పొద్దున అలారం మోతతో మెలకువ వచ్చింది. ఒళ్ళంతా బరువుగా, నొప్పులుగా ఉంది. అస్సలు లేవబుద్ధి కాలేదు. అయినా తప్పదు. లేవటానికి కాస్త బద్దకిస్తే మొత్తం పని ఆలస్యమై హడావిడి అయిపోతుంది. బలవంతంగా లేచి బాత్రూమ్లోకి వెళ్ళాను. బాత్రూం అలమరలో నుండి ప్యాడ్స్ తీశాను. పేకెట్లో ఒకటే ఉంది. లోపల బీరువాలో ఇంకో ప్యాకెట్ ఉండాలి. అసలే ఇవాళ రెండో రోజు అనుకుంటూ, తీసి మార్చుకుని, ముఖం కడుక్కుని బయటికి వచ్చాను. అసలు ఇదివరకు రెండు ప్యాకెట్లే సరిపోయేవి. ఇప్పుడు నా కూతురు రవళి కూడా పెద్దది అయి నాకు పోటీకొచ్చేసరికి నాలుగు కొన్నా సరిపోవట్లేదు.
గబగబా వంటింట్లోకి అడుగుపెట్టాను. రాత్రి బద్దకించి వదిలేసిన సింకులో గిన్నెలు, తుడవని పొయ్యి, గట్టు చూసి నీరసం వచ్చింది. ముందు అవన్నీ శుభ్రం చేసుకుంటే కానీ… ఏం చెయ్యలేను. గబగబా గిన్నెలను బయట తోమడానికి వేసి సింకు కడిగి, పొయ్యి గట్టు తుడిచి, వంటిల్లు ఊడ్చేసరికి నడుము నొప్పి వచ్చేసింది. పాలు ఒక పొయ్యిపైనా, డికాషన్కి నీళ్ళు ఇంకో పొయ్యి పైనా పెట్టి, కూరలు తీసి తరగసాగాను. పిల్లల స్కూలు బస్సు ఏడున్నరకే వస్తుంది. ఆరున్నరకి నా వంట అయిపోతే, వాళ్ళని బుజ్జగింపి లేపి తయారు చేయించేసరికి ఇంకో గంట పడుతుంది. పాలు పొంగాయి… కాఫీ కలుపుకొని తాగుతూ బెడ్రూమ్లోకి వచ్చి ”లేవండర్రా… లేవండి… ఏవండీ… మీరు కూడా!” అని మొదటి హెచ్చరిక జారీ చేసి వచ్చాను. అలా ఒక మూడుసార్లు అరిచాక కానీ తండ్రీ కూతుళ్ళు లేవరు. బన్నీగాడు సరేసరి! బియ్యం కడిగి కుక్కర్లో పెట్టి, కూరకోసం మూకుడులో నూనె పోశాను. దొండకాయ, ఉల్లిపాయ వేసి మెత్తగా వేయిస్తే రవళికి ఇష్టం. బన్నీ గాడికి మాత్రం ఉల్లిపాయ లేకుండా కరకరగా వేయించాలి. వాళ్ళు కొట్టుకోకుండా అలా ఒకసారి ఇలా ఒకసారి చేస్తా. ఆలోచిస్తూ మూకుడులో ముక్కలు వేసి, కుక్కర్ ఆఫ్ చేసి, ఉప్మాలోకి అల్లం, పచ్చిమిర్చి తరిగి మళ్ళీ బెడ్రూమ్లోకి రెండో పిలుపు కోసం వెళ్ళాను. నడుము లాగేస్తోంది. కాస్త ఓలిని స్ప్రే కొట్టుకోవాలి.
”ఏవండీ! పాపాయి… లేవాలి… రేయ్ బన్నీ నువ్వు కూడా లేవరా!” స్వరం పెంచి బెడ్రూంలోకి వెళ్ళిన నాకు పక్కమీద కూర్చుని ఏడుస్తున్న బన్నీగాడు కనపడ్డాడు. ”ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావ్?” అడిగా! మెల్లగా బయటపెట్టాడు… టీచరు చేయమన్న ప్రాజెక్టు వర్క్ మర్చిపోయాడట. వెధవ ఎప్పుడూ ఇంతే! శనాదివారాలు… స్కూల్ బ్యాగ్ వంక కన్నెత్తయినా చూడడు. సోమవారం పొద్దున్న అన్నీ గుర్తొస్తాయి.
”సైన్స్ ప్రాజెక్టు చెయ్యాలి. బర్డ్స్, యానిమల్స్ అతికించాలి” చెబుతున్నాడు. ఛార్ట్ షాపులో దొరుకుతాయట. మెల్లగా ఒక్కోటి చెబుతున్నాడు. ”మరి ఇప్పుడు చేస్తారా… లేకపోతే బెంచి పైన నిలబెడుతుంది…” బుగ్గలపైనుండి కన్నీళ్ళు కారిపోతుంటే అడుగుతున్నాడు. ”సరే ముందు లే ముఖం కడుక్కు రా. చూద్దాం” రెక్క పుచ్చుకు లేవదీశా.
”ఏయ్ రవళీ! లే. ఏమండీ! ముందు లేచి కాస్త వీడి సంగతేంటో చూడండి. అక్కడ పొయ్యి మీద కూర మాడిపోతుంది” అంటూ మళ్ళీ వంటింట్లోకి వడివడిగా వెళ్ళాను. ”అబ్బ… పొద్దున్నే ఇదొక గోల. నిన్నంతా ఏం చేశావురా?” సణుక్కుంటూ లేచాడు రమేష్.
వంటింట్లోకి వెళ్ళి కూర మూత తీసి చూస్తే ఇంకా ఉడుకే పట్టలేదు. ఏమిటిది? అనుమానంగా మూకుడు కింద మంటకేసి చూశా. పొయ్యి వెలగట్లేదు… గ్యాస్ అయిపోయినట్లుంది. దేవుడా! వారం క్రితం నుండీ బుక్ చేయాలని అనుకుంటూ మర్చిపోయా. ఛ! ఇప్పుడెలా. ఒక పక్క టైమవుతోంది. ఇంకా ముప్పావుగంటలో పిల్లల స్కూల్ ఆటో వచ్చేస్తుంది. అక్కడ బన్నీగాడి ఏడుపు. రమేష్ అరుపులు… నడుము నొప్పి… దానికి తోడు ఈ గ్యాస్ అయిపోవడం… అక్కడే కూర్చుని భోరున ఏడుద్దామనిపించింది. టైమెక్కడుంది. గబగబా వెళ్ళి పక్క పోర్షన్లో వనజని అడిగా. లక్కీగా ఎక్స్ట్రా సిలెండర్ ఉందట. అది దొర్లించి తెచ్చి మొత్తానికి మార్చి పొయ్యి వెలిగించాను. రమేష్ లేచి ముఖం కడుక్కుని బన్నీగాడి చార్టుల కోసం పరిగెత్తాడు. స్కూల్ టైముకి ఇంకా అరగంటే ఉంది. గబగబా మిగతా వంట పూర్తి చేస్తూ ఉన్నాను. ‘అమ్మా జడ…’ రవళి రిబ్బను పట్టుకొని వచ్చింది. వస్తున్నా పద అంటూ పొయ్యి సిమ్‌లో పెట్టి రమేష్‌కి కాఫీ కలిపి, హాల్లోకి వచ్చాను. హాలంతా పుస్తకాలు, చార్టులు పరుచుకుని కూర్చుని ఉన్నారు రమేష్, బన్నీగాడు. కాఫీ ఇస్తూ ”త్వరగా కానివ్వండి… ఆటో వచ్చేస్తుంది” అంటూ రవళి జడ వేయసాగాను. ”అమ్మా! బాక్స్‌లో ఏం పెట్టావు?” ఇందాకటి ఏడుపు అంతా ఏమయ్యిందో… కాళ్ళు ఊపుకుంటూ బన్నీగాడి ఆరా! ఒక ఏడుపు ఏడ్చేసి ఒకళ్ళకి పని అప్పగించేసి కూర్చుంటాడు… వెధవ! ”రేయ్…తర్వాత చెప్తా కానీ నీకు స్నానం చేయిస్తా రా… ఎలాగూ నాన్నే కదా అతికిస్తున్నది” అని వాడిని లాక్కెళ్ళి రెండు చెంబులు పోశా.
ఇంకా బాక్సులు సర్దడం కాలేదు. ఆ పని చేసి… స్నానానికి వెళుతూ బీరువా తెరిచి ప్యాడ్స్ కోసం చూశాను. ప్యాకెట్ లేదు. ఎక్కడ పెట్టాను?… ఆలోచిస్తూ అన్ని అరలూ చూశాను. బట్టల మధ్యలో కూడా వెతికాను. ఊహు… ఎక్కడా కనబడదే… రవళి ఏమైనా తీసిందా? ”రవళీ… రవళీ” కేకేసి పిలిచాను. ”విస్పర్ ప్యాకెట్ ఉండాలి… ఏమైంది?” అసహనంగా అడిగాను.
”అదా… మొన్న పక్కింటి పద్మా ఆంటీ వచ్చి ప్యాడ్స్ ఉన్నాయా… అర్జెంటుగా కావాలి” అని అడిగింది. ”అంటే మొత్తం ప్యాకెట్ ఇచ్చేశావా?” మధ్యలోనే ఆపి కోపంగా అడిగాను. ”కాదు ప్యాకెట్ ఓపెన్ చేసి ఒకటి ఇస్తుంటే… కొత్త ప్యాకెట్ కదా! మొత్తం ఇచ్చేయి. నేను డబ్బులు ఇస్తాను మమ్మీకి చెప్పు… అని ప్యాకెట్ తీసుకుని వెళ్ళిపోయింది” బిక్కముఖం వేసుకుని రవళి చెపుతుంటే… నాకు పద్మ మీద ఎక్కడలేని కోపం వచ్చింది. అసలు ఏమనుకుంటోంది ఆవిడ… ఇదేమైనా సూపర్ మార్కెటా… ఏదో అవసరానికి ఒకటి అప్పు ఇస్తాం కానీ మొత్తం తీసుకుని వెళ్ళిపోవడం ఏమిటి? ఇప్పుడు ఎలా? నేను ఎక్కడికి పరిగెత్తాలి. రవళిని పంపుదామంటే ఇప్పుడే షాపులు కూడా తెరవరు. నీరసం ముంచుకొచ్చింది. అలాగే బీరువా పక్కన మంచంపై కూలబడ్డాను. నా ముఖం చూసి పాపం దోషిలా తలదించుకున్న రవళి అంతలోనే ”మమ్మీ ఆగు! ఒక్క నిమిషం…” అంటూ పక్క రూమలోకి పరిగెత్తుకుని వెళ్ళి వెలిగిపోతున్న ముఖంతో తిరిగి వచ్చి ”ఇదిగో!” అంటూ ఒక కవర్ నా చేతిలో పెట్టింది. ”నువ్వు ఎమర్జెన్సీకి వుంటాయని నా స్కూల్ బ్యాగ్‌లో ఎప్పుడూ ఉంచుతావుగా రెండు ప్యాడ్స్… అవే.. అలాగే ఉన్నాయి తీసుకో…” అంది. ”హమ్మయ్య! నా బంగారు తల్లి” దాన్ని దగ్గరికి తీసుకుని మెచ్చుకున్నా. ”రక్షించావే… ఇక నేను స్నానానికి వెళతా… నువ్వు కూడా వెళ్ళు… టేబుల్ మీద టిఫిన్ ఉంది తింటూ ఉండండి” అని చెప్పి బాత్‌రూమ్‌వైపు వెళ్ళాను.
పిల్లల్ని స్కూల్‌కి పంపి నేనూ ఆఫీస్ చేరాను. వెళ్తూనే మా కాంప్లెక్స్‌లో కింద ఉన్న మెడికల్ షాప్‌లో ప్యాడ్స్ కొనుక్కుని మరీ వెళ్ళాను. ఆ రోజు సోమవారం కాబట్టి కస్టమర్ల రద్దీ బాగా ఉంటుంది మా ఆఫీసులో. అదేమిటో నా నెలసరి పండగ వచ్చినప్పుడే ఆఫీసులో ఎక్కువ పనులు ఉంటాయి. పని చూసుకుంటూనే మధ్య మధ్య వాష్‌రూమ్‌కి పరిగెత్తడం, ప్యాడ్స్ మార్చుకోవడంతో సరిపోయింది రోజంతా. ”ఏంటి జెండానా?” నా అవస్థ చూసి కొలీగ్ వినీత అడిగింది. ”ఊ…అవును… సెకండ్ డే” అన్నాను. ”ఓ…” కళ్ళతోనే సానుభూతి పలికించింది వినీత. నెలలో ఈ టైమ్‌కి మాకు చాలానే కోడ్ వర్డ్స్
ఉన్నాయి. జెండా అని, పండగ అని, ఫ్రెండ్ వచ్చింది అని… రకరకాలుగా చెప్తారు. ఇక ఆ టైమ్‌లో కట్టే చీరలు కూడా కాస్త వేరుగానే ఉంటాయి. ముదురు రంగులు, ఎర్రపూల చీరలు, ఎక్కువగా జార్జెట్, సింథటిక్… అలా ఉంటాయి. నాఫ్రెండ్ ఉష అయితే ప్రత్యేకించి కొన్ని చీరలను ఈ సందర్బానికి కొనుక్కుంది. అది గుర్తుకొచ్చి నవ్వొచ్చింది.
పని ముగించుకుని సాయంత్రం బయలుదేరదాం అనుకుంటుంటే మేనేజర్ ఏదో మీటింగ్ అని పిలిచి అరగంట వాయించాడు. ఏమీ పనికొచ్చేది ఉండదు అందులో… అయినా తప్పదు. ఛీ! అన్నీ ఇవాళే ఉండాలా? అనుకుంటూ… చిరాగ్గా ముళ్ళమీద కూర్చున్నట్లు కూర్చుని మొత్తానికి బయటపడ్డాం. రమేష్‌కి ఫోన్ చేసి లేటవుతుందని చెప్పాను. మా ఇద్దరి ఇళ్ళు ఒకేవైపు అవటంతో బస్ కోసం చూడకుండా నేను, వినీతా ఆటో ఎక్కేశాం. దారిలో వినీతతో పొద్దుటినుండీ నా తిప్పలన్నీ ఏకరువు పెట్టాను. పక్కింటావిడ ఇలా ప్యాకెట్ తీసుకు వెళ్ళిపోయిందంటే ఒకటే నవ్వు తను. ”పక్కింటి వాళ్ళని ఇవి కూడా అప్పు అడుగుతారా! పైగా షాపులో కొన్నట్టు ప్యాకెట్ మొత్తం” అంటూ మళ్ళీ నవ్వింది. ”ఇప్పుడు నవ్వొస్తోంది కానీ అప్పుడు ఆవిడ పీక పిసికేయాలన్నంత కోపం వచ్చింది తెలుసా!” అన్నాను. ”ఏదో నా కూతురి దగ్గర ఉండబట్టి సరిపోయింది కానీ లేకపోతే నా పరిస్థితి ఏమిటి” అన్నాను. ”నిజమే! కూతురు ఉండడం నీకు కలిసొచ్చింది. నాకు ఇద్దరూ మగ వెధవలేగా!” అంది. మాటల్లో ఇల్లు వచ్చేసింది. ”పోన్లే వెళ్ళి రెస్ట్ తీసుకో” అంది వినీత. ”ఆ… ఏమున్నా మన పనులు మనకు తప్పవుగా” అంటూ తనకు వీడుకోలు చెప్పి ఇంట్లోకి నడిచాను.
చిరాగ్గా, నీరసంగా ఉంది. ముందు శుభ్రంగా స్నానం చేయాలి అనుకుంటూ బ్యాగ్ సోఫాలో పడేసి… ఏంటి! ఇల్లు ఇంత నిశ్శబ్దంగా ఉంది అనుకుంటూ లోపలికి తొంగి చూశాను. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని రవళి, బన్నీ బుద్దిగా అన్నం తింటున్నారు. రమేష్ దగ్గరుండి వడ్డిస్తున్నాడు. ”మమ్మీ!” నన్ను చూడగానే అరిచాడు బన్నీ. ”అరే వంట అయిపోయిందా!” సంభ్రమంగా రమేష్‌ని అడుగుతూ… ”అరే మంచి పిల్లల్లాగా అప్పుడే అన్నం తినేస్తున్నారా” పిల్లలతో అన్నాను. ”అప్పుడే ఏంటమ్మా నాకు ఎప్పటినుంచో ఆకలి వేస్తుంటే…” అన్నాడు కళ్ళు తిప్పుతూ బన్నీ. ”వేడి వేడి అన్నం… టొమాటో ఎగ్ కర్రీ చేశా. నువ్వు కూడా తొందరగా ఫ్రెష్ అయి వచ్చేయి… తినేద్దాం” అన్నాడు రమేష్. ”అలాగే” కృతజ్ఞతగా రమేష్ వంక చూసి అంటుంటే, ”మమ్మీ… మమ్మీ… కూరలోకి ఉల్లిపాయ, టమాట నేనే కట్ చేసి ఇచ్చా తెలుసా…” రవళి అంది. ”వెరీగుడ్ రా తల్లీ… నా బంగారం” నవ్వుతూ అన్నాను. ఇంతలోనే బన్నీ ”మరి నేను?” అన్నాడు. ”నువ్వు కూడా బంగారం! నాన్న కూడా…” రమేష్ వంక ఓరగా చూసి అని ”ఇప్పుడే స్నానం చేసేసి వచ్చేస్తా” అని చిరునవ్వుతో బెడ్రూమ్లోకి వెళ్ళాను.
స్నానం చేసి భోజనం ముగించి న్యూస్ చూడడానికి టీవీ ముందు కూర్చున్నాం. రమేష్ బెడ్రూంలోకి వెళ్ళిపోయి సెల్లో మునిగిపోయాడు. పొద్దుటి నుంచి ఉన్న అలసట కొంచెం తీరి మనసు, శరీరం కాస్త తేలికపడ్డాయి. టీవీలో… బ్రేక్‌లో అడ్వర్జయిజ్మెంట్లు వస్తున్నాయి. ”పీరియడ్ కా దూస్రా దిన్… నో ప్రాబ్లెం” అంటూ ఒక అమ్మాయి తెల్ల ప్యాంట్, చొక్కా వేసుకుని చకచకా కొండలు ఎక్కుతోంది. ”ఇక్కడా ఇదే గోలా? అయినా ఇప్పుడు కొండలు ఎక్కాలా? పిచ్చి ముండా! ఎచ్చులకు పోతే ఆనక నువ్వే బాధపడాలి” తిట్టాను. రవళి కుసుక్కున నవ్వింది. ”ఏంటి మమ్మీ… చెప్పు ఏంటి?” బన్నీ అడుగుతున్నాడు. ”ఏం లేదులేరా… తెల్ల ప్యాంట్ వేసుకుని ఎవరైనా కొండలు ఎక్కుతారా? అందుకే తిట్టా. అయినా పదండి. ఇక పడుకుందాం…” అంటూ లేచి రవళీ, నేనూ ఒకళ్ళ ముఖం
ఒకళ్ళు చూసుకుని మళ్ళీ నవ్వుకుంటూ బెడ్రూమ్లోకి నడిచాం. ఇంకో రోజు ముగిసింది!