1996 సంవత్సరంలో డిప్యూటి తహిసల్దార్‌గా సెలక్టయ్యి, హైదరాబాదు కలక్టరాఫీసులో ట్రైనింగ్ తీసుకున్నప్పుడు ‘మురికివాడలు’గా పిలవబడే హైదరాబాదులో అన్ని చోట్లా విస్తరించివున్న బస్తీలను చాలా దగ్గరగా చూసాను. అప్పట్లో కురిసిన బీభత్స వర్షాలకి మూసినాలా పొంగి, నాలాకి అటూటూ ఉన్న వందలాది బస్తీలు నీట మునిగినప్పుడు, కలక్టరాఫీస్ నుండి పెద్ద ఎత్తున జరిగిన రిలీఫ్ కార్యక్రమాల్లో మాట్రయినీలందరం పాల్గొన్నాం. పాఠశాలల్లో రిలీఫ్ కేంద్రాలు ఏర్పాటుచేసి, నిర్వాసితులకు భోజన ఏర్పాట్లు చేయడం, బియ్యం, వంట సామాగ్రి, నష్టపరిహారం పంచడం లాంటి కార్యక్రమాల్లో నేను చాలా చురుకుగా పని చేసాను. ఆ విధంగా బస్తీ జీవితాన్ని, చాలా దగ్గరగా చూసాను వ్యవసాయం విధ్వంశమై, గ్రామాల్లో పని దొరకక పొట్టచేత పట్టుకుని పట్టణాలకు వలస వచ్చిన వారితోనే ఈ బస్తీలు కిటకిట లాడుతుంటాయి ఎలాంటి కనీసవసతులూ లేకుండా సర్వత్రా మురికి నిండి ఉండడం వల్లనే కాబోలు వీటికి మురికివాడలనే అమానవీయ పేరు స్థిరం చేసారు. ఈ మధ్య కేశవరెడ్డి రాసిన ‘రాముడుండాడు, రాజ్యముండాది’ నవలను మరోసారి చదివినప్పుడు పల్లెల నుండి ఎలాంటి దుర్భరపరిస్థితులలో ప్రజలు తలల మీద మూటలు మోస్తూ నగర బాటపడతారో చాలా స్పష్టంగా రూపుకట్టింది. గుప్పెడు మెతుకుల కోసమే పల్లెల్ని వదిలి పట్టణాలకొచ్చిన జనంతో ఈ బస్తీలన్నీ నిండి ఉండడం ఒక కామన్ సూత్రం. చాలా విషాదంగా వారు వదిలివచ్చిన ప్రాంతం పేరుతోనే చాలా చోట్ల బస్తీలు వెలిసాయి. ఉదా: పాలమూరు బస్తీ. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయ్.
భూమిక ఇటీవలే నగర బస్తీలలో పని చేయడం ప్రారంభించింది. పది బస్తీలలో స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా మా పని మొదలైంది. ఆయా బస్తీలకు వెళ్ళినప్పుడు, అక్కడ విస్తరించి ఉన్న సమస్యల గురించి ప్రస్తావించినప్పుడు నాకు పై విషయాలు గుర్తొచ్చాయి. అప్పుడు తిరిగిన కొన్ని బస్తీలను చూసినప్పుడు వారి సమస్యల్లో పెద్దగా మార్పు గానీ, వారి జీవన ప్రమాణాల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో మెరుగు కానీ కనబడలేదు. కనీస సౌకర్యాలు ఇప్పటికీ పెద్దగా ఏర్పడలేదు. హింసారూపాలు మారాయి. గృహహింసలో కొత్త కోణాలు కనబడ్డాయి. విపరీత వస్తు వినిమయ సంస్క ృతికి బానిసలైన యువత తల్లిదండ్రులపట్ల చూపిస్తున్న నిరాదరణ, కొన్ని చోట్ల హింసా ప్రవృత్తి గురించి తల్లులు ఆందోళనతో మాతో పంచుకున్నారు. ఏరుల్లా పారుతున్న మద్యం, తాగి విచక్షణ కోల్పోతున్న యువకుల విపరీత ప్రవర్తనలు, భద్రతలోపించిన ఆడపిల్లలు, బాల్యవివాహాలు, బాలకార్మికులు… ఇవన్నీ మా ముందు ప్రత్యక్షమైన కొన్ని సమస్యలు / అంశాలు.
నాలుగేళ్ళపాటు పదిబస్తీలలో పైన చెప్పిన అంశాల మీదే మేము పని చేయాలని నిర్ణయంచుకున్నాం. నిజానికి బస్తీలలో పనిచేసిన అనుభవం భూమికకు లేదు. ఈ చాలెంజ్‌ని స్వీకరించి మేము ఈ నూతన కార్యక్రమానికి తెరతీసాం. బస్తీల రంగస్థలం మీద హింసలేని సమాజాన్ని స్త్రీలకు, పిల్లలకు అందించాలనే మా కార్యక్రమం గురించి మీతో పంచుకోవాలని భూమికలో ఈ చిన్న నోట్ రాసాను. మీ సలహాలు, సూచనలు తప్పక ఇవ్వగలరు.