ఆమె జవాబు -తోట రాంబాబు

 

”జీరో డిగ్రీలకు చేరుకున్న విశాఖ ఏజెన్సీ ప్రాంతం లంబసింగి” అనే వార్తను విన్నప్పుడు తప్పకుండా ఆ ప్లేస్‌కి వెళ్ళాలనుకున్నాను. నేనూ, ఇద్దరు మిత్రులూ కలిసి ఉదయాన్నే కాకినాడ నుండి బయలుదేరి లంబసింగి జంక్షన్‌ చేరేసరికి పది అయిపోయింది. ఇక్కడితో పోలిస్తే చల్లగానే ఉంది గానీ, పొగమంచు లాంటిదేమీ లేదు. టీ హోటల్‌ అతన్ని అడిగితే, ”రాత్రంతా మంచు పడుతూనే ఉంది. ఆకులమీద మిగిలిపోయిన మంచు, అరగంట క్రితం వరకూ చెట్ల మీదనుండి వర్షంలా పడింది. ఇప్పుడిప్పుడే తగ్గింది” అని చెప్పాడు. అక్కడున్న పెద్ద చెట్టు కింద చూస్తే, ఎవరో నీళ్ళు చల్లినట్లు మొత్తం తడిగా ఉంది. ఇక పొగమంచు చూసే ప్రోగ్రామ్‌ రేపు ఉదయమే. ఇప్పుడు ఏం చేయాలి? అని మాలో మేం ఆలోచించుకుంటూ ఉంటే, దగ్గర్లో ఉన్న తాజంగి రిజర్వాయర్‌ చూడడానికి వెళ్ళమని టీ కొట్టు అతను సలహా ఇచ్చాడు. ఆటో మాట్లాడుకుని వెళ్తే, ఎందుకు వచ్చామా అనిపించింది. అడవీ ప్రాంతంలో ఉండేవారికి అడవి కంటే, ఇటువంటి ఎaఅ-ఎaసవ విషయాలే గొప్పగా అనిపిస్తాయేమో. ”ఏం చూడాలి?” అన్న ప్రశ్న ఇంకెవర్నీ అడగకూడదని అర్ధమయింది.

మధ్యాహ్నం భోజనం చేసి, ఏ ప్లాన్‌లూ లేకుండా, ఏ గమ్యమూ లేకుండా తిరగడానికి బయలుదేరాం. లంబసింగి నుండి చింతపల్లి వెళ్ళే ఘాట్‌ రోడ్డులో నడుచుకుంటూ, కాఫీ తోటలు, అక్కడున్న చెట్లపైకి పాకిన మిరియాల తీగలను చూసుకుంటూ, మూడో, నాలుగో కిలోమీటర్లు నడిచిన తర్వాత, ఘాట్‌ రోడ్డు కుడివైపునున్న చిన్న లోయలోకి ఒక కాలిబాట కనిపించింది. ఆ కాలిబాట ఎక్కడికి వెళుతుందా అని చూస్తే, కింద ఉన్న చిన్న సెలయేరును దాటడానికి వేసిన దుంగ వరకూ ఉంది. దుంగ లేకపోయినా దాటడం కష్టం ఏమీ కాదు. లోతు రెండు అడుగులు దాటి ఉండదు. దుంగ అవతలవైపు ఆ కాలిబాట, చిన్న కొండపైకి పోయింది. ఆ బాట చివర్లో నాలుగు గుడిసెలు కనిపించాయి. ఆ బుల్లి కొండ, దానిపై ఉన్న ఆ ఇళ్ళు చూడడానికి చాలా బాగున్నాయి. అక్కడ ఉండే అదృష్టవంతులతో మాట్లాడితే ఇంకా బాగుంటుందని, ముగ్గురమూ కిందకి దిగి, సెలయేరు దాటుకుని గుడిసెలవైపు నడిచాం. దారికి అటూ ఇటూ ఉన్న మొక్కలకు చిక్కుడు కాయల వంటివి ఉన్నాయి. సాధారణ చిక్కుడు ముదురు ఆకుపచ్చగా ఉంటే, ఇవి బాగా లేత ఆకుపచ్చ రంగులో ఉన్నాయి. ఒక కాయ కోసి, ఒలిచి చూస్తే, అవి మార్కెట్లో దొరికే తెల్ల చిక్కుడు గింజలు (white kidney beans). గింజలు కొని తెచ్చుకుని వండుకొని తినడమే తప్ప, కాయల రూపంలో చూడడం అదే మొదటిసారి. కాలిబాటకు అటూ, ఇటూ మొత్తం అవే మొక్కలు. మొక్కల చుట్టూ కాపలా కోసం కంచె గానీ, బోర్డర్‌ కానీ ఏమీ లేవు. అలా నడుచుకుంటూ గుడిసె దగ్గరికి వెళ్ళేసరికి నలుగురు పిల్లలు కనిపించారు. ”హాయ్‌” చెప్పి చెయ్యి ఊపితే, మెల్లిగా హాయ్‌ అన్నారు, కాస్త సిగ్గుపడుతూ. పిల్లలతో కాసేపు మాట్లాడి, గుడిసెల మధ్యలోకి వెళ్ళాము. పిల్లలు కూడా మమ్మల్ని ఫాలో అయ్యారు. నాలుగు గుడిసెలు నాలుగువైపులా కట్టుకొని, ఒక గుడిసె పట్టే ఖాళీ స్థలాన్ని ఉమ్మడి జాగాగా ఉంచుకున్నారు.

మధ్యలో ఉన్న ఆ ఖాళీ స్థలంలో బీన్స్‌ కాయలు కుప్పగా పోసి, ఆడవాళ్ళూ, మగవాళ్ళూ కూర్చొని ఒలుస్తూ ఉన్నారు. ”ఇన్ని కాయలు ఒకేసారి ఒలుస్తున్నారు. ఎక్కడ అమ్ముతారు?” అని అడిగితే ”లంబసింగి సంతలో” అన్నారు. ”మేమూ అక్కడినుండే వచ్చాము. లంబసింగిలో ఎక్కడ?” అని అడిగితే, ”లంబసింగి జంక్షన్‌ నుండి లోపలికి వెళ్తే లంబసింగి ఊరు. అక్కడ వారానికి ఒకరోజు సంత జరుగుతుంది. అంటే, రేపు ఉదయం. ఇక్కడ గూడేల్లో ఉండే మేమంతా పండించినవి అక్కడే అమ్ముతాము. మాకు కావల్సిన సామాన్లు అక్కడ కొనుక్కొని తెచ్చుకుంటాం. రేపు అక్కడికి వస్తే, అందరినీ చూడొచ్చు. సంత చాలా బాగుంటుంది” అని సమాధానమిచ్చారు.

అనుకోకుండా ఇక్కడికి రావడంవల్ల మంచి ఇన్ఫర్మేషన్‌ దొరికిందని హ్యాపీగా ఫీలయ్యాం. గుడిసెల అవతల వైపునకు పోతే, కూరగాయల మొక్కలతో చిన్న పెరడు ఉంది. ఆ పెరట్లో ఎర్రగా, లావుగా, పొడుగ్గా పెరిగిన చెరుకు గడలు కనిపించాయి. చెరుకు గడ అమ్ముతారా? అని అడిగాం. కూర్చున్న నలుగురిలో ఒకతను లేచి చెరుకు గడ నరికి, మూడు ముక్కలు చేసి ముగ్గురికీ ఇచ్చాడు. ”ఎంత ఇమ్మంటారు?” అని అడిగితే ”ఎంతో కొంత ఇవ్వండి” అన్నాడు. తిరునాళ్ళలో చెరుకు ముక్కలు కొన్న అనుభవంతో ముప్ఫై రూపాయలు ఇచ్చి, విలువైన సమాచారం చెప్పినందుకు థాంక్స్‌ చెప్పి వచ్చేశాము.

కొండ దిగి, సెలయేరు దాటి మళ్ళీ పైకెక్కి ఘాట్‌ రోడ్డులో నడుస్తూ, చెరుకు ముక్కపై తొక్కను పళ్ళతో పీకి, ఒక ముక్క కొరికి నమిలితే, నాలుకకు తాకిన ఆ జ్యూస్‌ నా కళ్ళు మూతలు పడేలా చేసింది. ఆ చెరుకు రుచి ఎంత బాగుందంటే, తినిపిస్తే తప్ప ఆ రుచిని మాటల్లో చెప్పలేను. అప్పుడు అర్థమయింది. అది మామూలుగా తిరునాళ్ళలో అమ్మే బంగారు తీగ రకం కాదని. ఎర్రగానే ఉన్నా, ఈ చెరుకు చాలా లావుగా ఉంది. కణుపుకూ, కణుపుకూ మధ్య చాలా దూరం ఉంది. ముగ్గురం ”ఎంత బాగుందో ఎంత బాగుందో” అనుకుంటూ తిన్నాం. చెరుకు మొత్తం అయిపోయాక, ముప్ఫై రూపాయలే ఇచ్చినందుకు చాలా ఫీలయ్యాం. అది మామూలు చెరుకు కాదు, నూటికి నూరు శాతం పూర్తి ఆర్గానిక్‌. వంద రూపాయలు ఇచ్చినా తక్కువే. నోబెల్‌ బహుమతికి అర్హత ఉన్న పుస్తకం రాసిన రైటర్‌కి సన్మానం పేరుతో శాలువా కప్పి అవమానించినట్లు ఫీలయ్యాను. ఇప్పటికీ వారికి నేను డబ్బులు బాకీ ఉన్నాననే నా ఫీలింగ్‌.

మర్నాడు ఉదయం మంచులో తడిసిన, చెట్ల అందాలను ఆస్వాదించాక, తొమ్మిది గంటల సమయంలో లంబసింగి సంతకు వెళ్ళాం. అక్కడ పెద్ద పెద్ద సంచుల్లో పోసిన క్యారెట్లు, కర్రపెండలం దుంపలు, తాటి బెల్లము, చిక్కుడు గింజలూ మొదలైన వ్యవసాయ ఉత్పత్తులను గిరిజనులు అమ్ముతుంటే, నర్సీపట్నం నుంచి వచ్చిన వ్యాపారులు వంట సామాన్లు, కాస్మొటిక్‌ సామాన్లు, బూరలు, బుడగలు అమ్ముతున్నారు.

సంచుల్లో ఉన్న చిక్కుడు గింజలను చూసి, నిన్న చెరుకుగడ ఇచ్చిన ఫ్యామిలీ కోసం వెతికాను, ఎవరూ కనిపించలేదు. వేరే ఎవరికైనా ఇచ్చి పంపించారేమో అనుకున్నాం. ఒకచోట యాభై ఏళ్ళ వయసున్న గిరిజన మహిళ చిక్కుడు గింజలు అమ్మడానికి కూర్చుంది. ఆ గింజలు చాలా ఫ్రెష్‌గా, మంచి రంగులో ఉన్నాయి. అక్కడ దొరికే ఉత్పత్తులన్నీ పూర్తి ఆర్గానిక్‌ కాబట్టి, ఒక కేజీ చిక్కుడు గింజలు ఇవ్వమని అడిగాను. ”ఏమీ అనుకోకు బాబూ! విడిగా కొన్ని గింజలు అమ్మేస్తే, షావుకార్లు మిగిలినవి కొనరు. కావాలంటే మొత్తం తీసుకో” అంది. నలభై రూపాయలు పెట్టి ఒక కేజీ కొనడం ఓకే గానీ, ఇరవై కేజీలు మొత్తం కొనాలంటే ఆ సంచిని ఇంటివరకూ మోయాలి. అమ్మో అనుకున్నాను. ”కేజీ చాలండీ. కావాలంటే డబ్బులు ఎక్కువ తీసుకోండి” అన్నాను. ”త్వరగా అమ్మేసి ఇంటికి వెళ్ళిపోవాలి బాబూ. కొద్దికొద్దిగా అమ్ముకుంటే, ఎప్పటికీ వెళ్ళలేను” అని చెప్పింది. చేసేదేమీ లేక, సంతలో మిగిలిన విశేషాలు చూడడానికి వెళ్ళిపోయాము.

ఒకచోట జీలుగ కల్లు అమ్ముతున్నారు. పది రూపాయలు తీసుకుని సొరకాయ ముంతతో ఇస్తున్నారు. దానిలో 200 ఎంఎల్‌ వరకూ కల్లు ఉంటుంది. పదిచ్చి, నేను కూడా ఒక ముంత తీసుకున్నాను. టేస్ట్‌ చూశాం కానీ, తాగలేకపోయాం. కాస్త ముందుకు వెళ్తే, కర్టెన్స్‌తో కట్టిన రెండు స్టాల్స్‌ ఉన్నాయి. ఒక దానిలో ఫోటోలు తీస్తున్నారు. రెండవ స్టాల్‌ లోపల ఒక వ్యక్తి కుట్టు మిషను పెట్టుకుని, అక్కడే కొలతలు తీసుకుని, జాకెట్లు కుట్టేస్తున్నాడు. పుల్ల ఐసు తింటూ, జాకెట్‌ బాగా కుట్టమని చెబుతోంది ఒక గిరిజన మహిళ.

సంతలో వాతావరణం చూశాక, ఒక విషయం అర్థమయింది. హిస్టరీని పుస్తకాల్లోనే చదువుకోనవసరం లేదని, ట్రావెల్‌ చేస్తే మన గత చరిత్రను వర్తమానంగా కలిగిన మనుషులు ఉంటారనీ, గతంలో మనం ఎంత అమాయకత్వంతో ఉండేవారిమో ఇప్పుడు కూడా అటువంటి వ్యక్తులను కలుసుకోవచ్చనీ తెలుసుకున్నాను. అందుకే ఈ సంత బాగా నచ్చింది. అలా పదకొండు వరకూ తిరిగి మళ్ళీ వెనక్కి వస్తే ఆ పెద్దామె అప్పటికీ, చిక్కుడు గింజలు అమ్మడానికి ఎదురుచూస్తూనే కనిపించింది. ఎవరో వ్యాపారి మాట్లాడి వెళ్ళిపోయాడు. బేరం తెగలేదనుకుంటాను. ఆమె దగ్గరికి వెళ్ళి, ఈ సంచి మొత్తం ఎంతకు ఇస్తారు అని అడిగాను. ఇరవైకేజీలు బాబు, నాలుగు వందలు అని చెప్పింది. కేజీ 40 రూపాయల లెక్కన, మొత్తం 800 అవుతాయి. ఈమె చెప్పిన రేటు, అందులో సగం. దానికి కూడా వ్యాపారస్తుడు ఒప్పుకోలేదా? అంతకంటే తక్కువ వస్తే, ఆమెకు ఏం సరిపోతుంది. అది ఆమె వారం రోజుల సంపాదన కదా? అనుకున్నాను. కానీ, చేసేదేమీ లేక మళ్ళీ సంతలో తిరగడం మొదలుపెట్టాం.

పన్నెండు దాటాక, అక్కడే ఒక పూరి గుడిసెలాంటి హోటల్లో భోజనం చేశాం. అప్పటికప్పుడు వేడివేడిగా వండిన పదార్ధాలు వడ్డించడం వల్లనేమో ఫుడ్‌ చాలా టేస్టీగా అనిపించింది. ముగ్గురమూ బయటకు వస్తుంటే, ఇంతకు ముందు కనిపించిన వ్యాపారస్తుడే, ఆమెకు డబ్బులు ఇస్తూ కనిపించాడు. బాగా లేట్‌ అయిపోతుందిగా. చేసేదేమీ లేక ఏ యాభయ్యో, వందో తగ్గించి అమ్మేసి ఉంటుందనుకున్నాం. ఆమె వెళ్ళిపోయింది. కొనుక్కున్న అతను ఆ సంచిని కాస్త పక్కకు పట్టుకెళ్ళి, మిగిలిన కూరగాయలతో కలిపి అమ్ముతున్నాడు. అతని దగ్గరకు వెళ్ళి ”ఎంతకు కొన్నారు?” అని అడిగాను. ”అలా చెప్పకూడదు” అన్నాడు. ”నాకు కిలో కావాలి ఎంత?” అని అడిగాను. ”నలభై” అన్నాడు. డబ్బులిచ్చి కిలో తీసుకున్నాం.

అరగంట సంతలో తిరిగి, జీలుగ కల్లు తాగి గట్టిగట్టిగా మాట్లాడుతున్న ఇద్దరి మాటలు విని నవ్వుకొని వెళ్ళిపోవడానికి రెడీ అయ్యాము. అప్పుడు మళ్ళీ కనిపించిందా పెద్దామె. వేగంగా నడుచుకుంటూ ఆమె దగ్గరకు వెళ్ళి, ”చిక్కుడు గింజల సంచి ఎంతకు కొన్నాడతను?” అని అడిగాను. ”నూట యాభై రూపాయలు” చెప్పిందామె. ఆ మాట వినగానే, గొంతు లోపల కండరాలు నొక్కుకుపోతున్న ఫీలింగ్‌. ”వెళ్తాను బాబు” అని, ఆమె నడిచి వెళ్ళిపోతున్న దృశ్యం మసకబారిపోతుంటే తెలిసింది, నా కళ్ళనుండి నీళ్ళు కారిపోతున్నాయని. ”అయ్యో! మనమైనా కొనేసి ఉంటే బాగుండేది” అన్నారు ప్రెండ్స్‌ ఇద్దరూ. నిజమే కదా! మేం కొని ఉంటే, ఆమెకు నాలుగు వందలు వచ్చి ఉండేవి. ఎలాగోలా మోసుకుపోయి ఊళ్ళో అమ్మేస్తే అయిపోయేవి అనిపించింది.

చిక్కుడు గింజలు కొనాలనుకున్నాను కాబట్టి, నాకు ఇదంతా తెలిసింది. లేకపోతే, నేను కూడా ఫోటోలు తీసుకుని వెళ్ళిపోయేవాడిని. ఈమె కథ నాకు ఎప్పటికీ తెలిసి ఉండేది కాదు. ఇప్పుడు కూడా, ఈమె గురించి మాత్రమే తెలిసింది. ఇదే సంతలో వందలమంది గిరిజనులు, తమ పంటను అమ్ముకుంటూ ఉన్నారు. ఒక్కొక్కరినీ కదిపితే, ఇంకెన్ని కథలు తెలుస్తాయో.

అతి తక్కువ వనరులతో బతుకు సాగించే జీవన విధానం వల్ల, గిరిజనులు ఎక్కువ ఆశించకపోవచ్చు. ఆశించొచ్చు అన్న విషయం కూడా వారికి తెలియకపోవచ్చు. అందుకే, తక్కువ రేటుకు వారి శ్రమఫలాలను అమ్మేసుకునే అమాయకత్వం వారిలో ఉండొచ్చు. అలాగని వారి అమాయకత్వాన్ని exploit చేయడం న్యాయమా? బయటి ప్రపంచం భౌతిక కాలుష్యంతోను, సాంస్కృతిక కాలుష్యంతోను వారిపై దాడి చేయడం వల్ల, ఆదివాసీలకు కూడా అవసరాలు పెరుగుతున్నాయి కదా… మెడికల్‌ నీడ్స్‌ పెరుగుతున్నాయి కదా… ఆ అవసరాలను చేరుకోవడానికి మనలాగా వారు తరతరాలకు సరిపడా ఆస్తులు పోగేయరు. పోనీ ఇరుగు పొరుగు వారి నుండి సహాయం పొందడానికి కుదురుతుందా అంటే, అందరి పరిస్థితీ అదే. ఇదంతా గ్రహించలేని వారి అమాయకత్వాన్ని అలుసుగా చేసుకొని దోచుకోవడం దారుణం. ఇలాంటివి చూసినప్పుడే మేథస్సు, నాగరికతలో కూడా విలనిజం ఉందనిపించింది.

పట్టణ ప్రాంతాల్లో ఉండే చదువుకున్న వినియోగదారుల (ఓటర్ల)ను వ్యాపారుల అత్యాశ నుండి కాపాడడానికి రైతు బజార్లు పెట్టి, కూరగాయల ధరలను ప్రభుత్వమే నిర్ణయించి, ధరల పట్టికను ఏర్పాటు చేసినట్లు, గిరిజన ప్రాంతాల్లో కనీస ధరకంటే తక్కువ రేటుకి ఏ దళారీ కొనే వీలు లేకుండా, కనీస ధర పట్టికను ఏర్పాటు చేయాలి కదా! పట్టిక చదవలేని ఆదివాసీల కోసం, ఆడియో అనౌన్స్‌మెంట్‌ లాంటివి ఏర్పాటు చేయాలి కదా! అవేమీ చేయకపోతే, ఇంకెందుకు ఈ ప్రభుత్వాలు?

అదివాసీలు అమాయకులు కావొచ్చు. కానీ, మన భూ వాతావరణాన్నీ, పర్యావరణ సమతుల్యాన్నీ కాపాడే అడవులకు రక్షకులు వారే. అక్కడ ఆదివాసీలు కాకుండా ఇంకెవరున్నా, ఎక్కువ వనరులను వాడి వనాలను నాశనం చేస్తారు. అందుకే వారక్కడే ఉండాలి. అక్కడ ఉన్న వారి హక్కులను కాపాడటం, వారిని కాపాడుకోవడం ప్రభుత్వం యొక్క బాధ్యత. అలాగే మనందరి ఉమ్మడి బాధ్యత కూడా.

(రస్తా వెబ్‌ మ్యాగజైన్‌ నుంచి)

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.