ఆమె అంతే!
వేళ్ళూనుకున్న పుట్టింటి మన్నును తొలుచుకొని
అంటుమొక్కై మెట్టింటి వనంలోకి తరలొస్తుంది!
బద్దలౌతున్న తనువును చీల్చుకొచ్చిన
రక్తపు ముద్దల్ని మురిపెంగా ముద్దాడుతుంది!
ఛిద్రమౌతున్న పేగు క్షేత్రాన్ని
పాల పొదుగు చేసుకొని
వంశాలను వృద్ధి చేస్తుంది!
ఉనికి మరచిన తాద్మాత్యంలో మునిగి
బంధాల గూళ్ళు అల్లుతూ శ్రమల సాలీడౌతుంది!
”ఆమె అంతే!”
ఆవిరౌతున్న ఆత్మాభిమాన చమురు పోగేసుకుంటూ…
వెలిగే వ్యక్తిత్వపు దివిటీ అవ్వాలని తపిస్తుంది!
పశు పదఘటనల్లో శవమౌతున్నా…
పాశపు శైశవాలను ప్రసవిస్తూనే ఉంటుంది!
తప్పిపోయిన సాధికార శోధనలో సొమ్మసిల్లుతున్నా…
స్వతంత్ర శ్వాసల్ని స్వప్నిస్తూనే ఉంటుంది!
ఆగమౌతున్న అవకాశాల
ఆకాశంలో
చైతన్య మేఘమై సాగాలని
ఆరాటపడుతూనే ఉంటుంది!
చేధింపశక్యం కాని సృష్టి సంతులనా వస్త్ర సగభాగమైనా…
మగ మగ్గంలో చిక్కిన దారమై స్వేచ్ఛకు పెనుగులాడుతూనే
ఉంటుంది!
ఆమె అంతే!
ప్రకృతి జాగృతికి
ఆధారమైనా…
ప్రగతి ప్రసవానికి పురుటి నొప్పులు పడుతూనే ఉంటుంది!