ఏందో యీ ఎండలు, మెండలు సల్లగుండాంటె యిండ్ల పెండ్లీలో పెండ్లీలు తెగవచ్చినయి. అట్లా మా అన్న బిడ్డె పెండ్లి ఉందంటే అక్కలు, బావలు, వదినెలు, అన్నలు వాళ్ళ పిల్లలు ఇంకా సుట్టా బందువు లంత కలుస్తరనీ యెండలు యెర్రసీమలాగ మాడుకుంట బొయిన ఊరికి. బందుసేనలో చాన మంది రాలే. ఏందంటే కరువు పని ఇడ్సిపెట్టి యాడొద్దుమన్నరట. మా చిన్నక్క గూడ కలువలే పెండ్లిల. సరే పెండ్లిల కలువ లేదని ఆమె ఊరికి బొయిన. గూడెంల చిన్న పిల్లలు, ముసలోల్లే ఉన్నరు. మామూలు చేతనైన ముసలోల్లుగూడ బోతరు ఉపాధి హామీ పనికి. మరీ చాతగాని లేవలేని ముసలోల్లే ఇండ్లకాడ ఉన్నరు.
మా అక్కను పెండ్లికెందుకు రాలే దని అడిగిన్నో లేదో ఇగ ఆమె ‘కరువు పని’ సొదంత గుది గుచ్చింది.
ఎట్లరాను సెల్లె గీ ‘కరువు పనిని’ ఇడ్సిపెట్టి ఎట్లద్దు. ఎప్పుడో యాడాది కోపాలి అత్తది. అదీ ఎండకాలంలనే అత్తదాయె. గీ యెండలు పాడువడ యేమెండలు గొడ్తన్నయి, నిప్పులు గుర్తన్నయి. సెవుల్ల గల్లలు బడ్తన్నయి యెండ గాలికి. కొందరైతే యెండ దొబ్బగొట్టి సచ్చిపోతండ్రు. ఒక్కరోజు పోకున్నా పేరు తీసేసినమని పిల్లలాపీసరు (ఫీల్డ్ ఆఫీసర్) మేటుగాడు యెల్లగొడ్తరు. ఆల్లను బతిమాలి, గీమాలితెగాని యినరు. ఏమన్న ఎక్కువ తక్కువ నాయం మాట్లాడితే తీసేత్తమని బెదిరిత్తరు. గింత ఆలిషమైనా కట్టమే వూకోరు.
గాల్ల బాదకు తాల్లలేక పొద్దుగాల లేసి రాత్తిరి దేమన్నుంటె సల్లబడి యింట్ల ఏం బట్టక ఉర్కుతమ్. ఏమి లేకుంటె నోట్లె నీల్లు బోసుకోకుంటనే పోతం. మల్లా అంబటాల్లకు సురసుర ఎర్రటెండలల ఒక్కొక్కలు గసగసమను కుంట గావరైతరు. అయినామల్లా తెల్లారి కరువు పనికిపోతనే ఉంటము.
గీ కరువు పని నిన్న మొన్నటిదాకా ఓ పదేనేండ్ల సందున్న పనేనాయె. గప్పటి కాన్నుంచి సేత్తన్న. ఇదువరకున్నట్లో లేదు శాన మారింది. పని మారింది, పైస మారింది. మొదట్ల గింత పంజేత్తే గింత కూలిత్తమని లేదు. ఎంత జేసినా రోజూ కూలింతని
ఉండేది సెల్లే… గిప్పుడు కాలువలు గజంలోతు గజం ఎడల్పు, గజం పొడుగు దవ్వితె రొండువందలిత్తండ్రు. అది 15 రోజులకు ఓ సారి ఇత్తండ్రు. ఓ యిచ్చే రోజు లొల్లి లొల్లి జేత్తరు. నువ్వు గింతే తవ్వినవంటే… గింతే మోసినవంటే… గింతే పైసలని సెప్తేరు అళ్ళ యిసాబే అర్తం గాదు.
కరువు పనంటేనే మా అసోంటి పేదోల్లకు, కూలికైకిలోల్లకాయె. ఇండ్ల చానమంది కుంటెనెగాండ్లు మోపై శాన రాయకీయాల్జేత్తరు సెల్లే…
యీసంల మాసం గిట్టిచ్చుకుంటరు గాడుదులు. మా నోట్లె మన్ను గొడ్తరు. సేసిన పనులగ్గూడ ఎగ్గొడుతరు ఏం జేత్తమ్ ఆడుతమ్, లొల్లిబెడ్తమ్ మల్లా ఆనికిందికే పోక దప్పదాయె.
పేదోల్లకు ఊరు కదులకుండ
ఉంచాలంటె గౌరుమెంటు గీ కరువు పని మోపుజేసింది. లేకుంటే ఏ పట్నం బొయినా బత్కుతము. దేశాలు గొడ్డుబోయినయా! గీ పిల్లలాపీసరు, మేటుగాడు పదిమందికొక్క డుంటరు. ఆల్లే ఆజిరి తీస్కుంటరు. ఈల్లేంజేత్త రంటే… ఊల్లె నుంచి సూదరాడోల్లత్తే… మట్టి పని బరువు పని సేపియ్యరు, వాళ్ళను సెట్టు కింద కూసోబెట్టి ఆజిరేసి కూలిత్తరు. ఇగ మన మాదిగాడోల్ల నైతే… గింత కూసోనియ్యరు పస్రాలను (పశువుల్ని) గెదిమినట్లే గెదుము తరు. వానకాలం సలికాలంలల్ల పంట లుంటయి అంతో ఇంతో… కూల్లు దొర్కుతయి. గీ ఎండకాలం ఏం కూల్లుంటయి ఏముండయాయె. ఏమి తింటము ఎట్ల బత్కుతము. అందికే ఈ కాలంల పట్నం బోదుము. గీ ‘కరువు పని’ అచ్చినకాన్నుంచి ఊల్లెనే ఉంటున్నము. పొయేటోల్లు కొందరు బోతనే ఉన్నరు. మేము పొయి పొయి శాతగాక పట్నం బొయి పంజేసుడు సాలిచ్చుకున్నం. గీ కాలంల గీ కరువు పనే బాగ ఆసరైతది. కూరనారకు, ఉప్పుకు తొక్కుకు, నిప్పులు గురిసే యెండలున్నా, ఎండ దెబ్బగొట్టి, పాములు తేల్లు గరిసి సచ్చిపోయినా గీ పనికి పోకుంట మానము. ఆకలి మంటసోంటిది. ఈ మంట ముందట ఎన్ని నిప్పులు గురిసే ఎండలైనా బలాదూరే. గా మొన్న నారాయన కాడ ఊల్లెనాట గీల కరువు పనికిబొయి పదిమందాడోల్లు మట్టి గూలి సచ్చి పోయిండ్రట. గది టీవీల జూసినంక బువ్వే తినబుద్దిగాలే. శాన దుక్కమచ్చింది. గీ సారు గాల్లు బాడ్కావులు పంజేసేగాడ గీంత నీల్ల కుండ బెట్టరు, నీడ సౌలతికి గింత పందిరో, టెంటో యెయ్యరు. ఎండకు గుల్కోసు నీళ్ళు గూడ యియ్యాల్నాట. నీల్లే పెట్టనోల్లు గుల్కోసునీల్లిత్తారు! మేమే ఇంట్లకెల్లి నీల్ల సీసాలు కొంటబోతము. ఎండకు తాలలేక ఆ సెట్టు కిందికి ఈ సెట్టు కిందికి ఉరుకుతము. గీ సెరలు ఎవ్వలికి రావద్దు సెల్లే.
ఇగ వూల్లె ఆడోల్లనోతీరు సూత్తరు. మాదిగోల్లను, మాదిగాడోల్లనో తీరు సూత్తరు. వాళ్ళను సెట్లు నాటిత్తరు, శాతగాదంటె కూసోండ్రంటరు. మమ్ములనైతే పతాకమ్ మట్టి మోపిత్తరు. తల్కాయ నొత్తంది సారూ, కాల్లు గుంజుతున్నయి సారూ అంటే… చాత గాకుంటె ఎందుకత్తరు పోండ్రి ఇంటికి పైసల్లేవు, ఏమిలేవు అడుగొద్దు అని గంజి తీగెను తీసేసినట్లు తీసేసి మాట్లాడ్తరు. గయన్ని దిగమింగుకుంట పంజేత్తము. గిట్లాంటి పాయిదేర్లతనాలు జూపిత్తరు. కరువు పనిల పెద్దపని సెరువుల బంటాల్దీయాలె, కాలువలు దవ్వాలె. గీ కాల్వల నీళ్ళు ఎవల పంటలక పోతయి? బూములున్న పెద్ద కులాల పంట లకు బోతయి. గీ కాల్వలతోని మా అసోంటి గుంట సెంటు లేని కూలీల్లకేమి ఫాయిద.
గీ బూములున్న సాములకు నీల్లు పారియ్యనీకి మా అసోంటి సిన్న కులాలకు రోజు కూలిచ్చి గీ కరువు పనితోని పేదోల్లను, పెద్దోల్లను జేత్తన్నమని పేపర్ల నిండడ, టీవీల నిండ మొత్తుకుంటదేంది? పేరు మాది ఊరు వాల్లది.