ఎడ తెగని అలలు… గంభీరంగా శబ్దం చేసుకుంటూ వచ్చి గలగలమని, వెనక్కెళ్ళిపోతున్నాయి. సూర్యాస్తమయపు కాంతి అలల నురగపైన లేత ఎరుపు రంగులో ప్రతిఫలిస్తోంది. చేపల వేటకి సముద్రం మీదకి వెళ్ళిన గంగపుత్రులు తెరచాపలెత్తి పడవల్ని తీరంవైపు తీసుకొస్తున్నారు. పోర్టులోకి రాడానికి అనుమతికోసం ఎదురుచూస్తూ సముద్రంలోనే లంగరువేసి ఆగిన భారీ ఓడలు తీరాన్నించి ఆటబొమ్మల్లా కనిపిస్తున్నాయి. దూరంగా కొండమీది లైట్‌హౌస్‌పైన గుండ్రంగా తిరుగుతున్న లైటు తీరం ఇక్కడుంది వచ్చెయ్యండని ఎక్కడో మైళ్ళదూరాన అంతూ పొంతూలేని జలనిధిలో ప్రయాణిస్తున్న నౌకలకి దిక్కును సూచిస్తోంది.
సముద్రపు గాలితో జత కట్టిన మేఘాలు భూతాపాన్ని చల్లబరచడాని కన్నట్టు బిరబిరావస్తున్నాయి. మెత్తటి ఇసుక తిన్నెల మీద కూర్చుని సేదుతీరుతున్న జనం రాబోయే వర్షాన్ని తలుచుకుని ఇళ్ళదారి పడుతున్నారు. క్రమేణా ముసురుతున్న చీకట్లను బీచ్‌రోడ్లో సైనికుల్లో నిలిచిన తెల్లని లైట్లు పారదోల లేకపోతున్నాయి. ఆ చిరు వెలుతుళ్ళ చిమ్మ చీకట్లు గమ్మత్తైన భావాల్ని రేపుతున్నాయి. ఆనందాను భూతుల్లో మునిగిపోయిన శాంతిని ఓ పిల్లగాలి, ఆ వెనకే ఓ సన్నటి వానజల్లు పలకరించడానికనట్లు వచ్చిపడ్డాయి. దాంతో ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చినట్లైంది… గబుక్కున ముక్కు మూసుకుంది!
తను కూర్చున్న చోటుకి వంద గజాల దూరంలో సముద్రంలో కలుస్తున్న మురుక్కాలవ… ఒక్కసారిగా పొంగి తనమీద కొచ్చేసినట్లనిపించింది. ఆ వాసనకి బీచ్‌కి సేద తిరడానికొచ్చిన ప్రతి ఒక్కరూ ఒక ప్లాస్టిక్ కవర్నో, నీళ్ళ సీసానో, ధర్మాకోల్ ప్లేట్లనో, టీ కప్పుల్నో, పళ్ళ తొక్కల్నో, మిగిలిపోయిన చిరుతిళ్ళనో తమ గుర్తుగా అన్నట్టు సముద్ర తీరాన వదిలేసి పోతున్నారు. ఆ గుర్తుల బరువులు మోయలేక తనలోకి లాక్కుంటూ… ఇముడ్చుకోలేక బైటికి నెట్టేస్తూ… తెగ హైరానా పడుతోంది సాగరం.
ఇంకోచోట, తమకేదో కొత్త ఆహారం దొరికిందని ఆశపడ్డ చేపలు / జలజీవులు నిర్జీవంగా, ఒడ్డుకి కొట్టుకొచ్చి పడ్తున్నాయి. కర్మాగార వ్యర్థాలు, మురిక్కాలవలద్వారా చేరుతున్న రసాయనాలు అలల తాకిడికి నురగల్ని సృష్టిస్తూ కొన్ని మైళ్ళ దూరం వరకు సముద్రంలో కలిసి చేపలకి, తాబేళ్ళకి ఊపిరి సలపనివ్వకపోతున్నాయి. మరోచోట, యురేనియం వ్యర్థాలు కూడా కలిసిన సముద్రపు అలలు చీకట్లో మిణుగురు పురుగుల్లా మెరుస్తున్నాయి. వాటిని మింగి మెరుపుల్లా ఎగిరిపడ్డ చేపలు మనకి ఆహారమై మనలోకే ఆ రసాయన వ్యర్థాలని కొద్దికొద్దిగా చేర్చుతున్నాయి. సహజవాయువు, తైలాల కోసం వేసిన రిగ్గులనుండి, ఎగిసే మంబలతో సహా వాయుకాలుష్యానికి తోడ్పడుతున్నాయి. అతి సన్నటి ఐరన్ ఓర్ పొడి గాలిలో కలిసిపోయి జనాల ఊపిరితిత్తుల్లో చేరిపోతుంటే, గంధకపు నిల్వలు కళ్ళని, ముక్కుల్ని మండిస్తుంటే… మనుషులూ అంతుపట్టని రోగాల బారిన పడుతున్నారు.
ఇంకో పక్క ఉప్పు కయ్యల్లోనూ ఇవన్నీ చేరి, ఉప్పు తినే వారందర్నీ తమలో కలిపేసుకుంటున్నాయి! వీటన్నింటితో పాటు శాంతి కళ్ళముందు గంగ వరంలో సముద్రం నుంచి దూరంగా తరిమేయబడ్డ గంగపుత్రులు ‘మా సముద్రం పోనాది బాబో…’ అని బాపురుమంటూ కనిపిస్తున్నారు. సముద్రానికి ‘కంచె’ వేసి ‘ప్రైవేటు’ చేసుకున్న బడా వ్యాపారులు, తీరాన్ని ఆక్రమించుకుని కంపెనీలూ, కర్మాగారాలూ (ఎవరి అభివృద్ధికో…!!), టూరిజం పేరుతో వక్ర వ్యాపారాలు చేస్తున్న రిసార్టులూ, హోటళ్ళూ… తమ స్థావరాల్ని, జీవనోపాదుల్ని, బతుల్ని దెబ్బతీస్తుంటే… గంగపుత్రులు దిక్కు లేకా… కొంత కసితోనూ… పెద్ద ఓడల్లో వచ్చిన మాదక ద్రవ్యాలని తమ చిన్న పడవల్తో తీరానికి తెచ్చి ‘దందా’ చేస్తే… పోలీసులు, ఎక్సైజ్ వాళ్ళు ఇంకా ఎవరెవరో… అందరికీ మేమే టార్గెట్టా…! మమ్మల్నీ స్థితికి నెట్టిన ‘పెద్దల’ంతా’ మమ్మల్ని మట్టేసి మా జీవశవాలమీద అందలమెక్కినా ఎవరికీ పట్టింపులేదా అంటూ ఘోష పడుతున్నారు.
ఇటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ, పర్యావరణ పరిస్థితుల్లో ఎవరెటువైపు… అందమైన లోకాన్ని విధ్వంసం చేస్తున్న మనిషికి తన మనుగడే ఓ చిక్కు ప్రశ్న కాదా? ప్రకృతి విధ్వంసం మానవాళి విధ్వంసం కాదా? ఏదీ జవాబు? లోనంతా ఘోష… ఎదుట సముద్రపు ఘోష…