భారతదేశం పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చే అంశం కుటుంబ వ్యవస్థ. కుటుంబం అంటే తల్లి, తండ్రి, పిల్లలు అని మాత్రమే అనుకుంటారు. కానీ వారి మధ్య ప్రేమ కూడా ఉండాలి. ప్రేమతో కూడిన బంధాలే కుటుంబాలుగా నిలుస్తాయి అని ఎవరూ తర్కించరు. నేను, నా భర్త, నా పిల్లలు అని వారికి కావలసినవన్నీ బాధ్యతగా అమరుస్తూ ఏ లోటూ లేకుండా చూసుకుంటూ వారే తన జీవిత పరమావధిగా బ్రతికిన ‘మానవి’ నవలలోని వసంత తన మీద ఏ మాత్రం ప్రేమలేదని తెలిసినా భర్త కోసం, కుటుంబం కోసం ఎంతగా తపించిందో, ఆ తపన వల్ల తాను ఎంతగా కృంగిపోయిందో, చివరకు ఆత్మహత్యకు సిద్ధపడిన ఆమె స్వతంత్ర భావాలు కలిగిన తన చిన్నకూతురైన నవత వల్ల స్ఫూర్తి పొంది తాను ఎందుకు పుట్టిందో తన లక్ష్యాలు, తాను చేయవలసిన పనులు ఏమిటో తెలుసుకుని స్థిరమైన నిర్ణయాలు తీసుకునే శక్తివంతమైన మహిళగా ఎదిగిన తీరును ఎంతో చక్కగా వివరించారు ఓల్గా గారు.
నవలలోని పాత్రను గమనించినట్లయితే వసంత భర్త సురేష్ కుటుంబాన్ని ఎంత బాధ్యతగా నడిపించినా, కుటుంబం అంటే ఎంతో గౌరవం ఉన్నప్పటికీ పెళ్ళయినా, పిల్లలున్నా తన మనసును నియంత్రణలో ఉంచుకోలేని వ్యక్తిగా మనకు కనబడతాడు. తాను ప్రేమించిన మహిళకు దగ్గరై వసంతను ఎంతో క్షోభకు గురిచేసిన వ్యక్తిగా కనబడతాడు. కానీ తనకు భార్య అంటే గౌరవం, అభిమానం ఉన్నా తాను ఎంతో ప్రేమించిన నీలిమను దూరం చేసుకోలేక భార్య వసంతను ఎంతో బాధపెడుతున్నానని మధనపడుతూ తనకు నచ్చిన విధంగానే బ్రతుకుతాడు. సమాజం కోసం, కుటుంబం కోసం తన ఇష్టాలను మార్చుకోవాలని అనుకోడు. ఇలాంటి వ్యక్తులు మనకు సమాజంలో కోకొల్లలుగా తారసపడతారు. ఇలాంటి వారివల్ల కుటుంబం, కుటుంబంలోని వ్యక్తులు ఎంత బాధపడతారో తెలుస్తుంది. ప్రేమకు వయసు లేదు, నిజమే. ప్రేమ ఎప్పుడు, ఎక్కడ పుడుతుందో కూడా తెలియదు. కానీ పెళ్ళి బంధం ముడిపడిన తర్వాత మనసును కట్టడి చేసుకోకపోతే కుటుంబాలు నిలబడవు. కుటుంబం నిలబడకపోతే ‘భారతదేశం కుటుంబ వ్యవస్థమీద ఆధారపడుతుంది’ అనే వాక్యానికి అర్థమే ఉండదు.
వసంత పెద్దకూతురు లావణ్య పెళ్ళయిన తర్వాత తన అత్తగారింట్లో తన స్థానం గురించే ఎప్పుడూ పాకులాడుతూ కనబడే ఒక సామాన్య గృహిణిలా కనిపిస్తుంది. ఎంతసేపూ అత్తగారు, భర్త ఏమనుకుంటారో అని ఆలోచిస్తుంది తప్ప అమ్మ బాధను ఏ మాత్రం అర్ధం చేసుకోదు. పైగా అమ్మ నాన్నల మధ్య ఉన్న సమస్యల వల్ల తనకు భర్త, అత్తల దగ్గర పరువు పోతోందని ఆలోచిస్తుంది. పుట్టింటి నుంచి వచ్చే పెట్టుబోతలను, చీరలను, సారెలను ఏమీ తక్కువ కాకుండా పొందాలనుకునే మహిళ. ఎందుకంటే వీటిలో ఏ లోటు కనిపించినా తన అత్త దగ్గర చులకనైపోతాననే ఆలోచిస్తుంది. అమ్మతో తనకు జరిగినన్ని రోజులు పనులు చేయించుకోవాలని చూస్తుంది. అమ్మ అంటే గౌరవం ఉన్నా అమ్మకు వచ్చిన సమస్యను తీర్చడానికి ప్రయత్నించదు. నాన్న సురేష్ చేసిన పనికి తిట్టుకుని ఈ విషయం తన అత్తగారింట్లో తెలిస్తే పరువు పోతుందని ఆలోచించి వాళ్ళ అమ్మను ఇంట్లో ఉంచుకోవడానికి ఇష్టపడదు. తన సమస్యను తీర్చి భర్తకు బుద్ధి చెబుతుందనుకున్న వసంత నమ్మకాన్ని లావణ్య నిలబెట్టుకోకపోగా తన భర్తతో చెప్పి వాళ్ళ నాన్న దగ్గర్నుంచి రావలసిన ఆస్థిని రాయించుకునే సగటు కూతురిలాగా వ్యవహరిస్తుంది. మనకు లావణ్య నవలలో ఎలా కనిపిస్తుందంటే ఎవరెలా పోతే నాకేంటి? నేను, నా భర్త, నా అత్త మామలు, నా కుటుంబం అనే స్వార్థం కలిగిన స్త్రీలాగా మనకు కనిపిస్తుంది. ఇలాంటి కూతుళ్ళు సమాజంలో ఉన్నారు. కనీసం తల్లి సమస్యను అర్ధం చేసుకుని సాటి మహిళగా ధైర్యం చెప్పి ఓదార్చే గుణం లావణ్యలో కనిపించదు. కానీ భర్తతో చెప్పి పుట్టింటి ఆస్థిని రాబట్టుకుంటుంది. నిజంగా లావణ్యపైన నమ్మకం పెట్టుకున్న తల్లి వసంత ఎంతో బాధపడుతుంది. తన భర్త తనకు చేసిన అన్యాయంకన్నా లావణ్య పెట్టిన బాధ ఎక్కువ అనిపిస్తుంది. ఈ పరిస్థితులే వసంత ఆత్మహత్య చేసుకోవడానికి పురిగొల్పుతాయి.
ఇక రోహిణి, శాంత వసంత స్నేహితురాళ్ళు. రోహిణి బాగా చదువుకుని డాక్టరై స్థిరపడుతుంది. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు. వసంత కాస్త తీరిక చేసుకుని తన స్నేహితుల ఇళ్ళకు వెళ్తుంది. కుటుంబమే లోకంగా బ్రతికిన వసంత తన పెళ్ళయ్యాక మొదటిసారి ఒక వారం రోజులు రోహిణితో గడుపుదామని గుంటూరు వెళ్తుంది. రోహిణి సమాజం పట్ల మంచి అవగాహన కలిగిన మహిళ. అదే ఊళ్ళోని శాంతని కూడా వసంత కలిసి శాంత పెళ్ళి చేసుకోలేదని, డిగ్రీ కాలేజిలో ప్రిన్సిపాల్‌గా పని చేస్తోందని, వేరొకరితో సహజీవనం చేస్తోందని తెలుసుకుని ఆమెను తప్పుగా అర్ధం చేసుకుంటుంది. కానీ రోహిణి శాంతను సమర్ధిస్తుంది. పరిస్థితులను అర్థం చేసుకోవాలని, ఒకరి మనస్సు బాధపెట్టకూడదని వసంతకు ఎంతో చక్కగా వివరిస్తుంది. శాంత కూడా సమాజం గురించి అనవసరమని, సంతోషంగా
ఉన్నానా లేదా అనేదే తనకు ముఖ్యమని, తనవల్ల ఇతరులకు సమస్యలు రాకూడదని పరిణతితో వివరిస్తుంది. ఇవన్నీ వసంతకు అంతగా రుచించవు. ఎందుకంటే ఆ సమయంలో ఆమె సమాజం కోసం ఒక కుటుంబంలా బ్రతికే సామాన్య గృహిణి. రోహిణి, శాంత ఇద్దరూ చదువుకుని తమకు నచ్చిన విధంగా తమ జీవితాన్ని మలచుకున్న మహిళలుగా మనకు కనిపిస్తారు.
వసంత భర్త విషయం తెలిసిన తర్వాత రోహిణి ఆమెకు సమాజం గురించి, మనుషుల గురించి చక్కగా వివరించి ధైర్యంగా
ఉండాలని, ఏదో ఒక ఉద్యోగం చేయమని మంచి సలహాలు ఇచ్చి మార్చే ప్రయత్నం చేస్తుంది. అంతేకాక వసంత భర్త సురేష్, అతను ప్రేమించిన నీలిమను కలిసి వారి వల్ల వసంత ఎంత బాధపడుతోందో చెప్పి బాధ్యతగా వ్యవహరిస్తుంది. ఇలాంటి మిత్రులు ఉంటే సమస్యలను ఎదుర్కోవడానికి సమాజంలో ఎన్నో దారులు కనిపిస్తాయి.
నవలలోని ప్రధాన పాత్రలు వసంత మరియు నవత. వసంత సామాన్య గృహిణి. తన కుటుంబమే తన ప్రపంచం అన్నట్లుగా బ్రతికింది. తన ఇంట్లో వాళ్ళందరూ తాను లేకుండా ఉండలేరు అనే విధంగా చూసుకోవాలన్న తాపత్రయం. ఇంట్లో అన్ని పనులూ తనే చేసేది. ఎవరినీ ఏ పనీ చేయనిచ్చేది కాదు. తన పెద్దకూతురు లావణ్యను అచ్చు తనలాగే తీర్చిదిద్దింది. కానీ చిన్నకూతురు నవత మాత్రం లావణ్యకు పూర్తిగా వ్యతిరేకం. స్వతంత్ర భావాలు కలిగిన వ్యక్తి. ఎవరి పనులు వారే చేసుకోవాలని, చేసుకోనివ్వాలని అమ్మతో ఎప్పుడూ గొడవపడేది. ”నాన్నను చిన్న చిన్న పనులు కూడా చేసుకోనివ్వవు. మమ్మల్ని కూడా అంతే. అన్నీ నువ్వే చేయాలని చూస్తావు. నీది చాలా స్వార్థబుద్ధి అమ్మా!” అని ఎప్పుడూ గొడవపడేది. తన పనులు మాత్రం తానే చేసుకునేది. ఇంట్లో అందరూ సోమరులు కావడానికి అమ్మే కారణమని, ఎవరి పనులు వారికి చెప్పి అమ్మను చదువుకోమనేది లేదా ఉద్యోగం చేయమనేది. తనకంటూ సమయం కేటాయించుకోమని చెప్పేది. చివరికి అమ్మకు కష్టం ఎదురైనప్పుడు కూడా అమ్మకే అమ్మ అయి కష్టాలను దూరం చేయడమే కాక అమ్మని ఎందరికో ఆదర్శప్రాయురాలిగా తీర్చిదిద్దిన యువతి.
వసంత తన సమస్యను తన పెద్దకూతురు తీరుస్తుందని నమ్ముతుంది. తన జీవితం మొత్తం భర్తకు తోడు నీడగా
ఉంది. కానీ వాళ్ళిద్దరూ వసంతను వంచిస్తారు. ఇంట్లో వాళ్ళందరికీ ఏం కావాలో తనకు తెలుసనుకుంటుంది వసంత. కానీ ఎవరికి ఏం కావాలో అస్సలు తెలియదని సురేష్‌తో కథలో చెప్పిస్తారు ఓల్గా. ఇంకా తన అన్న, వదినలు కూడా ”ఆస్థులన్నీ
నీకు, నీ పిల్లలకే ఇచ్చారు కదా అంతలా బాధపడతావు ఎందుకు’ అంటారు. అప్పుడు వసంత బాధ మరీ ఎక్కువవుతుంది. ఈ సమస్యను ఎలా తీర్చుకోవాలో తెలియక చనిపోవడానికి నిర్ణయించుకుంటుంది. కానీ సురేష్, వసంతని కాపాడి పెద్ద కూతురు రోహిణి, చిన్న కూతురు నవతని పిలిపించి అప్పగిస్తాడు. వసంత తన భర్త తనతోనే ఉండాలని, సమాజంలో భర్త వదిలేసిన మహిళగా తాను బ్రతకలేనని ఎంతగానో బాధపడుతుంది. ఎలా బతకాలో కూడా తన జీవితాన్ని ఊహించుకోలేకపోతుంది. రోహిణి ఆమెకు ఎంతో ధైర్యం చెప్తుంది. కానీ వసంతలో ఏ మార్పూ కనబడదు. అప్పుడు ఆమె చిన్న కూతురు నవత తన కాలేజీకి దగ్గర్లో ఇల్లు తీసుకుని అమ్మను తీసుకువెళ్ళి ఆమెకు ఒక కొత్త జీవితాన్ని పరిచయం చేస్తుంది. నవత తన కాలేజీలో స్టూడెంట్ లీడర్‌గా ఉంటూ తాను చేసే అన్ని పనులలో వసంత సహాయం తీసుకుంటూ ఉంటుంది. దీంతో వసంత కాలంతో పాటు తన సమస్యను మర్చిపోయి సమాజానికి సేవలందిస్తూ చైతన్యమూర్తిలా ముందుకు సాగుతుంది.
వసంతలో మార్పు తీసుకురావడానికి నవత చేసే ప్రతి పనీ ఆమెకు ఎంతో సహకరిస్తుంది. అటు తండ్రిని, ఇటు తల్లిని ఎవరినీ బాధపెట్టకుండా నవత తన తల్లిని మార్చుకుంటుంది. నవత రాజకీయాలలో మగవాళ్ళతో కలిసి తిరిగి ఏమైపోతుందో అని వసంత మొదట్లో భయపడినా తన కూతురు చేసే ప్రతి పనిలో సహకారమందిస్తూ తన ఆలోచనలలో, పనులలో పరిణతి చెంది సమాజాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు సాగుతుంది. తనకు కేవలం తన కుటుంబం మాత్రమే ముఖ్యం కాదని, సమాజమే కుటుంబమనే ఆలోచనతో, తాను ఇంకా సమాజానికి ఏం చేయాలా అనే ఆలోచనలతో గడిపి వాటిని ఆచరించే మహిళగా వసంత తీర్చిదిద్దబడుతుంది. ఒక సామాన్య గృహిణి మానవిగా మారిన విధానం ఈ నవలలో కనిపిస్తుంది. ఎందరో మహిళలు కూతుళ్ళలాగా, భార్యల్లాగా, తల్లుల్లాగా సేవలందించడమే కాదు మనుషుల్లాగా కూడా బతకాలని రచయిత్రి వివరించారు. ఆడపిల్లలు సోదరులు, తండ్రులు, భర్తల పరువు కాపాడే వాళ్ళలానే కాక సమాజాన్ని చక్కదిద్దడానికి తమ వంతు సాయం చేయాలని వసంత, నవత, రోహిణి అనే పాత్రల ద్వారా మనకు ఎంతో చక్కగా తెలియపరచారు. మన పుట్టుక కేవలం కుటుంబం కోసమే అని భావించి, ఒకవేళ కుటుంబం విచ్ఛిన్నమైతే ఇంకో మార్గమే లేదన్నట్లు ఎందరో ఆత్మహత్యకు పాల్పడుతుంటారు. కానీ మన పుట్టుకకు ఒక కారణం ఉంటుందని, అది నెరవేరేవరకు మనం చావకూడదని, మనకు మనంగా చావడం పిరికితనమే అవుతుందనీ వివరించారు. ఏ సమస్యకూ చావు పరిష్కారం కాదు. ప్రతి సమస్యకూ పరిష్కారం
ఉంటుంది. దానికి కాలమే సమాధానం చెప్తుందని, అందుకు మన కృషి కూడా అవసరమని వివరించారు. ఇలాంటి చైతన్యపూరిత నవలలు వ్రాస్తూ ఎందరికో ప్రేరణ కలిగిస్తూ, జీవితాల పట్ల, చేసే పనుల పట్ల, ప్రవర్తనల పట్ల, సమాజం పట్ల అవగాహన కల్పిస్తూ బాధ్యతలను పెంచి మహిళలను ముందుకు నడిపిస్తున్న మానవి నవలను ఆవిష్కరించిన ఓల్గా గారికి నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ…