జెండర్‌ ఏమిటో తెలుసుకుందాం

 

(గత సంచిక తరువాయి…)

జెండర్‌, అభివృద్ధి

అభివృద్ధి అంశాలు, చర్చలలో జెండర్‌ ఇంత ప్రాధాన్యతను ఎందుకు సంతరించుకుంది?

గత 10-15 సంవత్సరాలుగా జెండర్‌, అభివృద్దిపై చాలా చర్చలు జరుగుతున్నాయన్నది నిజమే. ఈ విషయంపై అనేక సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు, వర్క్‌షాప్‌లు జరిగాయి. ప్రజలందరి జీవితాలను మెరుగుపరచడానికి ఉద్దేశించిన ప్రణాళికాబద్ధ అభివృద్ధి ప్రయత్నాల వల్ల స్త్రీలకు ఉపయోగం లేదనీ, లేదా వాస్తవానికి అనేక విధాలుగా వారికి హాని చేస్తున్నాయనీ స్పష్టం కావడంతో స్త్రీ లేదా జెండర్‌ అంశాలు అభివృద్ధి విషయాలలో చర్చకు వచ్చాయి. 1960ల అంతం, 1970ల ఆరంభంతో ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో (ప్రధానంగా) మహిళా పరిశోధకులు అభివృద్ధి ప్రణాళికలు స్త్రీలను నిర్లక్ష్యం చేశాయన్న విషయాన్ని ఎత్తి చూపసాగారు. అంతకుముందే ఈ ప్రక్రియలో పేదలు భాగస్వాములు కాకపోవటం, వారు మరింతగా పేదరికంలోకి నెట్టివేయబడడం వంటి విషయాలు పరిశీలించబడ్డాయి. అభివృద్ధి కార్యక్రమాలు వాటంతట అవే అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తాయని ప్రణాళికాకర్తలు భావించారు, కానీ ఈ అంచనా నిజం కాదని దాదాపు అన్ని చోట్లా నిరూపితమయ్యింది. 1950లలో కొత్తగా స్వాతంత్య్రం పొందిన దేశాలు ప్రణాళికాబద్ధ అభివృద్ధిని చేపట్టినప్పుడు వాటికి పాశ్చాత్య దేశాలు ఆదర్శంగా నిలిచాయి. పారిశ్రామికీకరణ, ఆధునిక వ్యవసాయం ద్వారా ప్రగతి, అభివృద్ధి సాధించవచ్చని భావించి పారిశ్రామికవేత్తలు, భూస్వాములు, వ్యాపారవేత్తలపై దృష్టి కేంద్రీకరించారు. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రభుత్వాలు ‘బలవంతులపై తమ పాచికలు ఒడ్డడం ద్వారా’, అభివృద్ధి ప్రయత్నాల ప్రయోజనాలు మెల్లగా అధిక సంఖ్యాకులైన పేదలకు చేరతాయనీ, తద్వారా క్రమేపీ సమాజం మొత్తం సుసంపన్నం అవుతుందని భావించారు. ఆదాయాలు లేని పేదలు, స్త్రీలపై అసలు దృష్టి సారించలేదు. ఇంటిలోనూ, ఆర్థిక విధానంలోనూ స్త్రీల పాత్రను గుర్తించలేదు, లేదా విలువైనదిగా భావించలేదు.

ఐక్యరాజ్యసమితి మొదటి దశాబ్దమైన 1960-1970 కాలంలో అభివృద్ధి ప్రయోజనాలు అధిక సంఖ్యాకులైన పేదలకు చేరటం లేదని స్పష్టమయింది. పూర్తికాలం ఉపాధి లేకపోవటం, ఆహార కొరతలు, పేద-ధనికుల మధ్య అంతరాలు పెరగటం వంటి వాటికి స్పష్టమైన నిదర్శనాలు కనిపించాయి. ఈ సాక్ష్యాల ఫలితంగా, కిందనుంచి వస్తున్న వత్తిడుల ఫలితంగా రెండవ అభివృద్ధి దశకమైన 1970-1980 కాలంలో అభివృద్ధి లక్ష్యాలను, వాటిని సాధించే మార్గాలను పునఃపరిశీలింంచారు. భారత్‌, బంగ్లాదేశ్‌లలో గ్రామీణ ప్రాంతాలలో పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలు అభివృద్ధి కార్యక్రమాలలో స్త్రీలు, పేదలు పాల్గొనడం లేదన్న విషయాన్ని ఎత్తిచూపాయి. ఈ సందర్భంలోనే ”ప్రజల భాగస్వామ్యం”, ”కిందనుంచి ప్రణాళికలు”, ”ప్రగతితో పాటు సంపద పునఃవిభజన” వంటి సిద్ధాంతాలు చర్చకు వచ్చాయి. ఇదే సమయంలో ”మౌలిక అవసరాల విధానం”తో పాటు అనేక పేదరిక నిర్మూలన కార్యక్రమాలు ప్రవేశపెట్టబడ్డాయి.

అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాల వల్ల ఒక కుటుంబం ప్రయోజనం పొందినప్పటికీ అదే కుటుంబంలోని స్త్రీలు సమాన ప్రయోజనం పొందుతారని హామీ లేదన్న విషయం వెల్లడయింది. వాళ్ళసలు ఏ మాత్రం ప్రయోజనం పొందకపోవచ్చు కూడా. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో ఫెమినిస్టు దృక్పథంతో అంటే స్త్రీల ప్రయోజనాలు, అంశాలను సాధించాలన్న ఉద్దేశంతోనూ, తరతమ బేధాలతో ఉన్న జెండర్‌ సంబంధాలను మార్చి సమానంగా చెయ్యాలన్న ఉద్దేశంతో చేపట్టిన అధ్యయనాలు జెండర్‌ పట్టించుకోని అభివృద్ధి ప్రణాళికలు స్త్రీల దృష్టి కోణాన్ని, అవసరాలను, ప్రయోజనాలను విస్మరించాయని తెలియజేసే వివరాలు, నిదర్శనాలు వెల్లడి చేశాయి. వీటిని నిర్లక్ష్యం చెయ్యటమంటే ప్రస్తుతం స్త్రీ-పురుషుల మధ్యనున్న అసమానతలను పరిష్కరించ పూనుకోకపోవటమే. అంతేకాకుండా అభివృద్ధి ప్రక్రియలలో స్త్రీల భాగస్వామ్యం, పాత్ర కూడా విస్మరింపబడ్డాయి. ఫలితంగా స్త్రీలు మరింత అంచులకు నెట్టివేయబడ్డారు. మరింతగా అధికార హీనులయ్యారు.

చదువు, శిక్షణా అవకాశాలు స్త్రీలకు అందుబాటులోకి రాలేదనీ, సాంకేతిక విజ్ఞానం స్త్రీలను చాకిరీ నుంచి విముక్తం చేయలేదనీ, దురభిప్రాయాలు, పొరపాటు అవగాహనలు ఇంకా కొనసాగుతున్నాయనీ అందరికీ స్పష్టమయింది.

ఈ అంశాలను వివరించటానికి కొన్ని ఉదాహరణలు ఇస్తారా?

ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రదేశాలలో స్త్రీలు రైతులుగా, ఆహార ఉత్పత్తిదారులుగా ఉన్నారు. అయినప్పటికీ ప్రణాళికా వేత్తలు, నిర్ణయాలు తీసుకునేవాళ్ళు, సమాచార ప్రసారకులు వారి పాత్రను గుర్తించ నిరాకరించారు. ఈ పెద్ద మనుషులు ఉపయోగించే భాష సైతం వీరి వివక్షతను బట్టబయలు చేస్తుంది. రైతులను ఉద్దేశించినప్పుడు వారు ఎప్పుడు పుంలింగ పదాలైన ‘పురుషులు’, ‘అతడు’ అన్న నామవాచకాలను మాత్రమే ఉపయోగిస్తారు.

అభివృద్ధి కార్యక్రమాల ఫలితంగా స్త్రీలు మరింతగా అంచులకు నెట్టివేయబడ్డారు.

వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి ప్రణాళికలు తయారు చేయడంలో స్త్రీలను నిర్లక్ష్యం చేశారని, ఫలితంగా వారి పరిస్థితి మరింత దిగజారిందని, ఈ ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతోందనీ ఈ విషయాలు వెల్లడి చేస్తున్నాయి. వ్యవసాయం, ఉద్యానవనం, పశుపోషణలో స్త్రీల పాత్ర ఎక్కువయినప్పటికీ శిక్షణ, సమాచార, రుణాలలో అధిక భాగం పురుష రైతులకే అందింది. విస్తరణ కార్యక్రమాలు దాదాపు పురుషుల ద్వారా, పురుషుల కోసం నిర్వహింపబడ్డాయి. దీనికి విరుద్ధంగా స్త్రీలకు ఆదాయాన్ని కల్పించే కార్యక్రమాలు కుట్లు, ఎంబ్రాయిడరీ, అప్పడాలు, పచ్చళ్ళ తయారీ వంటి సాంప్రదాయ రంగాలకు పరిమితమయింది. ఇవి అందించిన ఆదాయం తక్కువ కానీ స్త్రీత్వం, పురుషత్వం చుట్టూ అల్లిన భ్రమలు మాత్రం ఎక్కువ.

నిర్ణయాలు తీసుకోవటం దగ్గరనుంచి అమలు చెయ్యటం వరకు వ్యవసాయం అభివృద్ధిలో సమస్తమూ పురుషుల ఆధీనంలోనే జరిగింది. ఉదాహరణకు 1980లలో ప్రపంచ బ్యాంకు ప్రణాళికలు, నిధుల ఆధారంగా భారతదేశంలో పెద్ద ఎత్తున చేపట్టిన శిక్షణ, సందర్శన వ్యవసాయ విస్తరణ సేవలు స్త్రీలను పూర్తిగా విస్మరించాయి. అదేవిధంగా నేపాల్‌లో ‘అటవీ పునరుద్ధరణకు ప్రసార సాధనాల మద్దతు’ అన్న నివేదికలో స్త్రీల ప్రస్తావన ఒక్కసారి కూడా రాలేదు. అడవుల పునరుద్ధరణ, నీటి సరఫరా, ధాన్యం నిల్వ వంటి విషయాలు స్త్రీలను ఎంతగానో ప్రభావితం చేస్తాయి. ఈ పనులు చేసేది కూడా ఎక్కువగా వాళ్ళే. అయినప్పటికీ వీటికి సంబంధించిన పథకాలలోనూ స్త్రీలను భాగస్వాములను చెయ్యలేదు. అంతేకాదు, సాంకేతిక విజ్ఞానంలో అధికభాగం పురుషులకు ఇవ్వబడింది. వారి నియంత్రణలో ఉంది. ఇంకోవైపు స్త్రీలు మాత్రం శ్రమతో కూడుకున్న, నిరంతరం చేస్తూ ఉండవలసిన, నడుం విరిగే పనులు చేస్తూనే ఉన్నారు. వ్యవసాయ వాణిజ్యీకరణ ఫలితంగా పనులు చాలావరకు స్త్రీలే చేస్తున్నప్పటికీ నగదు, కుటుంబ వనరులు ఎక్కువగా పురుషుల నియంత్రణలోకి వెళ్ళాయి.

”గృహిణి”, ”కుటుంబ పెద్ద”, ”ఆర్థిక” పని వంటి వాటి పట్ల ఉన్న పొరపాటు అవగాహనల వల్ల స్త్రీల ఉత్పాదక పాత్రలను పూర్తిగా విస్మరించారని నేపాల్‌లోని పదకొండు ప్రధాన గ్రామీణాభివృద్ధి పథకాలను 1980లలో సమీక్షించగా వెల్లడయింది. ఈ పథకాలలో చాలా వాటిల్లో కొత్త సాంకేతిక విజ్ఞానం, యంత్రాలు వంటివి పురుషులు చేసే పొలం దున్నడం వంటి పనులకే అందుబాటులోకి వచ్చాయి. స్త్రీలు చేసే దంచడం, పిండి కొట్టడం వంటి పనుల్లో యాంత్రీకరణ చోటు చేసుకోగానే అది పురుషుల పనిగా మారిపోయింది. ఇండోనేషియా, బంగ్లాదేశ్‌లలో అధిక దిగుబడినిచ్చే వరి వంగడాల దంపుడు యంత్రాలు ప్రవేశపెట్టగా ఇదే జరిగింది. దీని ఫలితంగా ఒక్క దెబ్బతో అధిక సంఖ్యాక స్త్రీలు తాము సంపాదిస్తున్న కొద్దిపాటి ఆదాయాన్ని కూడా కోల్పోయారు.

వ్యవసాయ, ఆర్థిక విధానంలో కీలకమైన ఉత్పాదక వనరు అయిన భూమిని కలిగి ఉండడం, దాన్ని నియంత్రించడంలో స్త్రీలకు స్థానం లేకుండా చేశారు. సాంప్రదాయ భూమి కౌలుదారీ విధానాలలో స్త్రీలు భూ యజమానులు కాకపోయినప్పటికీ తమ కోసం, తమ పిల్లల కోసం, ఉమ్మడి కుటుంబాల కోసం ఆహారం పండించే వీలు ఉండేదని ఆహారం, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌.ఎ.ఓ.) తెలియచేస్తోంది. అయితే కొన్ని భూసంస్కరణ కార్యక్రమాల వల్ల వ్యక్తిగతంగా పురుషులకు భూమి పట్టాలు లభించడంతో స్త్రీలకు భూమి అందుబాటులో లేకుండా, దానిపై నియంత్రణ లేకుండా పోయింది. అదేసమయంలో ఆ కొత్త యజమాని భూమిని సాగు చేయడానికి బదులు దాన్ని అమ్మాలని నిర్ణయించుకోవచ్చు. ఫలితంగా స్థానిక వినియోగానికి ఆహార ఉత్పత్తి చెయ్యటానికి ఆ భూమి అందుబాటులో లేకుండా పోతుంది.

భూమి పట్టాలు పురుషుల పేరున ఇవ్వటంతో చట్టపరంగా వాళ్ళు కుటుంబ పెద్దలవుతారు. దీని ప్రకారం అప్పులు తీసుకోవడానికి, ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములు కావటానికి, సహకార సంఘాలలో సభ్యులు కావటానికి పురుషులకే అధికారం ఉంటుంది. పురుషులు నగరాలకు వలసపోయిన కారణంగా స్త్రీలే వ్యవసాయ పనులన్నీ చేసే ఉత్తరప్రదేశ్‌ (ప్రస్తుత ఉత్తతరాఖండ్‌) లోని కొండ ప్రాంతాలలో కూడా ఇదే పరిస్థితి. శిక్షణ విషయంలో కూడా ఇదే ధోరణి కొనసాగుతోంది.

శ్రీలంకలోని మహావేలీ పథకం, మలేషియాలోని ముడా పథకం, కెన్యాలోని మ్వియా పథకం వంటి అనేక సాగునీటి పథకాలలోని పునరావాస కార్యక్రమాలను విశ్లేషించగా అవి సంప్రదాయ ఉత్పత్తిదారులుగా స్త్రీలకు ఉన్న సాపేక్షిక స్వతంత్రతను విస్మరించి పురుషుడు కుటుంబ పెద్దగా, గృహిణి సహాయకురాలుగా ఉండే ఒంటరి కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని తయారుచేశారని వెల్లడి చేసింది.

శ్రీలంకలోని మహావేలీ పథకంలో వివాహిత స్త్రీలకు భూమి పట్టా పొందే హక్కు లేకుండా చేశారనీ, వారసులుగా ఒక్కరినే పేర్కొనవలసి ఉండడంతో అది సాధారణంగా కొడుకుకి దక్కేదని ఫెమినిస్టు పరిశోధకులు తెలియజేశారు. సింహళ సంప్రదాయ చట్టం ప్రకారం కుటుంబ వరి, మాగాణి భూములపై కొడుకులు, కూతుళ్ళకు సమాన వారసత్వపు హక్కులు ఉండేవి. అదేవిధంగా వివాహిత స్త్రీలకు స్వతంత్రమైన, ఇతరులెవ్వరూ లాక్కోలేని భూమి అధికార హక్కులు ఉండేవి. ఇందుకు విరుద్ధంగా పునరావాస గ్రామాలలో భార్యలు పరాధీనులుగా మారారు. స్త్రీలకు భూమి పట్టా లేకపోవడంతో వారికి వ్యవసాయ విస్తరణ సమాచారం, సంస్థాగత రుణాలు, సహకార సంఘాలలో సభ్యత్వం వంటివి అందలేదు. ఫలితంగా స్త్రీలు కొత్త పద్ధతుల్లో నిర్లక్ష్యం చేయబడ్డారు. అధికారాలు కోల్పోయారు.

కొత్త అంశాలు చెప్పేటప్పుడు ఇచ్చే శిక్షణలో స్త్రీలు విస్మరింపబడ్డారు. పురుష విస్తరణాధికారులు స్త్రీలను కలవడాన్ని సాంప్రదాయ దృక్పథాలు అనుమతించేవి కాదు. ఉదాహరణకు వాయువ్య బంగ్లాదేశ్‌లోని ఒక ప్రాంతంలో విత్తనాలను సాంప్రదాయంగా స్త్రీలు ఎంపిక చేసేవారు. అధిక దిగుబడినిచ్చే కొత్త గోధుమ రకాన్ని ప్రవేశపెట్టిన తరువాత దాని ఫలితాలు నిరాశాజనకంగా ఉన్నాయి. దీనికి సంబంధించిన శిక్షణ కేవలం పురుషులకే ఇవ్వడం వల్ల మహిళలు సరైన విత్తనాలు ఎంపిక చేయలేకపోవడం ఫలితంగా ఇది సంభవించిందని తేలింది.

”అభివృద్ధి” పేరుతో ప్రధాన వ్యవసాయ స్రవంతి నుంచి స్త్రీలను బయటికి నెట్టివేశారని ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలోని అనుభవాలు తెలియజేస్తున్నాయి. అంతకుముందు వ్యవసాయంలో స్త్రీ, పురుషులు సమాన భాగస్వాములుగా ఉండేవారు. విజ్ఞానం, నిర్ణయాలలో భాగస్వామ్యం, శ్రమ దాదాపు సమానంగా ఉండేవి. క్రమేపీ పురుష ”అభివృద్ధి కారులు” తమ దృష్టిని కేవలం పురుష రైతులపైనే కేంద్రీకరించసాగారు. పురుషుల భారం తగ్గించటానికి, సామర్ధ్యం పెంచటానికి వారికి యంత్రాలు వచ్చాయి. సహకార సంఘాలలో, అభివృద్ధి కమిటీలలో పురుషులు సభ్యులయ్యారు. వాణిజ్య పంటల వల్ల డబ్బు పురుషుల చేతుల్లోకి చేరింది. వ్యవసాయ వాణిజ్యీకరణతో మార్కెట్‌, బ్యాంకులు, వ్యాపార కేంద్రాలు ”బయటి” ప్రదేశాలుగా మారటం వల్ల చాలామంది స్త్రీలకు అవి అందుబాటులో లేకుండా పోయి వాళ్ళ పరిస్థితి మరింత తీసికట్టయింది.

ఆర్థిక రంగంలోని ఇతర కార్యక్రమాలు కూడా ఇవే ధోరణులను వెల్లడి చేశాయి. ఉదాహరణకు భారతదేశంలో నేత పరిశ్రమలో స్త్రీలు అధిక సంఖ్యలో ఉపాధి పొందేవారు. కానీ ఆధునికీకరణ, యాంత్రీకరణల ఫలితంగా వాళ్ళు ఉపాధి కోల్పోయారు. ఆర్థికంగా స్త్రీలు అంచులకు నెట్టివేయబడడం వల్ల సామాజికంగా కూడా అంచులకు నెట్టివేయబడ్డారు. ఫలితంగా సమాజంలో వారి హోదా తగ్గిపోయింది. భారతదేశంలో వరకట్నం, స్త్రీ భ్రూణహత్య, స్త్రీ శిశు హత్య అంతకు ముందు లేని ప్రాంతాలలోకి, సమాజాలలోకి విస్తరించటానికి ఇది కూడా ఒక కారణం. దక్షిణాసియాలో స్త్రీ- పురుషుల నిష్పత్తి పడిపోతూ ఉండటానికి కూడా ఇది ఒక ప్రధాన కారణం. ఆర్థికంగా, నిరర్థకంగా మారటంతో స్త్రీల మనుగడ అవకాశాలు తగ్గిపోయినట్లు కనబడుతుంది.

ఈ విధమైన అభివృద్ధి విధానాన్ని స్త్రీ దృక్పథం నుంచి మీరెలా విశ్లేషిస్తారు?

ఉత్పత్తి వాణిజ్యీకరణ వల్ల నగదు రూపం తీసుకోవడం వల్ల స్త్రీలు, పేదలు మరింత అంచులకు నెట్టివేయబడ్డారనడానికి సోషలిస్టు, ఫెమినిస్టు పరిశోధకులు తగినన్ని రుజువులు సేకరించగలిగారు. పెట్టుబడి జమ అయ్యే క్రమంలో కొద్దిమంది దగ్గర సంపద పోగుపడి, ఎక్కువమంది భూమి మీద, ఇతర వనరుల మీద నియంత్రణ కోల్పోతారు. వాళ్ళ నియంత్రణలో మిగిలేది వారి శ్రమ ఒక్కటే, కానీ ఆ శ్రమ విలువను నిర్ణయించేది వాళ్ళు కాదు. వ్యక్తిగత ఆస్తి వల్ల వర్గ, జెండర్‌ తారతమ్యాలు ఏర్పడ్డాయని ఎంగెల్స్‌ స్పష్టంగా పేర్కొన్నాడు. వ్యక్తిగత ఆస్తి రూపొందడంతో స్త్రీలను నియంత్రించాల్సిన అవసరం వచ్చిందని అతడు ప్రతిపాదించాడు.. స్త్రీల పునరుత్పత్తి, లైంగికత మీద పురుషుల నియంత్రణతో ప్రపంచ వ్యాప్తంగా తల్లులు చారిత్రకంగా ఓటమి పాలయ్యారు. బూర్జువాజీ స్త్రీల పరిస్థితి శ్రామిక వర్గ స్త్రీల పరిస్థితి కంటే హీనంగా ఉంటుంది; బూర్జువాజీ స్త్రీలు కూడా ఆస్తిలో భాగమే, వాళ్ళు వారసులను కని, సాకేవాళ్ళు మాత్రమే.

ఆర్థికవేత్తలు అమర్త్యసేన్‌, జూ డ్రీజ్‌లు భారతదేశంలో స్త్రీ, పురుషుల నిష్పత్తిపై పరిశోధన జరిపి ఇదే విధమైన నిర్ధారణకు వచ్చారు. భారతదేశంలో 1901 నుంచి స్త్రీ, పురుషుల నిష్పత్తి క్రమబద్దంగా ఎలా పడిపోతుందో వాళ్ళు చూపించారు. అయితే పేద, నిరక్షరాస్య, శ్రామిక వర్గాలు, కులాలలో సాధారణంగా స్త్రీల సంఖ్య ఎక్కువ ఉన్న వాస్తవాన్ని కూడా వాళ్ళు తెలియజేశారు.

1901లో ఉత్తరప్రదేశ్‌ జనాభా మొత్తంలో స్త్రీ, పురుషుల నిష్పత్తి వెయ్యికి 937 కాగా తక్కువ కులం మాదిగ (చమార్‌)లలో అది 986. 1981 నాటికి షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలలో స్త్రీ, పురుషుల నిస్పత్తి ఇతర కులాలలో మాదిరిగానే ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగల ప్రజలు ఈనాడు ‘ఉన్నత’ కులాలవారి లాగానే ఉన్నారు. అంటే వాళ్ళు కూడా పితృస్వామ్య ధోరణులు అవలంబించి స్త్రీలను నిర్లక్ష్యం చేయసాగారు. ఫలితంగా వారి మనుగడ అవకాశాలు దెబ్బతింటున్నాయి. పితృస్వామ్య నియమాలు ఇతర కులాలకు కూడా విస్తరిస్తున్నాయని ఈ అంకెలు తెలియచేస్తున్నాయి..

సామాజిక నిచ్చెనలో ఉన్న కులాలు ఆర్థికంగా అభివృద్ధి సాధించినప్పుడు ఈ ప్రక్రియ మరింత బలంగా ఉంటుందని సేన్‌, డ్రీజ్‌లు చెబుతున్నారు. పేదరికం, అధిక స్త్రీ, పురుష నిష్పత్తి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని వాళ్ళ ద్వారా తెలుసుకుని విస్మయానికి, ఆందోళనకు గురవుతాం. వాస్తవానికి పేదరికం ఉన్న గృహాలలో స్త్రీ, పురుషులమధ్య సహకారం మనుగడకు తప్పనిసరి అయి జెండర్‌ సంబంధాలు సమానంగా ఉండే అవకాశం ఉంది. అదే సంపన్న గృహాలలో స్త్రీలు మరింత పరాధీనులుగా, అలంకరణ వస్తువులుగా

ఉంటారు.

జర్మన్‌ ఫెమినిస్ట్‌, మేధావి అయిన వెరానికా బెన్‌ హోల్ట్‌ – ధామ్సన్‌ కూడా ఇదే రకమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నారు. మూడవ ప్రపంచంలోని అధిక సంఖ్యాక స్త్రీలు ఎదుర్కొంటున్న దారుణ స్థితిగతులు పితృస్వామ్య వ్యవస్థల ఫలితం కాదు; అది వెనుకబాటుతనానికీ, అభివృద్ది చెందకపోవటానికీ నిదర్శనం కాదు, ఇందుకు విరుద్ధంగా ఆధునిక అభివృద్ది కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆమె రాశారు. ఆమె ప్రకారం మనకు ప్రస్తుతం తెలిసిన గృహిణి మొదటి ప్రపంచంలో 119వ శతాబ్దంలో రూపుదిద్దుకుంది. దీర్ఘకాలికంగా సాగిన ఈ చారిత్రక ప్రక్రియ నిరుపేద కూలీలను తయారుచేసిన ప్రక్రియలతో పోల్చదగింది; దగ్గర సంబంధం కలది. ఈ ప్రక్రియను బెన్‌హోల్డ్‌-థామ్సన్‌ ‘ఇంటికి పరిమితం చేయటం’, ‘గృహిణిగా మార్చటం’ అని పేర్కొంది. ఆధునిక వస్తు ఆధార ఆర్థిక విధానం, ధనం పట్టు బిగించటంతో స్త్రీలు వేతనం లేని పనులలోకి లేదా తక్కువ వేతనం లభించే రంగాలలోకి నెట్టివేయబడతారని ఆమె అంటున్నారు. తమకు అందుబాటులో లేని డబ్బుతో నడిచే నేటి ప్రపంచంలో స్త్రీలు ప్రత్యేకించి తమ పిల్లలతో స్వతంత్రంగా బతకగలిగే పరిస్థితి లేకుండా పోతోంది. అన్ని రకాల ఆస్తులు ఒకటొకటిగా కోల్పోతుండడంతో స్త్రీ, పురుషునిపై ఆధారపడక తప్పడంలేదు. స్త్రీ, పురుషుల మధ్య సంబంధాలలో క్రమేపీ సహకారం అంతరించిపోతోంది. ఈ నేపథ్యంలో స్త్రీ, పురుషుల సంబంధాల మధ్య తారతమ్యాలు ఏర్పడతాయి. ఆధునిక సమాజంలో డబ్బుకీ, సామాజిక గౌరవానికీ బలంగా ముడిపడి ఉండడంతో డబ్బు అందుబాటులో లేని వ్యక్తులకు గౌరవమూ దక్కకుండా పోతుందని ఆమె అంటున్నారు.

1970లలో భారతదేశ గ్రామీణ మహిళల గురించి అధ్యయనం చేసిన మరియా మీస్‌ ఇలా అంటున్నారు. ”ఇటీవల కాలంలో వ్యవసాయం వేగంగా ‘అభివృద్ధి’ చెందిన ప్రాంతాలలో, కొత్త రూపాలలో సంపద చోటుచేసుకున్న ప్రాంతాల్లో ‘ఆధునికీకరణ’కు సంకేతంగా సినిమాలు, మద్యం, టెలివిజన్‌, ఇతర వినియోగదారీ వస్తువులు ప్రవేశపెట్టిన ప్రాంతాలలో హింస, లైంగిక దౌర్జన్యం తీవ్రరూపాలలో కనపడుతుంది”.

ఈ వివరాలు, పరిశీలనలు చూసి ‘అభివృద్ది’తో సంబంధం ఉన్న వారందరూ పునరాలోచన చెయ్యాల్సిన అవసరం ఉంది. ఆర్థిక ప్రగతి సాధించినంత మాత్రాన జెండర్‌ అసమానతలు తగ్గిపోవని ఈ విషయాలు మనకు గుర్తు చేస్తున్నాయి. పెట్టుబడిదారీ ఆర్థిక ప్రగతి వాస్తవంలో జెండర్‌ పక్షపాతాలు పెరగడానికి దారి తీయవచ్చు. భారతదేశంలో బాగా అభివృద్ధి చెందిన పంజాబ్‌, హర్యానా రాష్ట్రాలలో స్త్రీ, పురుషుల నిష్పత్తి వరుసగా 882, 865 ఉండడం (భారత సగటు నిష్పత్తి 927) ఈ అంశాన్ని నిరూపిస్తోంది.

మరింత జెండర్‌ సమానతను సాధించటమంటే సామాజిక మార్పులకు పూనుకోవాలి. దీనికీ, ఆర్థిక ప్రగతికీ సంబంధం

ఉండాల్సిన పనిలేదు. కుటుంబంలో స్త్రీకి మరింత చోటు, గళం ఇచ్చే విభిన్న అంశాల ఫలితంగా స్త్రీ ప్రగతి ధోరణి గణనీయంగా తగ్గిందని అనేక అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. ప్రాథమిక విద్య, వేతన ఉపాధి ద్వారా స్వతంత్ర ఆదాయాలు సంపాదించుకోగలగటం ఈ అంశాలలో ముఖ్యమైనవి. రెండవదాని ఫలితంగా స్త్రీలకు బయటి ప్రపంచం మరింతగా తెలుస్తుంది. మరింత గౌరవం లభిస్తుంది. మరింతగా అధికారాలను సాధించుకునే అవకాశం దొరుకుతుంది. మనుగడకు అవకాశాలు మరింతగా పెరుగుతాయి.

ఈ పరిశోధనలు, పరిశీలనలు అభివృద్ధి ప్రణాళికా రచనను, కార్యక్రమాలను ఏ విధంగా మార్చగలిగాయి?

ఇవి ప్రభావం చూపాయి. సమాజంలో సగం మంది అయిన స్త్రీలను విస్మరించడం వల్ల, నిర్లక్ష్యం చెయ్యటం వల్ల కేవలం స్రీలకే కాక మొత్తం సమాజానికి నష్టం కలిగిస్తోందని నిర్ణయాలు తీసుకునే స్థాయిలో ఉన్న కొంతమంది, ప్రణాళికా కర్తలు గుర్తించారు. సభ్య ప్రభుత్వాలను ప్రభావితం చేయడానికి ఐక్యరాజ్యసమితి 1975లో మెక్సికోలో స్త్రీలు, అభివృద్ధిపై ప్రపంచ సదస్సును నిర్వహించింది. 1975-85ని మహిళా దశాబ్దంగా ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా అనేక ప్రకటనలు, కార్యాచరణ ప్రణాళికలు తయారుచేసింది. వీటిని అనేక సభ్యదేశాలు ఆమోదించాయి కూడా. అభివృద్ధిలో స్త్రీలను ఎలా అంతర్భాగంగా చెయ్యాలన్న విషయాన్ని చర్చించడానికి ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రదేశాలలో వందలాది సమావేశాలు, గోష్టి కార్యక్రమాలు జరిగాయి. ఒకవైపున సమానత్వం, న్యాయం అభివృద్దిని కోరుతూ మహిళా ఉద్యమాలు

కిందినుంచి వత్తిడి తీసుకువస్తుండగా ఇంకొకవైపు ఐక్యరాజ్య సమితి చర్చలు, ప్రపంచ ప్రకటనలు వంటి వాటి ద్వారా పై నుంచి వత్తిడి వచ్చింది. ఫలితంగా అనేక ప్రభుత్వాలు స్త్రీల గురించి సమాచారం, గణాంక వివరాలు సేకరించడానికీ, అభివృద్ధి పథకాలు స్త్రీలపై చూపే ప్రభావాన్ని పర్యవేక్షించడానికీ, అంచనా వేయడానికీ, అభివృద్ధి ప్రణాళికల్లో స్త్రీలను భాగస్వాముల్ని చేయడానికీ స్త్రీలకు సంబంధించిన కమీషన్లు, స్త్రీ సంక్షేమ శాఖలు, మంత్రిత్వ శాఖలను ఏర్పాటు చేశాయి. ఉత్పత్తికీ, సమాజానికీ స్త్రీల కృషిని, వారి ప్రత్యేక అవసరాలను గుర్తించి, చర్చలు జరగటం మొదలయింది. కొంతమేరకు నిర్లక్ష్యం, గౌరవించకపోవడం అన్న తెరలు తొలిగి స్త్రీలు కొద్దిగా వెలుగులోకి రావడం మొదలయింది. జెండర్‌ సమానతను సాధించడంలో తాము సాధించిన ప్రగతిని తెలియజేస్తూ ప్రతి సంవత్సరం మహిళల స్థితిగతులపై ఒక నివేదికను రూపొందిస్తామని అనేక దేశాలు ఐక్యరాజ్యసమితికి మాటిచ్చాయి.

అయినప్పటికీ సాస్కియా వైరింగా పేర్కొన్నట్లు ”ఆర్థిక ప్రగతి సాధించిన, ఆర్థిక తిరోగమనం ఎదుర్కొంటున్న రెండు భిన్న పరిస్థితులలోనూ గత కొన్ని దశాబ్దాలుగా స్త్రీల అంశాలు, అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించినప్పటికీ వాస్తవ ప్రగతి మాత్రం అరకొరగా, అసమగ్రంగా ఉంది”. 1991 ఐక్యరాజ్యసమితి నివేదికలో అప్పటి సెక్రటరీ జనరల్‌ అయిన పెరెజ్‌ డి. కుల్లెర్‌ ఇలా పేర్కొన్నారు. ”ఇక్కడ పొందుపరచిన వివరాలు, సూచికల ప్రకారం గత ఇరవై సంవత్సరాలలో కొంతమంది స్త్రీల స్థితి మెరుగుపడిందని స్పష్టమవుతున్నప్పటికీ అధిక సంఖ్యాక స్త్రీల పరిస్థితి అధికారం, సంపద, అవకాశాలలో పురుషుల కంటే వెనుకపడే ఉంది. మానవ అభివృద్ధి నివేదిక 1993 ప్రకారం స్త్రీలకు (అభివృద్ధి నుంచి వెలివేయబడ్డ అతి పెద్ద బృందం) అధికార స్థానాలకు తలుపులు తెరిచి లేవు; అక్షరాస్యులై ఉండే అవకాశాలు తక్కువ; వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కూడా చాలా తక్కువ. సంబంధిత గణాంకాలు అందుబాటులో ఉన్న (అభివృద్ధి చెందుతున్న) దేశాలలో స్త్రీ అభివృద్ధి సూచిక పురుషులతో పోలిస్తే 60 శాతంగా ఉంది. ఇటీవల చేపట్టిన అధ్యయనాలు కొన్ని అభివృద్దిలో స్త్రీలు వెనుకబడి ఉండడానికీ, స్త్రీలపై హింస పెరగటానికీ మధ్య సంబంధం ఉందనీ తెలియచేశాయి”.

దక్షిణ ఆసియాలో జెండర్‌ సంబంధాలు మరింత సమానంగా మారాయా?

ఈ ప్రశ్నకు సరైన సమాధానమివ్వటం సాధ్యం కాదు. విషయం చాలా క్లిష్టమైనది. అన్ని దేశాలకూ, అన్ని సమాజాలకూ వర్తించేలా సాధారణ సూత్రీకరణ చెయ్యలేం. కొన్ని రూపాలలో స్త్రీలు తప్పనిసరిగా లాభపడ్డారు. ఈ రోజు వారికి మునుపటి కంటే ఎక్కువ హక్కులున్నాయి. (ఉదాహరణకు ఓటు హక్కు, వారసత్వపు హక్కు); రాజకీయంగా నిర్ణయాలు తీసుకోవటంలో మరింత భాగస్వామ్యం ఉంది. స్త్రీల అణచివేతకు సంబంధించి, దానిని పద్ధతి ప్రకారం ఎదుర్కోవాల్సిన అవసరం గురించి చైతన్యం ఉంది. స్త్రీలు కూడా మార్పుకోసం మరింతగా గళం విప్పుతున్నారు, సంఘటితమవుతున్నారు. అయతే మరికొన్ని రూపాలలో స్త్రీల పరిస్థితి క్షీణించినట్లుగా కనపడుతోంది.

ఉదాహరణకు స్త్రీల జీవనకాలం, అక్షరాస్యతలో గణనీయమైన ప్రగతి సాధించిన శ్రీలంకలో గత 10-15 సంవత్సరాలలో వారి పరిస్థితి దిగజారింది. భారతదేశం, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌లలో స్త్రీ, పురుష నిష్పత్తి ఇంకా తగ్గుతూనే ఉంది. 1901లో అప్పటి భారతదేశంలో ప్రతి వెయ్యిమంది పురుషులకు 975 స్త్రీలు ఉండేవారు. 1991 నాటికి స్త్రీల సంఖ్య బంగ్లాదేశ్‌లో 940కి, భారతదేశంలో 927కి, పాకిస్తాన్‌లో 910కి తగ్గిపోయింది. ఈనాడు దక్షిణాసియాలో 7.4 కోట్ల స్త్రీలు, బాలికలు ‘అంతర్థానమై’పోయారు. అంటే పితృస్వామ్య నిర్లక్ష్యం, పక్షపాతం, హింసల ద్వారా 90 సంవత్సరాల క్రితం నాటి కంటే ఇప్పుడు ఎక్కువమంది స్త్రీలు, బాలికలు ‘చంపబడుతున్నారు’. ‘అభివృద్ధి’ సాధించినప్పటికీ, లేదా దాని కారణంగానైనా, స్త్రీలు, బాలికల స్థితి దిగజారుతోందని ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. దక్షిణ ఆసియాలో ఒకవైపు స్త్రీలకు ఎక్కువ అవకాశాలు కల్పించబడుతున్నప్పటికీ, జెండర్‌ అంశాలపై చైతన్యం, మాట్లాడడం పెరుగుతున్నప్పటికీ అనేక ప్రాంతాలలో పితృస్వామ్య భావజాలం బలోపేతం అవుతుండడం కనబడుతుంది. అన్ని రకాల మత ఛాందసత్వం ఫలితంగా స్త్రీలపై ఆంక్షలు పెరుగుతున్నాయి.

ఉదాహరణకు పాకిస్థాన్‌లో ప్రగతిశీల కుటుంబ చట్టాల స్థానంలో స్త్రీ వ్యతిరేక హదూద్‌ ఆర్డినెన్స్‌ రూపొందింది; బంగ్లాదేశ్‌లో మితవాద హిందూ సంస్థలు పితృస్వామ్య ఆదర్శ పాత్రలను పునరుద్ధరించడానికి కృషి చేస్తున్నాయి. మార్కెట్‌ శక్తులు ఎంతో వేగంగా బూతు సాహిత్యాన్ని ప్రచారం చేస్తూ స్త్రీలను కించపరిచే విధంగా చిత్రీకరిస్తున్నాయి. ఒకప్పుడు నిరసింపబడి కనుమరుగైపోయాయనుకున్న అందాల పోటీలు ఇప్పుడు ప్రపంచీకరణ, సరళీకరణలతో పెద్ద ఎత్తున తిరిగి రంగప్రవేశం చేశాయి. స్త్రీలపై హింస కూడా గణనీయంగా పెరిగింది. ఆర్థిక సమస్యల ఫలితంగా స్త్రీల పట్ల వివక్షత పెరుగుతోంది. ఉదాహరణకు దక్షిణ భారతదేశంలో ఇంతకు ముందెన్నడూ లేని స్త్రీ శిశుహత్య ఇప్పుడు చోటు చేసుకుంటోంది. ఇంతకు ముందు వరకట్నం లేని సమాజాల్లో కూడా ఇప్పుడు వరకట్నం ఇచ్చి పుచ్చుకుంటున్నారు. దక్షిణాసియాలోని ఏడు దేశాలలో నాలిగింటికి స్త్రీలు ప్రధాన మంత్రులుగా ఉన్నప్పటికీ రాజకీయాల్లో స్త్రీల భాగస్వామ్యం చాలా తక్కువగా ఉంది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత దక్షిణాసియా పార్లమెంటులలో అన్నింటిలోనూ స్త్రీల సంఖ్య వేళ్ళపై లెక్కించేంత తక్కువగా ఉంది.

బ్రిటన్‌లో పితృస్వామ్య వ్యవస్థలోని మార్పులపై సిల్వియా వాల్బి చేసిన వ్యాఖ్యలు దక్షిణాసియాకు కూడా వర్తించేలా కనపడుతున్నాయి. ”బ్రిటన్‌లోని పితృస్వామ్య రూపాలలోనూ, దాని తీవ్రతలోనూ మార్పు ఉంది. గత శతాబ్దకాలంలో వ్యక్తిగత రూపంలో ఉన్న పితృస్వామ్యం ఇప్పుడు ప్రజారూపం దాల్చింది. వ్యక్తిగత పితృస్వామ్యంలో స్త్రీల అణచివేతకు ప్రధాన వేదికగా గృహ ఆధార ఉత్పత్తి ఉంది. అదే ప్రజా పితృస్వామ్యం ఉపాధి, రాజ్యం వంటి బహిరంగ రంగాలలో ద్యోతకమవుతుంది. ఈ కొత్త రూపంలో కుటుంబం తన పితృస్వామ్య స్వభావాన్ని కోల్పోదు కానీ అది ప్రధాన రంగంగా మాత్రం ఉండదు. వ్యక్తిగత పితృస్వామ్యంలో స్త్రీ శ్రమను కుటుంబ పెద్ద దోచుకుంటే ప్రజా పితృస్వామ్యంలో దానిని సమూహం దోచుకుంటుంది” అని ఆమె అన్నారు.

(ఇంకా ఉంది)

Share
This entry was posted in సమాచారం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.