ఫేస్‌బుక్‌లో ఒక వర్గం మిత్రుల వల్లే ఈ కథ రాయగలిగాను. థాంక్ యు ఫ్రెండ్స్!
… ….. …
ఈ కథ ఒకానొక రోజు ఎలా మొదలయ్యిందంటే…
”గేటు చప్పుడయ్యింది. ఎవరొచ్చారో చూడమ్మాయ్!” ముందు హాల్లో కూర్చున్న సుభద్రమ్మ కోడల్ని కేకేసింది.
”నేను తీస్తా నానమ్మా” ఎనిమిదేళ్ళ దివాకర్ బాబు ఒక్కంగలో వెళ్ళి గేటు తీశాడు.
హడావిడిగా వంటింట్లోంచి హాల్లోకి వచ్చి, బయటకు తొంగి చూసిన మైథిలి ముఖం నిండా నవ్వు పులుముకుని, ”అత్తయ్యా! కూరగాయలమ్మి రంగి వచ్చింది. నిన్న చెప్పినట్లే తనతోపాటు కొత్త పనమ్మాయిని తీసుకొచ్చినట్లుంది.”
”దండాలండీ!” వాళ్ళిద్దరూ వసారా లోపలికొచ్చారు.
”అమ్మగారూ! ఇదిగో మల్లి!” తనతో వచ్చినమ్మాయిని రంగి పరిచయం చేసింది.
అత్తా కోడళ్ళిద్దరి దృష్టి ఒకేసారి మల్లి మీద పడింది. శుభ్రంగా ఉన్న మల్లిని చూసి, సుభద్రమ్మ తల పంకించడంతో మైథిలి మొదలుపెట్టింది. ”ఉదయాన్నే వాకిలి ఊడ్చి, నీళ్ళు జల్లి ముగ్గు పెట్టాలి! ఇల్లూడ్చి తడిబట్ట పెట్టాలి. గిన్నెలు కడగాలి. మాతో పాటే కాఫీ, టిఫిన్! జీతం సంగతి కూడా ఒక మాట అనుకుంటే…” ఆగింది.
”కష్టం సుఖం తెలిసినవాళ్ళు. మీరే చెప్పండి!” రంగి లౌక్యంగా అంది.
సుభద్రమ్మ తను కూర్చున్న చోటు నుంచే ”ఏవిట్లూ?” కుడిచేతి పిడికిలి బిగించి, బొటన వేలు పైకెత్తి ప్రశ్నార్దకంగా ఊపుతూ మల్లిని అడిగింది.
మల్లి చెప్పిన జవాబుకి అత్తాకోడళ్ళిద్దరి ముఖాలు మాడిపోయాయి.
”మీ దుంపతెగ! మీ కులపోళ్ళని మా ఊళ్ళో అయితే చావిట్లోక్కూడా రానివ్వం. అస్సలూ…” ఆవిడ ఇంకేదో అనబోతుంటే మైథిలి కలుగచేసుకుని, ”అత్తయ్యా! మీరుండండి. నేను మాట్లాడ్తానుగా” అని ఆవిడ వాక్ప్రవాహాన్ని ఆపింది.
”ఈ రోజుల్లో కూడా ఎక్కడున్నారమ్మా?” రంగి చివాట్లు అందుకోబోయింది.
అత్తగారి చాదస్తం వల్ల తన ప్రాణమ్మీదికి వచ్చేలా ఉందని, దయచేసి వెళ్ళిపొమ్మని బ్రతిమాలి, బామాలి సైగలు చేస్తూ వాళ్ళని పంపించేసింది.
”ఎవర్ని పడితే వాళ్ళని ఇంట్లోకి రానిస్తావా అంటూ శుద్దీ లేకుండా?” సుభద్రమ్మ గొణగడం మొదలుపెట్టగానే ”అత్తయ్యా! ఈ పట్టణాల్లో ఇలా కులం పేరుతో తక్కువచేసి మాట్లాడితే పెద్ద గొడవైపోతుంది. ముందే కులమడగకపోవడం నాదే పొరపాటు. ఊర్కోండి” అని ఫుల్‌స్టాప్ పెట్టించింది.
ఆ రాత్రి ‘బెడ్‌టైమ్ స్టోరీ’ చెబ్తుండగా తల్లిని మధ్యలో ఆపి దివాకర్ బాబు ”మమ్మీ! ఏవిట్లు అంటే ఏమిటి?” తన కుడిచేతితో పిడికిలితో సరిగ్గా నానమ్మ ‘ముద్ర’ని కాపీ చేస్తూ అడిగాడు.
‘ఏవిట్లు అంటే ఏ కులమూ అని అర్ధం బాబూ’ చెప్పింది.
”కులము అంటే?” ఇంకో ప్రశ్న వేశాడు.
ఉద్ఘ్రంధాలకు సరిపోయే జవాబుని ఒక్క చిన్న వాక్యంలో చెప్పింది.
దివాకర్ బాబు పెద్దవాడయ్యాడు. పదో తరగతిలో స్టేట్ ఫస్ట్ వచ్చాడు. ఆనందం అంబరాన్నంటింది. ఇంటికొచ్చిన టీవీ ఛానల్స్ వాళ్ళతో ఎంపీసీ గ్రూప్ తీసుకుని ప్రతిష్టాత్మకమైన ఐఐటీ కాలేజీలో చదివి ఇంజనీర్నవడమే తన ధ్యేయమని చెప్పాడు.
ఆ సాయంత్రమే వాళ్ళింటికి శ్యామ్ రాజ్ వచ్చాడు. ఆఫీసులో ఎన్నో స్థాయిలపైనుండే తన బాస్ స్వయంగా తన ఇంటికి రావడంతో దివాకర్ తండ్రి ఉక్కిరిబిక్కిరయ్యాడు. జోడించిన చేతులతో అలాగే నిలబడిపోయాడు.
దివాకర్‌కి ఆయన హోదా తెలీదు. కేవలం తన క్లాస్‌మేట్ విల్సన్ తండ్రిగా మాత్రమే పరిచయం. అందుకే ఆయన అడిగిన ప్రశ్నలకు టకటకా జవాబులు చెప్పి ఆయన్ని మురిపించాడు.
”ఇలాంటి కొడుకుని కన్నందుకు అభినందనలు చెల్లెమ్మా!” అంటూ తను తెచ్చిన స్వీట్‌బాక్స్ మైథిలి చేతికిచ్చాడు.
”వెల్‌డన్ మై బోయ్! నీ బుర్రలోనే ఓ కాలిక్యులేటరుందని మా విల్సన్ అంటూ ఉంటాడు. ఒకటి స్టడీ టేబుల్ మీద కూడా ఉంటే బాగుంటుందని…” బాబుకి బహుమతిచ్చాడు.
కాఫీ మర్యాదలయ్యాక ఆయన వెళ్ళిపోయాడు.
తర్వాత ఆయన తాగిన కాఫీ కప్పుని మైథిలి విడిగా ప్రక్కన పెట్టింది. ఆయన కూర్చున్న సోఫా దగ్గర్నుంచి గేట్ దాకా పసుపు నీళ్ళు జల్లింది. శ్యామ్‌రాజ్ వాళ్ళింట్లో ఎలా ఉంటారో, నాన్ వెజ్‌లో ఏమేం తింటారో పెద్దవాళ్ళంతా తలో మాటగా చెప్పుకున్నారు. చీదరించుకున్నారు. ఒకప్పుడు తమ కులం ఎంత గొప్పదో చెప్పుకుంటూనే ఆ శ్యామ్‌రాజ్ కులం వాళ్ళు ఊరి చివర గూడెంలో ఎలా
ఉండేవాళ్ళో, ఏయే పనులు చేసేవాళ్ళో వైనాలు వైనాలుగా చెప్పుకున్నారు. అలాంటి కులంలోంచి వచ్చిన మనిషికి మర్యాదలు చేయాల్సిన కాలం వచ్చిందని తిట్టుకున్నారు. ‘ఇలాంటి కాలం వస్తుంద’ని బ్రహ్మం గారు ఎప్పుడోనే చెప్పారని కూడా చెప్పుకున్నారు.
స్వీట్ బాక్స్‌ని ఏం చేయాలన్న తర్జన భర్జనల తర్వాత బాబు తండ్రి తన ఆఫీస్‌లో స్టాఫ్‌కి పంచుతానన్నాడు.
ఈ సంభాషణలో పాలు పంచుకోకపోయినా బాబు చాలా శ్రద్ధగా వింటూండిపోయాడు. పిల్లలు రాముడి నుంచో, కృష్ణుడి నుంచో గొప్ప గొప్ప విషయాలు నేర్చుకుంటారని వాళ్ళకి మనం ఎన్నో కథలు చెబ్తూ ఉంటాం. వట్టిదే! వాళ్ళు ఏ దేవుడి కథనుంచీ ఏమీ నేర్చుకోరు. వాళ్ళకి తల్లీ తండ్రే కన్పించే దేవుళ్ళు. వాళ్ళ నుంచే అన్నీ నేర్చుకుంటారు. తను ఒక గొప్ప సామాజిక వర్గానికి చెందినవాడినని బాబు మనస్సులో ఓ ముద్ర పడిపోయింది.
… ….. …
రెండు సంవత్సరాలు తపస్సు చేసిన బాబుకి ఐఐటి సీటు కొద్ది తేడాలో తప్పిపోయింది.
కుల ప్రాతిపదికన ఉన్న రిజర్వేషన్ల సంగతి అర్థమై చిన్నపిల్లాడిలా భోరున ఏడ్చాడు. ”ఏమిటమ్మా ఈ అన్యాయం? ఈ కులంలో పుట్టడం నా తప్పా? ఈ బ్లడీ రిజర్వేషన్స్ మూలంగా క్లాసులో నాకన్నా తక్కువ మార్కులు వచ్చినవాడికి ఐఐటిలో సీటు వచ్చింది. ఎవరమ్మా ఈ రిజర్వేషన్స్ పెట్టింది? ఐ హేట్ దెమ్ అండ్ దిస్ బ్లడీ సిస్టమ్”.
ఓటమినీ, చెదిరిన కలనీ, దుఃఖాన్నీ తట్టుకోవటం ఆ లేత వయసులో కష్టమే. కొన్నేళ్ళ ముందే ‘యాంటీ రిజర్వేషన్ మూమెంట్’లో ప్రాణాలు తీసుకున్న అగ్రవర్ణ విద్యార్థులు మైథిలి కళ్ళముందు మెదలడంతో ఒళ్ళు జలదరించింది. ”బాబూ! ఒకప్పుడు ఆ కులాల వాళ్ళమీద మిగిలిన కులాల వాళ్ళు ఆధిపత్యం చెలాయించి వాళ్ళని చాలా ‘చిన్నచూపు’ చూశారు. ఊరవతల గూడేల్లో ఉంచి అంటరానివాళ్ళన్నారు. తరతరాలుగా అణచివేతకు గురయ్యారు…” నచ్చచెప్పబోయింది.
”అప్పుడెప్పుడో ఎవరో చేసిందానికి నేనెందుకమ్మా పనిష్మెంట్ తీసుకోవాలి? నేనేమన్నా కావాలని ఏరికోరి ఈ కులంలో పుట్టానా?” మధ్యలోనే అడ్డుకున్నాడు.
”అది తలరాత! మన పుట్టుక మన చేతుల్లో ఉండదు బాబూ. ఏం చేస్తాం? నా తండ్రివి కదా? ఊర్కో! నీ తెలివితేటలకి ఏదో ఒకరోజు గుర్తింపు వస్తుంది” కొడుకుని దగ్గరకు తీసుకుని ఓదార్చింది.
అతనిలోలోపల ‘ఫైర్’ రగలసాగింది. ‘మనోడే’ అంటూ సీనియర్లలో ఒక గ్రూప్ వాళ్ళు అతన్ని అక్కున చేర్చుకున్నారు. ఇంజనీరింగ్ కాలేజీలో కులాల వారీగా గ్రూపులున్నాయని అతనికర్థమైంది. ఆ కులం ఇచ్చిన గుర్తింపుతో అతను సౌకర్యవంతంగా ఫీలయ్యాడు. ఇంజనీరింగ్‌లో వివిధ బ్రాంచీలను ఆమోదించినట్లుగానే విద్యార్థుల్లో ఈ కుల విభజనని కూడా ప్రొఫెసర్లు సైతం ఆమోదించినట్లే కనిపించారు.
పుస్తకాలతో పాటు ప్రపంచాన్నీ చదవటం మొదలుపెట్టిన బాబుకి చాలా విషయాలు అర్థమవ్వసాగాయి. పీర్ గ్రూప్‌తో స్నేహాలు, చర్చలు చేస్తూనే చుట్టూ ఉన్న సమాజాన్ని స్వయంగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తూనే భవిష్యత్తులో ఈ సమాజాన్ని ఎలా నిర్దేశించాలో నిర్ణయించుకున్నాడు.
ఇంజనీరింగ్ పూర్తయ్యాక చెప్పాడు. ”నేను సివిల్ సర్వీసెస్‌కి ప్రిపేరవుతాను”. అందరూ సంతోషంగా ”నీ తెలివితేటలకు అదే సరైన సర్వీస్” అంటూ ఆమోదించారు.
అతని క్లాస్‌మేట్స్ చాలామంది పై చదువులకని అమెరికా వెళ్ళిపోయారు.
అతను లక్ష్యసాధనకై పగలూ రాత్రీ తేడా లేకుండా చదివాడు. ఇష్టంగా యాంత్రొపాలజీ, అంతే ఇష్టంగా భారత రాజ్యాంగమూ చదివాడు. తెలుగుని ఒక సబ్జక్టుగా చదివాడు. ‘మనుధర్మం’తో కనెక్టయ్యాడు. లైబ్రరీకెళ్ళటం, పవర్ పాయింట్ తయారు చేసుకుని చదువుకోవటం, పునశ్చరణ ఇంతే! మొదటిసారి ప్రిలిమ్స్, మెయిన్స్ క్లియర్ చేశాడు. కానీ ఇంటర్వ్యూలో నెగ్గలేకపోయాడు.
సంగతి తెలిసిన అమెరికా స్నేహితులు ‘డర్టీ ఇండియా! ఆ రిజర్వేషన్ల ట్రాప్‌లో టైమ్ వేస్ట్ చేసుకోకుండా ఇక్కడికొచ్చి కోట్లు సంపాదించు’ అన్నారు.
అతను విన్లేదు. తనలో ఫైర్‌ని చల్లారనివ్వలేదు.
శారీరక, మానసిక శక్తుల్ని కూడగట్టుకున్నాడు. రెండోసారీ అంతే! మూడోసారి తన వీక్ పాయింట్‌ని అధిగమించటానికి ‘మాక్ ఇంటర్వ్యూ’లక్కూడా అటెండయ్యి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నాడు. మళ్ళీ ఓటమే ఎదురైంది. ఆ ఓటమికన్నా అతడ్ని మరింత బాధించిన విషయం ఇంకొకటుంది. తన క్లాస్‌మేట్ విల్సన్ రిజర్వేషన్ పుణ్యమా అని ఐఆర్‌ఎస్ ఆఫీసరయ్యాడు. చరిత్ర చెప్పినట్లుగా ఆఫీసర్ కొడుకు ఆఫీసరయ్యాడు.
జరిగిన అన్యాయానికి బాబు రక్తం మరిగిపోయింది. అతడ్ని కంట్రోల్ చేయడం ఎవరి వల్లా కాలేదు. బాగా డ్రింక్ చేసి ఆ రాత్రంతా తన ఆవేదన వెళ్ళగక్కాడు. ”అసలు నేనేం పాపం చేశాను? నువ్వే చెప్పు. ఇంకా ఎన్నేళ్ళు ఈ వివక్షను అనుభవించాలి? విల్సన్ గాడి బాబుకి రిజర్వేషన్‌లో పెద్ద ఉద్యోగం. మళ్ళీ వాడికీ రిజర్వేషన్! ది గాడ్డామిట్!!”
”ఊర్కో బాబూ!” ఓదార్చబోయింది.
”ఆ బ్లడీ రోగ్స్ నా లైఫ్‌ని స్క్రూ చేశారు” చేతిలో విస్కీ బాటిల్‌ని గోడకేసి విసిరికొట్టాడు. వేదన, ఆవేదన! తనది సుదూర స్వప్నమని అర్థమయ్యిన తర్వాత ఒక విరక్తి.
సెలవుల్లో ఇండియాకొచ్చిన ప్రతాప్ బలవంతంగా బాబుని అమెరికా తీసుకువెళ్ళాడు. దివాకర్ నెమ్మదిగా స్నేహితుల సమక్షంలో మనుషుల్లో పడ్డాడు. తొందరలోనే ‘ల్యాండ్ ఆఫ్ గోల్డెన్ ఆపర్చ్యూనిటీ’గా చెప్పుకునే అమెరికాలో అతని అర్హతలకి, నైపుణ్యాలకు తగ్గ
ఉద్యోగం వచ్చింది. పెద్ద జీతం! జీవితం సరస్సులో తేలిపోతున్న పూలనావలా తయారైంది.
ప్రతాప్ బృందంలోని వాళ్ళంతా తమ కులం వాళ్ళని మరికొంతమందినైనా ఇలా అమెరికా తీసుకురావాలన్న దృఢ సంకల్పంతో ఉండేవారు.
అప్పటికే అమెరికాలో స్థిరపడి, సాఫ్ట్‌వేర్ కంపెనీలు నడపడమే కాకుండా, రెస్టారెంట్లలాంటి రకరకాల బిజినెస్‌లలో మునిగి తేలుతున్న ప్రతాప్‌లాంటి ఫ్రెండ్సంతా వారాంతాల్లో కలుసుకుని, తమ ప్రగతినీ, తమ వారి ప్రగతినీ వీనుల విందుగా కలబోసుకునేవాళ్ళు. అమెరికాకి కొత్తగా వచ్చిన తమ వారిని అభిమానంగా తమలో కలుపుకునేవాళ్ళు. ఒకరి గెలుపుని అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు.
”అందరూ మనవాళ్ళ సక్సెస్ చూసి ఏడుస్తారు కానీ మన దగ్గరున్న హార్డ్ వర్కింగ్ నేచర్, నిజాయితీ, క్రమశిక్షణ, వాళ్ళల్లో చూపించమను” లాంటి మాటలు వింటుంటే బాబు ఛాతీ అటో రెండంగుళాలు ఇటో రెండంగుళాలు ఉప్పొంగేది.
వాళ్ళంతా ఒకళ్ళనొకళ్ళు ఇళ్ళ పేర్లతో పిలుచుకునేవాళ్ళు. కొత్త వాళ్ళందరితో షేర్ చేసినట్లుగానే బాబుతో కూడా ప్రతాప్ ఒక చిన్న టిప్ షేర్ చేశాడు ”ఏ అమ్మాయైనా ఇంట్రస్టింగ్‌గా అన్పిస్తే ముందు సర్ నేమ్ అడగాలి. అక్కడే మనకు కులం తెల్సిపోతుంది. అప్పుడే ప్రొసీడవ్వాలి”.
అతనికి తన టీమ్‌లో పనిచేస్తున్న లావణ్య ‘ఇంట్రస్టింగ్’గా అన్పించింది. ఇంటి పేరుతో తమ కులమేనని కన్ఫర్మయింది.
తీరయిన శరీరం, గాల్లో తేలే నల్లటి మేఘంలాంటి జుత్తు, మృదువైన మాట, నవ్వే ఆ కళ్ళు, సుకుమారమైన ఆ చేతి కదలికలు, ఆ పెదవి విరుపులు, ఆమె ప్రతి కదలికలో ఓ లాలిత్యం గోచరించేది. అమ్మాయిలంతా ఇలానే ఉంటారా? ఈ అమ్మాయే ప్రత్యేకమా? ఏమో? పరీక్షలనీ, మార్కులనీ, ర్యాంకులనీ, సీట్లనీ కళ్ళకు గంతలు కట్టుకున్న ‘గెలుపు గుర్రం’లా తను ఇప్పటిదాకా పరుగులు పెట్టాడు. ఇన్నేళ్ళూ ఏ అమ్మాయినీ పట్టించుకోలేదు. ఎనఫ్ ఈజ్ ఎనఫ్!
లావణ్య స్నేహాన్ని ఆస్వాదించటం మొదలుపెట్టాడు. ఆఫీసుకి వెళ్ళి ఉదయాన్నే ఆ అమ్మాయిని చూస్తే ఉత్సాహం
ఉరకలు వేసేది. సాయంత్రమైతే ఆమె సమక్షంలో అలిసిన మనస్సు సేద తీరుతున్నట్లుగా ఉండేది. తను మాట్లాడుతుంటే ఇష్టంగా, ఆరాధనగా చూస్తుండిపోయే ఆ అమ్మాయి కోసం ఏదైనా చేయొచ్చనిపించేది.
ఓ సాయంత్రం అడిగింది ”షల్ వియ్ గో ఫర్ వాక్?”
”ష్యూర్” అంటూ కదిలాడు.
పొడవాటి ఆ దారంతా నిర్మానుష్యంగా ఉంది. చలి పెరుగుతోంది. పలుచని వెలుతురులో ఇద్దరి నీడలు పొడవుగా కలిసిపోతున్నాయి. ఆమె తన ప్రక్కనే నడుస్తూ, తనకు మాత్రమే వినపడేలా శ్రావ్యంగా ఏవో కబుర్లు చెబుతోంటే అతను ఆ కబుర్లని కాకుండా ఆమె గొంతుని వింటున్నాడు. ఉండుండి తన చేతికి తగులుతున్న ఆమె చేతిని అందుకుని ఆ చేతి వ్రేళ్ళలో తన వ్రేళ్ళు జొనిపి నడిస్తే? గాడ్! ఆ ఆలోచన వచ్చిన వెంటనే రెండు చేతుల్నీ ప్యాంట్ జేబులో పెట్టుకుని నడవసాగాడు.
ఆకాశంలో నెలవంకని చూపిస్తూ ఏదో చెబుతుండగా క్రిందున్న మంచు మీద కాలుజారి ఆమె పడబోయింది.
”అరెరె!” అంటూ రెండు చేతుల్తో ఆమె భుజాల్ని ఒడిసి పట్టుకున్నాడు.
సరిగ్గా ఆమె అతని ఛాతీమీద వాలింది. అతనే మైమరపులో ఆమెని మరింత దగ్గరకు హత్తుకున్నాడో, ఆమే ఇష్టంగా ఇంకాస్త దగ్గరకు జరిగిందో అతనికి అర్థం కాలేదు. కానీ ఆ కౌగిలిలోంచి అయిష్టంగా ఆమె రెండు సెకన్లు ఆలస్యంగా జరిగింది. ఆ గుండ్రటి భుజాల మెత్తదనం మాత్రం అతని మనస్సులో అలానే ఉండిపోయింది.
ఆ తర్వాత తనను చూడగానే వాలిపోయే ఆమె చూపులు, ఎదురుగా కూర్చుని మాట్లాడుతుంటే ఆ కళ్ళల్లో ఆరాధన కొత్తగా కన్పించింది.
ఇంకొన్నాళ్ళయ్యాక ”నీతో పర్సనల్‌గా మాట్లాడాలి, డిన్నర్‌కి వెళదాం” చెప్పిందామె.
ఆమె ఏమడగబోతోందో ఊహించిన బాబులో ఎగ్జయిట్‌మెంట్! తను కమిటవ్వబోతున్నట్లు ప్రతాప్‌తో చెప్పాడు.
ప్రతాప్ తన ‘నెట్‌వర్క్’ని ఉపయోగించి ఇండియాలోని మిత్రులకు ఫోన్ చేశాడు. లావణ్యకు సంబంధించిన సమాచారాన్నంతా సేకరించాడు.
ఆమె కులగోత్రాల సంగతి తెలియగానే బ్లాంకయిన మైండ్‌తో బాబుకి కాల్ చేసి ఒక్కటే మాట చెప్పాడు, ”డ్యూడ్! నీకు తెల్సా? లావణ్య కులం వాళ్ళని మనింట్లో పనిమనుషులుగా కూడా పెట్టుకోరు. జస్ట్ ఫర్‌గెట్”.
బాబు విస్తుపోయి, ”అదేమిటీ ఆ ఇంటి పేరు వాళ్ళు మనవాళ్ళేగా?” అన్నాడు.
”ఒక్కో ఇంటిపేరంతే. రెండు, మూడు కులాల్లో ఉంటుంది. అయినా నువ్వెలా మిస్టేకయ్యావ్? మనవాళ్ళ ముక్కూ, ముఖమూ, మాట తీరూ, హైటూ పర్సనాలిటీ, ప్రవర్తన, అలవాట్లు, లగ్జరీ లైఫ్ స్టయిల్… చూడగానే తెల్సిపోతుంది” సందేహంగా అడిగాడు.
”అన్ని విషయాల్లో మనాళ్ళలానే ఉంది. షి ఈజ్ క్లాస్ ఎపార్ట్!” విచారం.
”అయితే దాల్ మే కుచ్ కాలా…” అంటూ కుళ్ళు జోక్ వేశాడు.
బాబు కష్టమ్మీద మనస్సు మళ్ళించుకుని, పని ఒత్తిడి అని చెప్పి లావణ్యనిన కలవటం తగ్గించాడు. ఇవేమీ తెలియని లావణ్య ఓ రోజు ”దివ్! ఇంట్లో పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు” చెప్పింది.
దట్స్ గ్రేట్. పెళ్ళి భోజనం తిని చాలా రోజులయ్యింది. కమాన్. హు ఈజ్ దట్ గై? బ్యాకెండ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే చెప్పు” ఉత్సాహంగా అడిగాడు.
తనని ఆట పట్టిస్తున్నాడు? ”దివ్! నా గురించి నీ అభిప్రాయం?”
”నువ్వు మంచి భార్యవవుతావ్?”
”ఊ! మనిద్దరం మంచి భార్యాభర్తలవుదామా?” అతని కళ్ళల్లోకి చూస్తూ ఆశగా అడిగింది.
తల పైకెత్తి నవ్వేశాడు.
”ఓ కమాన్! అయామ్ సో సారీ. నిన్నెప్పుడూ నేనా దృష్టిలో చూడలేదు. అయామ్ ఆల్రెడీ ఎంగేజ్డ్” అంటూ తప్పించుకున్నాడు.
ఆమె తిరిగి ఒక్క మాట కూడా మాట్లాడకుండా కళ్ళ నిండా నీళ్ళతో అతడ్నే చూస్తుండిపోయింది.
బాబు హడావిడిగా ఇండియా వెళ్ళి కులగోత్రాలు, ఇతర సమీకరణాలు చూసి పెద్దలు ఆమోదించిన మోహన మెడలో తాళి కట్టేశాడు. ఆమెని అమెరికా తీసుకువచ్చి కాపురం పెట్టేశాడు.
జాబ్‌కి రిజైన్ చేసి వెళ్ళిపోయిన లావణ్య అతని మనస్సులో మాత్రం ఓ కార్నర్‌లో ఉండిపోయింది. చాలా విషయాల్లో లావణ్యతో మోహనని పోల్చుకుంటూ ఉండేవాడు. మోహన కొద్దిగా తేడా!
ఆ సంగతి పెళ్ళయిన కొత్తలోనే ఓ గెట్ టుగెదర్ పార్టీలో అతనికి అర్థమైపోయింది.
పీవీసింధు ఒలింపిక్స్‌లో ఆడుతూ ఉండగా ఆట చూడడం ఆపి, ఆ అమ్మాయి కులమేమిటా అని డౌటొచ్చి తామంతా గూగుల్ సెర్చ్ చేస్తుంటే, ఏ మాత్రం మొహమాటం లేకుండా ”ఆర్యూ నాట్ ఎషేమ్డ్?” అంటూ అందరిమీదా ధ్వజమెత్తింది.
”అంటే మనవాళ్ళే అయ్యుండొచ్చు కదా…” ఎవరో సర్దిచెప్పబోయారు.
”సో వాట్?” వాదనకు దిగింది.
”అంత గొప్ప ప్లేయర్ మన కులమే అంటే మన కులానికి ఎంత గుర్తింపు?” చెబ్తున్న కళ్ళల్లో మెరుపు.
”ఓగ్గాడ్! ఆమె ఫలానా కులంలో పుట్టడం యాధృచ్చికం. అంత మాత్రాన ఆమె టాలెంట్‌ని ఓన్ చేసేసుకుందామని అనుకుంటున్నారా?” ఆవేదనగా అడిగింది.
”అది కాదు…” అతనికేం మాట్లాడాలో అర్థం కాలేదు.
”మీ న్యారో మైండ్‌తో ఆమెని ఒక కులానికే పరిమితం చేయకండి. షీ ఈజ్ జస్ట్ యాన్ ఇండియన్. అది దృష్టిలో ఉంచుకోండి. ఆమె దేశం తరఫున ఆడుతోంది. దటీజ్ ద ట్రూత్. దయచేసి మీ పర్సెప్షన్‌ని మార్చుకోండి”. ఆ ధాటి ముందు ఎవరూ నిలబడలేకపోయారు.
ఆ తర్వాత వాళ్ళంతా ఏమనుకుంటారో అని బాబు వర్రీ అయ్యాడు.
”మనమ్మాయిలకు ఆ పొగరూ, విగరూ ఉంటుందిలే” అని వాళ్ళే సర్దుకున్నారు.
”నీ తొట్టి గ్యాంగ్ ఇంకా ఏ యుగంలో ఉంది?” అని ఇంటికి వచ్చాక కూడా ఆమె విసుక్కుంది.
ఓ పార్టీలో ఇంకా సింగిల్‌గా ఉన్న లావణ్య కనిపించింది. మోహనా, లావణ్య ఇద్దరూ ఇదివరకే ఏదో సంస్థలో వాలంటీర్లుగా పనిచేశారంట. ఆత్మీయంగా హత్తుకుపోయారు. అది చూసి దివాకర్ కలవరపడ్డాడు. లావణ్య తమ పరిచయం గురించి మాటల మధ్యలో ఎక్కడైనా మాట జారుతుందా? ఏమో! మోహనకి లావణ్య ఏ కులమో తెల్సా?
ఇంకో మిత్రుడు ఓ రోజు బాధగా అన్నాడు, ”నా మేనకోడలికి మెడికల్ కాలేజీలో సీటు రాలేదు. డర్టీ పాలిటిక్స్”.
”ఇండియాలో ఆ బ్లడీ పొలిటీషియన్స్ అంతే. ఓటు బ్యాంక్ కోసం ఎన్ని తరాలైనా ఆ రిజర్వేషన్స్ కంటిన్యూ చేస్తారు. వాళ్ళకే మాయదారి రోగమో వస్తే మాత్రం ట్రీట్‌మెంట్ కోసం ప్రాణభయంతో ఏ సింగపూరో, అమెరికానో పరిగెత్తుతారు.”
ఆ జోక్‌కి అందరూ నవ్వేశారు.
”బ్రో! ఆ పొలిటీషియన్స్‌ని వదిలెయ్. గ్యాస్ సిలిండర్‌కి సబ్సిడీని వాలంటీర్‌గా వదులుకున్నట్లు ఈ తరం వాళ్ళయినా అస్సలు ఆ రిజర్వేషన్స్ మాకొద్దు అని వాళ్ళంతట వాళ్ళే ముందుకు రావచ్చు కదా” దివాకర్ అడిగాడు.
”మనమంతా మైండ్‌సెట్ మార్చుకుని వాళ్ళని మనుషుల్లా చూస్తూ సరయిన సామాజిక హోదా ఇస్తే అలానే ముందుకొస్తారు” మోహన వ్యంగ్యంగా అంది.
”అలా ఎలా చూడగలం?” రఘు పజిలవుతూ అడిగాడు.
”ఎందుకు చూడలేం? ఈ కులాలూ మతాలూ అన్నీ మనం కల్పించుకున్నవే అని, మనుషులందరూ సమానమే అని మనకు తెలుసు కదా?” అడిగింది.
”బీ ఫ్రాంక్ మోహనా! అస్సలు నువ్వు నీ కులానికి వ్యతిరేకమా? నీ కులాన్ని డిజోన్ చేసుకుంటున్నావా?” ప్రతాప్ తీక్షణంగా చూస్తూ సూటిగా అడిగాడు.
దివాకర్ గుండెల్లో రాయి పడినంత పనయ్యింది. ఇన్నాళ్ళూ ఏదైతే జరుగుతుందని భయపడుతున్నాడో అదే జరగబోతోంది.
”న్నో! యు ఆర్ మిస్టేకన్. నా కులాన్ని నేను డిజోన్ చేసుకోవడం లేదు. అయితే ఆ కులం పేరుతో వచ్చే అదనపు గుర్తింపు వద్దంటున్నాను. నా దృష్టిలో కులాలన్నీ సమానమే. అందర్నీ సమానంగా చూడాలంటున్నాను” కచ్చితంగా చెప్పింది.
”దటీజ్ ఎబ్సర్డ్! రిజర్వేషన్ల పుణ్యమా అని వాళ్ళీ రోజున చదువులో, అంతస్థులో, డబ్బులో మనకన్నా ఎక్కువ వాళ్ళే కావచ్చు. వాళ్ళ డబ్బు, అధికారం ఏదో ఒకరోజు మనకీ రావచ్చు. కానీ మన కులం డాబూ దర్పం వాళ్ళకెన్నటికీ రాదు” అంతకన్నా కచ్చితమైన సమాధానమిచ్చాడు ప్రతాప్.
వెంటనే దివాకర్ చప్పట్లు కొట్టి ”బ్రో! యు ఆర్ రైట్” అన్నాడు.
అతనివైపు జాలిగా, లోతుగా చూసి ”క్యాస్ట్ ఫీలింగన్నది ఓ జబ్బు. దానివల్ల ఏం మిస్సయ్యావో నీకిప్పటికీ అర్ధం కాలేదా?” సర్కాస్టిక్‌గా అతనికి మాత్రమే వినపడేలా అడిగింది.
దివాకర్‌కి ఎక్కడో కలుక్కుమంది.
”ఎస్! ఆ ఇండియాలో కులాలు పోవు. రిజర్వేషన్లూ పోవు. అమెరికాలో కాబట్టి ఆ కులాల రిజర్వేషన్ల గొడవ లేకుండా, మన ఓన్ టాలెంట్‌తో ఇంతగా సక్సెసయ్యి సంతోషంగా ఉన్నాం. వండర్‌ఫుల్” ప్రతాప్ అన్నాడు.
”ఇక్కడ కాబట్టి ఎవరూ తమని కులమతాల పేరుతో కించపరచటం లేదనీ, మానసికంగా ప్రశాంతంగా ఎలివేటెడ్‌గా ఉండగలుగుతున్నామని వాళ్ళు కూడా మొన్న మా ఆఫీసులో అచ్చంగా మీలాగే అనుకున్నారు” వెంటనే అంది.
ఆ రిటార్ట్‌కి అందరూ గతుక్కుమన్నారు.
కానీ మళ్ళీ మామూలే!
అక్కడెక్కడో తమ కులానికి చెందిన హీరో సినిమా రిలీజవుతుంటే అంతా రెచ్చిపోయి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చెస్తారు. తెలుగు రాష్ట్రాలలో తమ వాళ్ళు రాజకీయాల్లోకి దిగుతున్నారంటే ఇక్కడి నుంచే సపోర్ట్!
అంతా చూసి, మోహన దుమ్ము దులిపేది. ”కులం పేరుతో రాజకీయ పార్టీలు, బహిరంగ సభలు పెట్టుకోవడం ఏమిటి? ఎంత ఛండాలం?”
మోహన మాటలో, చూపులో, చేతలో ఓ నిర్లక్ష్యం. నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్లుంటుంది. రకరకాల పుల్లవిరుపు మాటలు అంటుంటుంది. ఏ మాట నోటికొస్తే ఆ మాట అనేస్తుంది. తనంటే ఇష్టం లేకుండా పెళ్ళి చేసుకుందా? పోనీ అడిగేస్తే? మాటకు మాట సమాధానం చెప్పేస్తుంది. ‘నీకలాంటి డౌట్ వచ్చిందంటే నువ్వలాంటి పని ఏదో చేసుండాలం’ంటుంది. వాదానికి దిగుతుంది. ఎందుకొచ్చిన తలనొప్పి? సర్దుకుపోవడం మినహా మరో గత్యంతరం కన్పించలేదు.
ఈ రాజీ ఫార్ములాతో రోజులు గడిచిపోయాయ్. వారికిపుడు ఒక బాబు.
ఒకరోజు ప్రతాప్ సూచనల మేరకు దివాకర్ శ్రద్ధగా ఒక వీడియో అప్‌లోడ్ చేస్తున్నాడు.
ఇంట్లో పనిచేస్తుండగా ఆడియో విన్న మోహనకు ఒళ్ళు మండిపోయింది. ”ఛీ! ఛీ! దివా. మహానటి సావిత్రిగారి యాక్షన్‌ని కులంతో చూస్తావా?” ఆవేశంగా అడిగింది.
”అది కాదు. అంత గొప్ప నటిది మన కులమే అంటే మన కులానికి ఎంత గుర్తింపు? ఎంత గొప్ప?” నచ్చచెప్తున్నట్లుగా అన్నాడు.
”ఛీ! ఛీ! నీ బోడి గొప్ప కోసం ఆవిడ్నీ, ఆవిడ పెద్దమ్మనీ, పెదనాన్ననీ సమాధుల్లోంచి లేపి మరీ కులమడగడానికి కూడా సిద్ధమయ్యావ్!” ఇరిటేటయ్యింది.
”కూల్ డౌన్ బేబీ” బ్రతిమాలబోయాడు.
”ఆవిడది నీ కులమే అని తేల్చి చెప్పడానికి ఇన్ని పాట్లు పడ్తున్నావా? ఓ ఫేక్ సైట్ క్రియేట్ చేసి మరీ ఆవిడది నీ కులమే అని తేల్చి చెప్తావా? నువ్వు అన్‌సివిలైజ్డ్ యానిమల్‌వి. ఆ తొట్టి గ్యాంగ్ సపోర్ట్. మీరంతా ఎటు పోతున్నార్రా?” ఆవేదనగా అడిగింది.
ఆమె ధాటికి దివాకర్ బిత్తరపోయాడు.
తర్వాత కొన్నాళ్ళు ఆమె అతనితో మాట్లాడలేదు.
… ….. …
టీవీ చూస్తున్న మోహన ఉన్నట్టుండి, ”దివా! టీవీ చూడు. ప్రతాప్ వాళ్ళబ్బాయి చదువుతున్న స్కూల్లోకి ఓ సైకో ఎంటరయ్యాడు” అంది. ‘ఏ…మి…టీ?” అతనికి నోటమాట రాలేదు.
”రాక్షసునిలా ఉన్నాడు. మెషీన్‌గన్‌తో పిల్లల్ని కాలుస్తానంటున్నాడు. గాడ్! ప్రతాప్ ఇంటికి వెళ్దాం పద”
మోహనే డ్రయివ్ చేసింది. వీళ్ళు వెళ్ళేసరికి అక్కడ పరిస్థితి దారుణంగా ఉంది. ”నా బాబు! నా బాబు నాక్కావాలి” హిస్టీరిగ్గా అరుస్తూ ఏడుస్తోంది ప్రతాప్ భార్య.
”కంట్రోల్ ఝాన్సీ! ఏం కాదు. నువ్వు కంగారుపడకు” ప్రతాప్ భార్యకు ధైర్యం చెబ్తున్నాడు కానీ అతనిలోనూ కంగారు, భయం, వేదన, ఆందోళన.
మోహన ఆమెను దగ్గరకు తీసుకుని మంచినీళ్ళు తాగించింది.
అభివృద్ధి చెందిన కమ్యూనికేషన్ సిస్టమ్ పుణ్యమా అని నిమిషాల్లో అందరూ స్కూల్ దగ్గరికి చేరిపోయారు.
”పాపిష్టి దేశం! ఎంత దుర్మార్గుడు. ముక్కుపచ్చలారని నా బిడ్డ నాకు దక్కుతాడా?” ఆమెని కంట్రోల్ చేయడం ఎవరివల్లా కావడం లేదు.
ఇదే దేశాన్ని ఒకప్పుడు వేనోళ్ళ పొగిడిన అందరూ ఇప్పుడు దుమ్మెత్తి పోస్తున్నారు. గుండెలు అరచేతుల్లో పెట్టుకున్నారు.
ఆ సైకో బ్లాక్. తరతరాలుగా వైట్స్‌కీ, బ్లాక్స్‌కీ మధ్య జరుగుతున్న గొడవ తారస్థాయికి చేరుకుందని అర్థమైంది. బానిసలుగా చూసిన పాపం పండుతోంది. ఎవరు బలవుతారో? కాప్స్ చుట్టుముట్టారు.
”ఇంత అభివృద్ది చెందిన ఈ దేశంలో ఈ రేసిజమ్ ఏమిటి? సో స్యాడ్!” ఎవరో కామెంట్ చేశారు.
”జస్ట్ బార్బేరియస్” దివాకర్ అన్నాడు.
”మనదాకా వస్తే? మనం మాత్రం ఏం చేశాంరా? రాష్ట్రమూ, దేశమూ, సముద్రాలూ, ఖండాలు దాటి ఇక్కడికి వచ్చి కూడా మనం కులపిచ్చిని తగ్గించుకోలేదు” పశ్చాత్తాపంతో ప్రతాప్ చేతుల్లో ముఖం దాచుకున్నాడు.
మోహన ఓదార్పుగా అతని భుజం మీద చెయ్యేసింది.