జీవ వైవిధ్యాన్ని, జీవించే హక్కును హరిస్తున్ననల్లమల యురేనియం ప్రాజెక్టును వ్యతిరేకిద్దాం

ప్రజలారా, ప్రజాస్వామిక వాదులారా !

యురేనియం వెలికితీత నల్లమలలోని జీవవైవిధ్నాన్ని నాశనంచేసి సమస్త ప్రాణకోటిని హరించే రేడియో ధార్మిక కిరణాలను ప్రసరింపజేస్తుంది. యురేనియం వెలికితీత మానవజాతి ప్రాణాలను హరించే క్యాన్సర్‌ను బహుమతిగా ఇస్తుంది. యురేనియంతో జలవాయు కాలుష్యాలతో పాటు భూమిని సైతం విషపూరితం చేస్తున్నది యురేనియం వెలికితీతపై నల్లమల ప్రజానీకం యుద్ధం ప్రకటించి ఉంది. యుద్ధంలో ప్రజాస్వామికవాదులు, మేధావులు ఎటువైపు వున్నారో తేల్చుకోమంటున్నది. 2008 నుండి 2014 వరకు నల్లమల అడవిలో నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ (ఎన్‌.ఎమ్‌.డి.సి) ఆధ్వర్యంలో యురేనియం నిలువల సేకరణ కోసం బోర్లు వేయడానికి అటవీశాఖ అనుమతించిందని అమ్రాబాద్‌ అటవీ డివిజన్‌ అధికారి సుధాకర్‌ రావు గారు జూలై 24న పౌరహక్కులసంఘ నిజనిర్ధారణ బృందానికి విషయాలు తెలియజేశారు. అంతేకాక నేడు జరుగుతున్న ఈ విధ్వంసక అభివృద్ధి గురించి అటవీశాఖ అధికారులకే తెలియదని ఒకేలా ఆ స్థితే వస్తే గ్రీన్‌ట్రిబ్యునల్‌లో కేసువేసి ఈ వెలికితీతని ఆపాల్సిన అవసరం ఉందని తెలియజేశాడు. ముఖ్యంగా ప్రపంచంలో ఎక్కడా లేని సహజ సిద్ధమైన అడవి దానితో పాటు పులుల జీవనం ఇక్కడే ఉందని వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిదని అందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత ఎక్కువగా ఉంటుందని పౌరహక్కుల సంఘ ప్రతినిధులకు తెలియజెశాడు.

2012 లో యురేనియం కోసం బోర్లు వేస్తున్న సమయంలో ప్రజలకు ఎటువంటి విషయ సమాచారం లేని స్థితిలో తిర్మలాపూర్‌ గ్రామంలో బోర్‌బండిని ధ్వంసం చేస్తే తప్ప ఎందుకోసం బోర్లు వేస్తున్నారో విషయం వెలువడిన సంగతి తిర్మలాపూర్‌ గ్రామస్థులు నిజనిర్ధారణ కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. సుమారుగా యురేనియం వెలికితీతకు గురవుతున్న అన్ని గ్రామాల ప్రజలు ప్రాణాలు పోయేదాక పోరాడుతాం కానీ యురేనియం వెలికితీతకు ససెమీరా ఒప్పుకోమని తెగేసి చెప్పుతున్నారు. వారి మాటల్లోనే ప్రజలకు కరెంటు అవసరమే కావచ్చు కానీ లక్షలాది మందిని నిర్వాసితులను చేసి, అనారోగ్యం పాలుచేసి, జీవనోపాధి లేకుండా చేసి తెచ్చే కరెంటు మాకు వద్దే వద్దు. ప్రభుత్వం వెంటనే ఈ యురేనియం వెలికితీత నిర్ణయాన్ని మానుకోవాలని నల్లమల ప్రజానీకమంతా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. జూలై 18న నేషనల్‌ అటవీ శాఖ కన్సర్‌వేటర్‌ ఝా కూడా యురేనియం వెలికితీతకు అనుమతులు ఇచ్చినట్టుగా వార్తా పత్రికలో చూస్తున్నాం అన్న విషయం స్పష్టం అవుతున్నది.

మనోహరమైన ఈ ప్రకృతి పై భారత ప్రభుత్వ కన్ను బడింది. ఈ కన్ను పడిందంటే ఏదైనా సరే భస్మీపటలం కావాల్సిందే. ఆ నేలను కుళ్ళ బొడిచి గర్భంలోని ఖనిజాన్ని వెలికి తీసే కార్యానికి పూనుకుంది. మాటలు రాని అపారమైన వృక్షజాలం, జంతు జాలం, పక్షులు, ప్రకృతి, పర్యావరణం, నీరు, గాలి, నదులు కేంద్ర ప్రభుత్వ పంజాలో యిరుక్కాని విలవిల్లాడుతున్నవి. విచిత్రంగా అక్కడ నివసించే ఆదివాసులకు మాటలొచ్చు. వారి గతమంతా దుర్భరమే. వర్తమానం తెలియదు. భవిష్యత్తు ఆశ లేదు. వీరి మాటల వెనుక మెదడుంది. వారి మెదళ్ళలో తెలంగాణ సాయుధ పోరాట గుర్తులు నక్సలైటు ఉద్యమ పొరలు గూడు కట్టుకున్నవి. తత్ఫలితంగా వీరి మాటలు పదును గానే వున్నాయి.

”మోదీ మమ్మల్ని చంపాలనుకుంటున్నాడు. ఈ గడ్డ మీది ఆకులు, అలాలు, గడ్డలు, కాయలు, పండ్లు తిన్నోళ్ళం అంత సులభంగా చావం. పోరాడి చస్తాం. మేం బతికిన ఈ గడ్డ మమ్మల్ని కాపాడుకుంటది. మా ఆవులకు, లేగలకు కొమ్ములున్నాయి మమ్మల్ని ఎలా కపాడుకోవాలో వాటికి బాగా తెలుసు. అని తిర్మలాపూర్‌ కు చెందిన అరవై మూడేళ్ళ నారమ్మ అంటుంటే అందరూ గొంతులు కలిపారు. యంత్రాలను, వాహనాలను అప్పర్‌ ప్లాటుకు ఎక్కనివ్వం. మోడీమిల్ట్రీని పారదోలుతాం. ఈ అడవి మాది, అడవి సంపద మాది. మేమే అనుభవిస్తాం. మేం ఎక్కడికి వెళ్ళి దేన్ని యాచించం. మా దగ్గరికి వస్తే వూరుకోం. మైదాన ప్రాంతం నుండి ఎట్ల పైకి ఎక్కుతారో చూస్తాం. అక్కడే పాతి పెడతాం. మా మీద బాంబులు వేస్తారా? మేం బాణాలు వేస్తాం. కాచుకోండని” అమాయకపు చూపులు చూస్తూనే సర్పంచ్‌ ముత్తమ్మ (31) దృఢంగా అంటుంటే గ్రామస్థులంతా చప్పట్లు కొట్టారు. ఆదివాసులు రాజులతో, రాజ్యాలతో, విదేశీయులతో పోరాడిన చరిత్ర గలిగిన వారసత్వ పోరాట పటిమ, నిశ్చయం కనబడుతుంది. సాంప్రదాయ విల్లంబులు, అత్యాధునిక ఆయుధాలు తలపడనున్నాయి. పోరాటంలో ఎన్ని ప్రాణాలు చుట్టు తీతువులు తిరుగుతాయో?యురేనియం తవ్వకాల వలన నిర్వాసితులయ్యే గ్రామాలు.

అమ్రాబాదుమండలంలో : అమ్రాబాదు, మన్ననూర్‌, తిర్మలాపూర్‌, ఉప్పునుంతల, లక్ష్మాపూర్‌, మాదవాని పల్లి, వంగురోని పల్లి, సార్లపల్లి, ఈదుల బావి, కల్ములోని పల్లి, ఎల్మా పల్లి, వటువర్ల పల్లి, కుడిచింతల బైలు, మాచారం, వెంకటేశ్వర్ల బావి, తుర్కపల్లి, దోమల కుంట ఈదులబావి, కుమ్మరోనిపల్లి, కొమ్మనపెంట, కోలంపెంట, జంగం రెడ్డి పల్లి, యమరెడ్డి పల్లి, తెలుగుపల్లి, కొత్తపల్లి, చింతలోని పల్లి, కండ్లకుంట, కుమ్మరోని పల్లి గ్రామాలు ఉన్నాయి. పదర మండలంలో : పదర, రాయలగండి తండా, జ్యోత్యానాయక్‌ తండా, కొడోని పల్లి, చిట్లంకుంట, చెన్నంపల్లి, పెట్రాల్‌ చేను, వంకేశ్వరం, ఉడిమిల్ల, పిల్లిగుండ్లు, ఇప్పలపల్లి, మారడుగు, బాపన్‌పాడు తండా, బాపన్‌పాడు చెంచుగూడెం, మద్దిమడుగు, గీసగండి పెంట గ్రామాలు ఉన్నాయి. లింగాల మండలంలో : లింగాల, అప్పాపూర్‌, రాంపూర్‌, సంగిడి గుండాల, మేడిమల్కల, ఈర్లపెంట, బౌరాపురం, మల్లాపురం, తీరంగాపురం, రాయవరం. అచ్చంపేట మండలంలో : బక్కలింగయ్య పల్లె, ఘనపురం, సీత్రాల, అక్కారం, మన్నె వారి పల్లి, సిద్ధాపురం, ఐనోలు, బొమ్మనపల్లి, రంగాపూర్‌. బల్మూర్‌ మండలంలో : బానాల, చెంచెగూడెం, లక్ష్మిపల్లి, బిల్లకల్లు వెంకటాపూర్‌, అంబగిరి మొదలగు యురేనియం ప్రభావిత గ్రామాలు ఉన్నాయి.

ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి కాలంలో నల్లమల అడవిలో డబీర్స్‌ వజ్రాల వేట కొనసాగింది. 2008-2014 వరకు యురేనియం నిల్వల కోసం పరిశోధన కొనసాగింది. యురేనియం నిర్ధారణ అయిన తర్వాత కేంద్రప్రభుత్వం నల్లమల అడవి విధ్వంసానికి అనుమతిలిస్తున్నది. యురేనియం వెలికితీయడం అంటే చెంచులను హత్య చేయడమే. యురేనియం కోసం 4000 వేల బోర్లు తవ్వడం పచ్చని అడవిని పరిశ్రమలతో నింపడమే. ఈ విధ్వంసంతో 64 రకాల వన్య ప్రాణుల ఆచూకి లేకుండా పోతుంది. దేశంలోనే రెండవ అతిపెద్ద అమ్రాబాద్‌ టైగర్‌ ఫారెస్టు అంతమవుతుంది. జీవ వైవిధ్యం పూర్తిగా దెబ్బతింటుంది. వన్యప్రాణులు, ఆదివాసీ చెంచుల ఆచూకి లేకుండా పోయేస్థితి యురేనియం తవ్వకాల వల్ల రాబోతుంది. యురేనియం వెలికితీత మరోవైపు జలాన్ని కూడా కలుషితం చేస్తుంది. చివరికి అది శ్రీశైలం, నాగార్జునసాగర్‌ డ్యామ్‌లకు కూడా పెను ముప్పు గా మారబోతున్నది. ఈ సమస్య నల్లమల చెంచులదే కాదు ఉమ్మడి మహబూబ్‌నగర్‌,

ఉమ్మడి నల్లగొండ జిల్లాల ప్రజలది కూడా. అంతేకాక 12 వందల మంది2 అమరుల త్యాగంతో సాధించుకున్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానిది కూడా. తెలంగాణ ముఖ్యమంత్రి బహుళజాతి కంపెనీలకు దాసోహం అవుతున్నాడా? ప్రజాప్రతినిధి, ముఖ్యమంత్రిగా వున్న చంద్రశేఖర్‌రావు తన బాధ్యతను పూర్తిగా నిర్వర్తిస్తున్నాడని భావించగలమా? తేల్చుకోవాల్సిన సమయం ఇదే. కార్పోరేట్లకు మనుషులి ప్రాణాల కన్నా లాభాలే ముఖ్యంగా మారతున్నాది.

రష్యాలో చెర్నోబిల్‌ అణు విధ్వంసాన్ని, జపాన్‌లో పుక్కుషుమా అణు విధ్వంసాన్ని మరువలేని స్థితిలో ప్రపంచం ఉండి అభివృద్ధి చెందిన దేశాలలో యురేనియం వెలికితీతను నిలిపివేసుకున్న ఒక ప్రజాస్వామిక తీర్మానం పట్ల మన ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తూ ప్రజల జీవించే హక్కు, జీవనోపాధి హక్కులపై తీవ్రస్థాయిలో దాడిచేస్తున్న విధానమే నల్లమలలోని యురేనియం వెలికితీతగా మనం అర్ధం చేసుకోవాలి. దీన్ని గమనించే మహారాష్ట్ర జైతాపూర్‌లో అణువిద్యుత్‌ కార్మాగారానికి వ్యతిరేకంగా అక్కడి ప్రజల పోరాటం తుపాకి కాల్పు వరకు వచ్చి ఇద్దరు ప్రాణాలు కూడా త్యాగం చేస్తే తప్ప అది అక్కడ లెక్కుండ తమిళనాడుకు తరలిచబడింది. తమిళనాడు కుడాంకుళంలో అణు విద్యుత్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మొక్కవోని ధైర్య సాహాసాలతో పోరాడిన తమిళ ప్రజల పోరాటాలన్ని మరవకముందే మరో అణు విధ్వంసాన్ని తెలంగాణ ప్రజలు ఎదుర్కొవాల్సి వస్తున్నది. ఈ క్రమంలోనే నల్లమలలో 4000 వేల బోర్లు తవ్వడం, 20 వేల టన్నుల యురేనియం వెలికితీయడం ప్రజల, పర్యావరణ విధ్వంసాలకు ప్రభుత్వమే అనుమతిచ్చి అప్రజాస్వామికంగా ప్రవర్తిస్తున్నది.

ఇప్పటికే వున్న 17 అణువిద్యుత్‌ ప్లాంట్‌లకు తోడుగా ఇంకా 6 ప్లాంట్స్‌ను కన్‌స్ట్రక్షన్‌ స్థాయిలో కొనసాగుతున్నాయి. ఇది ఇంధనం కొరతకు సంబంధించి అణువిద్యుత్‌ ప్లాంట్‌ల మీద ప్రభుత్వాలు కేంద్రీకరించడం ప్రజల జీవన్మరణ సమస్యగా మారింది. ఇదే స్థితి జార్ఖండ్‌లోని తూర్పు సింగ్‌భూమ్‌ జిల్లాకు చెందిన జాదుగూడాలో కొనసాగుతున్నది. ప్రకృతి సంపద ప్రజలకు బతుకు దెరువును ఇవ్వాలి కానీ ప్రజలకు బతుకే లేకుండా దాడిచేస్తే ప్రజలేమైపోవాలి. ప్రభుత్వాలు అడవిపై ప్రేమతో గానీ, ఆదివాసీలపై ప్రేమతో గానీ ఒక ప్రజాస్వామికమైన పని చేయడం లేదు. కేవలం ఖనిజకాంక్ష కలిగిన బహుళజాతి కంపెనీల కోసం అడవిని, ఆదివాసీలని నాశనం చేస్తుంది. ఇది మనది కాని మన ప్రభుత్వంగా ప్రజలను హత్య చేస్తున్నది. జార్ఖండ్‌లోని జాదుగూడ యురేనియం మైన్స్‌ వలన 50 వేల మంది ప్రజల జీవితాలు ప్రమాదంలో పడ్డాయి. వీరంతా ఎక్కువ రేడియోషన్‌కు గురై ఆరోగ్య సమస్యలతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఈ యురేనియం మైన్స్‌

ఉన్న ప్రాంతమంతా సంతాల్‌, ముంగా, మహిలి జాతులకు చెందిన ఆదివాసులు జీవిస్తుంటారు. ఈ ప్రాంతంలోని 5 గ్రామాలను, 2 వేల ఇండ్లను 9 వేల ప్రజానికంతో కలిసి పరిశోధన జరిపిన వైద్యబృందం వంశపారంపర్య జబ్బులకు, కాన్సర్‌కు, చర్మవ్యాధులకు నిలయంగా మారిపోయి అక్కడి ప్రాంతమంతా వారి జీవించే హక్కును ప్రశ్నార్ధకం చేసింది. భారత వైద్యబృందం శాంతి మరియు అభివృద్ధికి సంబంధించిన స్థానిక సమస్యతో, జార్ఖండ్‌కు చెందిన రేడియేషన్‌ వ్యతిరేక సంస్థతో కలిసి 23 గ్రామాల్లో 30 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాన్ని పరిశీలించి ప్రజల నివేదికను తయారుచేసింది. ఈ నివేదికలో యురేనియం వెలికితీత వల్ల ప్రజల అభివృద్ధి కన్నా సమస్య వినాశనమే ఎక్కువగా ఉన్నదని పేర్కొన్నది. జాదుగూడా యురేనియం గనులను చూస్తున్న మనం నల్లమలలోని యురేనియం వెలికితీతకు ఎలా అంగీకరించగలం? ఇదంతా అభివృద్ధిగా ప్రభుత్వాలు మాట్లాడుతాయి. పర్యావరణమే విధ్వంసమైపోయిన తర్వాత జీవ వైవిద్యం ఎక్కడ ఉంటుంది.

నల్గొండ జిల్లా పరిధిలోని పెద్దగట్టు, సేరుపల్లి నుంచి 2001లోనే యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాటం చేసి అడ్డుకోవడం జరిగింది. బీజేపీ, ప్రస్తుత ప్రభుత్వాలు గతంలో ప్రజల పక్షాన పోరాటం చేశాయి కాని గద్దెనెక్కొన తరువాత మాట మార్చి ప్రజలను ముంచుతున్నారు. నల్లమల అక్షయపాత్ర, ఆరోగ్యప్రదాత అని ప్రతి పల్లె నుంచి పిల్లాపాపలతో కలిసి యురేనియానికి వ్యతిరేకంగా నిరంతరం పోరాటాలు చేసి బడా కంపెనీలను తరిమికొట్టాలని లేని పక్షంలో నల్లమల ప్రాంతం విషపూరితంగా మారి మానవ జాతే జీవించలేని స్థితి ఏర్పడుతుంది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలోని నాగర్‌ కర్నూల్‌, నల్గొండ, కర్నూల్‌, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో 2లక్షల 75వేల హెక్టార్లలో విస్తరించి ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో అటవీ ఉత్పత్తుల సేకరణ ద్వారా ఉపాధి ఆపొందేందుకు చెంచులు, అటవీ అందాలను చూసేందుకు వచ్చిన పర్యాటకులను నిబంధనల పేరిట నానా ఇబ్బందులు పెట్టే అధికారులు, యురేనియం తవ్వకాలకు అనుమతివ్వడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. నల్లమలలోని పోడ్‌ ఏరియాలో రోడ్డు వేయాలన్నా, చెంచుపేంటలకు విద్యుత్‌ సౌకర్యం లికల్పించాలన్నా తీవ్రమైన ఆంక్షల నేపథ్యంలో సాధ్యం కాని పరిస్థితి ఉన్నది. ‘నల్లమలలో ఆరు వందల జాతులకు చెందిన ఔషధ మొక్కలు, 70 రకాల అరుదైన వన్యప్రాణులు, అరుదైన చెంచు ఆదిమ జాతి నివసిస్తున్న నేపథ్యంలో ఈ ప్రాంత ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చే యురేనియం తవ్వకాలను అటవీశాఖ ఎలా అనుమతిచ్చి అటవీ హక్కుల చట్టాన్ని అటవీ శాఖే అతిక్రమించదనే స్పష్టమవుతున్నది.

”అమ్రాబాద్‌ నల్లమలలోని ఈ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌ దేశంలోనే అతిపెద్దది. దేశంలో అత్యంత జీవ వైవిధ్యమున్న ప్రాంతం కూడా ఇదే. పులులు, చిరుతలు, అడవి పందులు, కణుజులు, దుప్పులు, ఎలుగుబంట్లు, నెమళ్లు వంటి జీవరాశులకు ఇది నెలవు. ఇక్కడ యురేనియం నిక్షేపాలను అన్వేషించేందుకు అనుమతి ఇస్తే అడవి నాశనమే. వన్యప్రాణుల సంరక్షణకు ఎన్నో ఏళ్లుగా పడిన శ్రమ వథా అవుతుంది. అడవితో పాటు వన్యప్రాణుల మనుగడకే ముప్పు వాటిల్లుతుంది” అని అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ ప్రాంతం ఫీల్డ్‌ డైరెక్టర్‌ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో స్పష్టం చేశారు. యురేనియం నిక్షేపాల అన్వేషణ కోసం తవ్వకాలు జరపాలని భావిస్తున్న అటవీప్రాంతాల్లో నాలుగు బ్లాకులున్నాయి. ఈ మొత్తం బ్లాకుల విస్తీర్ణం 83 చదరపు కిలోమీటర్లుగా ఉంది. ఈ ప్రాంతం పూర్వపు నల్లగొండ, మహబూబ్‌ నగర్‌ జిల్లాల్లో విస్తరించి

ఉంది. ఈ నాలుగు బ్లాకుల్లో కొండలు, వివిధ రకాల అరుదైన వక్ష జాతులు, జీవరాశులు ఉన్నాయి. దట్టమైన అటవీప్రాంతం కావడంతో పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, అడవి పందులు వంటివి సంచరిస్తున్నాయి. ఇలాంటి అరణ్యంలోకి అడుగు పెట్టడం కష్టం. కాలిబాటలు కూడా లేవు. ఇలాంటి దట్టమైన అరణ్యంలోకి తవ్వకాల కోసం భారీ యంత్రాలను ఎలా తీసుకెళతారన్నది ప్రశ్నార్థకం. వక్షాలను తొలగిస్తారా లేదా? అనే దానిపై కూడా స్పష్టత లేదు. ఇలాంటి విశిష్టమైన అటవీ ప్రాంతంలో ఖనిజాన్వేషణ జరిగితే ‘భూమి కోతకు గురవుతుంది. అక్కడ సంచరించే జీవరాశులపై రసాయనాల ప్రభావం ఉంటుంది. భారీ గుంతలు ఏర్పడి వన్య ప్రాణుల మనుగడకు ముప్పు వాటిల్లుతుంది. అంతేగాక జీవ వైవిధ్యానికీ విఘాతం ఏర్పడుతుందనే విషయం మనకు అందరికి తెలిసిందే.

బ్లాకు1 : దీని విస్తీర్ణం 38 చదరపు కిలోమీటర్లు. ఇది అమ్రాబాద్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌ పరిధిలోని మాచవరం బీట్‌ పరిధిలో

ఉంది. అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ బఫర్‌ ఏరియాలో ఇదొక భాగం. ఇందులోని 239, 240, 241 కంపార్ట్‌ మెంట్లు కోర్‌ ఏరియాలోనే

ఉన్నాయి. కొండలు, చెట్లు, ముళ్ల పొదలతో నిండి ఉంది. ఇక్కడ అడవిపందులు, కణుజులు, దుప్పులు, ఎలుగుబంట్లు, చిరుతలు, పులులు వంటి జీవరాశులు ఉన్నాయి. ఈ ప్రాంతంలో తవ్వకాలకు భారీ యంత్రాలను తీసుకెళ్లడం అంత సులువుకాదు తవ్వకాలు ఎక్కడ జరుపుతారో కూడా చెప్పలేదు. చెట్లను తొలగిస్తారా? లేదా? అనే విషయంలో కూడా స్పష్టత లేదు.

బ్లాకు 2 : మొత్తం 38 చ.కి.మీ.ల విస్తీర్ణంలో ఉంది. అమ్రాబాద్‌ అటవీ రేంజ్లోని పాద్రా, మారేడుపల్లి బీట్ల పరిధిలో ఉంది. అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ పారేస్టలోని రాజీవ్‌ గాంధీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఈ బ్లాకు పరిధిలోనే ఉంది. ఇందులోని నల్లవాగు ప్రాంతంలో పులుల సంచారం ఉంటుందని చెబుతారు. కొండలు, గుట్టలతో కూడిన ఈ ప్రాంతంలోకి వెళ్లడానికి రహదారులు లేవు. యంత్రాలను తీసుకెళ్లి తవ్వకాలు జరపడంపై స్పష్టత ఇవ్వలేదు.

బ్లాకు 3: మొత్తం విస్తీర్ణం 3 చ.కి.మీ.లు. దేవరకొండ రేంజ్లోని కంబాలపల్లి బీట్లో ఉన్న 116 కంపార్ట్‌ మెంట్‌ కిందకు వస్తుంది. ఇక్కడ రాజీవ్‌ గాంధీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం విస్తరించి ఉంది. ఈ బ్లాకులోనూ ఎక్కడ తవ్వకాలు జరుపుతారనే దానిపై స్పష్టత లేదు.

బ్లాకు 4: మొత్తం విస్తీర్ణం 3 చ.కి.మీ.లు. ఇది కూడా దేవరకొండ రేంజ్లోని కంబాలపల్లి బీట్లో గల ‘117 కంపార్టమెంట్‌ పరిధిలోకి వస్తుంది. ఇందులో నూ రాజీవ్‌ గాంధీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం విస్తరించి ఉంది. ఇక్కడ పలు రకాల వన్య ప్రాణులు సంచరిస్తున్నట్లు వివిధ నివేదికల్లో స్పష్టమైంది. మొదటి 3 బ్లాకుల్లో అమ్రాబాద్‌ టైగర్‌ ప్రాజెక్టు నిర్మితమైన ప్రదేశం. కావునా వన్యప్రాణి సమస్తం దెబ్బతినే అవకాశం ఉంది. పెద్ద పులి ఇక కనుమరుగే అమ్రాబాద్‌ రిజర్వ్‌ నెత్తిన యురేనియం పిడుగు 20వేల టన్నుల నిక్షేపాల అన్వేషణకు కేంద్రం అనుమతి 83 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో తవ్వకాలు 4000 బోర్లు తవ్వనున్న అణుశక్తి శాఖ దేశంలోనే అత్యంత నాణ్యమైనది లభ్యమయ్యేది ఇక్కడే.

కేంద్రం ”అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్లో భారీ స్థాయిలో యురేనియం నిక్షేపాలున్నాయి. భూమిపై ‘ఆక్సిజన్‌ వ్యాపించి-జీవజాలం పుట్టుకకు ముందునాటి కాలానికే ఇవి భూరాతి పొరల్లో నిక్షిప్తమై ఉన్నట్లు ఓ అంచనా. ఇంతవరకూ దేశంలో లభ్యమైన యురేనియం నిక్షేపాలు చాలా తక్కువ గ్రేడ్‌ ఉన్నవి. వాటి లభ్యత కూడా బహు స్వల్పం. దేశమంతా మేం పరిశీలించి సూక్ష్మస్థాయిలో అన్వేషణ జరిపినపుడు కడప బేసిస్‌ కిందకు వచ్చే తెలంగాణ ప్రాంతంలో నిక్షేపాలు గణనీయంగా ఉన్నట్లు నివేదికలు వచ్చాయి. అత్యంత నాణ్యమైన నిక్షేపాలివి. ఇవి చాలా ఆశాజనకంగా కనిపించాయి. అత్యధికంగా లభ్యత కూడా కనిపిస్తోంది. రెండు విభిన్న రాతిపొరల ఉపరితలంలో నిక్షిప్తమై ఉన్నాయి.

ఇపుడు నల్లమలలోని ప్రజల, వన్యప్రాణుల భవిత ప్రశ్నార్థకమవుతోంది. బతుకు ఛిద్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌, నల్లగొండ జిల్లాల్లో విస్తరించిన అటవీ ప్రాంతం త్వరలోనే పెద్ద పెద్ద యంత్రాల మోతలతో, తవ్వకాలతో తన రూపు కోల్పోబోతోంది. అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్లో యురేనియం నిక్షేపాల అన్వేషణకు కేంద్ర అణుశక్తి సంస్థకు కేంద్ర అటవీ సలహా మండలి సూత్రప్రాయంగా అనుమతి ఇవ్వడం కేవలం చరిత్రను చెరిపేయడమే కాదు. ప్రముఖ శైవక్షేత్రాలు, ఆదివాసులైన చెంచులు, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన దేశంలోనే రెండో పెద్దదైన పులుల అభయారణ్యం – అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్టుల అస్తిత్వానికి పెద్ద దెబ్బ. ఈ నిర్ణయం ఆ ప్రాంతవాసుల్లో భయాందోళనలు రేపుతోంది. మే 22న అటవీ సలహా మండలి సమావేశం జరిగింది. ఇందులో ఆమోదించిన అంశాల ప్రకారం ‘అమ్రాబాద్‌ అభయారణ్య ప్రాంతంలోని 83 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో యురేనియం తవ్వకాలు జరుగుతాయి.

కోయజాతులు నల్లమల నిండా ఉన్నారు. చెంచులు కూడా ఎక్కువే. యురేనియం నిక్షేపాలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో 120 గూడెంలు ఉన్నాయని, దాదాపు 11 వేల మంది జీవనం సాగిస్తున్నారని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. యురేనియం వివిధ ఖనిజాల మిశ్రమంగా ఉంటుందని, దానిని వేరుచేసే ప్రక్రియలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా చెంచుల ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యురేనియం తవ్వకాలు జరిగే ప్రదేశాలను శత్రుదేశాల ముప్పు నుంచి కాపాడుకునేందుకు ఐదంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. దీని వల్ల యురేనియం తవ్వకాల పేరిట చెంచులను కూడా మైదాన ప్రాంతాలకు తరలించడం అనివార్యమవుతోంది. యురేనియం వెలికితీతవల్ల శ్రీశైలం,నాగార్జునసాగర్లోని నీరు కూడా కలుషితమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శైవ క్షేత్రాల మనుగడకు ముప్పు యురేనియం తవ్వకాలు చేపడితే దేశంలోనే ప్రసిద్ధిగాంచిన శైవక్షేత్రాల ఉనికి కూడా లేకుండాపోయే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతుంది. శ్రీశైల ఉత్తర ద్వారం ”ఉమామహేశ్వరం, మద్దిమడుగు ఆంజనేయస్వామి దేవాలయం, గోరాపురం భ్రమరాంబ ‘మల్లికార్జున దేవాలయం, లొద్ది మల్లయ్య, సలేశ్వర క్షేత్రాలు కూడా యురేనియం తవ్వకాలకు అనుమతించిన ప్రదేశాల్లో ఉండటంతో సహజంగానే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. శ్రీశైల మల్లికార్జునుణ్ణి దర్శించుకోవడానికి నల్లమల అటవీ ప్రాంతం గుండానే ప్రయాణించాల్సి ఉంటుంది. ‘యురేనియం తవ్వకాలు ప్రారంభమవుతే ఇక్కడ రాకపోకలపై కచ్చితంగా కఠినమైన నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయి.

యురేనియం నిక్షేపాల అన్వేషణను తెలంగాణ అటవీ శాఖ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రక్షిత అటవీ ప్రాంతాల్లో వందల ఫీట్ల లోతు డ్రిల్లింగ్‌ చేయడం వల్ల అటవీ సంపద నాశనమయ్యే ప్రమాదముందని పేర్కొంటోంది. యురేనియం నిక్షేపాల అన్వేషణకు అనుమతించవద్దంటూ 2016లో కేంద్ర ప్రభుత్వానికి అటవీ శాఖ ఒక నివేదికను సమర్పించింది. ఈ కేంద్రం వాదన ఇదీ! అణుశక్తి నుంచి ఇందన స్వయం సమద్ధి సాధించాలన్నది కేంద్రం లక్ష్యం. ప్రస్తుతం దేశంలో ‘అణుశక్తి కర్మాగారాల స్థాపిత సామర్థ్యం 6780 మెగావాట్లే! 2030 నాటికి దీనిని 40,000 మెగావాట్లకు పెంచాలన్నది టార్గెట్‌. అశుశక్తి ద్వారానే ఇది సాధ్యమని కేంద్రం విశ్వసిస్తోంది. దెబ్బతినే జాతులు – వణ్యప్రాణులు నల్లమలలో ఉన్నంత ప్రక తి వైవిధ్యం మరెక్కడా కానరాదు. అనేక వక్ష జాతులిక్కడ ఉన్నాయి. జంతుజాతుల విషయానికొస్తే.. పెద్దపులులకు ఇది ప్రధాన ఆవాసం. చిరుతలు, ఎలుగులు, వైల్డ్‌ క్యాట్స్‌, అడవి కుక్కలు, అడవి పందులు, కష్ణ జింకలు, మచ్చల దుప్పిలు, నక్కలు, తోడేళ్లు, కోతులు, ఉడుములు, ప్యాంగోలీన్లు, కొండచిలువలు, నాగుబాములు, అనేక ఉభయచరాలు ఇక్కడ

ఉన్నాయి. 2014లో అమ్రాబాద్‌ పులుల సంరక్షణ కేంద్రం ఏర్పాటైంది. 2611 చదరపు కిలో మీటర్లీ విస్తీర్ణంలో ఉన్న ఇది శ్రీశైలం-సాగర్‌ టైగర్‌ రిజర్వ్‌ (3296 చ.కి.మీ)తరువాత రెండో అతి పెద్దది. అమ్రాబాద్‌ అడవిలో ప్రస్తుతం 13 పెద్ద పులులున్నట్లు సమాచారం.

ఖనిజ తవ్వకాల నుండి, శుభ్రం చేయడం, విద్యుత్‌ ఉత్పత్తి వరకు మొత్తం అణు ఇంధన ప్రక్రియలో వందకు పైగా రేడియోధార్మిక శ్రేణులు విడుదల అవుతాయి. వాటిలో క్యాన్సర్‌ను కల్గించేవి, జీవజాలంకు ప్రమాదకరమైన స్ట్రాన్షియం-90 ఐమెడన్‌-131, సినియం – 137 లాంటి మూలకానలు ఉత్పత్తి అవుతాయి. వాటిలో క్యాన్సర్‌ను కల్గించేవి, జీవజాలంకు ప్రమాద కరమైన స్ట్రాన్షియం – 90 ఊమిడెన్‌ -131, నిసియం -137 లాంటి మూలకాలు ఉత్పత్తి అవుతాయి. ఇవే వదార్థాలు అణ్వాయుధాలు ప్రయోగించినపుడు విడుదలవుతాయి.

ఒక వెయ్యి మెగావాట్ల సామర్థ్యమున్న అణువిద్యుత్‌ రియాక్టరు నుండి 10-15 అణుబాండుల తయారీకి సరిపడే ప్లుటోనియంను

ఉత్పత్తి అవుతుందని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్‌ 2005లో హెచ్చరించాడు. అణువిద్యుత్‌ రియాక్టర్లు అణు బాంబులు తయారీకి ఉపయోగపడే ఇంధనాన్ని తయారుచేసి మొత్తం మానవాళి వెనక్కి మెడలో అణుబాంబులను వేళ్లాడదీస్తాయి.

దీంతో యురేనియం శుద్ధికి కష్ణా జలాలు తప్ప వేరే మార్గం లేదు. ముడి యురేనియం నుంచి వెలువడే అణుశక్తితో కాంక్రీట్‌ నిర్మాణాలకు ముప్పు ఏర్పడుతుందని ఇంజనీరింగ్‌ నిపుణులంటున్నారు. ఒక్క శ్రీశైలమే కాదు… శ్రీశైలం వరద జలాలు, నికర జలాలపై ఆధారపడి నిర్మించిన మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల భవితవ్యం కూడా నీరుగారిపోతుందనే ఆందోళన రైతాంగంలో వ్యక్తమవుతోంది. యురేనియంతో కలుషితమైన నీటిని సాగు భూములకు మళ్లిస్తే భూమి సహజ లక్షణాన్ని కోల్పోతుందని వారంటున్నారు. యురేనియంలో రేడియోధార్మికశక్తి గల గామా కిరణాలకు 30 సెంటీమీటర్ల మందం ఉన్న కాంక్రీట్‌ ను కూడా విచ్చిన్నం చేయగల శక్తి ఉంటుందనీ, దీనివల్ల డ్యామ్‌ కు ముప్పు వాటిల్లుతుందని నిపుణులు అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ పథకం మెయిన్‌ గ్రిడ్‌ నాగర్‌ కర్నూలు జిల్లా నార్లపూర్‌ వద్ద ఉన్నది. యురేనియం వ్యర్థాలు క ష్ణా నదిలో మిళితమైతే అది కూడా డోలాయమానంలో పడుతుంది.

యురేనియంతో నేడు నల్లమలలో అడవే కాదు. తెలంగాణ మొత్తంగా విధ్వంసానికి గురి కాబోతుంది. ఉత్తర తెలంగాణలో ఒకవైపు ఓపెస్‌ క్యాస్ట్‌ల విధ్వంసం మరోవైపు గుట్టల విధ్వంసంతో వట్టిపోయిన తెలంగాణగా మారబోతున్నది. ఓపెన్‌ క్యాస్ట్‌ బొగ్గుగనులు వచ్చి వాతావరణ కాలుష్యం పెరిగిపోతున్నది. ఇప్పటికీ 100 గ్రానైట్‌ గుట్టల విధ్వంసం కొనసాగింది. గుట్టల విధ్వంసంతో వ్యవసాయ భూముల్లకు ఆధారమైన గుట్టల జలధార అదృష్టమైపోయి భూములు బీడులుగా మారుతున్నాయి. వట్టిపోయిన తెలంగాణలో ప్రజల జీవనం ఎక్కడ

ఉంటుంది. సాధించుకున్న తెలంగాణలో కూడా మళ్లీ పోరాటమే ప్రధానమవుతున్నది. పోరాటాపై రాజ్య అణచివేత తీవ్రంగా కొనసాగుతున్నది. హక్కులేని వట్టి పోయిన తెలంగాణలో మట్టి మనుషులకు తిరుగుబాటు పోరాటాలు తప్ప మరొక గత్యంతరం లేకుండా ప్రభుత్వమే చేస్తున్నది. హక్కుల అణచివేత ఉద్యమాలను సృష్టిస్తుందనడానికి సజీవ తార్ఖానమే మన తెలంగాణ.

డిమాండ్స్‌:

1. జీవ వైవిధ్యాన్ని, నల్లమల అడవి ప్రాంతంలో ప్రజల జీవించే హక్కును హరిస్తున్న యురేనియం వెలికి తీతను రద్దు చేయాలి.

2. నల్లమల అడవి ప్రాంతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన సాగిస్తున యురేనియం వెలికి తీత ప్రాజెక్టును వెంటనే నిలిపివేయాలి.

పౌరహక్కుల సంఘం (జకూజ) తెలంగాణ

Share
This entry was posted in కరపత్రం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.