ఇటీవల ఒక దర్శకుడు తన సినిమాలోని హీరో క్యారెక్టర్ని సమర్ధించుకుంటూ చేసిన వ్యాఖ్యలివి. ఒకర్నొకరు చెంపలు వాయించుకుంటే చనువు లేకపోతే అదసలు ప్రేమేంటి అంటున్నాడు ఆ దర్శకుడు.” love is blind, and lovers cannot see the pretty follies that themselves commit”. అంటాడు Shakesphere, “The merchant of ‘Viniece’ లో.pretty follies ముచ్చటైన తప్పిదాలంటే చెంప దెబ్బలు కొట్టుకోవడమా? పిడిగుద్దులు ఇచ్చుకోవడమా? నిండా ప్రేమలో మునిగినప్పుడే కాదు, ఎటువంటి సందర్భంలో అయినా ఒక వ్యక్తి మరొక వ్యక్తి మీద చెయ్యెత్తడం తప్పే, దాష్టీకమే. దాని పరిణామం ఎంతయినా, ‘ప్రవృత్తిగా హింస అసమర్ధుల ఆయుధం’ అంటారు సైకాలజిస్టులు. ఇక్కడ ఆ దర్శకుడు ప్రేమ ముసుగులో సమర్ధిస్తోంది పచ్చి మగ దురహంకారాన్నే.
సినిమాను సినిమాలాగే చూస్తున్నాం కాబట్టే, ఇప్పటివరకూ వచ్చిన పాత్రల్లో భిన్నంగా ఏదైనా కనిపిస్తే దాన్ని ఆసక్తిగా చూస్తాం. బారులు తీరిన ఆడియన్స్, ఇబ్బడి ముబ్బడి కలెక్షన్స్ బట్టే ఆ పాత్రని సమాజం ఆమోదించేసింది అనుకుంటే ఒట్టి భ్రమ. అమ్మాయి ఇష్టాయిష్టాలైతే ఏ మాత్రం పట్టింపు లేకుండా, ‘అది నా పిల్ల…’ అనుకోవడం అంటే, ‘నా ఆస్తి…’ అని చేసే స్థలాల కబ్జా లాంటిది. ‘బలవంతులు దుర్బల జాతిని బానిసల గావించి’న అనాగరిక న్యాయం హీరోయిజంగా చూపుతున్న సినిమాలు, కబ్జాలు, దౌర్జన్యాలు సమకాలీన ధర్మాలుగా గ్లోరిఫై చేయబడుతున్న సినిమాలు యువత మీద ఖచ్చితంగా దుష్ప్రభావరం చూపుతాయి. వద్దన్న దానిమీదే ఎక్కువ ఆసక్తి ఉండడం ఆ వయసులో సహజమే కదా!
దానికి తోడు, సదరు హీరో క్యారెక్ట రైజేషన్లో కనిపించేదే నిజమైన ప్రేమ అని దర్శకుడు సమర్ధించుకోవడం సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నట్లు? సినిమాలో అత్యంత ప్రతిభావంతంగా చిత్రీకరించబడ్డ ఒక పాత్ర ఒక జెండర్ మీద మౌలికమైన దాడి చేసే స్థితిలో ఉన్నప్పుడు అది సరైనదే కదా అనే భావనలోకి అందరూ వెళ్ళిపోతున్నప్పుడు, తప్పకుండా అందులోని తప్పులని ఎత్తి చూపించి ఆ మత్తులో నుండి బయటకు తీసుకుని రావాల్సిన అవసరం ఉంది.
కొడవళ్ళతో ఆడపిల్లల మెడలు నరికే వాళ్ళూ… ఆసిడ్ దాడులతో అమ్మాయిల ముఖాలని వికృతంగా మార్చే నికృష్టులూ… ఇలాంటి వ్యాఖ్యలని తమ ఉన్మాదానికి ఆలంబనగా చేసుకుని తామూ ఉదాత్త ప్రేమికులమనే వాదనని తీసుకుని వచ్చే అవకాశం ఉందని అనిపించడం లేదా?
చెంపదెబ్బలు కొట్టుకోవడం… ఎక్కడ కావాలనుకుంటే అక్కడ టచ్ చేయడం… అనుకున్నప్పుడల్లా ముద్దు పెట్టుకోవడంలోనే ఎమోషన్స్ ఉన్నాయి అనుకుంటే పబ్లిక్ ప్లాట్‌ఫామ్స్ మీద ఏకపక్షంగా దాష్టీకానికి దిగే ప్రతి ఈవ్ టీజర్ కూడా అది తనలోని ఎమోషన్ అని చెప్పి తన మనసుని తాను కవరింగ్ చేసుకుంటే వాళ్ళెంత ప్రమాదకరంగా మారతారు?
శరీరం మీదో… మనసు మీదో జరిగే దాడి అన్నది ఎప్పటికీ కూడా ప్రేమలోని ఎమోషన్ కాదు. అది ఒక హింస. అంతకన్నా వేరేమీ కాదు. ఒకళ్ళనొకళ్ళు కొట్టుకునే స్వేచ్ఛలోనే నిజమైన ప్రేమ కనిపిస్తుందంటే, పరస్పర అంగీకారంతో జరగాల్సిన సెక్స్‌కీ, లైంగిక హింసకీ తేడా లేదనుకుంటే మన ఆలోచనలోనే ఏదో తేడా ఉన్నట్లు… నరనరాల్లో పాతుకుపోయి ఉన్న పితృస్వామ్య భావజాలమే ఇలాంటి ఆలోచనలకి కారణం అవుతుంది. ఇలాంటి శారీరక లైంగిక, మానసిక హింస చాలామందిపై ఎంత ప్రభావం చూపి స్తుందంటే వాళ్ళలో ఆత్మహత్య చేసుకోవాలన్న కోరిక కూడా బలీయంగా పెరిగిపోయేంతలా.
ఏ ఒక్కరి నిర్వచనాన్నో తీసుకుని ప్రేమంటే ఇదీ అని ఒక నిర్ణయానికి రావటం సరి కాకపోవచ్చు. కానీ… ఖలీల్ గిబ్రాన్ చెప్పిన ఈ మాటలు చూడండి. ఈ మాటల్లోనే లోతులకి వెళ్తే మనకి తప్పకుండా ప్రేమంటే ఏమిటన్నది పరిచయం అవుతుంది.
”ఒకరినొకరు ప్రేమించుకోండి, కానీ ప్రేమను బంధకంగా చేసుకోకండి. దాన్ని మీ జ్జాన తీరాల మధ్యన కదిలే కడలిగా
ఉండనివ్వండి. ఒకరి పాత్రనొకరు నింపుకోండి, కానీ ఒకే పాత్రలో తాగకండి
మీ రొట్టెలని ఒకరికొకరు ఇచ్చుకోండి కానీ ఒకే రొట్టెను పంచుకుని తినకండి కలిసిమెలసి నృత్యగానాలతో ఆనందంచండి కానీ ఎవరికి వారుగా నిలిచి ఉండండి. వీణ తంత్రులు దేనికది వేరుగా ఉంటేనేమి, వాటి కంపనలన్నీ ఒకే నాదంగా పలుకుతాయి
ఒకరికొకరు హృదయాల్ని ఇచ్చుకోండి తప్ప ఒకరి మనసుని మరొకరు ఆధీనం చేసుకోకండి
జీవితపు హస్తం మాత్రమే మీ హృదయాల్ని కలిగి ఉంటుంది. జంటగా నిలవండి కానీ మరీ దగ్గరగా కాదు… ఆలయ స్తంభాల రీతిగా!”
ఎవరి వ్యక్తిత్వాన్ని వాళ్ళు నిలుపుకుంటూ ఒకరికొకరు ఆలంబనగా మారడంలో ఉన్న ఎమోషన్ కన్నా గొప్ప ఎమోషన్ ఏమైనా
ఉంటుందా?
మనకెంత ఇష్టమైన వారైనా సరే… వారికంటూ ఒక వ్యక్తిత్వం ఉంటుందనీ… దానికి మరింత మెరుగులద్దేలా తమ ప్రవర్తన ఉండాలే కానీ తమ ఆలోచనలకొక కార్బన్ కాపీలాగానో… తాము ఆడించినట్లు ఆడే మరయంత్రం లాగానో అనుకునే వాళ్ళలో ప్రేమలో ఏ నిజాయితీ ఉన్నట్లు. ప్రేమలో ఏ ఒకరైనా తమ వ్యక్తిత్వాన్ని పణంగా పెట్టాల్సి వస్తే అంతకన్నా నరకయాతన మరొకటి
ఉంటుందా? అంతటి యాతన ఉన్నప్పుడు అది ప్రేమ అవుతుందా?
అసలు తన సమక్షంలో నిశ్చింతగా ఆదమరచి నిద్రపోగల ధీమా అన్నది అవతలి వారు ఇవ్వనప్పుడు తమ ప్రేమలో ఏ నిజాయితీని ఎమోషన్‌గా ఫీల్ అవ్వాలి? ఒకరి ఎమోషన్స్ మరొకరి వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రతిబంధకమైనప్పుడు అక్కడ మిగిలేది ప్రేమ కాదు… చిత్రహింస మాత్రమే!!!