ఒక మనిషి… ఒక ఇల్లు… ఒక ప్రపంచం -ఉమా నూతక్కి

 

”దొరా, తలను లోపలికి పెట్టుకో. ఆడది తానమాడడాన్ని అలా చూస్తున్నావే…” కోపంగా చెప్పాడు దొరైకణ్ణు.

హెన్రీ నవ్వాడు. ”మీరు అది మాత్రమే చూశారా? ఆ హేరోపిన్‌ వంపులో వస్తున్నప్పుడు.. ఒక తెల్లని లేగదూడ పరిగెత్తిందే… కొండ పల్లంలో, పొలాల మధ్య ప్రశ్నార్థకంలాగా తోకను ఎత్తుకుని మన లారీ శబ్దానికి రెండు గెంతులు గెంతిందే… పరుగెడుతూ ఆర్భాటం చేసిందే… దాన్ని చూశానే.. మీరు చూళ్ళేదా? లారీకి అడ్డుగా ఇంతకు ముందు కోతులు అటూ ఇటూ దుబ్బుదుబ్బుమని దూకుతూ పరుగులు తీశాయే… దాన్ని చూశానే, మీరు చూళ్ళేదా…”

ఎంత గొప్ప భావన కదా.

మనం ఏదైనా వెతుకుతున్నామనుకోండి మనం వెతుకుతున్న ప్రతి చోటా అది ఉన్నట్లే భ్రమగా అనిపిస్తుంది. ఆఫీసులో =వషశీఅషఱశ్రీఱa్‌ఱశీఅర చేసేటప్పుడు మనలో చాలామందికి ఇలాంటి చేదు అనుభవం ఎదురవుతుంది. ఎక్కడైనా తేడా వచ్చినా ఒక ఎమౌంట్‌ కోసం వెతుకుతుంటే ఏ షీట్‌లో చూసినా ముందు ఆ ఫిగర్‌ కనిపిస్తుంది.

చాలాసార్లు కొన్ని పుస్తకాల విషయంలోనూ అదే అనుభవం. ఒక పుస్తకం కోసం వెతుకుతాం. దాని కవర్‌ పిక్చర్‌ మన మనసులో ముద్రపడిపోయి ఉంటుంది.

మొన్న బుక్‌ ఫెస్టివల్‌కి వెళ్ళినపుడు సాహత్య అకాడమీ స్టాల్‌లో ‘అమృత సంతానం’ తీసుకుని బిల్లు కడుతుండగా పక్కన లీలగా ఈ పుస్తకం కనిపించింది. మళ్ళీ ఒకసారి పరీక్షగా చూశాక అప్రయత్నంగా చిన్న కేక వచ్చేసింది. నా సంబరం చూసి ఆయన నవ్వి ”మళ్ళీ ప్రింట్‌ చేశాం” అన్నారు. ఎప్పుడో ఇంగ్లీష్‌ వెర్షన్‌లో

(ూ వీaఅ ూ ష్ట్రశీఎవ a షశీతీశ్రీస) చదివా ఈ పుస్తకాన్ని.

మనం మన చుట్టుపక్కల ఉన్న మనుషుల్లో చాలా చూస్తాం. రకరకాల మనస్తత్వాలు, వ్యక్తిత్వాలు, కొన్ని కల్మషాలు, కొన్ని విద్వేషాలు. కానీ, అసలు అలాంటివేమీ లేని ఒక స్వచ్ఛమైన ప్రపంచం ఉంటే అది ఎలా ఉంటుందో మన ఊహకి కూడా అందదు.

అదిగో అలాంటి పుస్తకం ”ఒక మనిషి ఒక ఇల్లు ఒక ప్రపంచం” ఇందులో పాత్రలన్నీ చాలా గొప్పవి. Iసవaశ్రీఱర్‌ఱష జష్ట్రaతీaష్‌వతీర.

కృష్ణరాజపురం అనే అందమైన ఊరు. ఆ ఊరి గుడి ధర్మకర్త సభాపతి పిళ్ళై. ఒకానొక విషాద సమయంలో ఎవరికీ చెప్పకుండా ఊరు వదిలి మిలట్రీలో చేరతాడు. యుద్ధంలో చనిపోయిన స్నేహితుడికిచ్చిన మాట కోసం అతని భార్యతో సహజీవనం చేస్తాడు. యుద్ధ సమయంలోనే అనాధ అయిన హెన్రీని చేరదీస్తాడు. ఎలాంటి ఆంక్షలూ, బాధ్యతలూ లేకుండా కేవలం మమ్మా, పప్పాల ప్రేమను శ్వాసిస్తూ పెరిగిన హెన్రీ నిర్మలమైన పసిపాపలాంటి మనస్తత్వంతో ఎదుటపడిన ప్రతి మనిషి మనసులోనూ ఒక అందమైన స్థానాన్ని సంపాదిస్తాడు.

తండ్రి చనిపోయాక అతనికి వారసత్వంగా ఇచ్చిన ఇల్లు, పొలం పత్రాలు తీసుకుని కృష్ణరాజపురం వస్తాడు హెన్రీ. అనాధ అయిన హెన్రీ ఒక మనిషిగా మొదలుపెట్టిన ప్రయాణం, ఒక ఇల్లు నుంచి ఒక ప్రపంచాన్ని ఎలా సృష్టించి ఇచ్చిందో చాలా హృద్యంగా చెప్తారు జయకాంతన్‌.

ఈ కథలో హెన్రీ, పప్పా, మమ్మా, దేవరాజన్‌, దొరైకణ్ణు, ఊరి మునసబు, అక్కమ్మ, చిలకమ్మ, చిన్నపిల్లవాడు మణికంఠ… అందరూ గొప్ప మనుషులే. చివరికి ఆ ఊరిలో ఉన్న పిచ్చిపిల్లతో సహా. నవల పొడుగూతా హెన్రీ తన మమ్మా, పప్పాల గురించిన జ్ఞాపకాలను మధురంగా నెమరు వేసుకుంటూ ఉంటాడు. నవల చివరి వరకూ మనల్ని ఇంత సున్నితమైన మనుషులు, ఈ సున్నితత్వాన్ని చివరివరకూ కాపాడుకోవడం సాధ్యమా అన్న సందేహం వెంటాడుతుంది. అయితే ఇలా ఉండగలగడం సాధ్యమేనని చివరికి ఋజువు చేస్తారు రచయిత.

అసలు ఒకానొక ఊహా ప్రపంచంలో ఒక గొప్ప కల కంటున్నట్లు ఉంటుందీ పుస్తకం.

‘జీవితంలో నువ్వు నెరవేర్చవలసిన ధర్మం ఒకటే ఒకటుంది. ఏమిటో తెలుసా? ఎప్పుడూ సంతోషంగా ఉండు. అంతేరా కన్నా’ అని చెప్పేవారు మా నాన్న. నేనెప్పుడూ సంతోషంగానే ఉన్నాను…’ ఈ పుస్తకంలోని ప్రధాన పాత్రధారి హెన్రీ చేత రచయిత చెప్పిన మాటలు ఇవి. ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడైనా సరే మనకి మనం అంతిమంగా కోరుకునేది సంతోషాన్నే కదా! అలాంటి సంతోషాలన్నీ పాత్రలుగా మారి ఈ పుస్తకంగా బయటకు వచ్చాయని చెప్పవచ్చు.

మామూలుగా చాలా కథలకు అవి జరిగే కాలాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి ఒక గుర్తింపు, విలువ వస్తుంటాయి. అసలు ఇలాంటి కథకు కాలంతోనూ, జరిగే ప్రదేశంతోనూ సంబంధం ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది కాలంతోనూ, ప్రాంతంతోనూ సంబంధం లేకుండా అనాదిగా లోకమంతా విస్తరించిన మనిషి కథ. ప్రతి మనిషి లోపల గూడు కట్టుకుని ఉండే స్వచ్ఛత. బయటకి వస్తే అప్పుడు ఈ లోకం మనకి ఎంత నిర్మలత్వాన్ని అందించే అవకాశం ఉంటుందో అని పరిచయం చేసే కథ.

ఈ నవల ఎక్కడికక్కడ మనిషిలోని సున్నితత్వాలని అడుగడుగునా పరిచయం చేస్తుంటే మనిషి లోపల ఇంత ఆర్ద్రత ఉంటుందా…. మామూలు మనుషుల్లో మానవత్వపు సుగంధాలు ఇంతలా పరిమళిస్తూ ఉంటాయా? నిజంగా ఇలా ఉంటే ఎంత బాగుంటుందీ ప్రపంచం అనిపిస్తుంది.

అసలు ఈ పుస్తకం పేరులోనే జీవిత నిర్వచనం ఉంటుంది. మనిషిగా ఉన్నత వ్యక్తిత్వాన్ని అలవర్చుకుంటే తన ఇంటినే దీపంగా చేసి ప్రపంచాన్ని ఉజ్వలంగా వెలిగించటం సాధ్యమే అన్నట్లుగా…

ఇప్పటివరకూ మనం బాల్యం, స్త్రీ వాదం, దళితవాదం, అభ్యుదయం, విప్లవం, రాజకీయం, మన ఊరి మట్టివాసన… ఇలా అనేకానేక ఇతివృత్తాలతో ఎన్నో గొప్ప కథలు చదివి ఉంటాం. ఆ ఇతివృత్తాలన్నీ ఒక్కటై ఇమిడిపోయే మనిషి వాసన వేసే ఇతివృత్తమిది. ఇందులోని పాత్రల్లా మనుషులు మారితే ఈ లోకపు వర్ణమే మారిపోదా అనిపిస్తుంది పుస్తకం చదువుతున్నంతసేపూ.

ఇందులో ఒకచోట దేవుడి గురించి హెన్రీ ఇలా అంటాడు… ”దేవుణ్ణి నమ్మడానికీ, నమ్మకపోవడానికీ ‘నేనెవరు’ అన్నదే నాకు తెలియటం లేదు. ‘భగవంతుడు’ అన్నది మన నమ్మకం మాత్రమేనా? నాకూ, నమ్మకాలకీ ఏమిటి సంబంధం? ఈ జీవితం తప్ప, అదీ నాకు తెలిసిన ఏ కాస్తో తప్ప నాకింకేమీ తెలియదే”.

ఇక్కడ దేవుడు గురించి చెప్పినట్లే అనిపించవచ్చు కానీ తరచి చూస్తే జీవితంలో మనకి ఎదురయ్యే ఎన్నో వాదనలకి సమాధానంగా అనిపిస్తుంది. అసలు మనమేమిటో మనం తెలుసుకోకుండానే ఎన్నో వాదప్రతివాదాలతో మన జీవితాలని సంక్లిష్టం చేసుకుంటున్న సంగతి ఎంత సులువుగా చెప్పారో కదా!

మనుషుల మధ్య అంతర్లీనంగా అనుబంధాలు పెనవేసుకుని ఉంటే సమాజపు విలువలు ఎంత ఉన్నతంగా ఉంటాయో మనకి కళ్ళకు కట్టినట్లు అనిపిస్తుంది. తప్పు చేసిన వాడిచేత కూడా మంచి పని చేయించే శిక్ష ఎంత గొప్ప నాగరికత? అది ఈ పుస్తకంలో పరిచయమవుతుంది.

మనసు బాగోనప్పుడు ఒక్కసారి ఈ పుస్తకం చదివితే మనలో మనకి తెలియని భరోసా ఒకటి ముందుకు వస్తుంది. ఆ భరోసా మన చుట్టూ ఇచ్చే ప్రపంచానిదే అయి ఉంటుంది. ఎందుకంటే మన ఆలోచనల్ని మనం ఈ పుస్తకంలో రాసినంత స్వచ్ఛంగా మార్చుకోవటం అప్పటికే మొదలుపెట్టే ప్రయత్నంలో ఉంటాం కాబట్టి. మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మనం అలానే చూడడం అలవాటు అవుతుంది కాబట్టి.

ఇది పల్లెసీమల కథో… నగరంలా పరిగెట్టే కథో కాదు. ఇది మనిషి సీమల కథ. మనిషిని తన లోపలికి పరిగెత్తించే కథ. లోపలి మనిషిని మనిషిగా బయటకి వెల్లడి చేసే కథ.

జ్ఞానపీఠ అవార్డు గ్రహీత జయకాంతన్‌ తమిళంలో రచించిన సుప్రసిద్ధ నవల ఇది. ఈ నవల సాహిత్య అకాడమీ పురస్కారం పొందింది. జయకాంతన్‌ రెండు వందలకు పైగా కథలు, నలభై నవలలు రాశారు. ఈ నవలను తెలుగులోకి జిల్లేళ్ళ బాలాజీ అనువదించారు.

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.