మంకెన పువ్వు పేరుతో ఉమా నూతక్కి కొత్త కాలం ఈ సంచిక నుండే ప్రారంభమౌతోంది. పాఠకులు గమనించగలరు. ఎప్పటిలాగే దీనిని కూడా ఆదరిస్తారని ఆశిస్తూ…
– ఎడిటర్
‘సింధూరం, రక్తచందనం,
బంధూకం, సంధ్యారాగం,
పులిచంపిన లేడినెత్తురూ,
ఎగరేసిన ఎర్రని జెండా,
రుద్రాలిక నయన జ్వాలిక,
కలకత్తా కాళిక నాలిక…’
…నవకవనానికి కావాలన్నారు కదా శ్రీశ్రీ! ఇదిగో ఇదే ఆ బంధూకం – అంటే మంకెన పువ్వు!
‘బంధూక పుష్ప సంకాశం – హార కుండల శోభితం…’
– అని ఉదయాన్నే చదివే ‘సూర్యాష్టకం’లో కూడా అదే బంధూకం – మంకెన పువ్వు.
‘మామిడీ చిగురెరుపూ మంకెన పువ్వెరుపూ
మణులన్నింటిలోనా మాణిక్యం ఎరుపూ…’ అంటారు కదా కృష్ణశాస్త్రి! అలా ప్రాచీనం నుంచి ఆధునికం దాకా, కాలాలకీ, భావాలకీ, సంపాదాయాలకీ ఒక పక్క కట్టుబడుతూనే, మరో పక్క సంబంధం లేని స్వతంత్రతే – మంకెన పువ్వు.
‘మంకెన పూలు’ పేరుతో ఒక శీర్షిక కింద రాద్దామను కున్నప్పుడు మంకెన పువ్వు లానే నిబద్ధ స్వేచ్ఛ, విశృంఖల చెరవంటి సఱషష్ట్రశ్‌ీశీఎఱవర రాసే అవకాశం ఈ శీర్షిక ద్వారా కలుగుతుందని అనిపించింది. అదే ప్రోద్బలం. నిజానికి నేనేమీ అలవోకగా రాయగలిగిన చేయితిరిగిన రచయిత్రిని కాదు. కానీ, రచన అంటే ‘అభ్యాసం కూసు విద్య’ వంటిది కాదు కాబట్టి నా అనుభవమే దన్నుగా రాయాలని నిశ్చయించుకున్నాను. ఐనా కొంచెం బెరుగ్గానే ఉంది. కారణం, చెప్పదలచుకున్నది చెప్పగలిగే శక్తి ప్రోది చేసుకున్నా, చెప్పుకునే పరిస్థితి ఉందా… అన్నదే ఇప్పుడు ప్రశ్న!
మన చిన్నప్పుడు తమకి నచ్చినవీ, నచ్చనివీ స్వేచ్ఛగా, యథేచ్ఛగా మాట్లాడుకోవడానికి మన అమ్మలకీ, అమ్మమ్మలకీ కాస్త చోటుండేది… అరుగుల రూపంలో! తలుపులు లేని మంచి అరుగులు. అంటే తలుపులు చెడ్డవనేమీ కాదు. కాకపోతే చిక్కంతా తలపులకి వేసుకునే తలుపుల గురించే.
తలుపులు వేసున్నప్పటికీ కాస్త ప్రయత్నించి ఒక రెక్కని కాస్తంత ఓరగా తీసి బైటకి తొంగిచూస్తే ఎలా ఉంటుంది? అసలు మూసి ఉన్న తలుపుల అవతల ఎల్లలు లేని లోకాన్ని ఊహించుకుంటే చాలా గొప్పగా ఉంటుంది కదూ! ఆలోచనలకి రెక్లలొచ్చినట్లూ కొత్త దృశ్యాలేవో ఆవిష్కరింపబడే అవకాశమున్నట్లూ అనిపించదూ…
అసలు చిక్కంతా ఎక్కడొస్తుందంటే మనం ఊహించు కున్నంత వరకూ పర్వాలేదు. మాట్లాడితేనే కష్టం.. ఆవేశం తెచ్చుకుంటే ఇంకా కష్టం… ఆవేశం దాటి పదండి ముందుకు… పదండి తోసుకు… అంటూ నడకా… పరుగూ మొదలెడితే… మనం అనుకునే మంచే మనల్ని శత్రువులుగా అక్షరీకరించేలా చేస్తుంది. ఇక్కడంతా… మన ఊహలూ… మన ఊసులూ… మన ఆలోచనలూ… మన ఆశలూ… మన ఆశయాలు… మన భావాలూ… అన్నీ నిషిద్ధం. ఇన్నాళ్ళుగా మనమెరిగిన సత్యాలని అబద్ధాలుగా ఒప్పుకోలేకపోతే మనమూ నిషిద్ధమే! అయితే ఆ ఆంక్షలు… నిషేధాలు వంటి ఏ ముళ్ళ కంచెలకీ వెరవకపోవడమే – మంకెన పూలు!
పళ్ళ చెట్టుకి ముళ్ళకంప… ప్రహరీ గోడపై గాజు పెంకులు… లెక్కచేయని నిశ్చయమే ఈ నా మంకెన పూలు!
ఒకలా చూస్తే…
నిలువెల్లా రగులుతున్న విప్లవ జ్వాలాముఖ అగ్గిశిఖలు
మరోలా చూస్తే…
మనసు రెమ్మమీద వాలిన ఎర్రెర్రని సీతాకోకచిలుకలు
దాచుకున్న గాయాలనీ… సేద తీర్చే ముచ్చట్లనీ
రేకలుగా దాచుకున్న…
”మంకెన పూలు…”
ఇకపై నెల నెలా…