంభాషణలలో పైపైన కథని చెప్పకుండా, ఒక్కొక్కప్పుడు విడమరచి వివరిస్తూ ఉపన్యాస ధోరణిలో అనేక విషయాలను కథల్లో చర్చించటం రచయిత్రి కథనశిల్పంగా చెప్పుకోవాలి.

”రచనకు సామాజిక ప్రయోజనం ఉండాలన్న ధ్యేయంతో ఆడపిల్లగా, భార్యగా, తల్లిగా, ఉద్యోగినిగా స్త్రీ నేడు ఎదుర్కొంటున్న సమస్యలను ఎత్తిచూపుతూ రాస్తాననీ, తాను స్త్రీని కనుక స్త్రీల సమస్యలకే తన రచనలలో ప్రాముఖ్యత ఇస్తానని” కామేశ్వరి గారు తన రచనల గురించి చెప్పుకుంటారు.

కాదేదీ కవిత కనర్హం అన్న శ్రీశ్రీ గేయంలోని తొమ్మిది అంశాల ఆధారంగా రావిశాస్త్రి తొమ్మిది కథలను ”ఋక్కులు శ్రీ శ్రీ కోసం కథలు” అని రాశారు. అవే అంశాల్ని తీసుకుని కామేశ్వరి ‘కాదేదీ కథ కనర్హం’ అనే ఉపశీర్షికతో తొమ్మిది కథల్ని రాసి ఒప్పించటం రచయిత్రి ఆత్మవిశ్వాసానికి నిదర్శనం.

”శ్రీశ్రీ కాదేదీ కవిత కనర్హం అన్న స్ఫూర్తితో రాసినవి కవిత కనర్హం కానప్పుడు కథకు మాత్రం అనర్హం ఎలా అవుతాయి అన్న ఆలోచనతో రాసినవే ఈ తొమ్మిది కథలు” అని ఆ పుస్తకం ముందు మాటలలో చెప్పుకున్నారు రచయిత్రి (1975).

ఈ తొమ్మిది కథలూ కథా నిర్మాణంలోనూ, శైలిలోనే కాక కథకు తగిన భాషను వాడటంలోనూ రచయిత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. తిండి పెట్టకపోతే ఏ విశ్వాసం నిలవదు అనే అంశంతో ‘కుక్కపిల్ల’, రత్తి అగ్గి కోసం వస్తే బలాత్కారం చేయబోతే ఆ ‘అగ్గిపుల్లే’ వెలిగించి, కామాన్ని దహించి గుండె మంట చల్లార్చుకుంటుంది. వాసన సబ్బుమీద మోజుతో పనిచేసే ఇంట్లోని బాత్‌రూమ్‌లలో అరిగిపోయిన ‘సబ్బుముక్క’ దొంగతనం చేయబోతే దానికి అంటుకున్న అమ్మగారి ముక్కుపుడక రత్తిని దొంగగా ముద్రేసింది. మొగుడుపోతే పాన్‌షాప్‌లో కూర్చున్న కోటమ్మ మిగతా కిళ్ళీ కొట్టువాళ్ళ ఆదాయం కొల్లగొట్టిందని కసి పెంచుకున్న వీర్రాజు ‘అరటితొక్క’ మీద కాలువేసి కోటమ్మ పడిపోగానే మూడు నెలల పాటు తన ఆదాయానికి ఢోకా లేదని సంతోషిస్తాడు. వారసుడి కోసం తపించిన కోటీశ్వరుడు తుదకు తనకు పుట్టిన వారసుడు డ్రైవరు వలన కలిగాడని తెలిసి తన భవంతిని కట్టేటప్పుడు నిలబడడానికి నిలబెట్టిన ‘బల్లచెక్క’ తాను కానని తెలిసి ఆత్మహత్య చేసుకుంటాడు. కూతురి సంసారాన్ని నిలబెట్టేందుకు ‘హారతి పళ్ళెం’ దొంగిలించాలనుకున్న పూజారిని అతని కూతురు వారిస్తుంది. ‘తలుపు గొళ్ళెం’ వేసి పన్నెండేళ్ళ వయసులో శోభనం పేరున జరిగిన లైంగిక కార్యానికి బెంబేలెత్తిన కావమ్మ ఎక్కడ శోభనానికి గొళ్ళెం వేసినా భయకంపితురాలౌతుంది. జమిందారీ పోయినా రాజసంతో బతుకుతోన్న రమేష్‌ చంద్ర రాత్రి పూట మధిరతో పాటు మగువ కోసం వెంపర్లాడి పెంపుడు గుర్రాల్ని చూసే రంగడి భార్యకు వలవేస్తాడు. అది తెలిసి రంగడు ‘గుర్రపు కళ్ళెం’ తెగిపోయేలా చేసి రమేష్‌ చంద్ర చావుకి కారణం చేస్తాడు. ఇందులో ప్రత్యేకంగా చెప్పదగినది ‘రొట్టెముక్క’. రైల్వేస్టేషన్‌లోని ముష్టిదానికి పుట్టిన కవలలు అక్కడే అడుక్కుంటూ పెరుగుతారు. ఒకరోజు ఆకలి బాధ భరించలేక ఆగిన రైలులోని కిటికీ నుండి రొట్టెముక్క తింటున్న పిల్లాడి నుండి లాక్కుంటాడు ఒకడు. అంతలో రైలు కదలగా బండి కిందపడి ముక్కలౌతాడు. అక్కడికొచ్చిన రెండో పిల్లాడు తెగిన చేతిలోని రొట్టెముక్కని ఆబగా లాక్కొని తినేస్తాడు. ఈ కథని మొదటి నుండి చివరి వరకూ కరుణ, దయ, బాధ, భయం, బీభత్సం మొదలైన అన్ని రకాల భావస్పందనలనూ పాఠకులలో కలిగేలా చేసి చివరికి గుండెను చెమ్మగిల్లజేస్తుంది. ఈ తొమ్మిది కథలూ బడుగు వర్గాల జీవన సంఘర్షణలను ఒక ప్రవాహశైలిలో రాశారు రచయిత్రి. ఆమెను ఒక మంచి రచయిత్రిగా చెప్పటానిక ఈ కథలే చాలు. ఇంతటి గొప్ప కథల్ని రాసినా కామేశ్వరిగారు ఈ శైలినీ, రచనా వైచిత్రిని, వస్తురూప విన్యాసాన్నీ తర్వాతి కథలలో ఎక్కువగా ఉపయోగించుకోలేదు. బహుశా నవలా రచనలోకి వచ్చి ఆ ప్రభంజనంతో వారి దృక్పథంలో వచ్చిన మార్పు కావచ్చును. ఈ కథలు రాసిన కాలం 1977 ఆ ప్రాంతంలో కావటం, అప్పుడప్పుడే విరసం ఆవిర్భావం వల్ల చాలామంది రచయితలు అట్టడుగు ప్రజల జీవితాలలోకి తొంగి చూచి కథాంశాల్ని ఏరి దానికి తగిన శైలీ, సంభాషణలతో కథలు విస్తృతంగా రాశారు. గొప్ప కథకులుగా సాహిత్యరంగంలో తమ పేరు నమోదు చేసుకున్నారు. అదే సమయంలో కామేశ్వరి గారు రాసిన ఈ కథలు కూడా వాటి సరసన చేరతగినవే.

బడుగు వర్గాల జీవన పోరాటాల్ని తీసుకొని రాసిన కథల్లో శిల్ప రూపచిత్రణలో కొంతమేరకు రావిశాస్త్రి ప్రభావంతో రాసినట్లు అనిపించినా, కామేశ్వరి తనకంటూ ఒక ముద్రని స్వీయ ప్రతిభతో సాధించారు.

అలాంటి కథల్లోనిదే – ‘వేట’ కథ. ఫారెస్టు రేంజర్లు, ఆఫీసర్లు పులిని వేటాడడానికి వస్తే దండకారుణ్యం కాంట్రాక్టరు సహాయం చేస్తాడు. తన కాంట్రాక్టులు శాంక్షన్‌ చేయించుకోవటం కోసం తన భార్యగా వేరొక స్త్రీని చూపి కన్సర్వేటర్‌కు ఎరవేసి సాధిస్తాడు. దొర ఆ పులిని కొట్టేస్తే, నీవు ఈ పులిని కొట్టేవుతో ముగింపు ఇచ్చింది రచయిత్రి. అటువంటిదే మరో కథ- భార్యని పోలీసోళ్ళు పట్టుకెళ్ళారని కంప్లయింట్‌ ఇవ్వటానికి వచ్చిన పెంటయ్యని, పోలీసు హెడ్‌ గవర్రాజు తిట్టి వేరెవరో నకిలీ పోలీసులు పట్టికెళ్ళుంటారు అంటాడు. మా పోలీసుల్ని మీ ఆడవాళ్ళు గుర్తుపడితే వాళ్ళని సస్పెండు చేస్తానంటాడు. ఎక్కడో స్కూల్లో ఒళ్ళు తెలియని స్థితిలో దొరికిన భార్యని తెచ్చుకుంటాడు పెంటయ్య. గంగరాజు నలుగురు పోలీసుల్ని తెచ్చి వాళ్ళని పెంటయ్య భార్య గుర్తుపట్టగలదేమో కనుక్కోమంటాడు. పెంటయ్య భార్య వాళ్ళు కాదంటుంది. తిరిగి వెళ్ళిపోయిన గంగరాజు ఆ నలుగురు పోలీసుల డ్రస్సులు తిరిగి తీసుకుని తన పోలీసులకిస్తాడు. ఈ రెండు కథలూ కూడా ‘ఋక్కులు’ కథల్లాగే ఒక ప్రత్యేక ఒరవడి, కథన శిల్పం కలిగి ఉంటాయి.

డెబ్భయిలలో విరసం ప్రభావంతో అప్పటి రచయితలు చాలామంది శ్రీశ్రీ, రావిశాస్త్రి, కారా ప్రభావానికి లోనై బడుగుజీవుల ఆర్తనాదాలు, శ్రమ దోపిడీ, ఆర్థిక సంక్షోభాలు మొదలైన అంశాలనే ఎక్కువగా కథాంశాలుగా తీసుకున్నారు. కానీ రచయిత్రులు మాత్రం నవలా ప్రభంజనంలో ఆ ప్రవాహంలోనే పడి నవలల్నే ఉధృతంగా రాసే సమయంలో కామేశ్వరి మాత్రం విరసం ప్రభావాన్ని అంది పుచ్చుకొన్నారా అనిపించేలా వారితో సమానంగా వైవిధ్యభరితమైన అంశాల్ని తమ వస్తు రూపాలుగా స్వీకరించారు. ఈ కథల్ని చూస్తే కథనశైలిలో కూడా ఒక ప్రత్యేకమైన వర్ణనలతో రావిశాస్త్రిని తలపిస్తారు. అయితే ఆ తర్వాత రాసిన వానచినుకులు వంటి కథలు మనస్తత్వ విశ్లేషణలతో శరత్‌ పాత్రల్ని పోలి ఉంటాయి.

‘ఆడది, ఆడపిల్ల అనే మాట డిక్షనరీలోంచి తీసెయ్యాలి. పుట్టిన దగ్గర్నుండీ పరాయిగానే చూపే ఆ పదం ఉండకూడదు. అమ్మాయి, కూతురు అనమంటూ’ ముగించిన కథ ‘ఈడపిల్లే’. ఇంతకు మించిన స్త్రీ చైతన్యం ఏముంది?

స్త్రీ విద్య కోసం ఉద్యమాలు చేసి చదువుకొని, ఆర్థిక స్వావలంబన సాధించాలని ఉద్యోగాలు చేయాలనుకునే స్త్రీలకి ఇటు ఇంటి చాకిరీ తప్పట్లేదు, అటు బైట చాకిరీ తప్పట్లేదు. పూర్వం స్త్రీని పిల్లల్ని కనే యంత్రంగా, ఇంటి చాకిరీకి పనిమనిషిగా గుర్తించే రోజులైతే తర్వాత్తర్వాత స్త్రీ డబ్బు సంపాదించే యంత్రంగా కూడా మారింది. (పెళ్ళికి ముందు పుట్టింటికి, తర్వాత మెట్టినింటికి కూడా). విద్య,

ఉద్యోగం స్త్రీ పురోగమనానికి నాంది అనుకుంటే, ఆ ‘పురోగమనానికి పునాదిరాళ్ళు’ అని తెలియజేసే కథ ఇది. స్త్రీ శ్రమశక్తి విలువని పట్టించుకోని కథగా మలిచారు రచయిత్రి. తర్వాతి తరం స్త్రీలకైనా ఆత్మస్థైర్యం, స్వశక్తి లభ్యమవ్వాలని ఆకాంక్షిస్తూ కథని ముగిస్తారు. కానీ కథ రాసి ముప్ఫై, నలభై ఏళ్ళయినా స్త్రీ జీవితాలలో మార్పు రాలేదు. ఇంటా, బయటా ఆమె చాకిరీ ఆమెదిగానే ఉంది అనే విషయాన్ని కొన్ని కథలలో స్పష్టం చేసింది రచయిత్రి.

ఒక మంచి కథ ‘ఎండమావులు’. శారదమ్మ ఒక సంగీతజ్ఞుడి కుమార్తె. సంగీతమే ప్రాణంగా ఉన్నా, లేమి వల్ల ఎక్కువ కట్నం అడగని సంగీత వాసన తెలియని వాడ్ని పెళ్ళి చేసుకుంటుంది. అత్త, భర్త ఆంక్షల వలన ఆమె కంఠం మూగబోతుంది.పెళ్ళయిన ఇరవై ఏళ్ళ తర్వాత భర్త చనిపోయాక ఒకరోజు శారదమ్మ గొంతు తీసే రాగాలు విని ఆమె కూతురు ప్రోత్సహిస్తుంది. సంగీతం అభ్యసించే రోజుల్లో శారదను అభిమానించిన గోపాలం తిరిగి కలుస్తాడు. వారి మధ్య గల ప్రేమని గుర్తించిన కూతురు వారి వివాహాన్ని ప్రోత్సహిస్తుంది. కానీ కూతురు పద్మ పెళ్ళి అయ్యాక చేసుకోవాలనుకుంటారు. వివాహానంతరం ఇంటికి వచ్చిన పద్మ ఇప్పుడు ఇంటికి గోపాలం రావడం లేదని తెలిసి తల్లిని ప్రశ్నిస్తుంది. ”నా కోసం నేనై నా ఇష్టం వచ్చింది చేస్తూ బతకనీ, మళ్ళీ ఈ బంధం వద్దు. ఇతను కూడా వివాహానంతరం నా పాటకి విసుక్కోవచ్చునేమో’ అంటూ ముగిస్తుంది రచయిత్రి. కళలను బయటనుండి ప్రోత్సహించే వారే భార్యల సృజనాత్మకతని ఏ విధంగా గుండెల్లో భూస్థాపితం చేసేస్తారో కథలో సరళమైన సంభాషణలతోనే విషయం పాఠకుడికి అందేలా రాస్తారు రచయిత్రి.

డబ్బున్న వాళ్ళకి మాత్రమే స్వాగతం పలికే ప్రైవేటు ఆసుపత్రిని నడిపే డాక్టరు సరోజిని. వాళ్ళ డ్రైవరు అంతకుముందు ముగ్గురు పిల్లల్ని పోగొట్టుకున్నందుకు, తన భార్యను చేర్చుకుని ఈ సారైనా బిడ్డను రక్షించాలని కోరుకుంటాడు. డ్రైవరు భార్యకు పుట్టిన పిల్లాడిని ధనవంతుల పిల్లకి పుట్టినట్లుగా చూపిస్తుంది డాక్టరు. తీరా ఆ పిల్ల అవివాహిత అనీ, ఆ పిల్లాడిని అనాథాశ్రమానికి తీసుకెళ్ళడం చూసిన ఆ డాక్టరు మొట్టమొదటిసారి స్వార్థం వదిలి మనీ క్రింద నుండి మనిషిగా లేచిందంటారు కామేశ్వరి. కన్నీటికి విలువెంత (1975) సంపుటిలో ఎక్కువ కథలు కన్నీటి గాథలే. అంతేకాదు అన్నీ సవ్యంగా ఉన్నప్పుడే కుటుంబ సభ్యుల మధ్య కూడా ఆప్యాయతలు, అనుబంధాలు అని, మానవ సంబంధాలు, కౌటుంబిక విలువలు అనీ నిజాల్ని నిర్భయంగా స్పష్టం చేశారు రచయిత్రి.

కామేశ్వరి, తొలినాటి చాలా కథల్లో అవసరమైనంతవరకూ కథలోని కథాంశాన్ని సూచిస్తూనే కథన శైలికి గాఢతని తెచ్చిపెట్టేలా కొన్ని చోట్ల పెద్ద పెద్ద పేరాలని వర్ణనాత్మకం చేశారు. ఈ వర్ణనలు కూడా ఏడవ దశాబ్దిలోని విప్లవాత్మక రచనలు చేసే కొందరి కథన శిల్పాలతో పోల్చదగినదిగా ఉంటుంది. ఉదాహరణకు – ”ముత్యాలు నల్లని శరీరం ఆ మంటల ఎరుపుకి కాలిన ఇనుములా మెరుస్తుంది. ఏడ్చి ఏడ్చి ఎర్రబడిన ఆమె కళ్ళు రెండూ నిప్పు కణికల్లా మెరుస్తున్నాయి. అక్కడ మండుతోన్న పొయ్యిలాగే ఆమె గుండెలు మండుతున్నాయి. అక్కడ ఉడుకుతున్న అన్నంలాగే ఆమె హృదయం కుతకుతలాడుతోంది. ఆమె పక్కన నల్లటి మాసిన గుడ్డ పీలికల మధ్య నల్లటి బల్లి గోడని కరుచుకున్నట్లు బోర్లా పడుకుని ఉంది చంటిపిల్ల”. ఇలాంటి వర్ణనల దృశ్యం ఒక రచయిత్రి కలం నుండి యాభై ఏళ్ళ కిందట వెలువడడం రచయిత్రి సమాజంలోని అట్టడుగు వర్గాల జీవితాలని కూడా గమనించగలిగిన పరిశీలనా దృక్పథాన్ని మాత్రమే కాదు రచనా సామర్ధ్యాన్ని, భావుకతనీ తెలియచేస్తుంది.

తొలిరోజుల్లో రాసిన కథల్లో తాను చూసిన, పరిశీలించిన అంశాలపైనే ఎక్కువ కథలు రాశారు. తర్వాత్తర్వాత సమాజంలోని జీవన విధానాల్లోను, మానవ ప్రవృత్తిలోనూ వచ్చిన మార్పులకు అనుగుణంగా మారుతోన్న కౌటుంబిక విలువలు, సాంఘిక, ఆర్థిక స్థితిగతుల నేపథ్యంలోంచి తీసుకున్న ఇతివృత్తాలు

ఉంటాయి.

తర్వాత ఇటీవల వచ్చిన రెండు మూడు సంపుటాలలో కథల్ని గమనిస్తే ఆధునీకరణ వలన యువతరంలో సాంకేతికత తీసుకువచ్చిన మార్పుల నేపథ్యం ‘మధుపం’ కథల సంపుటిలో అక్షరబద్ధం అయ్యాయి.

వయసురీత్యా వచ్చిన పెద్దరికంతో ప్రేమకు సంబంధించిన ఇతివృత్తాలతో రాసిన కథలలో కొంత ప్రాపంచిక అనుభవంతో, కాస్తంత సర్దుబాటులో దాంపత్య సంబంధాల్ని ఎలా సుఖమయం చేసుకోవచ్చో పాత్రలతో పాటు పాఠకుడిని కూడా కూర్చోబెట్టి గీతోపదేశం చేసే విధానంలో రాసిన కొన్ని కథలలో ‘గీతోపదేశం’ కూడా ఒకటి. తొందరపడి స్వయం నిర్ణయాలు తీసుకుని కష్టాల ఊబిలో పడకుండా ఎలా తీర్చిదిద్దుకోవాలో తెలియచేస్తారు. పాఠం చెబుతున్నట్లుగా ఉపన్యాస ధోరణి ఉన్నా నిరాడంబరమైన కథన శైలి వల్లా, పఠనీయత ఉండడం వల్లా చదువరులకు విసుగు కలిగించదు.

న్యూక్లియర్‌ కుటుంబాలు, ఒత్తిడిని పెంచే సాఫ్ట్‌వేర్‌ చదువులు, చదివిన వెంటనే లక్షల రూపాయల ఉద్యోగాలతో నేటి యువతకు జీవితం విలువ, బాధ్యతలు, తల్లిదండ్రుల మాటలను లక్ష్యపెట్టకపోవడం, వివాహ బంధాలపైనా, దాంపత్య సంబంధాల పట్లా గౌరవం లేకపోవటం, సోషల్‌ మీడియాలకి బానిసలై బతుకుల్ని బలిపెట్టడం – ఇలా ప్రస్తుత సమాజ ముఖ చిత్రంలోని వివిధ పోకడలు, వైరుధ్యాలు ప్రతిదీ ఒడిసి పట్టి కథలీకరించారు కామేశ్వరిగారు.

కుటుంబ పరిధిలోని వస్తు రూపాలే కాక వాయుసేనలోనూ, ఆర్మీ కేంపుల్లోనూ ఉద్యోగాలు చేసే వారి కుటుంబ జీవన కథనాలు, సియాచిన్‌ లాంటి కీలక ప్రదేశాలు, జీవితంలోని కష్టనష్టాలు పరిశీలనాత్మకంగా, పరిశోధనాత్మకంగా కుతూహలం రేకెత్తించేలా ‘తెలియని నిజాలు’ వంటి కథ కూడా రాశారు రచయిత్రి.

హిందూ మతానికి చెందిన అనేకానేక కర్మకాండలలోని పరమార్థాలను, హిందూ ధర్మం గురించి ‘వేదభూమి’ కథలో విదేశాలలో అక్కడి విదేశీయులకు వివరించే సందర్భంలో అతి సూక్ష్మ విషయాలను కూడా పూర్తి వివరణలతో విడమరచి చెప్పటం ఇప్పటి యువతరానికి కూడా కూలంకషంగా అర్థమయ్యేలా బోధిస్తూ చెప్పటం చాలా పటిష్టంగా, ధర్మ సూక్ష్మాలను ఎవరూ ప్రశ్నించని విధంగా రాయటం ప్రశంసనీయం.

అదే రచయిత్రి వినాయకుడు పాలు తాగాడన్న మూఢవిశ్వాసాన్ని చీల్చి చెండాడే విధంగా బొమ్మ వినాయకులకు పాలుపట్టి నేలపాలు చేసేకన్నా గుక్కెడు పాలకోసం గొంతు ఎండేలా ఏడుస్తున్న పసికందులకు అందించటం మంచిదనే అభిప్రాయంతో రాసిన కథ కూడా ఎంతో గొప్పగా ఉంటుంది.

ఈ రకంగా అరవై ఏళ్ళ సాహిత్య జీవితంలో సమాజంలో రూపాంతరం చెందుతూ వస్తోన్న సమస్యలన్నింటికీ ప్రతిస్పందిస్తూ కథనశైలిని తగువిధంగా వస్తురూపానికి అనుగుణంగా, సాహిత్య రంగంలో సృజన ప్రక్రియలలో వస్తున్న పరిణామాలకు అనుగుణంగా తన కథనా చాతుర్యాన్ని మెరుగుపరచుకుంటూ రాసిన కథలను ఎంపిక చేసుకుంటూ ఇంతవరకూ పన్నెండు సంపుటాలను వెలువరించారు. యువతరంతో పోటీపడుతూ కలాన్ని ఝళిపించుకుంటూ సాహిత్య రంగంలో ఎనభయ్యారేళ్ళ వయస్సులోనూ ముందుకు దూసుకెళ్తున్న నిత్య చైతన్యశీలి డి.కామేశ్వరి గారు.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.