ఆశల నగరం స్త్రీలకేమిస్తోంది?- మిథున్‌ సోమ్‌

మన దేశం నడిబొడ్డున ఒక ఊరి నుంచి దక్షిణ భారతదేశంలోని హైదరాబాద్‌ నగరానికి తన రాక ఎలా జరిగిందో కమల గుర్తు చేసుకుంది. ఆమె నివసించే ఫ్లాట్‌లో చిన్న అద్దాల గోడతో ఆఫీసు గది వేరుగా ఉంది. మేము మాట్లాడుకుంటుండగా ఆమెతో కలిసి ఉంటున్న స్నేహితులు (కమల మాటల్లో చెప్పాలంటే ఆమె ”కుటుంబం”) ఒకరికొకరుగా ఆఫీసుకు బయలుదేరారు. ఇంటి పనిలో సాయం చేసే పనామె ఇల్లు శుభ్రం చేస్తోంది. తన పెంపుడు లాబ్రెడార్‌ కుక్కను గుండెలకు హత్తుకుంటూ ఇంటింటికి తిరిగి అమ్మకాలు చేయడంతో ప్రారంభమైన తన ఉద్యోగ జీవితాన్ని కమల మననం చేసుకుంది.

చిన్న హాస్టల్‌ రూమ్‌లో నాలుగు మంచాలు, పలుచని చెక్క పార్టిషన్‌ సాయంతో నాలుగు భాగాలుగా విడగొట్టబడి గాలి, వెలుతురు సరిగా రాని ఇరుకు రూములో కూర్చుని లిపిక మాట్లాడింది. ఇంజనీరింగ్‌లో చేరి చదువు తర్వాత ”ఇస్రో” సంస్థలో ప్రాజెక్టు చేసి, చివరకు ఒక ఆఫీసు ఉద్యోగంలో స్థిరపడిన తన జీవిత ప్రయాణం గురించి చెప్పింది.

ఇంటి ముందు గదిలో సోఫాలో విశ్రాంతిగా కూర్చుని స్మృతి, తన చిన్నతనం, అమ్మ ఒంటరిగా ఆంధ్రాలోని ఒక చిన్న పల్లెలో కష్టపడి తనను పెంచి పెద్ద చేయడం గుర్తు చేసుకుంది. చిన్నతనంలో అప్పుడప్పుడూ అమ్మకు కూలి పనిలో సాయం చేయడం, చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం కోసం హైదరాబాద్‌ రావడం, ఒక పెద్ద మీడియా హౌస్‌లో చేరడం, కాబోయే భర్తను కలవడం, తర్వాత పెళ్ళి ఒకదాని తర్వాత ఒకటి జరిగాయి. మేము మాట్లాడుకుంటుంటే స్మృతి తల్లి వంటింట్లో మా కోసం టీ, పకోడీలు చేస్తోంది. ఆమె కొడుకు ఇంటి ముందు ఉన్న చిన్న పిల్లలతో ఆడుకుంటున్నాడు.

పెళ్ళి తర్వాత పుట్టి పెరిగిన ఊరుని, కుటుంబాన్ని వదిలి వెళ్ళడం ఆడవారికి సహజమైన విషయమే. అయితే పై చదువుల కోసం, ఉద్యోగాల కోసం ఇల్లు వదలడం కొత్తగా పెరిగిన ధోరణి. ఇలా బయటకు వచ్చే స్త్రీల సంఖ్య చాలా పెద్దది కాకపోవచ్చు, కానీ వీరి సంఖ్య ఒక గుర్తించదగ్గ స్థాయికి పెరిగింది.

ఇక్కడ మనం ముఖ్యంగా గమనించవలసిన అంశం ఒకటుంది. అనాదిగా స్త్రీలు పుట్టిన ఊరు విడిచి కొత్త చోట్లకి వెళ్తున్నా కూడా, ”వలస” లెక్కలలో వీరిని గుర్తించడం జరగలేదు. పెళ్ళయిన తర్వాత పుట్టింటిని, ఊరిని వదలడం సంప్రదాయం కాబట్టి, దీనిని ఒక విశేషంగా పరిగణించలేదు. 1980వ దశకం వరకు అంతర్జాతీయ గణాంకాలలో, అంటే ”వలస” గురించిన లెక్కల్లో, స్త్రీల ప్రస్తావన కనిపించదు. మెరుగైన జీవితం, కొత్త అవకాశాల కోసం స్వస్థలం విడిచిపెట్టేది పురుషులు మాత్రమే అన్న ప్రాతిపదిక మీదే వలస లెక్కలు జరిగేవి. ఇటువంటి నేపథ్యంలో పెళ్ళి మూలంగా కాకుండా ఊరు వదిలి పెట్టి వచ్చే ఆడవారి సంఖ్య చిన్నదే అయినా రాబోయే పెనుమార్పులకు సంకేతం కాగలదు. రీతి, రివాజుల మూలంగా కాకుండా, స్వంతంగా ఇతర కారణాల వలన స్త్రీ ఇల్లు వదలడం, కుటుంబ సమీకరణలలో పెద్ద మార్పుకు దారితీసే అవకాశం ఉంది. ఒక అమ్మాయి తల్లిదండ్రులు లేదా బంధువుల పరిధి దాటి స్వతంత్రంగా జీవించడం మొదలు పెట్టడంతో ఆమెను కాపాడడానికి కొత్త రక్షక వలయాలు ఏర్పడవలసిన అవసరం కలిగింది. అమ్మాయిలు నివసించే హాస్టల్‌ వార్డెన్లు, వారు చదువుకునే విద్యా సంస్థల పెద్దలు, వారు అద్దెకుంటున్న ఇంటి పెద్దలు, ఇరుగు పొరుగు అమ్మాయిల రాకపోకల్ని గమనిస్తూ, కుటుంబం బదులుగా కొత్త సంరక్షకులుగా తయారయ్యారు.

ఈ సందర్భంలో స్త్రీల భద్రత గురించి మనకు కొన్ని ప్రశ్నలు ఎదురవుతాయి. పట్టణాలలోని విద్యాసంస్థల్లో, ఆఫీసులలో ప్రజా రవాణా సౌకర్యాలలో, బహిరంగ ప్రదేశాలలో సురక్షితంగా తిరగడానికి వీరికి ఎటువంటి ప్రత్యేక సౌకర్యాలు ఉన్నాయి? అంటే పట్టణ వ్యవస్థకు సంబంధించిన యోజనలలో స్వతంత్ర మహిళల గురించి ప్రత్యేక శ్రద్ధ పెట్టడం జరిగిందా అన్నది ప్రశ్న. రోజు రోజుకి విశాలమవుతున్న పట్టణ భౌగోళిక పరిధిలో, అక్కడి సామాజిక వ్యవస్థలో స్వతంత్ర స్త్రీలకు ఎటువంటి స్థానం ఉంది?

హైదరాబాద్‌ వంటి నగరం మన దేశంలోని నయా ఉదారవాద ఆర్థిక వ్యవస్థకి, దాని వలన వచ్చే ప్రగతికి సంకేతంగా పరిగణించబతుంది. ఇక్కడ వ్యాపించిన సాఫ్ట్‌వేర్‌ రంగం, ఔషధ నిర్మాణ రంగం ఆర్థిక ఉన్నతికి సూచికలు. ఇటువంటి కొత్త రంగాలలో పెరుగుతున్న ఉద్యోగావకాశాల వలన, హైదరాబాద్‌ వలసలకు కేంద్రంగా మారింది. అయితే ఇందుకు అనుగుణంగా నగర వ్యవస్థ ఎంత మేరకు తయారుగా ఉన్నదన్నది ముఖ్యమైన ప్రశ్న. వలసల వలన పెరుగుతన్న జనాభా ఒత్తిడి, ముఖ్యంగా స్వతంత్ర మహిళలకు అనుకూలమైన వసతులు కల్పించడంలో నగరం ఎంత ముందుకు వచ్చిందన్న సవాలుకు సరైన జవాబు లేదు.

ఈ ప్రశ్నలకు సమాధానాలు వెదికే ముందు, స్త్రీలు చదువుకోసం, ఉద్యోగాల కోసం ఇల్లు వదిలి ఎందుకు వస్తున్నారో కనుక్కోవటం అవసరం. నగరం వీరికి ఏమైనా ప్రత్యేక ఆశలు కల్పిస్తోందా? ఈ వ్యాసంలో నేను చదువు లేదా ఉద్యోగం కోసం వలస వచ్చిన స్త్రీలపై దృష్టి కేంద్రీకరించాను. అన్వేషి ఆధ్వర్యంలో ”నగరాలు, లైంగికత” ప్రాజెక్టు కింద జరిపిన పరిశోధనల ఆధారంగా ఈ వ్యాసం రాయడం జరిగింది. ఇందులో వివిధ నేపథ్యాల నుండి వచ్చిన 51 మహిళలను ఇంటర్వ్యూ చేయడం జరిగింది.

హైదరాబాద్‌ నగరం

ఈ నగరం తన నాలుగు వందల ఏళ్ళ చరిత్రలో మన దేశంలోని ఇతర రాష్ట్రాల నుండే కాకుండా, ఇతర దేశాల నుండి వచ్చిన అనేక జాతుల వారికి స్థానం కల్పించింది. 2011 గణాంకాల ప్రకారం ఈ నగరంలోని 24 శాతం జనాభా ఇతర ప్రాంతాల నుండి వచ్చినవారే. 2000వ సంవత్సరం నుండి వలసలలో అకస్మాత్తుగా పెరుగుదల చూడవచ్చు. అవిభక్త ఆంధ్ర రాష్ట్రంలో 1990ల తర్వాత కొత్త ఆర్థిక విధానాల వలన పట్టణాల కేంద్రంగా ఎదుగుదల మనం గమనించవచ్చు. 1990వ దశకంలో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఉండడం వలన, రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలకు అధికార వికేంద్రీకరణ తేలిగ్గా జరిగింది. దీంతో ప్రతి రాష్ట్రానికి స్వంతంగా ఆర్థిక విధానాలు రూపొందించుకునే అవకాశం లభించింది. ఆర్థిక స్వాతంత్య్రంతో పాటు పెట్టుబడుల కోసం పోటీ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. సర్వీసు మరియు కమ్యూనికేషన్‌ టెక్నాలజీ రంగాలలో పెరుగుదల హెచ్చుగా జరిగింది. ఈ రంగాలలో అవకాశాలను తమ రాష్ట్రానికే ఎక్కువగా తెచ్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడ్డాయి. అనుకూలంగా ఉన్న రాజకీయ వాతావరణం, సమాజంలో పెరిగిన సాంకేతిక వినియోగం, ఆంగ్లభాషా ప్రయోగంలో సమర్ధత, ఇతర ప్రాంతీయ విశేషాలు (వేతన డిమాండు తక్కువగా ఉండడం వగైరా) వంటి అనేక కారణాల వలన పట్టణాలలో ఐటి మరియ బిపిఓ రంగాలు వేగంగా అభివృద్ధి చెందాయి. (రాజు& జత్రానా, 2016)

2000 దశకం మొదటి భాగంలో అవిభక్త ఆంధ్ర రాష్ట్రంలోని హైదరాబాద్‌ నగరంలో ఐ.టి. రంగం గణనీయంగా పెరగడం కనిపిస్తుంది. (కెన్నెడీ, 2007. దీని వలన ఐటి ఆధారిత చిన్న వ్యాపారాలు అనేకం అభివృద్ధి చెందడం జరిగింది. పెట్టుబడులను ఆకర్షించడానికి హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాలను మంచి రోడ్డు సౌకర్యంలో, అంతరాయం లేకుండా విద్యుత్తు వంటి ఇతర అనేక సౌకర్యాలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం జరిగింది. పెద్ద పెద్ద నిర్మాణాలు కేంద్రంగా ఉండే ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. వీటి కోసం భూమి సేకరణలో సహాయం, లేబర్‌ చట్టాలలో సవరణలు సహాయం, ఇతర సబ్సిడీలు పెద్ద ఎత్తున ఇవ్వడం జరిగింది. ఈ కారణాల వలన పెద్ద పెద్ద విదేశీ కంపెనీలు హైదరాబాద్‌ వైపు మొగ్గు చూపాయి. వీటి రాకను రాష్ట్ర ప్రభుత్వ సఫలతగా చిత్రీకరించడం జరిగింది (కెన్నెడీ 2007, కామత్‌ 2011). అయితే ఈ అభివృద్ధిలో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు భాగం రాలేదు. పైపెచ్చు వ్యవసాయ రంగంలో పెట్టుబడులు చెప్పుకోదగ్గ మోతాదులో తగ్గిపోయాయి (లడ్డి & మిశ్రా, 2010). అనేక పర్యాయాలు ఇతర ప్రాంతాలకు లోటు చేసి మరీ నిధులు, విద్యుత్‌ వంటి సౌకర్యాలను హైదరాబాద్‌ నగరానికి కేటాయించడం జరిగింది.

నగరంలో వస్తున్న ఈ కొత్త రకం ఎదుగుదల కోసం ఎంతో మంది శ్రమ అవసరమయింది. హైదరాబాద్‌ను ఒక అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దడానికి రకరకాల నిపుణులు కావలసి వచ్చారు. ప్రభుత్వ మరియు ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాల నుండి వచ్చే సాంకేతిక నిపుణులకు డిమాండ్‌ ఏర్పడింది. డిమాండుకు తగిన సంఖ్యలో కాలేజీలను ప్రారంభించడం జరిగింది. వీటికి పెట్టుబడి ముఖ్యంగా కోస్తా ఆంధ్రలోని వ్యవసాయ రంగంలోని మోతుబరుల నుండి వచ్చింది. అవిభక్త ఆంధ్రలో ప్రైవేటు రంగంలో వైద్య, ఇంజనీరింగ్‌ కళాశాలలు ఎక్కువ శాతం వీరి ఆధ్వర్యంలోనే నడిచాయి. హరిత విప్లవం ప్రభావంతో చాలా చోట్ల వ్యవసాయం లాభసాటి వ్యాపారంగా మారింది. కోస్తా ఆంధ్రలో ముఖ్యంగా కమ్మ, రెడ్డి కులాల పెత్తందార్లకు వ్యవసాయంలో మిగిలిన లాభాలకు కొత్త వ్యాపారాలు కావలసి వచ్చాయి. వీరు సాంకేతిక విద్యా రంగంలో వినివేశం చేయడానికి అప్పటి ప్రభుత్వం కూడా మద్దతు పలికింది. భూసేకరణలో నీరు, విద్యుత్‌ మరియు ఇతర సౌకర్యాలలో రాయితీలు భారీ ఎత్తున ఇవ్వడం జరిగింది. వీరు స్థాపించిన సంస్థల నుండి వచ్చే విద్యార్థులకు ఐ.టి. మరియు ఐ.టి. ఆధారిత కంపెనీలలో ఉద్యోగాలు దొరికాయి. పెరుగుతున్న ఐ.టి. రంగం వలన ఈ సాంకేతిక విద్యా సంస్థలు బాగా లాభపడ్డాయి (కామత్‌, 2011.పే.194). ఇది కాకుండా వైద్య రంగంలో ప్రైవేటీకరణకు, అంటే ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు, ఆసుపత్రులకు కూడా హైదరాబాద్‌ కేంద్రమయింది. ఈ రంగంలో ప్రైవేటీకరణకు శ్రీకారం చుట్టిన నగరాలలో హైదరాబాద్‌ మొదటిది. ఆంధ్ర, తెలంగాణలోని అన్ని జిల్లాల వారికి హైదరాబాద్‌ ఆశల మజిలీ అయ్యింది. నగరంలో విస్తరించిన ఐ.టి.రంగం, వివిధ రకాలైన కోచింగ్‌ సెంటర్లు, రకరకాల చిన్న వ్యాపారాలు. ఇవన్నీ హైదరాబాద్‌కు రావడానికి ప్రధాన ఆకర్షణలుగా మారాయి.

మేము విద్య లేదా ఉద్యోగం కోసం వలస వచ్చిన మహిళపైనే దృష్టి పెట్టినా, సర్వే తరువాత అన్ని అంశాలను జోడించే ఒక సార్వజనీన సూత్రం దొరకలేదు. ప్రతి ఒక్కరి ప్రయాణం, వారి జీవిత కథ విలక్షణంగా కనిపించాయి. చివరకు మేము పుట్టిన ఊరు వదిలిపెట్టి హైదరాబాద్‌ వంటి నగరంలో ఈ స్త్రీలు స్థిరపడడానికి ప్రధానంగా కనిపించే కారణాలను మాత్రమే వేరు చేయడానికి ప్రయత్నించాము.

ఉద్యోగ విద్యావకాశాలు ః

పెరుగుతున్న మధ్య తరగతి సమాజం కోరికలకు తగిన అవకాశాలు చిన్న ఊర్లు, గ్రామాలు కల్పించలేకపోతున్నాయి. అందుకే అందరి కలలు పండేది హైదరాబాద్‌ నగరంలోనే. విద్యార్థిని అనిక మాటల్లో చెప్పాలంటే, ‘మా ఊర్లో, మా చుట్టూ ఉండే జనంలో పిల్లలు పై చదువుల కోసం హైదరాబాద్‌ వెళ్ళారంటే గొప్ప గౌరవం లభిస్తుంది. అందుకనే కాకతీయ యూనివర్శిటీలో హాస్టల్‌లో ప్రవేశంతో సహా సీటు వచ్చినా, వద్దని హైదరాబాద్‌లో ఒక ప్రైవేటు కాలేజిలో చేరాను”. నగరంలో కష్టపడితే గబగబా నిచ్చెన పైకి ఎగబాకవచ్చనే నమ్మకం చాలామందికి ఉంది. స్మృతి అంటుంది, ”నగరం అయితే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కష్టపడితే ఉద్యోగంలో పైకి ఎదగవచ్చు. వ్యక్తిగా ఉద్యోగంలో పైకి రావాలంటే హైదరాబాద్‌ రావడమే మార్గం”. ”ఆంధ్ర, తెలంగాణ విభజన తర్వాత విశాఖపట్నం నుండి ఇతర నగరాల పేర్లు కొద్దిగా వినిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన జరగక ముందు మాత్రం జీవితంలో విజయం సాధించాలంటే హైదరాబాద్‌ రావడం ఒక్కటే మార్గం” అంటుంది సోనియా.

హైదరాబాద్‌లో ఉద్యోగం కోసం ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన మహిళలు కూడా ఉన్నారు. మధ్య భారతం నుండి వచ్చిన కమల చదువు పూర్తి చేసిన తర్వాత పూణెలో పనిచేసి, చివరకు హైదరాబాద్‌లో స్థిరపడింది. కొంత ఆర్థిక సౌలభ్యం ఉన్న ఇళ్ళనుండి వచ్చిన యువతులు, రెండు మూడు నగరాలు తిరిగి, ఎక్కడి ఉద్యోగం బాగుందో నిర్ణయించుకున్నారు. అయితే ఆర్థిక ఇబ్బందుల వలన తప్పనిసరి పరిస్థితులలో వలస వచ్చే యువతులు కూడా ఉన్నారు.

ఆర్థిక అవసరాలు ః

ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఇళ్ళనుంచి వచ్చే ఆడపిల్లలు చాలా వరకు హైస్కూలు చదువు పూర్తయిన వెంటనే తమ ఊర్ల నుండి నగరానికి వలస వస్తున్నారు. వీరికి ఉన్న ఊరిలో ఉద్యోగం దొరకడం కష్టం. హైదరాబాద్‌ షాపింగ్‌ మాల్స్‌లో, ఆసుపత్రులలో నర్సులుగా వీరు వెతుక్కుంటున్నారు. తాము సంపాదించిన మొత్తంలో దాదాపు 70-80 శాతం వీరు ఇంటికి పంపిస్తుంటారు. ఊర్లో ఇల్లు గడవడానికి వీరి సంపాదనే ముఖ్య ఆధారమన్నమాట.

శారద, శిరీష అక్కచెల్లెళ్ళు. తండ్రికి జబ్బు చేసి పొలం పని మానేయడంతో వీరు వరంగల్‌ నుండి హైదరాబాద్‌ వచ్చారు. ఒకరు డిగ్రీ పూర్తి చేశారు. ఇంకొక అమ్మాయి ఇంటర్మీడియట్‌ పూర్తి చేసింది. వీరు డిపార్ట్‌మెంటల్‌ స్టోర్స్‌లో క్యాషియర్‌గా ఒకరు, సేల్స్‌లో ఇంకొకరు పనిచేస్తున్నారు. ఇద్దరికి కలిపి నెలకు రూ.16,000 వస్తుంది. అందులో రూ.4000 మాత్రం ఖర్చుకు ఉంచుకుని మిగతాది ఇంటికి పంపిచేస్తుంటారు. వీరు చేసే పనిలో రోజుకు 10 గంటలు నిలబడడమే. తర్వాత ఇంటికి వచ్చి వంట చేసుకుని తిని పడుకోవడం, ఆదివారం వస్తే బట్టలు ఉతుక్కోవడం, ఇంట్లో ఏమన్నా పనులుంటే పూర్తి చేయడం. ఇంకా సమయం మిగిలితే కొంత విశ్రాంతి లభిస్తుంది. నర్సింగ్‌ కోర్సు పూర్తి చేసినా తన ఊర్లో అవకాశాలు లేక హైదరాబాద్‌ వచ్చింది. ఇక్కడ ఒక ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తోంది. ఆమె చెల్లెళ్ళు కూడా హైదరాబాద్‌లోనే పని చేస్తున్నారు. వీరు కూడా స్వంత ఖర్చులకు కొంచెం డబ్బు ఉంచుకుని, ఎక్కువ భాగం ఇంటికే పంపిస్తారు. ఈ ఆడపిల్లల సంపాదన ఊరిలో ఇల్లు గడవడానికి ముఖ్యమైన ఆధారం అయింది.

రాజకీయ అలజడులుః

కాశ్మీరులో, ఈశాన్య రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలలో శాంతి భద్రతలు కరువైనందున, ఎంతోమంది యువత భవిష్యత్తు దెబ్బతింటోంది. వారికి చదువు, ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఈ కారణాల వలన ఆడపిల్లలు విద్య మరియు ఉద్యోగాల కోసం హైదరాబాద్‌ వస్తున్నారు. రఫియా ఉత్తర భారతదేశం నుండి హైదరాబాద్‌ విశ్వవిద్యాలయంలో పి.హెచ్‌.డి కోసం వచ్చింది. ఆమె తండ్రి రాజకీయ సంఘర్షణలలో ప్రాణాలు కోల్పోయాడు. రాజకీయ అభద్రత వలన ఆమె స్వరాష్ట్రంలో పి.హెచ్‌.డి ముందు చేసే ఎం.ఫిల్‌ కోర్సు పూర్తి చేయడానికే మూడేళ్ళు పట్టవచ్చు. అటువంటప్పుడు పిహెచ్‌.డి. పూర్తి చేయడానికి ఎంత టైం పడుతుందో ఊహించడం కష్టం. ఆమె మాటల్లో చెప్పాలంటే, ”నేను పుట్టిన ప్రాంతం వదలకపోతే చదువే పూర్తి కాదు. ఇక ఉద్యోగం చేసి నా కాళ్ళమీద ఎప్పుడు నిలబడతాను? మా ఊర్లో రేపు పరీక్ష అనగా, గొడవలు మొదలయితే, వెంటనే కర్ఫ్యూ, పరీక్ష వాయిదా జరిగిపోతాయి. దేనికీ గ్యారంటీ లేదు”. ఈ విషయాలన్నీ తల్లికి చెప్పి ఒప్పించి ఆమె హైదరాబాద్‌ వచ్చింది.

అస్సాం నుండి వచ్చిన ప్రీతిబాల తమ రాష్ట్రంలో 2003వ సంవత్సరంలో జరిగిన జాతి కలహాలను గుర్తు చేసుకుంటుంది. కొన్ని జాతుల మిలిటెంట్ల మధ్య మొదలయిన గొడవలు సామాన్య జనం మధ్యకు వ్యాపించాయి. భిన్న జాతుల ప్రజలు ఒకరికొకరు అనుమానించడం మొదలుపెట్టారు. ఆమె చదువుకునే పాఠశాలలో కూడా విద్యార్థుల మధ్య గొడవలు జరిగాయి. ఇక గత్యంతరం లేక ఇంటర్మీడియట్‌ చదువు కోసం ఊరు వదిలి రాష్ట్ర ముఖ్యపట్టణమైన గౌహతి వెళ్ళవలసి వచ్చింది. ఆమె అంటుంది, ” ఆ సమయంలో నా అంచనా ప్రకారం మా ఊర్లో 90 శాతం జనం గౌహతికి తరలి వెళ్ళారు”. పై చదువుల కోసం తండ్రి ఢిల్లీకి పంపడం ఇష్టపడక పోవడం వలన ఆ అమ్మాయి హైదరాబాద్‌ నగరానికి చేరింది.

ఇంటిలో శోషణ:

కొంతమంది అమ్మాయిలకు తాము పుట్టి పెరిగిన ఊరే కాకుండా, స్వంత ఇంట్లో రక్షణ లేకపోవడం వలన హైదరాబాద్‌కు వలస రావలసిన అగత్యం ఏర్పడుతుంది. ఆకాంక్ష ఇంటిలో ఎవరికీ అక్కర్లేని కూతురయింది. ఇంటర్మీడియట్‌ తర్వాత అమ్మ, నాన్న స్వంతంగా బతకమన్నారు. ఆమెకు కనీసం మాట సాయం కూడా చేయలేదు. హైదరాబాద్‌కు వెళ్ళిపోదామన్న ఆమె నిర్ణయానికి వారి ఆమోదం లేదు, తిరస్కారం లేదు. ”నీ బతుకు నీ ఇష్టం, నీ తలకాయ నొప్పి’ అన్నారు. ఇటువంటి అమ్మాయిలకు నగరంలో బతుకు ఒక సురక్షిత అవకాశం అవుతుంది.

షింజిన ఒక అనాథ. అత్త, మేనమామల దగ్గర ఉన్నప్పుడు వారు ఆమెను సరిగ్గా చూసుకోలేదు. ఆమెని, అమ్మమ్మని ఇద్దర్నీ బయటికి తరిమేశారు. హైదరాబాద్‌లోని అనాధాశ్రమానికి ఎలాగోలా చేరింది. ఎవరూ లేకపోవడంతో ఇలా హైదరాబాద్‌కి చేరింది.

తనదైన ఉనికి కోసం:

హదాసీ పట్టణానికి వచ్చేయాలన్న తన కోరిక గురించి ఈ విధంగా చెబుతుంది. ”నాకు స్వతంత్రంగా బతకాలన్న కోరిక. అన్ని ఆంక్షలు, బంధాలకు దూరంగా… ఒక మంచి కూతురు, అక్క, చెల్లెలు, మనవరాలు కాకుండా, అన్నింటికీ దూరంగా అసలు నేనెవరిని అని తెలుసుకోవడానికి హైదరాబాద్‌ వచ్చేశాను”. ఇంటికీ, తల్లిదండ్రులకీ, బంధువులకు దూరంగా తామెవరో తెలుసుకోవడానికి, ఒక కొత్త ఆత్మవిశ్వాసంతో వలస వచ్చే అమ్మాయిలు ఒక ప్రత్యేక వర్గంగా కనిపిస్తున్నారు. తమ ఆలోచనల్ని విశాలం చేసుకోవడానికి, కొత్త దృక్పథాలు నిర్మించుకోవడానికి నగరంలో ఒక్కరిగా జీవించటానికే ఈ అమ్మాయిలు ఊరు విడిచి వస్తున్నారు. మన సమాజంలో ఉన్నత విద్య, ఉద్యోగం ఈ మార్గాన్వేషణకు మాధ్యమాలుగా పనిచేస్తున్నాయి.

మోనిక తన పట్టణ అనుభవాలను ఈ విధంగా వ్యక్తం చేస్తుంది. ”నేను చాలా చిన్న వయసులో అంటే నాకు పదహారేళ్ళు

ఉన్నప్పుడే హైదరాబాద్‌ వచ్చాను. స్వంత ఊరు వదిలి పెద్ద నగరానికి వస్తే కొత్త అనుభవాలు, కొత్త అవకాశాలు లభిస్తాయి. మంచి చదువు వలన, పదిమందిలో మాట్లాడే నేర్పు, ఆఫీసులో ఏ విధంగా మెలగాలి వంటి ఎన్నో విషయాలు తెలుస్తాయి. నేను ఇక్కడకు వచ్చిన మొదట్లో ఎంతో అమాయకంగా ఉండేదానిని. ఏమీ తెలియదు. ఇక్కడి మనుషుల్ని గమనిస్తూ వారు ఎలా మాట్లాడతారో, ఒక విషయం గురించి సంప్రదింపులు ఎలా చేస్తారో అన్నీ తెలుసుకున్నాను. నా మీద నాకు ఇప్పుడు ఎంత నమ్మకం కలిగిందంటే ప్రపంచంలో ఏ మూలకి తీసుకెళ్ళి వదిలినా నేను బతగ్గలను. ఇంత ఆత్మవిశ్వాసం హైదరాబాద్‌ నగరమే నాకు ఇచ్చింది. అందుకే ఈ ఊరంటే నాకు పిచ్చి.

నగరం ఆశ కల్పిస్తుంది:

ఇంతవరకు మనం కలుసుకున్న మహిళలంతా ఒకే సామాజిక వర్గం, ఆర్థిక నేపథ్యం నుండి వచ్చిన వారు కాదు. అందరి కథలను కలిపే సామాన్య సూత్రం నగరం. ఇది ఆశయసిద్ధి కోసం, అవకాశం కోసం కేంద్రం బిందువుగా కనిపిస్తుంది. అయితే నగరానికి వచ్చిన వీరంతా లాభపడ్డారా, జీవితాలు బాగుపడ్డాయా అని పరిశీలిస్తే సమాధానం తేలికగా లభించదు. ఈ జవాబు అనేక అంశాలపై ఆధారపడి ఉంది. అవి ఏమిటో ఒకటొకటి పరిశీలిద్దాం.

మొదటగా వారు పుట్టిన కులం, జాతి, ఊరు వంటి అంశాలు వారిలోని వ్యక్తిత్వాన్ని, నగరంలో వారి భవిష్యత్తుని నిర్దేశించేవిగా కనిపిస్తాయి. ఉదాహరణకు, చదువుకున్న మధ్య తరగతి అమ్మాయిలకు ఐ.టి. రంగంలో ఉద్యోగాల కోసం ప్రయత్నించే అవకాశం

ఉంటుంది. రెండవది, కులం, సాంస్కృతిక నేపథ్యం కలిసి రాకపోయినా, వృత్తి నైపుణ్యం ఉంటే అమ్మాయిలు నగరంలో అందుబాటులో ఉన్న కోచింగ్‌ సెంటర్ల ద్వారా పెద్ద ఉద్యోగాల కోసం కావలసిన ఇతర అర్హతలు సంపాదించుకోవచ్చు. మూడవది, ఆర్థిక సంక్షోభంలో ఉన్న కుటుంబాల ఆడపిల్లలు మాత్రం ఏదో ఒక ఉద్యోగం కోసం వెతుకుతారు. సూపర్‌ మార్కెట్‌ అయినా, మాల్‌ అయినా, బ్యూటీ పార్లర్‌ అయినా ఏదో ఒక చోట చిన్న ఉద్యోగం సంపాదించుకుంటారు. వారి ఇంట్లో ఆర్థికంగా స్థిరత్వం కొంతవరకు వచ్చిన తర్వాతే, వీళ్ళు కొత్త నైపుణ్యం సంపాదించడం, మెరుగైన ఉద్యోగాలు వెదుక్కోవడం గురించి ఆలోచించగలరు.

సహజంగా కుటుంబం, సమాజం విధించే ఆంక్షల పరిధి దాటి, స్వంతంగా ఏదైనా సాధించడం, దాని కోసం ప్రయత్నించడం, ఇవన్నీ నగరంలోనే సాధ్యం. అయితే ఈ ప్రయత్నంలో ఎవరు ఎంత దూరం వెళతారు, ఎంతవరకు అనుకున్న లక్ష్యం సాధిస్తారు అన్న విషయాలు మాత్రం తేలిగ్గా అంచనా కట్టలేము. లక్ష్యసాధనలో ఆడవారు పనిచేసే ఆఫీసులోని వాతావరణం, వారి చుట్టూ వారికి అండగా నిలిచే సంబంధాలు (పాతవి, కొత్తవి కూడా, పాతవి అంటే ఊరు, కుటుంబం నుండి ఏర్పడినవి; కొత్తవి అంటే విశ్వవిద్యాలయాల్లో, ఆఫీసుల్లో, సమాజంలోని ఇరుగు పొరుగు ద్వారా ఏర్పడేవి) వీటన్నింటిపై ఆధారపడి ఉంటుంది. ఈ ఆడపిల్లల అంశాలను, లక్ష్యాలను వారు నివసించే నగరం ఎంతవరకు ఆదరించి అవకాశాలు కల్పిస్తుంది అన్నది కూడా ఒక ముఖ్యమైన అంశం. ప్రజా రవాణా సౌకర్యాలలో, హాస్టళ్ళలో, అద్దెకు ఉండే ఇళ్ళల్లో, విద్యా సంస్థల్లో, ఆఫీసుల్లో, ఇతర బహిరంగ ప్రదేశాలలో నగరం ఆడవారికి సమాన అవకాశాలు ఇవ్వగలుగుతోందా? పెళ్ళికాని యువతులు ఒంటరిగా నివసిస్తుంటే, పితృస్వామిక సమాజంలో ఒక సహజమైన ఆందోళన ఉంటుంది. ఒంటరి ఆడపిల్లల లైంగిక స్వాతంత్య్రం గురించి ముఖ్యంగా ఒక భయం ఉంటుంది. అంటే సామాన్యంగా ఉండే సమాజ నియమాలకు విరుద్ధంగా ఏమైనా జరిగిపోతుందో ఏమో అనే భయం అన్నమాట.

ఒక కేంద్ర విశ్వవిద్యాలయం వంటి చోటులో, ఒక రాష్ట్ర విశ్వవిద్యాలయంలో, విద్యార్థినులు తమపై రాత్రిపూట విధించే కర్ఫ్యూని తొలగించాలని డిమాండు చేయవలసి వచ్చింది. దీనివలన మగపిల్లలతో సమానంగా అన్ని వేళలా విశ్వవిద్యాలయ గ్రంథాలయాన్ని వారు ఉపయోగించుకోవచ్చు. దీనికోసం వారు ఉద్యమించవలసి వచ్చింది. ఢిల్లీ నగరంలో ”పింజ్రా తోడ్‌” ప్రచారంతో, భద్రత పేరిట హాస్టళ్ళలో, అద్దె ఇళ్ళల్లో హెచ్చు రుసుం వసూలు చేయడాన్ని మహిళలు నిరసించారు. మేము మాట్లాడిన అమ్మాయిలలో కొందరు నగరంలోని కొన్ని కాలనీలలో తమకు ఇళ్ళు అద్దెకు ఇవ్వకపోవడం వంటి సమస్యలను ప్రస్తావించారు. అంటే డబ్బు ఒక్కోసారి ”ఒంటరి మహిళ” అన్న ముద్రను అధిగమించడానికి

ఉపయోగపడుతుంది. విభిన్న సామాజిక వర్గాల నుండి వచ్చే ఆడపిల్లలందరికీ నగరం ఒకే విధమైన అవకాశాలు ఇవ్వదు. ఉదాహరణకు ఐ.టి.రంగంలో పనిచేసే ఆడపిల్లలకు ఇబ్బంది లేకుండా వారి ఆఫీసులు ఉచితంగా షటిల్‌ సర్వీసులు అందిస్తున్నాయి. ఇందులో పనిచేసే ఆడవారు ఎక్కువ శాతం మధ్యతరగతికి చెందినవారు. మాల్స్‌లో, బట్టల షాపుల్లో, సూపర్‌ మార్కెట్లలో పనిచేసే అమ్మాయిలు ఎంత రాత్రయినా పనయ్యాక తమ దారి తామే చూసుకోవాలి. అలాగే రాత్రి షిఫ్టుల్లో పనిచేసే మునిసిపాలిటీ వర్కర్లకు కూడా ఎటువంటి రవాణా భద్రత లేదు. ఐ.టి.రంగం విపరీతంగా పెరగటం వలన, అందులో పనిచేసే యువతుల సంఖ్య కూడా ఎక్కువ కావడం వలన, ఈ ఆఫీసుల చుట్టు పక్కల ఉన్న కాలనీలు అమ్మాయిలకు అనుకూలంగా వసతులు కల్పిస్తున్నాయి. వారికి ఇళ్ళు, ఫ్లాట్లు తేలిగ్గా దొరుకుతాయి. నగరంలోని ఇతర సౌకర్యాలు కూడా వారికి తేలిగ్గా అందుబాటులోకి వస్తాయి.

పట్టణాలలో చదువుకుని, ఉద్యోగాలు చేస్తూ ఒంటరిగా బతుకుతున్నంత మాత్రాన, ఆడవారికి వారి జీవితంపై స్వయం నిర్ణయాలు తీసుకునే అధికారం పూర్తిగా లభించిందని భ్రమ పడకూడదు. ప్రస్తుతం చదువు, ఉద్యోగం వంటి అంశాలలో స్వంత నిర్ణయాలు తీసుకున్నా, పెళ్ళయిన తర్వాత ఈ స్వతంత్రం ఎంత వరకు మిగిలి ఉంటుంది అన్నది ప్రశ్నార్ధకమే.

ఇల్లు, కుటుంబం అనే వలయం నుండి బయటపడి ఒంటరిగా బతకడం వలన ఆడపిల్లలకు ఆత్మవిశ్వాసమైతే ఏర్పడుతుంది. అయితే దీన్ని ముందు ముందు జీవితంలో ఎంతవరకు నిలబెట్టుకోగలరో అనేది మాత్రం ఒక క్లిష్టమైన పజిల్‌ వంటిది. నగరంలో చదువు, ఉద్యోగం వలన సంపాదించుకున్న కొత్త సామాజిక, సాంస్కృతిక నేపథ్యం, దాని ద్వారా లభించే కొత్త అండదండలు, కొత్త అనుబంధాలు వాటి ద్వారా ఆమె అనుభవించే సుఖం, భద్రత, ఆత్మవిశ్వాసాలని, భవిష్యత్తు జీవితాన్ని ఆమె తీసుకునే నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి.

(అన్వేషి బ్రాడ్‌షీట్‌ నుండి)

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.