ఏమిటి, ఆ పాలుగారే చెంపలపై నల్లగా… అది మసా?
కాదు కాటుక అంటించుకుంది…
ఏమిటి, ఆ ఆల్చిప్పల్లాంటి పసికన్నుల్లో ఆ నీరు… అవి కన్నీళ్ళా?
కాదు, కంటిలో దుమ్ము పడేసుకుంది…
ఏమిటి, ఆ లేత పెదవులపై ఎరుపు… అది రక్తమా?
కాదు, రంగు అద్దుకుంది…
ఏమిటి, ఆ పసి చెక్కిళ్ళపై అచ్చులు… అవి చెంపదెబ్బలా?
కాదు, ఆట మధ్యలో పిల్లలు కొట్టుకున్నారు…
ఏమిటి, ఆ సుతిమెత్తని అరచేతిలో ఆ గాయాలు… దేనితో కొట్టిన ఆనవాళ్ళవి?
కాదు, పరిగెత్తి రాళ్ళపైన పడింది…
ఏమిటి, ఆ లేలేత పాదాల్లో బొబ్బలు… ఎండలో నిలబెట్టారా?
కాదు, చూసుకోకుండా నిప్పులపై కాలేసింది…
ఏమిటి, ఆమె ఒంటిలో అంత నీరసం… భోజనం పెట్టడం మానేశారా?
తిండంటే అస్సలు ఇష్టముండదు, బ్రతిమాలినా తినదు…
ఎందుకామె ముఖంలో అంత బాధ… ఆమెను వేధించారా?
అడిగిన బొమ్మ ఇవ్వలేదని…
ఎందుకామె పెదవిపై ఆ మౌనం… ఆమెను బాధపెట్టారా?
ఆమెకు ఎవరితోనూ మాట్లాడడం ఇష్టం ఉండదు…
ఏదీ ఆ అధరాలపై చిరునవ్వు?
ఆమెకు నవ్వడం రాదు…
ఏదీ ఆ నీలికన్నుల్లో వెలుగు?
ఆమెకు ఏడ్వడం ఓ సరదా…
అన్ని ప్రశ్నలకూ సమాధానాలు ఉన్నాయి…
కానీ, ఆ సమాధానాల క్రింద సమాధి అయిన నిజాన్ని వెలికి తీసేదెవరు?
నిలదీసి ప్రశ్నించేదెవరు?
ఓ లోకమా, నిన్ను నువ్వు చూసుకుంది చాలు,
కాస్త ఇటువైపు కూడా చూడు ఓ మారు…
పసితనం, పైశాచికత్వపు పిడికిళ్ళలో బందీ అవుతోంది,
తక్షణం వచ్చి విడిపించు…
ఈ అరాచకత్వానికి వ్యతిరేకంగా శంఖం పూరించు…
ఇది నీ కర్తవ్యం…
దయచేసి దీన్ని నిర్వర్తించు…