విశాలమైన డైనింగ్ హాల్ చాలా భాగం ఖాళీగానే ఉంది. నేనూ, హైలమ్ ఒక మూల కూర్చుని తీరికగా చేప ముక్కల్లో ముళ్ళు తీసుకుంటూ తింటున్నాం.
‘ఢాకా చేపల రుచే రుచి’ అంటూ ఇష్టంగా తింటోంది హైలమ్.
ఇంతలో పెద్ద చప్పుడు. ప్లేట్ కిందపడి కంగుమంటూ కాసేపు మోగుతూనే ఉంది. వెనక్కు తిరిగి చూస్తే రోషనారా విసవిసా వస్తోంది.
”ఇంత పెద్ద డైనింగ్ హాల్లో చోటే లేనట్లు నా పక్కకొచ్చి కూర్చుంటారెందుకు?” అంటూ మా పక్కనుంచి వెళ్ళిపోయింది.
ఆమె వచ్చిన టేబిల్ దగ్గర సాజిద్ ఆశ్చర్యంగా నోరు తెరుచుకొని నించున్నాడు –
ఇరవై మంది చూపులు అతని మీదనే కేంద్రీకరించడంతో ఇబ్బంది పడుతూ తన ప్లేటు తీసుకుని మా దగ్గరకు వచ్చాడు.
”నేను ఏమీ అనలేదు. తను ఒక్కతే కూర్చుని తింటోంది. నేను వెళ్ళి కూచోబోయాను. ప్లేటు ఎత్తేసి వెళ్ళిపోయింది” తడబడుతూ చెప్పాడు.
”తనే మూడ్‌లో ఉందో, మీరు అప్‌సెట్ అవకండి” అంటూ నేను, హైలమ్ సాజిద్‌ను ఓదారుస్తుంటే ఫైజా కూడా వచ్చి కూర్చుంది. ”మనం ఢాకాకు ఎందుకొచ్చాం? జరిగిందేంటి?” అంది ఫైజా కాస్త చిరాగ్గా.
”అంత దూరం ఆలోచించొద్దు. మనం ఒకరికొకరం పరిచయమై రెండు రోజులే అయింది. ఒకరి స్వభావాలొకరికి ఇంత తొందరగా అర్థం కావు. ఇంకా పది రోజులు కలిసే ఉంటాం కదా, టైమవుతోంది వెళ్దాం” అని ఫైజాకు సర్దిచెబుతూ లేచాను.
ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల నుంచి ఇరవైమంది ప్రతినిధులం ఢాకాలో ఒక వర్క్‌షాప్‌లో కలిశాం. అది మూడు దేశాలలో శతాబ్దాల నుంచి సామాన్యంగా ఉన్న సాంస్కృతిక వారసత్వం గురించిన వర్క్‌షాప్. సామాన్యంగా ఉన్న ఈ సంస్కృతి మూడు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్త యుద్ధ వాతావరణాన్ని మార్చగలుగుతుందా అనే విషయం గురించి చర్చించేందుకు సమావేశమయ్యాం.
ఢాకా నగరానికి ఒక చివరన ఉన్న అధ్యయన కేంద్రంలో ఈ సమావేశం జరుగుతోంది. ఈ పది రోజులూ మా బస కూడా ఇక్కడే. నేనూ, మణిపూర్ నుంచి వచ్చిన హైలమ్ ఒక గదిలో ఉన్నాం.
మొదటిరోజు పరిచయ కార్యక్రమం అయిపోయింది. మణిపూర్, అస్సాం, జార్ఖండ్, ఢిల్లీ, కరాచి, లాహోర్, రావల్పిండి నుంచి వచ్చిన ప్రతినిధులు, స్థానికులైన బంగ్లా దేశీయులు అందరం ఉత్సాహంగా పరిచయాలు చేసుకున్నాం. ఆడవాళ్ళ సంఖ్య తక్కువే. నేనూ, హైలమ్ కాక అస్సాం నుంచి జూనియానా, పాకిస్తాన్ నుంచి ఫైజా, బంగ్లాదేశ్ నుంచి రోషనారా, జపా, ఢిల్లీ నుంచి శృతి, శిల్పి… అంతే.
మూడు దేశాలలోని కళలలో, చరిత్రలో, ఉద్యమాలలో, మతాలలో, విశ్వాసాలలో, ఆహారపుటలవాట్లలో ఉన్న ఏకత్వాన్ని గురించి మాట్లాడుతున్నాం. వాటిని గుర్తు చేసుకుంటూ మూడు దేశాల మధ్యా స్నేహం పెంచుకోగల అవకాశాల గురించి ఆలోచిస్తున్నాం.
రెండో రోజుకి అందరం మరింత సన్నిహితులమయ్యాం. ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చిన మగవాళ్ళు మిరంజన్, షంగ్‌షమ్‌లు హైలమ్ కోసం నా గదికి వస్తూ బాగా స్నేహితులయ్యారు. మిరంజన్ చాలా సీరియస్‌గా కనబడతాడు. నోరు విప్పాడా మన పొట్ట చెక్కలవ్వాల్సిందే. అంత హాస్యం. అందరం నవ్వుతుంటే ఏమెరగనట్టు చూస్తుంటాడు. మిరంజన్, షంగ్‌షమ్‌లు జంట కవుల్లా తిరుగుతుంటారు. విడివిడిగా కనపడరు. ఎక్కడికెళ్ళినా కలిసే వెళ్తారు. అహ్మద్ రజా, సాజిద్‌లు కూడా అంతే.
సాజిద్ గుండుతో అందంగా కనిపించే యువకుడు. రోజూ గుండు గీసుకుంటాడు. పాకిస్తాన్‌లో ఇప్పుడది ఫ్యాషన్. ఆ నున్నని గుండు వెనక చిన్న పిలక ఉంటే అతన్ని చూసినవారెవరైనా సత్‌బ్రాహ్మణుడనుకుంటారు. వంచించగల ఈ వేషధారణ మన నిజరూపాన్ని కూడా ప్రకటించగలగటం ఆశ్చర్యమే. రజా, సాజిద్‌ని గంజా, కోనా (గుండు) అంటాడు. సాజిద్ రజాను భంగూ అంటాడు. ఎప్పుడూ సరదాగా పోట్లాడుకుంటూ, నవ్వుకుంటూ ఉండే వీళ్ళను చూస్తే ముచ్చటేస్తుంది.. ఆ వయసులో స్నేహాల తీరూ జోరూ వేరు. అంతా చాలా బాగుందనుకుంటున్న సమయంలో ఈ అపశృతి ఏమిటా అనిపించింది.
ఆ రోజు రాత్రి కుర్నిర్ గదిలో అందరం కూర్చున్నాం. తింటూ, తాగుతూ, కబుర్లు, పాటలు, డాన్సులు – పరమోత్సాహంగా
ఉన్నాం. రజా, సొహైల్‌లు పాడుతున్నారు. అయూబ్ తబలా వాయిస్తున్నాడు. మహబూబ్ అందమైన ఉర్దూలో వ్యాఖ్యానాలు చేస్తున్నాడు. జార్ఖండ్ మిత్రులు సంజీవ్, అరవింద్‌లు వాళ్ళ వాయిద్యాలు వినిపిస్తున్నారు. దీపూజ్జల్ నా చేతిలోని పుస్తకంలో తెలుగు అక్షరాలు చూసి బర్మా లిపి ఇలాగే ఉంటుందన్నాడు. అతని చిన్నతనంలో వాళ్ళ కుటుంబం బర్మా నుంచి చిట్టగాంగ్ వచ్చి అక్కడ స్థిరపడిపోయింది. చిట్టగాంగ్ అడవుల్లో గిరిజనులతో పనిచేస్తున్నాడా చిన్న కుర్రాడు. శిల్పి ”ఏ నయనీడరే డరే” అనే పాట మొదలుపెట్టగానే రోషనారా లేచి వెళ్ళడానికి సిద్ధమయింది. శిల్పి పాట ఆపి ఏంటన్నట్లు చూసింది.
”సారీ నే వెళ్ళాలి” అని వెళ్ళిపోయింది.
రోషనారా పక్కనున్నదెవరా అని చూశాను. సాజిద్. అతని ముఖం చిన్నబోయి ఉంది.
ఏం జరిగింది? ఎందుకు రోషనారా హఠాత్తుగా వెళ్ళిపోయింది. గడచిన రెండు రోజుల్నించీ రోషనారా కొంచెం వేరుగానే ఉంటోంది. ఏదో అయిష్టమైన పని బలవంతంగా చేస్తున్నట్లు ముఖం పెడుతుంది. పరిచయాల సమయం నుంచీ మాటల్లో క్లుప్తత, ముఖంలో నిర్లిప్తత అందరినీ ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి. ఐతే రెండు రోజులలో ఆ అమ్మాయి స్వభావం గురించి అంచనాకు రావటమూ సరికాదు. వాళ్ళిల్లు మేముంటున్న చోటుకి దగ్గరని చెప్పింది. ఇంటినుంచే వస్తూ పోతూ ఉంది. ఇవాళ రాత్రి మాతో ఉండమని హైలమ్ అడిగితే ఒప్పుకుంది. ఇప్పుడు హైలమ్‌తో గానీ, నాతో గానీ చెప్పకుండా వెళ్ళిపోయింది.
పోనీ – రోషనారా స్వభావం అది. హఠాత్తు నిర్ణయాలు తీసుకుంటుందనుకుంటే అందులో వింత లేదు. కానీ సాజిద్ ముఖం ఎందుకు చిన్నబోయింది? మధ్యాహ్నం ఆ సంఘటన జరిగిన తర్వాత కూడా సాజిద్ రోషనారా పక్కనెందుకు కూర్చున్నాడు? నా ఆలోచనలకు అడ్డుకట్ట వేస్తూ రజా పాటా, డ్యాన్స్ మొదలుపెట్టాడు. రజా అందమైన యువకుడే కానీ నవ్వుతూ ఉండడు. సీరియస్‌గా కొంపలు మునిగే పనిలో ఉన్నట్టుంటాడు. డాన్స్ కూడా సీరియస్‌గానే ఒక పని చేస్తున్నట్లు చేస్తున్న అతన్ని చూస్తే నవ్వొచ్చింది.
రానంటున్న కొద్దీ మహబూబ్‌ని కూడా లాగాడు. వయసు ఎంత ఉత్సాహానికైనా అడ్డుకట్ట వేయగలదు. మహబూబ్, రజాతో సమానంగా ఆడలేక విరమించాడు. శృతి లేచి వెళ్ళింది. శృతి, రజా డాన్స్ చేస్తుంటే ఎంతో బాగుంది. శృతి, సొహైల్ కలిసి పాడుతున్న ఆ పాట కూడా హాయిగా ఉంది. ఫైజా ఉదయం సంగీతాన్ని గురించీ, మనుషుల్ని ఏకం చేయడంలో దానికున్న శక్తి గురించీ మంచి
ఉపన్యాసం ఇచ్చింది. అదంతా ఎంత సత్యమో, ఈ సంగీత రాత్రి చెబుతోంది. మూడు దేశాల సంగీత నృత్య, సాహిత్యాలలో రాత్రి మైమరచి ఉండగా ఇదే సమయమన్నట్లు తెల్లవారింది.
… … …
నాల్గవరోజు చర్చలు చాలా బాగున్నాయి. మూడు దేశాలకూ సమానంగా ఉన్న చరిత్ర, 13వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దం వరకూ సాగిన అనేక ఉద్యమాల చరిత్ర, సాహిత్య ధోరణుల తీరుతెన్నులు – అనేక విషయాలతో అందరూ ఉత్తేజితులవుతున్నారు. సాజిద్ ఇక్బాల్ గురించీ, అతని కవిత్వం గురించీ మాట్లాడుతున్నాడు. రోషనారా ఎంత అసహనంగా కదులుతోందో తన కుర్చీలో…
ఎందుకు? సాజిద్ రోషనారాతో అనుచితంగా ప్రవర్తించాడా?
సాజిద్ తర్వాత మహబూబ్, కుర్షిద్ మాట్లాడుతున్నప్పుడు కూడా రోషనారాలో అసహనం పెరిగిందే తప్ప తరగలేదు.
బంగ్లాదేశ్ ప్రతినిధి జాకీర్ హుస్సేన్ నజ్రూల్ ఇస్లాం గురించి మాట్లాడుతుంటే రోషనారా నవ్వుతూ వింటోంది.
ఎంత అందమైంది రోషనారా! మరెందుకు మూడు రోజులుగా ముఖంలో చిటపటలు తెచ్చిపెట్టుకుని వికారం చేసుకుంది?
రోషనారా నాకొక ప్రశ్న అయింది.
ఆ రోజు సాయంత్రం అందరం పక్కనున్న తోటల్లోకి షికారుకెళ్ళాం. ఆ దగ్గరే ఒక మైదానంలో కొందరు యువకులు వాలీబాల్ ఆడుతున్నారు. రజా, సాజిద్‌లు పరిగెత్తుకుని వారి దగ్గరకు వెళ్ళి తామూ ఆడతామని అడుగుతున్నారు.
నేనూ, హైలమ్, మిరంజన్, దీపూజ్జల్ కాస్త దూరంగా నిలబడి ఎవరైనా పనసకాయలు కోసిస్తారా అని చూస్తున్నాం.
ఇంతలో వాలీబాల్ కోర్టు నుంచి అరుపులు.
మేం గబగబా అటు నడిచాం.
అక్కడున్న యువకులు సాజిద్, రజాలను కొట్టబోతున్నారు.
మేం మధ్యలోకి వెళ్ళి విడిపించాం.
”ఈ పాకీలు ఇక్కడికెందుకొచ్చారు? పొండి. లేదా మా చేతిలో చచ్చారే” అంటూ అరుస్తున్నారు.
మిరంజన్, షంగ్‌షమ్‌లు వెళ్ళి వచ్చీరాని బంగ్లాలో ”ఏదో కాన్ఫరెన్సుకి వచ్చారు. మేం ఇండియా నుంచి వచ్చాం. మీరు ఆవేశపడకండి. వాళ్ళను మేం తీసుకెళ్తాం” అంటూ సాజిద్‌ను, రజాను వెనక్కి నెట్టారు.
మహబూబ్, కుర్షిద్ వాళ్ళిద్దరినీ తీసుకుని వేగంగా అక్కడినుంచి గెస్ట్‌హౌస్ వైపు వెళ్ళిపోయారు.
రాత్రి పాటల కార్యక్రమం రద్దయింది. ఎవరికీ మూడ్ లేదు.
సాజిద్, రజాలను పాకిస్తానీయులనే కారణంతో వాళ్ళు కొట్టబోయారు. స్నేహ వాతావరణం కోసం కృషి చేసే సదస్సులో ఈ అపశృతి. జాకిర్ హుస్సేన్ సాజిద్, రజాలకు నచ్చచెబుతున్నాడు.
”మన దేశాల మధ్య జరిగింది ప్రజలింకా మర్చిపోలేదు”.
”అరె-అప్పటికి నేనింకా పుట్టలేదు. నేనెట్లా బాధ్యుడిని?” సాజిద్ కోపంతో మండిపడుతున్నాడు.
రజా మరింత సీరియస్ అయి మాట్లాడకుండా బిగుసుకుపోయాడు. ”ముప్ఫై ఏళ్ళు గడిచినా ఇంకా కోపం పోలేదా బంగ్లాదేశీయులకు. ప్రభుత్వాల మీదుండొచ్చు. సామాన్య జనం ఏం చేస్తారు?”
నేను లాహోర్ వెళ్ళినపుడు నాతో, నా స్నేహితులతో అక్కడి సామాన్య ప్రజలు ఎంత స్నేహంగా మాట్లాడారు.
రెండు దేశాల మధ్య శత్రుత్వం ప్రభుత్వాలు కల్పించినదే కానీ ప్రజలది కాదని వాళ్ళకు అర్థమైనట్లే ప్రవర్తించారు.
బజారు పక్కన టీ దుకాణాల వాళ్ళు, ఆటోల వాళ్ళు, షాపుల వాళ్ళు ఎంత ఆత్మీయంగా, గౌరవంగా చూశారు.
ఇక్కడ పరిస్థితి ఎందుకిలాగైంది? వీళ్ళ గాయాలింకా పచ్చిగా ఉన్నాయా? ఆ రాత్రి అందరికీ కలత నిద్రే అయింది.
ఈ సంఘటన మర్చిపోవడానికి మర్నాడు జరగాల్సిన కార్యక్రమంలో కొద్ది మార్పులు చేశారు. ప్రతి ప్రాంతం వాళ్ళూ ఏదో ఒక సాంస్కృతిక ప్రదర్శన ఇవ్వాలన్నారు.
ఉదయం ఐదింటినుంచీ ఎనిమిదింటి వరకూ ప్రాక్టీస్ చేసుకోవాలని అందరూ నిర్ణయించుకున్నారు.
ఈశాన్య రాష్ట్రాల వాళ్ళు నలుగురూ చీకూచింతా లేకుండా ఉన్నారు.
వాళ్ళకు పాటలకూ, నృత్యాలకూ కొదవే లేదు. శృతి, శిల్పి హిందీలో పాటా, డాన్సు ప్రాక్టీస్ చేస్తున్నారు.
జార్ఖండ్ మిత్రులు అరవింద్, సంజీవ్‌లు మహా నిశ్చింతగా ఉన్నారు. వాళ్ళు వాయిద్యాల సహితంగా వచ్చారు.
నేనేం చెయ్యాలి? పాడడం రాదు, ఆడటం రాదు.
దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ ఏకపాత్రాభినయం చెయ్యాలని, ఆ స్క్రిప్టు తెలుగులోంచి ఇంగ్లీషులోకి అనువాదం చేసుకునే పనిలో పడ్డాను. మూడు దేశాలకూ సంబంధించిన జాతీయోద్యమ ప్రస్తావన
ఉంటుంది గదా ఫరవాలేదనుకున్నా.
అందరం ఎవరి ప్రతిభ వాళ్ళు ప్రదర్శిస్తూ, నవ్విస్తూ, ఏడ్పిస్తూ చాలావరకు రాత్రి జరిగింది మర్చిపోయాం.
అసలైన ప్రదర్శన పాకిస్తానీ వాళ్ళది. హాల్లో జరుగుతున్న ప్రదర్శనలను ఆరుబయట రంగస్థలానికి మార్చారు. కాస్త మేకప్ కూడా వేసుకున్నారు. పల్లెల్లో పాకిస్తాన్ జన జీవితాన్ని ఏడెనిమిది మంది కలిసి ప్రదర్శించిన తీరు అపూర్వం. శ్రీశ్రీ అన్న ‘సమస్త వృత్తుల సహస్ర చిహ్నాలను’ కళ్ళకు కట్టారు. భారతదేశంలో, బంగ్లాదేశ్‌లో, పాకిస్తాన్‌లో ఎక్కడైనా గ్రామీణ శ్రామిక జన జీవిత సౌందర్యమొక్కటేనని నిరూపించారు. కన్నుల పండుగగా చూస్తుంటే ఇంతలో ఎక్కడినుంచో మధురమైన వేణుగానం. దూరంగా మొదలై దగ్గరకొస్తోంది.
ఎక్కడిదీ వేణువు? ఇంతవరకూ ఎవరూ వాయించలేదు.
ఎంత కల్లోలమైన మనస్సునైనా ప్రశాంతపరచగల వేణుగానం. ఎవరా అని చూస్తే మహబూబ్ కృష్ణుడి కంటే మధురంగా వేణువూదుతున్నాడు. ఆ ఆలాపన ఆగుతూనే అందరూ పాట అందుకున్నారు. ఒక్కొక్కరూ వచ్చి మమ్మల్ని వాళ్ళ గుంపులోకి లాక్కుంటున్నారు. అయూబ్ లాగుతుంటే ఆడలేననడానికి నోరు రాలేదు. అందరం కలిసి విశాలమైన ఆ ప్రాంగణంలో పచ్చని చెట్ల నీడన ఆడుతున్నాం.
ఆ క్షణాల్లో మా మనసుల్లో పొంగిన స్నేహామృతాన్ని దోసిళ్ళతో తాగేశాం.
మహబూబ్ అరవింద్‌ని కావలించుకుని ఏడ్చేస్తున్నాడు. అందరం ఉద్వేగ శిఖరాల అంచులకు చేరుకున్నాక అంతా ఆగిపోయింది. ఆయాసంగా కూర్చుని కలయజూస్తే ఈ సంబరానికంతటికీ ఒకే ఒక మౌనసాక్షిలా రోషనారా దూరంగా కూర్చుని ఉంది.
ఈ అమ్మాయి ఇక్కడికెందుకొచ్చినట్లు? స్నేహం చెయ్యలేని మనిషా? అలసట తీరి అందరం లోపలికి వెళ్ళాక కుర్షీద్ అందరికీ ఒక ప్రశ్న ఇచ్చి అంతర్ముఖులై ఒక అరగంట ఆలోచించుకోమన్నాడు.
”మిమ్మల్ని మీరు తొలిసారిగా దేనితో గుర్తించుకున్నారు? దేనితో మిమ్మల్ని మీరు కట్టేసుకున్నారు? దానినుంచి వేరుగా వెళ్ళాల్సి వచ్చిందా? అప్పుడు మీ అస్తిత్వ వేదన ఎలాంటిది? దీని గురించి ఆలోచించుకుంటే చాలు. అది ఇప్పుడు చెప్పనవసరం లేదు. నిశ్శబ్దంగా ఆలోచించుకోండి” అంటూ అతనూ నిశ్శబ్దమయ్యాడు.
నన్ను నేను తొలిసారిగా ఐక్యం చేసుకున్న నా యవ్వనారంభ సహచరి సామ్యవాదం – ప్రపంచంలోని బాధలన్నిటికీ, పరిష్కారమని నమ్మిన సామ్యవాదం. దానిని నేను విశ్వసించాను. అదొక్కటే వాస్తవమనుకున్నాను. ఆ విశ్వాసపు రోజుల నుండి అవిశ్వాసానికి జరిగిన ప్రయాణం విషాద కావ్యం. ఆ ప్రయాణంలో పోరాటం ఉంది. కానీ విషాదం విషాదమే. నా ఏక తెలుపులో క్రమంగా వ్యాపించిన నల్లదనం. నేను దేనికి చెందానో, చెందాననుకున్నానో అదిలేదు. ఉన్న రోజుల్లో కూడా నేననుకున్నట్లు లేదు. ఎలాగోలా ఉంటే చాలనుకున్నా. సోవియట్ పతనానంతరం నా వేళ్ళు పూర్తిగా తెగిపోయాయి. నేను పెళ్ళగించబడ్డాను. అదంతా తలచుకుంటే ఎంత బాధ, దుఃఖం. పది నిమిషాలలో ఆ బాధంతా నా మీదకు వచ్చి కన్నీటి చుక్కలుగా నా చెంపమీద జారింది.
కుర్షిద్ ఆ ప్రశ్నను కుల, మతపరంగా అడిగాడు. అతనికి నా మతం తెలియదు.
నిశ్శబ్ద సమయం గడిచాక, తమ అనుభూతులను పంచుకోదల్చిన వాళ్ళు పంచుకోవచ్చన్నాడు కుర్షిద్. బలవంతం ఏమీ లేదు.
కొందరు తమ కమ్యూనిటీల గురించి, వాటిలో వచ్చిన తేడాలతో జీవితాలలో వచ్చిన ఆటుపోట్ల గురించి చెప్తున్నారు.
సొహైల్ తన ప్రేమ గురించి చెప్పాడు. క్రిస్టియన్ అయి ఉండి ముస్లిం అమ్మాయిని ప్రేమించాడు. అమ్మాయి వైపు పెద్దలు ఒప్పుకోలేదు. ఇతను బాధపడి అవివాహితుడిగా మిగిలిపోయాడు. మతాలు మనుషుల్ని వేరు చేయటం గురించిన సమస్య అతని జీవిత సమస్య. జీవితంలో ఓడిపోయినా దాని గురించి పని చేస్తున్నాడు.
రోజులు గడిచిపోతున్నాయి. పగలంతా బుర్రలు వేడెక్కేలా మాటలు. రాత్రికి ఆ వేడిని చల్లబరిచే సంగీతాలు.
సాజిద్ రోషనారాను పలకరించబోవటం, ఆమె విసుగ్గా ముఖం తిప్పుకోవటం నాలుగైదుసార్లు నా కంటబడింది. హైలమ్, జూలియానాలు కూడా చూశారు.
ఫైజా, రోషనారాల మధ్య మాటలే లేనట్లు ఉంది.
ఫైజానడిగితే ”దగ్గర కాలేనప్పుడు కాస్త దూరంగా ఉండటమే మేలు కదా” అంది.
జాకీర్ హుస్సేన్, జపా నిజానికి పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయినపుడు పదహారేళ్ళ వయసులో ఉండుంటారు. వాళ్ళు అందరితో బాగుంటున్నారు.
ఈ రోషనారాకేమయింది?
”అసలు రోషనారా ఈ వర్క్‌షాప్‌కి రావటం అనవసరం” అంది హైలమ్ విసుగ్గా.
”మనందరికంటే రోషనారాకే ఈ వర్క్‌షాప్ అవసరముందేమో” అన్నాను నేను.
”అలా అంటారా” అని ఆలోచనలో పడింది హైలమ్.
ఇక చివరిరోజు రానే వచ్చింది. అందరిలో ఒకవైపు ఇళ్ళకు వెళ్తున్నామనే ఆనందం. ఇంకోవైపు ఇక్కడ ఈ మంచి వాతావరణం నుంచి వెళ్ళిపోవాలనే దిగులు. ఏది ఎక్కువో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఆ రోజు ఢాకా నగరంలో తిరిగి షాపింగ్ చేసుకుని రాత్రికి తిరిగి రావాలి. మర్నాడు మధ్యాహ్నం నుంచీ ఒక్కొక్కళ్ళు ఒక్కో సమయంలో ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళిపోతారు.
ఢాకా నిండా సరస్సులే. లేక్ సిటీ అని ఎందుకనలేదో. చిన్న, పెద్ద సరస్సులు, విశాలమైన తోటలు, ఎక్కడ చూస్తే అక్కడ విరగగాసిన పనస చెట్లు, విశాలమైన తోటలు, తాటిచెట్లు, నిండా గెలలతో ఉన్న ఈత చెట్లు… వీటన్నింటితో పాటు స్పష్టంగా కనబడే బీదరికం. అన్నీ ఉన్న ఢాకా నగరాన్ని చూస్తుండగా హఠాత్తుగా వర్షం. కాస్త వర్షానికే ఢాకాలో వరదలొస్తాయని మాకు తెలియదు. ఐతే వరద ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా పోతుంది. ఓ గంటన్నర వరదలో చిక్కుకుని, మరి వేరే ఎక్కడికీ ఆ వర్షంలో వెళ్ళే సాహసం చేయక తిరిగి వచ్చేశాం. షాపింగ్ సరదా వరద పాలైంది.
మర్నాడు ఉదయమే హైలమ్ నిద్ర లేపేసింది. ”నా ఫ్లయిట్ మధ్యాహ్నం రెండింటికి” అన్నాను కోపంగా.
”అందుకే లేపాను. త్వరగా తయారైతే అందరం షాపింగ్‌కి వెళ్దాం. నువ్వు సూట్‌కేస్ తెస్తే అట్నుంచి అటే ఎయిర్‌పోర్టుకి వెళ్ళొచ్చు. ఒకటి, రెండు గంటల తేడాతో అందరం వెళ్ళిపోతున్నాంగా” అంది.
నేను బద్దకిస్తుంటే బతిమాలి, పాకిస్తాన్ వాళ్ళను ఒప్పించటానికి వెళ్ళింది.
ఉదయం ఫ్లయిట్‌కి వెళ్ళేవాళ్ళు వెళ్ళిపోతే ఆరుగురు పాకిస్తానీలు, నలుగురు ఇండియన్లు ఉన్నాం. అందరూ షాపింగ్ జ్వరంతో వణుకుతున్నారు. పెద్ద వ్యాన్ కావాలని ఫోన్ చేసి ఎదురుచూస్తూ కూచున్నాం.
మిరంజమ్, షంగ్‌షమ్ లేకపోవడం వల్ల నవ్వులే లేవు.
రజా వచ్చి కబుర్లు మొదలుపెట్టాడు. రజాకు ఇంగ్లీషు రాదు. యమ స్పీడుగా ఉర్దూలో మాట్లాడతాడు. అతని ఉర్దూ వెంట పరిగెత్తలేక, నవ్వలేక చావాల్సిందే.
పెద్దల నెదిరించి రెండు నెలల క్రితం ప్రేమించిన అమ్మాయిని నిఖా చేసుకున్నాడట. ఆ అమ్మాయి, తనూ కలిసి మానవ హక్కుల కోసం లాహోర్‌లో జరిగిన ఊరేగింపులో పాల్గొన్నప్పటి ఫోటో అక్కడి న్యూస్ పేపర్లో పడితే అది గర్వంగా చూపెట్టాడు.
రజా వాళ్ళది ఫ్యూడల్ కుటుంబమట. జమీందార్లట. ఆ అమ్మాయి మధ్య తరగతి. పెద్దవాళ్ళు చాలా రోజులే అడ్డు చెప్పి ఇక ఊరుకున్నారు. నిఖా అయింది కానీ పెళ్ళి కాలేదట. వేరు వేరుగానే ఉంటున్నారు. పెళ్ళికి పిలుస్తానని మాటిచ్చాడు.
అమ్మాయిలు అతని వెంట పడతారని ఆమెకు జెలసీ అట. అది సహజం. డాన్సు చేయడం మొదలుపెడితే ఇక అమ్మాయిలు అతని వెంట పడకుండా ఉండలేరు. ఆ అమ్మాయికి ఇంగ్లీషు బాగా వచ్చని గర్వంగా చెప్పాడు.
ఆ అమ్మాయికి, తల్లికి, చెల్లెళ్ళకు మంచి బెంగాల్ కాటన్ చీరలు కొనడంలో సాయం చేయాలని అడిగాడు.
సాజిద్ గురించి చెప్పమంటే…
”ఆ రోషనారా సాజిద్ ఉత్సాహమంతా చంపేసింది. నిన్న ఇద్దరూ గొడవపడ్డారు. వీడు చెప్పేది వినిపించుకోకుండా తనిష్టం వచ్చినట్లు మాట్లాడింది. వీడికెందుకో ఆ అమ్మాయంటే అంత ఆకర్షణ. అదంతా నిన్నటితో అయిపోయింది. ఇప్పుడు రోషనారా అంటే మండిపడుతున్నాడు” అన్నాడు.
పది రోజుల్లో స్నేహ ప్రయత్నాలు వికటించి ద్వేష బీజాలు మొలకెత్తాయా అనుకున్నాను.
ఇంతలో వ్యాన్ వచ్చింది. షాపులు తెరవక ముందే షాపింగ్‌కి బయల్దేరారు. పది కూడా అవకుండా ఏం చెయ్యాలనుకుంటుంటే డ్రైవర్…
”ఇక్కడొక మ్యూజియం ఉంది చూస్తారా?” అని అడిగాడు.
”చూస్తాం, చూస్తాం” అని అరిచాం అందరం.
”ఏదో ఒకటి త్వరగా నిద్ర లేచినందుకు గిట్టుబాటు కావాలి” సాజిద్ గుండు మీద కొట్టాడు రజా.
”అరే భంగూ” అంటూ సాజిద్ తరుముతుంటే రజా మ్యూజియంలోకి పరిగెత్తాడు.
హఠాత్తుగా పరుగు ఆగింది. మేమూ వాళ్ళను చేరాం. అందరం నిశ్శబ్దమయ్యాం.
ఎదురుగా పాత తుపాకులు వరుసగా ఉన్నాయి. ఇదేమిటని చూస్తే అది బంగ్లాదేశ్ విముక్తి యుద్ధానికి సంబంధించిన మ్యూజియం. లోపలికి వెళ్తే గుండెలు పగిలే దృశ్యాలున్నాయి.
పాకిస్తాన్ సైనికులు చేసిన అకృత్యాలకు సాక్ష్యాలున్నాయి. అత్యాచారాలకు గురైన అమ్మాయిల ఫోటోలు, ఆ వివరాలు వరుసగా… తమ భాష కోసం స్వేచ్ఛ కోసం పోరాడి పాకిస్తాన్ సైనికుల కిరాతక హత్యలకు బలైన విద్యార్థుల ఫోటోలు, వివరాలు ఉన్నాయి. ఆయుధాలున్నాయి. ప్రతిఘటనలోని ముఖ్య ఘట్టాలన్నీ ఉన్నాయి. చివరికి పాక్ సైనికుల చిత్రవధల్లో మరణించిన వ్యక్తుల పుర్రెలు, ఎముకలు… కడుపులో చేయిపెట్టి తిప్పినట్లయింది. గొంతులో దుఃఖం ఆగకుండా ఉంది.
నా పరిస్థితి ఇలా ఉంటే పాకిస్తాన్ వాళ్ళెలా ఉండి ఉంటారు. వాళ్ళ ముఖాలు చూడాలంటే భయం వేసింది. సాజిద్, రజాలు ఎలా రియాక్టవుతారు.
ఆఖరి దృశ్యంగా ఇది మిగులుతుందా? దీని ఫలితమేంటి. ఒకటే గుబులుగా ఉంది మనసులో.
ఈ కిరాతక చర్యలతో, ఈ యుద్ధోన్మాదంలో వ్యక్తులుగా వాళ్ళకేం సంబంధం లేకపోవచ్చు గాక, కానీ చరిత్ర వాళ్ళదే.
ఆ చరిత్రను చెరపడం తేలిక కాదు. ఆ చేదుని, ఆ విషాదాన్ని ఈ యువకులు మింగగలరా? మింగలేకపోతే ఏమవుతుంది.
నేను ఎవరివంకా చూడకుండా మ్యూజియం నుంచి బైటికొచ్చి వ్యాన్‌లో కూర్చున్నాను.
అరగంట తర్వాత మిగిలిన వాళ్ళొచ్చారు. అంతా నిశ్శబ్దంగా ఉన్నారు. నేనెవరి ముఖాల్లోకి చూసే సాహసం చేయలేదు.
”రోషనారా పనిచేసే ఆఫీసుకు వెళ్దాం” సాజిద్ మెల్లిగా అన్నా ఆ నిశ్శబ్దంలో అది గట్టిగానే వినపడింది.
”ఎందుకు?” అంది హైలమ్ ఆందోళనగా.
”మీరు వస్తానంటే అందరం వెళ్దాం. లేదంటే నేను టాక్సీలో వెళ్తాను” అన్నాడు సాజిద్ స్థిరంగా.
”నేనూ వస్తా” అన్నాడు రజా.
మహబూబ్, అయూబ్, సొహైల్, జూలియానా ఏమీ మాట్లాడలేదు.
”అందరం వెళ్దాం” అన్నాను నేను.
డ్రైవర్‌కు రోషనారా అడ్రసున్న కార్డు ఇచ్చాం.
వ్యాను వెళ్తోంది. ఒక్క మాట లేదు. వచ్చేపుడు రజా, సాజిద్‌ల నవ్వులతో, సొహైల్ పాటలతో సాగిన వ్యానునిండా విషాద నిశ్శబ్దం.
వ్యాను ఆగింది. ఒక్కొక్కరే దిగారు.
ఎందుకిప్పుడు రోషనారాను కలవటం?
బహుశ అందరిలో ఈ ప్రశ్న ఉందేమో.
ఆఫీసులో రోషనారా గది ఎక్కడో కనుక్కుని వెళ్ళాం. పన్నెండయింది. పన్నెండు నుంచి ఒంటిగంట వరకు వాళ్ళకు లంచ్ టైం.
అందరూ విశ్రాంతిగా ఉన్నారు. అటూ ఇటూ తిరుగుతున్నారు.
రోషనారా గది ముందు నిలబడ్డాం.
లోపల రోషనారా నవ్వుతూ ”భంగూ, కోసీ” అంటూ రజాలా డాన్స్ చేసి చూపిస్తోంది. తన చుట్టూ నలుగురమ్మాయిలు నవ్వుతూ చప్పట్లు కొడుతున్నారు.
మమ్మల్ని చూడగానే ఫ్రీజ్ అయినట్లయిపోయింది.
నోరు తెరిచి మమ్మల్నే చూస్తోంది.
సాజిద్ ముందుకొచ్చాడు.
”రోషనారా, నన్ను క్షమించు”.
గంటకు పైగా నిగ్రహించుకున్న దుఃఖం పైకి తన్నుకొచ్చింది.
రజా కూడా ఆ దుఃఖంలో గొంతు కలిపాడు.
మహబూబ్, అయూబ్, సొహైల్‌లు చేతులు జోడించారు.
”నాకు తెలియదు. ఇంత జరిగిందని తెలియదు. చాలా దారుణం. నా దేశం తరపున నేను నీకు క్షమాపణ చెబుతున్నాను”.
నిమిషాలు గడుస్తున్నా దుఃఖం ఆగటం లేదు.
అందరం కన్నీళ్ళు కారుస్తున్నాం.
రోషనారా కూడా ఏడుస్తూ సాజిద్ చేతులు పట్టుకుంది.
”క్షమించు రోషనారా. నువ్వు చిన్నతనం నుంచీ ఆ మ్యూజియం చూస్తూ పెరిగావనీ, ఆ చరిత్ర పాఠాలుగా చదువుకుంటూ పెద్దయ్యావని నాకు తెలియదు గదా. నన్ను ద్వేషించటానికి నీకు హక్కు ఉంది. క్షమించే హృదయం లేదా?”
ఆ ఆనంద విషాద వాతావరణాన్ని, మా హృదయాలలోని బరువుని, తేలికదనాన్నీ కొలిచేందుకు పరికరాలే లేవు. పలికేందుకు మాటలే లేవు.
ఆటపాటలతో వికసించని స్నేహ సుమం పశ్చాత్తాపంలో, దుఃఖంలో వికసించింది. నవ్వులలో వ్యాపించని స్నేహ సుగంధం వెక్కిళ్ళలో ఆ ప్రదేశమంతా అలుముకుంది. కాసేపటికి… అందరూ కన్నీళ్ళు తుడుచుకునే సమయానికి సొహైల్ పాట అందుకున్నాడు.
ఏక్ ప్యార్ కీ నగ్మా హై…
అందరూ గొంతు కలిపారు.
రజా, సాజిద్, రోషనారా, హైలమ్ నృత్యం చేస్తున్నారు.
రోషనారా సాజిద్ గుండుమీద తబలా వాయిస్తోంది.
రజా పాము డాన్స్ చేస్తూ హైలమ్ మీదకు దూకుతూ జడిపిస్తున్నాడు.
మహబూబ్ సంచిలోంచి వేణువు పైకి తీసి గానం చేస్తున్నాడు.
ఆ గదంతా ప్రేమ పరిపరి విధాలుగా పరిభ్రమిస్తోంది. ఆలింగనాలతో పులకరించి పోతోంది.
(ఃమృణ్మయనాదంః నుండి…)