ఏది సార్వత్రిక సత్యంఎ. సునీత

 

మెర్సీ మార్గరెట్‌ రాసిన కవిత చాలామందిని కలవరపెట్టింది. క్లుప్తంగా చెప్పాలంటే ఒక మతాన్ని కించపరిచి మరొక మతాన్ని పెకెత్తిందని ఆమెపై ప్రధాన ఆరోపణ. ఇది మన దేశంలో మైనారిటీ మతాలనయితే ఆ కవిత దేశభక్తి కవితగా బహుశా కీర్తించి ఉండేవారు. దురదృష్టశాత్తు ఆమె కవిత మెజారిటీ మతంపై విమర్శను ఎక్కుపెట్టింది. అదీ ఒక అణగారిన కుల అస్తిత్వానికి చెందిన మహిళగా. ఇది రెండు, మూడింతల నేరం. నోరు మూసుకుని పడుండాల్సిన వాళ్ళు, అదీ ఆధిపత్య కులాలవారి ఇళ్ళల్లో, దేవాలయాల్లోకి ప్రవేశించడానికి కూడా అర్హత లేనివాళ్ళు, ఈ దేశంలో రాజ్యాంగం ఇచ్చిన మత స్వేచ్ఛని ఇలా దుర్వినియోగం చేయటంతో సహజంగానే తీవ్రంగా కలవరపడిన కొంతమంది ప్రత్యక్షంగా సైబర్‌ వేధింపులకు పాల్పడ్డారు. చంపుతామని, అత్యాచారం చేస్తామనే బెదిరింపులు మాత్రమే కాకుండా అతి అసహ్యమైన కుల దురహంకార, స్త్రీ ద్వేష, రేసిస్ట్‌ తిట్లు ఆమెకి మెసేజిల ద్వారా పంపారు. ఆమె కులంపై, మతంపై, శరీరంపై చెప్పరాని మాటలు అంటూ తమ కుల, మత, లింగ ఆధిపత్యాన్ని తద్వారా పునరుద్ఘాటించుకున్నారు. వీరిలో ఆధిపత్య కుల స్త్రీలు తమ పురుషులతో పోటీపడి మెర్సీని వేధించటం, కించపరచటంలో లింగ సమానత్వం సాధించేసుకున్నారు కూడా.

ఆమె కులం, మతానికి చెందిన ఒకరిద్దరు ప్రగతి శీల పురుషులు కూడా మెర్సీకి, ఇలాంటి కవిత రాసినందుకు తగిన శాస్తి జరగాలని భావించారు. వీరి ఉద్దేశంలో ఆమె తన హద్దులు మరిచి, ఈ సమయంలో పర మత దూషణకి పాల్పడింది. అంటే ఆమె మౌలికంగా ఒక మైనారిటి మత స్త్రీగా ప్రవర్తించాల్సిన రీతిలో అణకువగా ప్రవర్తించకుండా గీచిన గీత దాటింది. ఇటువంటి ధిక్కార ప్రవర్తనకి పాల్పడిన స్త్రీలని సంరక్షించాల్సిన అవసరం లేదు, ఆమె తన తప్పుకు సరయిన శిక్ష అనుభవించాల్సిందే అని బహిరంగంగా ప్రకటించేశారు కూడా. అలా తమ పురుషాధిక్యతను తాము పునరుద్ఘాటించుకున్నారు.

తెలుగు రాష్ట్రాల్లోని అభ్యుదయ వాదులందరూ ఇటువంటి బహిరంగ దాడులను గట్టిగానే ఖండించారు. ముఖ్యంగా అన్ని వాదాలకి చెందిన సాహితీకారులందరూ ఆమె వెనకే నిలిచారు. ఈ రకంగా ఆమెపై వేధింపులకు పాల్పడడం ఆమె గొంతు నొక్కడమే కా అందరికీ కావాల్సిన భావ స్వేచ్ఛని అణగదొక్కటమే అని నొక్కి చెప్పారు. ఆమెకీ, ఆమె రాసే స్వేచ్ఛకీ మద్దతు తెలిపారు. అయితే మద్దతు ప్రకటించిన వారిలో ముస్లిం వాదులు, దళిత వాదులు నిఖార్సయిన మద్దతు ప్రకటిస్తే, మెర్సీ పట్ల, ఆమె కవిత పట్ల, ఆమె రాసిన ఉద్దేశం పట్ల ఆమె భావ స్వేచ్ఛని సమర్దించిన అభ్యుదయ వాదుల్లో చాలా కలవరం కనిపించింది. అయ్యో ఇప్పుడెందుకు రాసింది అనుకున్న వాళ్ళ నుండి, ఏదో రాయబోయి మరేదో రాసిందనుకుంటా అని అన్నవాళ్ళు, పరాయి మతాన్ని విమర్శించడమెందుకు అన్న వాళ్ళ దగ్గర్నుంచి, ఏ మతమయినా చెడ్డదే కాదు, మత మార్పిడిని సమర్ధించే కవిత రాసిన మెర్సీ క్రిస్టియన్‌ కవినని గర్వంగా చెప్పుకునే ప్రగతిశీల రచయిత్రిగా ఎలా పరిగణించాలనే మీమాంస వరకు అనేక సందేహాలతో అందరూ అంతర్గతంగా సతమతమవుతున్నారు. తమ తమ ఫేస్‌బుక్‌ పోస్టుల్లో, వాట్సాప్‌ గ్రూపుల్లో ఆయా విమర్శని వ్యక్తపరిచారు. ఇవన్నీ న్యాయమయిన ప్రశ్నలే, వేసుకోవాల్సిన ప్రశ్నలే కూడా. అయితే ఇవన్నీ కూడా దేశంలో గత రెండు దశాబ్దాలలో తీవ్రంగా ప్రబలిపోయిన మెజారిటీ వాదం నేపథ్యంలో ఏర్పడిన సందేహాలు కాదా అనే ప్రశ్న కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంది.

అన్నింటికన్నా మొదటిది ఈ విమర్శల్లో మెర్సీ క్రిస్టియన్‌ అస్తిత్వాన్ని, ఆమె రచయిత అస్తిత్వాన్ని కలిపేయడం. ఇంతకు ముందు ఆమె తన రచనల్లో వాడుకున్న ప్రతీకలన్నీ తెలుగు సాహిత్య సంప్రదాయంలో భాగమే అయినప్పటికీ, ఆమె ఈ కవితలో సీత, రాముడు అనే పేరు గల వ్యక్తుల గురించి మాట్లాడగానే ప్రగతిశీల వాదులతో సహా అందరికీ ఆమె రచయిత అస్తిత్వం కాక, క్రిస్టియన్‌ అస్తిత్వమే కనబడింది. ఎందువల్ల? సీతకి వచ్చిన కష్టాలు నీకు రాకూడదు తల్లీ అనటం చిన్నతనంలో కొన్ని తరాల వాళ్ళకి రోజువారీ సంస్కృతిలో భాగం. తెలుగు సాహిత్యపరంగా సీత తరతరాలుగా స్త్రీల అణచివేతకే కాక ఆధునిక స్త్రీ వాద ప్రతీకగా ఉంటూ వచ్చింది. రంగనాయకమ్మ దగ్గరి నుండి, హేమలత, ఓల్గా వరకు సీతకి పలు రకాల వ్యక్తిత్వాన్ని కల్పించారు. ఒక కథలో సీత రావణుడితో ఉండిపోతే, మరొక కథనంలో సీత తల్లి (భూమి) దగ్గరికి వెళ్ళిపోతుంది. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్న మెర్సీ ఇటువంటి సాంస్కృతిక ప్రతీకని కవితలో వాడుకుని ఒక సాధారణ సీత సామాన్య రాముడి బాధలకు తట్టుకోలేక చర్చికి వెళ్ళిందంటే ప్రగతి శీల వాదులు కూడా ఆమెని తెలుగు రచయితగా కాక, ఆమె మతానికి ప్రతినిధిగా చూడడం ఏ విధంగా అర్థం చేసుకోవాలి?

మెర్సీ తనను తాను క్రిస్టియన్‌గా చెప్పుకోవటం తమని తాము మతానికి అతీతంగా ప్రకటించుకున్న అభ్యుదయ వాదులకి మింగుడు పడడంలేదు. దీనికి మత అస్తిత్వం, లౌకిక వాదం, ప్రగతి శీలతల మధ్య ఉన్న సంబంధం గురించి, ముఖ్యంగా వామపక్ష వాదులమని చెప్పుకునే వారికి ఉన్న స్పష్టత కొంత కారణంగా కన్పిస్తుంది. మత అస్తిత్వానికి, ప్రగతి శీలతకి పరస్పర వైరుధ్యం లేదని చెప్పటానికి మనకి చరిత్రలో అనేక ఉదాహరణలు కన్పిస్తాయి. అలాగే, దేవుణ్ణి నమ్మని వారందరూ ప్రజాస్వామ్య వాదులు అనటానికి ఏ సాక్ష్యాలు లేవు. లౌకిక వాదానికి, మతాలకి ఉన్న సంబంధం కూడా చరిత్రలో సంక్లిష్టమైనదే. యూరప్‌లోనే వివిధ దేశాల్లో ఈ సంబంధం గురించి వివిధ రకాలుగా ఉంది. అలాగే దేవుడిని నమ్మటానికి, లౌకికత్వం గురించి లోతుగా ఆలోచించడానికి మధ్య కూడా పరస్పర వైరుధ్యం ఏమీ లేదు. లౌకికత్వంపై ప్రామాణిక రచనలు చేసిన వాళ్ళల్లో ఒకరయిన ఛార్లెస్‌ టేలర్‌ మంచి క్రిస్టియన్‌. మన దగ్గర మతాన్ని లోతుగా ఆలోచించి రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్‌ కూడా మనిషికి మతం చాలా అవసరమని భావించారు. పైన దేవుళ్ళు ఉండరు, లౌకిక జీవితంలోనే మనిషి తనని తాను నిరూపించుకోవాలి అన్న బుద్ధుడి మతమే కదా బౌద్ధం. భావపరంగా, చరిత్రపరంగా ఇంత సంక్లిష్టత ఉన్న విషయాలని మనం అర్థం చేసుకోకుండా మెర్సీ తన మతాన్ని వదులుకుంటేనే ప్రగతిశీలత, ప్రజాస్వామికత, లౌకికత నిరూపించుకోగలుగుతుందని అనటం ఏ రకంగా సరైనది?

వీటన్నింటికీ మించి విమర్శకులందరూ పదేపదే ప్రస్తావించిన ఇంకొక విషయం కవితలోని సాధారణ సీత మత మార్పిడి. దీన్ని హిందూమతంపైన దాడిగా మితవాదులు కొంతమంది నిర్ధారిస్తే, మరి కొంతమంది అభ్యుదయ వాదులు మార్క్స్‌ చెప్పినట్లు అసలు మతమే మత్తుమందనే ప్రస్తావన తెచ్చారు. క్రిస్టియన్‌ చర్చిలు సామ్రాజ్యవాదానికి మద్దతిచ్చాయని, భారతదేశంలో బయటి డబ్బులతో, హిందూ మతంతో పోటీపడుతూ అందరినీ తమ మతంలోకి ఆహ్వానిస్తారని, విముక్తి చేసే సామర్ధ్యం లేని / కోల్పోయిన మతమని వారి విమర్శల సారాంశం. వీటిలో సత్యం లేకపోలేదు. అయితే భారతదేశంలో ఆధిపత్య కులాల వారికి కులం అవసరం లేనట్లే, ఆయా ఆధిపత్య కులాల ప్రగతిశీల వాదులకి మతం అవసరం కూడా పెద్దగా ఉండదు. ఏ మతానికి చెందిన వారయినా ఆధిపత్య కులాల వారికి, అసలు మత సంప్రదాయాలని పాటించకపోయినా లౌకికంగా, సాంస్కృతికంగా, మత సమూహంలో అందాల్సినవన్నీ (కొంత ఇబ్బందులు కలిగినా) అందుతాయి. అవి పేరంటాలు కావచ్చు, పెళ్ళిళ్ళు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, మంత్రి పదవులు కావచ్చు… అవి అందని సామాజిక వర్గాల, కులాల ప్రజలకి వ్యక్తులుగా, సమూహాలుగా మతం, మత సమూహాలు, మత అస్తిత్వం చాలా అవసరం. సామాన్య ప్రజలకి లౌకిక రాజ్యంలో దొరకని, పొందలేని సాధ్యపడని ముక్తి కోసమే కాక లౌకిక అవసరాలు, తమకొక అండ, గౌరవం, ఆత్మ సమ్మానం, స్థైర్యం, కమ్యూనిటీ, విద్య, వైద్యం, కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం మతం అవసరం పడుతుంది. ఇక్కడే మార్క్స్‌ మతం మత్తు మందు అనే ముందు, ”మతం అణగారిన జీవి నిట్టూర్పు, హృదయం లేని ఈ ప్రపంచానికి హృదయం, ఆత్మ లేని ప్రపంచానికి ఆత్మ” అని కూడా చెప్పాడని గుర్తు చేసుకోవాలి. దేవుడి అవసరం ఉన్నవాళ్ళు ఒక దేవుడు అందుబాటులో లేకుంటే వేరొక దేవుడిని వెతుక్కుంటారు. సమాజం నుండి వెలివేయబడిన దళితులు, రాజ్యం ప్రత్యక్ష, పరోక్ష దాడులకు గురయ్యే ఆదివాసీలు తమని ఆహ్వానించే మతాలని వెతుక్కోవటం మన దేశ చరిత్రలో ఒక అంతర్గత భాగమని అభ్యుదయ వాదులు ఇప్పటికైనా గుర్తించక తప్పదు. అది ఇస్లాం కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, మన రిపబ్లిక్‌ మూలాలు వేసిన అంబేద్కర్‌ తీసుకున్న బౌద్ధం కావచ్చు. అవి ఎటువంటి విముక్తికి దారి తీస్తుందన్న ప్రశ్న కూడా వాళ్ళు వేసుకుంటున్నారు. మెర్సీ కవిత దానిలో భాగమే. ఈ ఎగుడు దిగుడు చరిత్రని మర్చిపోయి అన్ని కులాల వారు, సామాజిక వర్గాల వారు తమకులాగే అన్ని మతాలని తిరస్కరించాలనే అమూర్తమైన భావన ఎవరికి పనికొస్తుందో అర్థం చేసుకోవడం కొంచె కష్టంగా ఉంది.

మెర్సీ, సీత రాముడిని ధిక్కరించే కవితని అహంకారంతో రాసిందా, అజ్ఞానంతో రాసిందా, ఆక్రోశంతో రాసిందా అనే చర్చ చేసేవాళ్ళం అందరం కూడా మన రాజ్యాంగంలో భావ ప్రకటనా స్వేచ్ఛతో పాటు మత స్వేచ్ఛ కూడా ఒక ప్రాథమిక హక్కేనన్న విషయం, ఆ స్వేచ్ఛకీ గత దశాబ్దాల్లో అనేక మత మార్పిడి నిరోధక చట్టాలు తెచ్చి తూట్లు పొడిచిన విషయం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం

ఉంది. మహారాష్ట్రలో 2014 నుండి 2018 వరకు ఎంతమంది మత మార్పిడి చెందారని ఇన్ఫర్మేషన్‌ చట్టం కింద ప్రశ్న అడిగితే 44 శాతం మంది హిందువులు ఇస్లాంని స్వీకరించారని, వివిధ మతాలవారు 22 శాతం మంది హిందూ మతాన్ని స్వీకరించారని గత ఏడాది టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ప్రచురించింది. మత మార్పిడి గురించిన హిందుత్వ వాదుల బాధ, ఆందోళన హిందుత్వ వాదులు చేసిన అసహ్యకరమయిన ఘర్‌ వాపసీ ప్రోగ్రామ్‌లో వ్యక్తమయింది. వీటన్నింటి మధ్యలో అభ్యుదయ వాదులు తెలుగు క్రిస్టియన్‌ రచయిత్రి ఒక సాధారణ సీత మత మార్పిడి గురించి రాసిన కవిత పట్ల చేసిన విమర్శ మెజారిటీ వాదం నిర్ణయించిన పరిధిలో చేస్తున్నారేమోనన్న సందేహం కలుగుతోంది. ఈ విమర్శకులు చారిత్రకంగా తమకు లభించిన సామాజిక స్థానం నుండి వచ్చిన స్వీయానుభవాన్ని సార్వత్రిక సత్యంగా తీసుకోవట్లేదు కదా? బహుశా అందువల్లే కాబోలు ముస్లిం వాదులు, దళిత వాదులెవరూ ఈ కవిత పట్ల అభ్యుదయ వాదులు వ్యక్తపరిచిన సందేహాలేమీ వ్యక్తపరచలేదు. మైనారిటీ సమూహాలుగా, అణగారిన సమూహాలుగా వారి సామాజిక అనుభవం ఈ కవితలో ఉన్న సార్వత్రిక విమర్శని అర్థం చేసుకున్నట్లుంది.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.