’69 తెలంగాణ నా దిక్సూచి: జీవన్‌ – కె. సజయ

 

గత సంచిక తరువాయి…)

‘ఏం పుస్తకం చదివినవురా’

అట్టడుగు సమూహాల నుంచి సాహిత్యం రావడం చాలా ముఖ్యమైన విషయంగా భావిస్తాను నేను.

”వరంగల్‌ ఆర్ట్స్‌ కాలేజీలో బి.ఎ. చేస్తున్నప్పుడు హరగోపాల్‌ మా కాలేజీలోనే లెక్చరర్‌గా ఉండేవారు. హీరోలా ఉండేవాడని అందరం అనుకునేవారం. ఆయన పాఠాలు బాగా చెప్పేవాడని అనేవాళ్ళు. నాది ఆయన సబ్జెక్టు కాకపోయినా గానీ అప్పుడప్పుడూ వెళ్ళి కూర్చుని వినేవాడిని. తర్వాత ఎం.ఏ ఇంగ్లీషు వరంగల్‌లోనే చేశాను. చాలామంది హైదరాబాద్‌ వెళ్ళేవారు యూనివర్శిటీ కోసం. అప్పటికి వరంగల్‌లో కాకతీయ యూనివర్శిటీ రాలేదు. పి.జి. కాలేజీ మాత్రమే ఉండేది. అక్కడే చదివాను. ’74లో పూర్తయింది.

మా బాపు ఐఏయస్‌ రాయాలని పట్టుబట్టడంతో ఒకసారి రాశాను గానీ, అంత శ్రద్ధ పెట్టలేదు. ఆ వైపుగా పోవాలనిపించలేదు. ఎంఏ అయిన వెంటనే 1974లోనే వరంగల్‌ సికెఎమ్‌ కాలేజీలో ఉద్యోగం వచ్చింది. ఎయిడెడ్‌ కాలేజి. ఎక్కువ రెడ్లే ఉండేవారు. ఆధిపత్య కులాలను దాటి బిసిలకు ఉద్యోగం రావటం కష్టమైన రోజులవి. ఇక్కడ రెడ్ల ఆధిపత్యం ఎక్కువ. ఊర్లలో ఉండే రెడ్లు సాధారణంగానే ఉండేవారు గానీ, వరంగల్‌ ప్రాంతంలో చాలా ఆధిపత్యంతో ఉండేవారు. కాలేజి ఎన్నికలు వస్తే జీపుల్లో వచ్చి ప్రచారం చేసేవాళ్ళు. అలానే తర్వాతి కాలంలో కాలేజిలో ఎబివిపి ఆధిపత్య రాజకీయాలకి వ్యతిరేకంగా చాలా నిలబడ్డాం.

ఉద్యోగం వచ్చిన తర్వాత స్వీట్స్‌ తీసుకుని కాళోజీ దగ్గరకు వెళ్ళాను. ఆయన ఒక్కటే అడిగారు, ”ట్యూషన్స్‌ చెప్తావా?” అని. లేదని చెప్పాను. అప్పుడు ఇంగ్లీషు టీచర్లకి చాలా డిమాండ్‌ ఉంది, గైడ్లు రాయటం, ట్యూషన్లు చెప్పటం అలాంటి వాటికి. ‘నీ ప్రతిభకి, నీ విజ్ఞానానికి ప్రభుత్వం జీతం ఇస్తోంది. అంతకు మించి నీ మేథోసంపత్తిని ఇంక దేనికీ అమ్ముకోకు’ అని కాళోజీ చెప్పారు. ఆ విషయం నా మనసులో బలంగా నాటుకుపోయింది. అప్పటినుంచి ఇప్పటివరకూ నేను ఆయన మాటలకు కట్టుబడి

ఉన్నాను. కాళోజి ద్వారానే నాకు లోహియా రచనలతోనూ, జయప్రకాష్‌ నారాయణ రచనలతోనూ పరిచయమయింది. వారి రచనలను చాలా విస్తృతంగా చదివాను. విలువలకు సంబంధించి కాళోజీ దగ్గర నేను చాలా నేర్చుకున్నాను.

ఆయన పుస్తకాలు విపరీతంగా చదివేవారు. కలిసినప్పుడల్లా ‘ఏం పుస్తకం చదివినవురా’ అని అడిగేవారు. చదవలేదంటే తిట్టేవారు. ఆయన భయంతో ఇంకా ఎక్కువగా కొత్త పుస్తకాలు చదవటం మొదలుపెట్టాను. ’75లో ఎమర్జెన్సీ వచ్చింది. అనేకమంది అరెస్టయ్యారు. ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ కాళోజి తెలంగాణ అంతా తిరిగారు. నేను కూడా ఆయనతో కలిసి చాలా చోట్లకు వెళ్ళాను. అదే సమయంలో రాజకీయ ఖైదీలు భూమయ్య, కిష్టాగౌడ్‌లను సికిందాబాద్‌లో ఉరితీశారు. ఎంతో భయానకమైన పరిస్థితి దేశమంతటా!

వరవరరావు కూడా అదే కాలేజిలో చేస్తూ ఉండేవారు. అంతకుముందు ఆయన్ని దూరం నుంచి చూడటమే కానీ నాకు ప్రత్యక్ష పరిచయం లేదు. మా వెనుక గల్లీలో ఉండేవారు. అయితే, నేను అక్కడ చేరే సమయానికి ఆయన మీసా కింద అనుకుంటా, అరెస్టయ్యి జైల్లో ఉండడంతో నేను ఆయనకి నేరుగా పరిచయం కాలేదు. ఆయన మూడో కూతురు బన్నీ పుట్టిన పదిరోజులకే ఆయన్ని అరెస్ట్‌ చేశారని అప్పుడు తెలిసింది. అందుకే పరిచయం లేకపోయినా గానీ వాళ్ళింటికి వెళ్ళి హేమక్కను పలుకరించి వచ్చాను. అది నా బాధ్యతగా అనిపించింది. ఆ తర్వాత కాలంలో దాదాపు నేను వాళ్ళింట్లో సభ్యుడిగా అయిపోయాను. అప్పటికి హక్కుల దృక్పథం లేదు కానీ, ప్రజాఉద్యమాలతో పనిచేయటం అవసరం అని భావించాను. ఎమర్జెన్సీ నిర్బంధం తర్వాత అది మరింత బలపడింది.

ఎమర్జెన్సీకి ముందే పౌరహక్కుల సంఘం ప్రారంభమయింది కానీ, అంత చురుగ్గా పనిచేయటంలేదు. ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో అన్ని విప్లవ పార్టీల ఆధ్వర్యంలో ఒక పెద్ద మీటింగ్‌ని నిర్వహించారు. అది జరిగిన కొద్దిరోజుల తర్వాత ఒక్క నాగిరెడ్డి గ్రూప్‌ యుసిసిఆర్‌ఐఎమ్మెల్‌ తప్ప ఇతర విప్లవ సంస్థల ఆధ్వర్యంలో పౌరహక్కుల సంఘం తిరిగి ప్రారంభమయింది. కన్వీనర్లుగా కాశీపతి, రంగనాథం, విఠల్‌ రావు ఉండేవారు. వరంగల్‌ నుంచి డా.రామనాథం, అట్లూరి రంగారావు, వరవరరావు, నరసింహయ్యలతో పాటు నన్ను కూడా ఏపిసిఎల్‌సి రాష్ట్ర కమిటీ మెంబరుగా అప్పుడు ఆహ్వానించారు. దాని తర్వాత రాజ్యహింసకు సంబంధించి అనేక సంఘటనలకు ఎపిసిఎల్‌సి సభ్యుడిగా నిజనిర్ధారణకు వెళ్ళేవాడిని.

1981లో బాలగోపాల్‌ హక్కుల ఉద్యమంలోకి వచ్చిన తర్వాత మా పని విధానంలో చాలా చెప్పుకోదగిన మార్పులు వచ్చాయి. ముఖ్యంగా నిజనిర్ధారణ చేసే విషయంలో విప్లవ సంస్థల ఆధ్వర్యంలో ఉన్న సంస్థ కాబట్టి ఆయా సంస్థలు ఉన్నచోట వాటి ప్రభావం

ఉండేది. అయితే, ఈ రాజకీయ ఒత్తిడికి కానీ, ప్రభావానికి కానీ లోను కాకుండా అక్కడ జరిగిన వాస్తవాన్ని వాస్తవంగా రికార్డు చేయడం మేము బాలగోపాల్‌ నుంచే నేర్చుకున్నాం. తను ’79లో ఆర్‌ఇసిలో మాథమెటిక్స్‌లో రిసెర్చ్‌ చేసేవాడు. మాకు వరంగల్‌లో ఒక ఫిల్మ్‌ సొసైటీ ఉండేది. హైదరాబాద్‌ ఫిల్మ్‌ క్లబ్‌ తర్వాత ఇదే తెలంగాణలో మొదటి ఫిల్మ్‌ సొసైటీ. దీన్ని కొంతమంది మిత్రులం కలిసి స్థాపించాం. నేను దానికి మొదటినుంచీ కార్యదర్శిగా ఉండేవాడిని. నిర్బంధం పెరిగిన తర్వాత వేరేవాళ్ళకు బాధ్యతలు అప్పగించటం జరిగింది. ప్రతివారం ప్రపంచ ప్రసిద్ధ సినిమాలు వేసేవాళ్ళం. చిత్రరీతి అనే పత్రికలో వాటి గురించి నేను రివ్యూలు కూడా రాసేవాడిని. మామూలుగా అయితే సభ్యులకు మాత్రమే అనుమతి ఉంటుంది. వేరేవాళ్ళు ఎవరన్నా రావాలనుకుంటే ఐదు రూపాయలు కట్టి రావొచ్చు.

ఆర్‌ఇసిలో ప్రొఫెసర్‌ పండిట్‌ అనే ఆయన మా ఫిల్మ్‌ క్లబ్‌ మెంబరు. ఆయన బాలగోపాల్‌కి పి.హెచ్‌.డి. గైడ్‌. ఒకసారి సత్యజిత్‌ రే సినిమాలు వేసినప్పుడు ‘మా స్టూడెంట్‌కి చాలా ఇంట్రెస్ట్‌ ఉంది, తీసుకురావచ్చా’ అని ఆయన అడిగాడు. అలా నాకు బాలగోపాల్‌తో మొదటి పరిచయం. ఆ తర్వాత కాలంలో తనకి కాకతీయ యూనివర్శిటీలోనే ఉద్యోగం వచ్చింది. అప్పుడు తను హక్కుల ఉద్యమంలోకి వచ్చాడు. బాలగోపాల్‌ వచ్చిన తర్వాత వరంగల్‌ యూనిట్‌ చాలా క్రియాశీలకంగా పనిచేసింది. డా.రామనాథం, నర్రా ప్రభాకర్‌ రెడ్డి, బుర్రా రాములు ఇలా అందరం నిరంతరం హక్కుల ఉద్యమ పనిలో ఉండేవాళ్ళం.

నేను హక్కుల ఉద్యమం పని ఎంచుకున్న తర్వాత, నా కుటుంబం మీద పోలీసుల ఒత్తిడి బాగా పెరిగింది. మా బాపుని పిలిచి బెదిరించేవారు. ఇంట్లో అందరూ భయపడేవారు. 1979 సంవత్సరంలో ప్రతిమతో నా పెళ్ళయింది. వాళ్ళది కరీంనగర్‌. తను అంపశయ్య నవీన్‌ స్టూడెంట్‌. ఆయన ద్వారానే మా పెళ్ళయింది. నవీన్‌ ద్వారా తనకి సాహిత్యంతో పరిచయం. బాగా చదువుతుంది కూడా. పెళ్ళయిన మూడోరోజునే ఒక నిజనిర్ధారణకు వెళ్ళాను. పండితాపురం పోలీసు కాల్పుల సంఘటన అది.

ఇంట్లో అందరూ నన్ను సంస్థ కార్యక్రమాల్లో పాల్గొనవద్దని చెప్పమని ప్రతిమ మీద ఒత్తిడి తెచ్చేవారు. తను అటు నాకు చెప్పలేక, పెద్దలకు సమాధానం చెప్పలేక చాలా ఇబ్బంది పడేది. నేను హక్కుల ఉద్యమంలో పని ఆపనని చాలా గట్టిగా చెప్పాల్సి వచ్చింది. నిజానికి మొండిగా వాదించడం అనేది నా స్వభావం కాదు. ‘పెద్ద పెద్ద వాళ్ళకు ఏమీ కాదు కానీ, మనలాంటి చిన్నవాళ్ళకు ఏమయినా అయితే ఆదుకునేవాళ్ళు ఉండరు’ అని మా బాపు బాధపడ్డాడు. నేను వినకపోవడంతో తర్వాత ఇంకేమీ అనలేదు. తర్వాత కాలంలో మొత్తం కుటుంబమంతా నా పనిని అర్థం చేసుకుని చాలా సహకరించారు.

వరంగల్‌లో ఎంత నిర్బంధం పెరిగిందంటే దాన్ని వర్ణించలేం. ప్రతిమ డెలివరీ కోసం హాస్పిటల్‌కు వెళ్తే, ‘అతను నక్సలైట్ల కోసం తిరుగుతాడు, అతని భార్యకు ట్రీట్‌మెంట్‌ ఇస్తే పోలీసుల నుంచి మీకేమన్నా సమస్యలు రావచ్చు’ అని డాక్టర్లతో వాళ్ళకు తెలిసినవాళ్ళు అనేవారట. అవి విన్నప్పుడు చాలా ఒత్తిడి అనిపించేది. నిజంగా ఏం చేయాలో తోచేది కాదు. పోలీసు నిర్బంధం ప్రభావం అట్లా ఉండేది. అనుక్షణం ఒత్తిడే. బయటికెళ్ళిన వాళ్ళం ఇంటికి తిరిగి వచ్చేవరకూ ఇంట్లో వాళ్ళకు చాలా భయం ఉండేది. వెనక్కి వస్తామో రామో అని ఎంతో ఆందోళన చెందేవాళ్ళు. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా ముందు పోలీసులు ఇంటిమీదకు వచ్చేసేవారు. మా కుటుంబమంతా ఆ పరిస్థితిని భరించారు.

ఆ సమయంలో తెలంగాణలో వారానికి రెండు, మూడు మిస్సింగ్‌ కేసులు, ఎన్‌కౌంటర్లు నమోదయ్యేవి. నా విద్యార్థులు ఐదారుగుర్ని పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. అలాంటి సమయంలోనే ’85లో డాక్టర్‌ రామనాథంని పోలీసులు హత్య చేశారు.చాలామంది కార్యకర్తలు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. కొంతమంది అరెస్టయ్యారు. బాలగోపాల్‌, వరవరరావు వరంగల్‌ వదిలి హైదరాబాద్‌ వెళ్ళాల్సి వచ్చింది. నేను ఒక్కడ్నే వరంగల్‌లో ఉన్నాను. మా కుటుంబం మొత్తం అక్కడే ఉండడం కూడా ఒక కారణం.

రామనాథం హత్య తర్వాత:

ఈ హత్య తర్వాత నిర్బంధం చాలా పెరిగింది. హేమక్క ఒక్కతే పిల్లలతో ఇక్కడ ఉంది. నేను తనని పలకరించి రావటానికి వాళ్ళింటికి వెళ్తుంటే మధ్యలో సత్యనారాయణ అనే ఇంటెలిజెన్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ‘నువ్వు వరవరరావు ఇంటికి పోవద్దు. ఇది టౌన్‌ డీఎస్‌పీ ఆర్డర్‌’ అన్నాడు. నేను పట్టించుకోలేదు. ఆ సమయంలో వాళ్ళింటికి వెళ్ళడానికి అందరూ భయపడేవారు.

ఒకసారి హేమక్కను బస్టాండ్‌కి స్కూటర్‌మీద తీసుకెళ్తుంటే పోలీస్‌ స్టేషన్‌ ఎదురుగా నిల్చున్న సి.ఐ. షమీం చూసి, నేను మళ్ళీ వెనక్కి వస్తున్నప్పుడు నా స్కూటర్‌కి అడ్డంగా జీప్‌ పెట్టి ఆపి ఎస్‌పి అరవిందరావు దగ్గరకు తీసుకెళ్ళాడు. సార్‌కి ముగ్గురు ఆడపిల్లలు, వాళ్ళకు చాలా అవసరాలు ఉంటాయి, నేనే జీతం డబ్బులు తీసుకెళ్ళి ఇవ్వాలి, మీరు వెళ్ళొద్దని చెప్పినా గానీ నేను తప్పకుండా వెళ్తూనే

ఉంటాను అని వాదించాను. ‘జీవన్‌ వినడు, వదిలేయండి’ అని ఎస్పీ అన్నాడు. కన్నాభిరాన్‌ ఎప్పుడూ చెప్పేవారు. ”జీవన్‌ ఒక్కడివే ఉన్నావు, జాగ్రత్త” అని. నా ధైర్యం ఏమిటంటే, మాకేదైనా అయితే చూసుకోవటానికి ఆయనున్నాడు కదా అనే.

1986లో ములుగు దగ్గర పస్రా అనే ఊరిలో ఒక లాకప్‌ డెత్‌ జరిగితే, దాని గురించి రాసినందుకు పోలీసులు నన్ను అరెస్టు చేసి తీసుకెళ్ళి బాగా కొట్టారు. ఒక రకంగా నేను శారీరక హింసకు గురయ్యింది అప్పుడే. మా ఇంట్లో వాళ్ళను కూడా తీవ్రస్థాయిలో బెదిరించారు. నన్ను పాయింట్‌ బ్లాంక్‌లో బెదిరించి ఎపిసిఎల్‌సికి రాజీనామా చేసినట్లుగా రాయించి దాన్ని పేపర్లో ప్రకటనగా ఇచ్చారు. నేను ఎలాంటి స్థితిలో ఆ ఉత్తరం రాశానో ఆ తర్వాత కన్నాభిరాన్‌ గారికి, బాలగోపాల్‌కి వివరిస్తూ చాలా పెద్ద ఉత్తరం రాశాను.

అట్లాంటి వాతావరణంలో ఇంక నేను కూడా వరంగల్‌లో ఉండే పరిస్థితి లేకపోయింది. ప్రతిమ అక్కడే ప్రభుత్వ టీచర్‌గా పనిచేస్తోంది. నాతో జీవితం పంచుకున్నందుకు తను కూడా ఈ సమస్యలన్నింటినీ భరించింది. నాకు రావలసిన తొమ్మిది నెలల జీతాన్ని కూడా వదులుకుని 1987లో హైదరాబాద్‌కి వచ్చి సిఐఇఎఫ్‌ఎల్‌లో ఒక డిప్లొమా కోర్సులో చేరాను. అప్పుడు జయశంకర్‌ సార్‌ అక్కడ రిజిస్ట్రార్‌గా చేసేవారు. నిజానికి నాకు డిప్యుటేషన్‌ మీద వచ్చే అవకాశం ఉంది కానీ అత్యవసరంగా చేరాల్సి రావడంతో జీతాన్ని వదులుకోవాల్సి వచ్చింది. అది పూర్తయిన తర్వాత మళ్ళీ వరంగల్‌ వెళ్ళిపోయాను. పౌరహక్కుల సంఘం పని మళ్ళీ మొదలుపెట్టాం. మాజీ మంత్రి హయగ్రీవాచారి హత్యకు ప్రతీకారంగా పోలీసులు 1991లో వరంగల్‌ యూనిట్‌ కన్వీనర్లలో ఒకడైన అడ్వకేట్‌ నర్రా ప్రభాకర్‌రెడ్డిని హత్య చేశారు. నిర్బంధం మరింత తీవ్రమవుతూ వస్తోంది.

జిల్లా కలెక్టర్‌ బి.పి.ఆచార్య సలహాతో వరంగల్‌ వదిలి హైదరాబాద్‌ ఏవి కాలేజికి డెప్యుటేషన్‌ మీద వచ్చాను. ఆర్డర్స్‌ తీసుకుని వెళ్తుంటే కలెక్టర్‌ ‘ఎలాగూ హైదరాబాద్‌ వెళ్తున్నావు కదా, ఒకసారి ఇక్కడి ఎస్‌పికి కనిపించి వెళ్ళమని’ సూచించాడు. నేను ప్రతిమను తీసుకుని వెళ్ళి ఎస్పీ నాయక్‌ను కలిశాను. అతను మాతో చాలా అన్యాయంగా ప్రవర్తించాడు. చాలా అసహ్యమైన భాషలో తిట్టాడు. నాపై పిస్టల్‌ను గురిపెట్టి ‘ఈ క్షణంలో నిన్ను ముండను చేస్తాను’ అంటూ ప్రతిమను బెదిరించాడు. కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడిన తర్వాత ‘సరే హైదరాబాద్‌కు వెళ్ళు. అక్కడ నిన్ను రోడ్డుమీద కాల్చి చంపుతా’ అని బెదిరించాడు. ఇంత ఘోరమైన నిర్బంధ పరిస్థితి వల్లే వరంగల్‌ విడిచిపెట్టి రావాల్సి వచ్చింది. మరో దారి లేకపోయింది. ఎంతో కష్టంమీద ప్రతిమకు కూడా హైదరాబాద్‌కు బదిలీ అయింది. అప్పుడు ఎపిసిఎల్‌సి హైదరాబాద్‌ యూనిట్‌కి కోదండ్‌ కన్వీనర్‌గా ఉండేవారు. కంచ ఐలయ్య, మధుసూదన్‌ రాజ్‌… వీళ్ళంతా ఉండేవారు. పౌరహక్కుల సంఘం కార్యక్రమాలు అక్కడినుంచే కొనసాగించాం.

’92లో ఏవి కాలేజిలో నా ఉద్యోగం పర్మనెంట్‌ అయ్యేసరికి జర్నలిస్ట్‌ రసూల్‌ని పోలీసులు హత్య చేశారు. అది ఇంకో అన్యాయమైన కథ. వాళ్ళది భువనగిరి దగ్గర ఒక ఊరు. వాళ్ళ పూర్వీకులకు చాలా భూములుండేవి కానీ ఆ తర్వాత అక్కడ ఒక రెడ్డి కుటుంబం దాన్ని తమ పేరుమీదకి బదలాయించుకున్నారట. ఈ విషయం రసూల్‌ వాళ్ళ తాతే స్వయంగా చెప్పాడు. దానిమీద అతను ఈనాడులో పనిచేస్తున్నప్పుడు ఒక కథనం రాశాడు.. దాంతో అక్కడ అతని ఉద్యోగం పోయింది. ఆ తర్వాత ఉదయం దినపత్రికలో చేరాడు. హైదరాబాద్‌ చుట్టుపక్కల భూములకు సంబంధించి జరుగుతున్న భూ కబ్జాల మీద, దానిలో పోలీసుల పాత్ర మీద అతను వరుస కథనాలు రాశాడు. దానికి ప్రతిస్పందన ఎన్‌కౌంటర్‌ పేరుతో జరిగిన హత్య. చాలా అన్యాయంగా చంపేశారు. జర్నలిస్టుల ఆందోళన వల్ల ప్రభుత్వం గులాం రసూల్‌ ఎన్‌కౌంటర్‌ కేసుని, అప్పటికే మిస్సింగ్‌ కేసుల గురించి పనిచేస్తున్న టిఎల్‌ఎన్‌రెడ్డి కమిషన్‌కు అప్పజెప్పింది. అయితే ఆ కమిషన్‌ చాలా అన్యాయమైన రిపోర్టు ఇచ్చింది.

దానిమీద అసలు వాస్తవాలతో కూడిన సుదీర్ఘమయిన ఒక బుక్‌లెట్‌ ‘న్యాయమూ లేదు. విచారణా లేదు. రెండోసారి రసూల్‌ హత్య’ అనే పేరుతో ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్టు యూనియన్‌తో కలిపి తీసుకొచ్చాం. ఇక్కడేం జరిగిందంటే, నేను ఈ కేసుకి సంబంధించిన నిజనిర్ధారణ విషయాలలో పనిచేయటం అనేది ఏవి కాలేజి యాజమాన్యానికి నచ్చలేదు. ఆ కేసులో వారికి సంబంధించినవారు ఉండడం ఒక కారణం. దాంతో నన్ను పర్మనెంట్‌ చేయకుండా అక్కడినుంచి వెళ్ళిపొమ్మని చెప్పారు.

ఆ తర్వాత పాతబస్తీ యాకుత్‌పురలో ఉన్న ధర్మవంత్‌ కాలేజిలో చేరాను. నేను పౌరహక్కుల కోసం పనిచేస్తున్నానని తెలిసినా గానీ అక్కడి మేనేజ్‌మెంట్‌ చాలా సహకరించారు. అక్కడే రిటైరయ్యాను. ఇలాంటి సమస్యలన్నీ అలవాటయిపోయాయి. అయితే, ఎక్కడా కూడా నా సర్వీస్‌ బ్రేక్‌ కాకపోవటంతో ఉద్యోగం నిలబడింది.

పౌరహక్కుల సంఘం నుంచి నిష్క్రమణ, మానవ హక్కుల వేదిక ఆవిర్భావం:

’98 వరకూ… అంటే ఉరిశిక్షలకి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం వరకూ, ఆ తర్వాత రాజీవ్‌గాంధీ హత్యానంతర పరిణామాల వరకూ ఎపిసిఎల్‌సిలోనే ఉన్నాను. అయితే కొన్ని అంశాల్లో పౌరహక్కుల

ఉద్యమం తీరుతెన్నుల మీద విమర్శనాత్మకమైన వైఖరి తీసుకోవాల్సి వచ్చింది. కొన్ని సంఘటనలు నన్ను, బాలగోపాల్‌ని, మరికొంతమందిని చాలా ఇబ్బంది పెడుతూ వస్తున్నాయి. డిస్టర్బ్‌ చేశాయి. ముఖ్యంగా కాకతీయ ఎక్స్‌ప్రెస్‌ కాల్చివేసిన సంఘటన. దానిలో 24 మంది చనిపోయారు.

ఒక సంవత్సరం తర్వాత అది చేసిన వ్యక్తి పోలీసులకి లొంగిపోయి తామే చేశామనే ‘అసలు విషయాన్ని’ బయటపెట్టడంతో, జరిగిన పొరపాటుకి క్షమించమని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ అప్పుడు పీపుల్స్‌వార్‌ పార్టీ ఆ సంఘటనకు బాధ్యత తమదే అని ప్రకటన ఇచ్చింది. అప్పటివరకూ కనీసం మాట్లాడలేదు. ఈ సంఘనటతో పాటు సమూలమైన సామాజిక మార్పు కోసం పనిచేస్తున్నామన్న విప్లవ రాజకీయ పార్టీలు కొన్ని సందర్భాలలో ప్రజలతో అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న తీరు కూడా మమ్మల్ని ఆలోచనలో పడేసింది. ప్రజా కోర్టుల్లో, న్యాయం పేరుతో సామాన్య ప్రజలపై ప్రయోగించిన ఒత్తిడి, హింస ఎంతో ఆందోళన కలిగించాయి.

ఆ సమయంలోనే, ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పుల్లో ముఖ్యమైనది, ఈస్ట్‌ యూరోప్‌లోని సోవియట్‌ యూనియన్‌ విచ్ఛిన్నమవటం, ఆ సందర్భంగా ఎదురైన ప్రశ్నలు. అలానే చైనాలో తియన్మాన్‌ స్క్వేర్‌లో జరిగిన విద్యార్థుల ప్రదర్శన… దానిమీద అక్కడి ప్రభుత్వం అనుసరించిన దమనకాండ. మన దగ్గరకు వస్తే, కారంచేడు నుండి చుండూరు వరకూ… ఆ తర్వాత కూడా దళితుల మీద జరుగుతూ వస్తున్న కుల దురహంకార మారణకాండలు.

మరో రెండు ముఖ్యమైన విషయాలు… ప్రపంచీకరణ విధానాలతో పెరుగుతున్న రైతుల ఆత్మహత్యలు, గృహహింసకు గురయి చనిపోతున్న స్త్రీలు, ఒక సంవత్సరంలో వచ్చిన గణాంకాలను పరిశీలిస్తే 270 మంది స్త్రీలు వరకట్న మరణాలకు గురయితే, ఆ సంవత్సరంలో జరిగిన ఎన్‌కౌంటర్ల సంఖ్య 178. రాజ్యం చేస్తున్న హక్కుల ఉల్లంఘనను ఎంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామో, అంతే తీవ్రంగా సామాజికంగా జరుగుతున్న హక్కుల ఉల్లంఘనను కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉందనేది మేము బలంగా భావించాం.

అధికారం వివిధ రూపాలలో ఎక్కడెక్కడ కేంద్రీకృతమౌతుందో ఆయా అంశాలన్నింటినీ వ్యతిరేకించాలని మా వాదన. అలాగే విప్లవ రాజకీయ పార్టీలు తీసుకునే నిర్ణయాలకు రాజకీయ కోణం

ఉంటుంది. వారు తీసుకునే చర్యలపై ప్రతిస్పందన హక్కుల కార్యకర్తలు ఎదుర్కోవాల్సి వస్తోందని మాకెదురవుతున్న అనుభవం. సంస్థలో వీటన్నింటి మీదా ఎప్పటికప్పుడు చర్చ పెడుతూ వస్తున్నాం. పూర్తిస్థాయి చర్చ మాత్రం గుంటూరు సభల్లో జరిగింది.

మీరు నమ్మరు గానీ, ఆ సభలో మేము పెట్టిన అంశాలపై నలభై ఎనిమిది గంటలపాటు చర్చ జరిగింది. దీన్ని ‘గ్రేట్‌ డిబేట్‌’ అని హరగోపాల్‌ ఎప్పుడూ అంటుండేవారు. అయితే మా విమర్శను మెజారిటీ సభ్యులు అంగీకరించకపోవడంతో ఒక ముప్ఫై రెండు మందిమి బయటకు వచ్చి మానవ హక్కుల వేదికగా (హ్యూమన్‌ రైట్స్‌ ఫోరమ్‌) 1998లో మా కార్యాచరణను ఒక స్వతంత్ర అస్తిత్వం, అవగాహన, ఆచరణతో ప్రారంభించాం.

సమాజంలో అసమానత, అణచివేతలు వివిధ రూపాల్లో స్థిరపడి ఉంటాయి. ఇవి హక్కులను అంగీకరించవు. ఈ అణచివేత ఏ రంగాల్లో ఉన్నా వ్యతిరేకించి పనిచేయాలనేది మా అవగాహన. హక్కుల ప్రాతిపదిక దిశగా పనిచేయాలని అనుకున్నాం. అలాగే, సామాజిక మార్పు కోసం ఉద్యమించే సంస్థలు, రాజకీయ పార్టీలు తమ కార్యాచరణతో అప్రజాస్వామికంగా, హింసాత్మకంగా వ్యవహరిస్తే బహిరంగంగానే వారితో ఈ విషయాలను చర్చించాలని కూడా అనుకున్నాం. గత 20 సంవత్సరాల నుంచీ ఈ అవగాహనతో పనిచేస్తూనే వస్తున్నాం.బాలగోపాల్‌ తాత్విక ఆలోచనా ధోరణి, నాయకత్వం మాకు కూడా పెద్ద బలం. అయితే 2009లో ఆయన ఆకస్మిక మరణం నాకు వ్యక్తిగతంగానూ, సంస్థాపరంగానూ కోలుకోలేని దెబ్బ. దానిని అధిగమించి ఆయన చనిపోయిన ఈ పదేళ్ళలో సంస్థను బలోపేతం చేసుకున్నాం. రెండు రాష్ట్రాలలోనూ మా శక్తి మేరకు హక్కుల ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాం.

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.