అంతా బాగానే ఉంటుంది
అప్పటి వరకు
కామంతో నైతేనేమి
మోహంతో నైతేనేమి
ఇరువురి తనువులొకటైనాక
అద్వైత సిద్ధి పొందినాక
ఈ లోకాన్నే మరచిపోయిన
అమృత ఘడియలలో
అక్షర తూణీరం నుంచి
ఒక ప్రశ్నల బాణం సంధిస్తావు
”జీతమెప్పుడిస్తారు?”
వేశ్య కూడా ఆ సమయంలో
ఆ ప్రసక్తి తేదు
పశువైనా ప్రవర్తించదు
మరో విధంగా
ఒక్కసారిగా
వేయి రాక్షస బల్లులు
మీద పాకినట్లు
మనస్సు ఝడుసుకొన్న ఆ క్షణంలో
నా జీవితం నుంచి
దూరంగా సుదూరంగా
విదిలించి వేయాలనుకుంటాను నిన్ను
కానీ భారత స్త్రీ నైనందుకు
సంప్రదాయాల సజీవ సమాధిలో
ఊపిరాడక గిల గిల కొట్టుకుంటూ
వివాహం ఊబిలో
కూరుకుపోతున్నప్పుడు
జీవితం నుంచి కాదుకదా
శరీరం నుంచైనా కించిత్తు కూడా
దూరమవడం నాచేతుల్లో లేనిపని
క్షణక్షణం ఇలా
రాజీపడుతూనే
మృత్యుపర్యంతం
బ్రతికేస్తూ ఉంటాను
నీ సర్ప పరిష్వంగంలో.