సినిమా నిదానంగా నడిచింది. థ్రిల్లింగ్‌గా లేదు… అని రాస్తున్న రివ్యూయర్లు సినిమాలను ఒక అనుభవంగా ఎలా చూడాలో కొత్తగా అర్థం చేసుకోవాలేమో.
మన కొత్త తెలుగు సినిమాలో కథానాయకుడు కవి. కవిత్వం రాస్తున్నాడు. కథానాయకి కూడా కవే. కవిత్వాన్ని ఆస్వాదిస్తున్నది. కవిత్వంతో ప్రేమలో పడుతున్నది. కలలని కవిత్వంలా పంచుకుంటున్నారిద్దరూ. కవిత్వంతో, జీవితంతో ప్రేమలో పడిపోయి ఒకరితో ఒకరు ప్రేమలో పడ్డారు. కథనాయకుడు ప్రేమ కవిత్వాన్ని విప్లవ నినాదాలుగా గోడల మీద రాస్తున్నాడు.
నమ్మశక్యంగా లేదు కదూ…
ఒకచేత్తో వందలమందిని నరికిపారేసి నెత్తుటేర్లలో ముంచేసి, అదే చేత్తో ఒక వంద ఆడిలను (సుమో పాతబడింది), మహేంద్ర జీపులను లేపేసి, నడుస్తున్న రైలునాపి, అప్పుడే వచ్చిన పొట్టి బట్టల హీరోయిన్‌ను వెంటనే ఖరీదైన విదేశాలకు తీసుకెళ్ళి, మంచుకొండల్లో దాదాపు బట్టల్లేకుండా ఆమే, జాకెట్టూ, జీన్సూ నిండా వేసుకుని తానూ సాహిత్యపు దుర్గంధాన్ని వెదజల్లే పాటలు పాడి, మళ్ళీ హైదరాబాద్‌కు వచ్చి తెలంగాణ భాషను దుర్మార్గంగా అపహాస్యం చేసి (రాష్ట్రం వచ్చి ఇన్నేండ్లైనా) అర్థం పర్థం లేని పిచ్చి కామెడీ మురికి సైడు కాల్వల్లో మునిగి తేలే హీరోలు రాజ్యమేలుతున్న తెలుగు సినిమాల్లో…
తల్లి బాధ చూడలేక దానికో యంత్రమే కనిపెట్టాలని అకుంఠిత దీక్షతో పనిచేసే హీరోలు, మామూలుగా మనందరం మాట్లాడుకునే మధురమైన తెలంగాణ భాషను నిజాయితీగా మాట్లాడే హీరోలు, కవిత్వం రాసే భావుకులైన హీరోలు, ప్రేమ కోసం పోరాటాలు చేసే హీరోలు, మనందరిలాగే మామూలుగా బ్రతికే హీరోలు ఇప్పుడు కొత్త తెలుగు సినిమాల్లో కనబడుతున్నారు.
అసలు నమ్మశక్యంగా లేదు కదూ…
ఇంకా నమ్మలేని విషయమేంటంటే, ఇప్పుడు తెలుగు సినిమాలో హీరో సామాజిక అంతస్థు స్పష్టంగా చెప్తున్నారు. అతను దళితుడని, బహుజనుడని, నిచ్చెన మెట్ల కుల సమాజపు సమాజం అట్టడుగు మెట్లకు చెందినవాడని, అంటరాని వాడని తెలుస్తోంది. ఇంతవరకూ తెలుగు సినిమాల హీరోలు కొన్ని ఇంటిపేర్లకు పరిమితమై, (ఆ ఇంటిపేర్లు ఏ ఆధిపత్య కులాలకు చెందినవో మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది) ఆ హీరో హీరోయిన్ల కుటుంబాలు కొన్ని ప్రాంతాల గ్రామాలకు/పట్టణాలకు పరిమితమై (ఆ గ్రామాలూ, పట్టణాలూ ఏ ప్రాంతమో కూడా తెలుస్తూ ఉంటుంది), మొత్తం కథే కొన్ని సామాజిక వర్గాలకు కుదించి వేయబడి ఒక తెలిసీ తెలియని ఆధిపత్యం మన మెదళ్ళమీద సినిమాగా కొన్ని దశాబ్దాలపాటు అడ్డగోలుగా పనిచేస్తున్న సందర్భంలో హీరోలు అణచివేయబడ్డ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని స్పష్టంగా ప్రకటించడం తెలుగు సినిమాల్లో గొప్ప విప్లవాత్మక మార్పు.
నాకు తెలిసీ ఒక మల్లీశ్వరి సినిమాలోనే హీరో, హీరోయిన్లు పద్మశాలీ కులానికి చెందినవారని ప్రకటిస్తారు. అలాగే బి.నర్సింగరావు గారు సినిమాల్లో మళ్ళీ ఆ సామాజిక చట్రం కనబడుతుంది. ఈ మధ్య వచ్చిన రంగస్థలం సినిమాలో బహుశా మొదటిసారి కుల సంబంధమైన హత్యలు చూపించారు. మల్లేశం సినిమాలో హీరో సామాజిక వర్గమూ, స్థితీ చాలా స్పష్టమే.
దొరసాని సినిమాలో హీరో ‘కింది’ కులం వాడు. దొరసాని ఇచ్చిన నీళ్ళ చెంబు నుండి నీళ్ళు తాగొచ్చా అని అమాయకంగా అడుగుతాడు. కోస్తా ప్రాంతంలో పచ్చని వ్యవసాయ ధనిక పల్లెటూర్లు కాకుండా తెలంగాణలో వరంగల్ జిల్లాలో పల్లెటూరులో కథ. (ఇప్పటికీ సిద్దిపేట రాలేదు తెలుగు సినిమాలోనికి… ఒకప్పుడు ఏదో సినిమాలో సిద్దిపేట కనబడుతుంది అంటే ఉరికి ఉరికి చూసినమ్). దొరల గడీల్లో కథ. తెలంగాణలో 1980/90ల్లో దొర గడీలున్నాయాని అడిగేటోల్లు కరీంనగర్, వరంగల్, నిజామాబాద్‌ల ఊర్లకు పోయి చూడాలె.
దొరసాని కథ మన జీవితాల నుండి వచ్చింది. మన జీవితాలను చెప్పేది. హీరో హీరోయిన్లు భావుకులు (తెలంగాణలో
ఉద్యమాల ప్రభావం వల్ల పెరిగిన చైతన్యమూ, భావుకతా పుష్కలం… అది 1980 / 90లలో దాదాపు ప్రతి యువతీ యువకుణ్ణి ప్రభావితం చేసింది… జీవితాలను మార్చివేసింది). వాళ్ళు కవిత్వం చెప్పుకున్నారు. కవిత్వంతో ప్రేమలో పడ్డారు. కవిత్వంతో ప్రేమించుకున్నారు.
ఐతే అది మామూలు ప్రేమ కథ కాదు. అది ఒక సామాజిక ధిక్కారం. ఆధిపత్య కుల వ్యవస్థనూ, దాన్ని కాపాడే దుర్మార్గపు భూస్వామ్య వ్యవస్థనూ ధిక్కరించి వాటిపై పోరాటం చేసిన ప్రేమ. ఆ ప్రేమ మనగలగాలంటే అవీ, వాటి ఆధిపత్యమూ పోవాలి. అందుకే సినిమాలో నక్సలైట్ ఉన్నాడు, ఆ విప్లవ పోరాట నేపథ్యం ఉంది.
ఈ పాయింట్‌ను స్పష్టంగా అర్థం చేసుకుని ఒకానొక సామాజిక చట్రంలో ప్రేమ ఎలా పోరాటం చేయాల్సి వస్తుందో, దానికి ఏ ఏ అంశాలు తోడవుతాయో తెలుసుకుని, అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు కె.వి.ఆర్.మహేంద్ర అభినందనీయుడు. భూస్వామ్యమూ, ఆధిపత్య కులవ్యవస్థ జమిలిగా ఎట్లా అణచివేతను అమలు చేస్తాయో అర్థం చేసుకోవడం ఈ సినిమా కథకు చాలా ముఖ్యం. అది అర్థమైతేనే, సామాజిక శక్తులనూ, వాటి మధ్య చలనసూత్రాలూ, ఘర్షణా సరిగ్గా అర్థమవుతాయి. ఇది మహేంద్రకు స్పష్టంగా తెలుసని సినిమా చెప్పకనే చెప్తున్నది.
సినిమా నిదానంగా నడిచింది, థ్రిల్లింగ్‌గా లేదు, పాతకాలం కథ… అని రాస్తున్న రివ్యూయర్లు సినిమాను ఒక అనుభవంగా ఎట్లా చూడాలో, సినిమాలో మునిగి తడవడం అంటే ఏమిటో కొత్తగా అర్థం చేసుకోవాలేమో.
చాలాచోట్ల సినిమాలో కెమెరా కథ చెప్తుంది. కెమెరా కదలికలు అతి చిన్నవైనా గొప్ప విషయాలను మనకందిస్తాయి. కెమెరా నిజానికో కవి కన్నులాంటిది. రాసే ప్రతి పదం ఒక్కో ఫ్రేమ్‌గా, వాక్యాలు దృశ్యాలుగా మనముందు ఆవరించి, వర్షించి, మనని తడిపి ముద్ద చేస్తాయి. దానికి అద్బుతమైన సంగీతం తోడవుతుంది. అప్పుడు సినిమా కేవలం కథ మాత్రమే కాదు. ఒక అనుభవమవుతుంది.
ఇట్లాంటి అనుభవాలు మన తెలుగు ప్రేక్షులకు కొత్త. ఇట్లాంటి సినిమాలు తెలుగు ప్రేక్షకులకు అర్థం కాకుండా
ఉండేందుకు, దరిదాపుల్లో లేకుండా చేసేందుకు, తెలుగు ప్రేక్షకుల దృష్టినీ, ఆలోచనలనూ, సెన్సిబిలిటీలనూ భ్రష్టు పట్టించేందుకు గత 75 ఏండ్లకు పైగా గట్టి ప్రయత్నమే జరిగింది. బెంగాలీలకు ఋత్విక్ ఘాటక్, రే, మృణాళ్‌సేన్ లా, మళయాళీలకు ఆదూర్ గోపాలకృష్ణన్, జాన్ అబ్రహామ్, అరవిందన్ లా, కన్నడీయులకు కాసరవిల్లి, నాగాభరణ, గిరీష్ కర్నాడ్ లా, తమిళులకు బాలచందర్, భారతిరాజాలా మనకు చాలా ఏండ్లకు కానీ బి.నర్సింగరావు రాలేదు. వచ్చినా ఆధిపత్య సినిమాను తట్టుకుని ఆ ఒరవడి కొనసాగలేదు.
ఇప్పుడు మళ్ళీ మల్లేశం, దొరసాని లాంటి సినిమాలు గొప్ప దీపాలైన గొప్ప కాంతిని వెదజల్లుతున్నాయి. తెలుగు సినిమా భవిష్యత్తు మీద గొప్ప ఆశను కలిగిస్తున్నాయి.