మీకు లక్ష ఇస్తం కక్కోసులు కడుగుతారా- జూపాక సుభద్ర

మా ఆఫీసు కొలీగ్‌ కొడుక్కి పస్కలై ఉస్మానియా హాస్పిటల్లో ఉన్నడంటే చూసొద్దామని పోయిన నిన్నే. గేట్లకాడ చానమంది కూడి లొల్లి జేస్తుండ్రు. ‘మాకు జీతాలు వెంటనే చెల్లించాలని’ నినాదా లిస్తున్నరు. వీల్ల సమ్మె వల్లనో ఏమో ఆస్పత్రి నుంచి గబ్బు వాసనొస్తంది. లోపల పేషెంట్లు ఎట్లున్నరో ఏమో. దాదాపు రెండు మూడు వందల మంది మహిళా పారిశుధ్య కార్మికులు గుమిగూడి లొల్లిజేస్తుండ్రు. ఆ గుంపుల్నంచి ఒకామెను పల్కరించిన. ఏమైందమ్మా… ఏంది? అని అడిగిన్నో లేదో, … ఆమె సొదంత మెదగట్టింది.

ఓ అమ్మా ఏం జెప్పాలె మేమంత దావుకాండ్లల్ల వూడుస్తము, పాయికానలు కడుగుతము. దావుకానను సుబ్రంగ

ఉంచుతము. నాల్గు నెల్ల కాంచి జీతాల్లేవు. యెట్ల బత్కాలె, ఎవ్వలకు జీతాలాపరు. గీ వూడ్సి, తూడ్సేటోల్లకే ఎప్పటికి జీతాలాప్తరు. ఏనాడు నెలనెలకు జీతాలొచ్చింది లేదు, మేం బతికింది లేదు. మేము ఊడ్వంది సాపు జెయ్యంది గీ పబ్లిక్కు యెల్లదని మేము సిటారు కొమ్మల కోర్కెలు కోర్తన్నమా… మేం జేసిన సాకిరికి జీతమియ్యమని అడుగుతున్నము.

అరే… అమ్మా గబ్బురడాలు, గడ్డలు, పుండ్లు సీము నెత్తురు ఉచ్చ పియ్యి ఆప్రీషన్‌ నెత్తురుకండలు యెత్తిపోస్తం. బువ్వ నోట్లెకుబోని గీ రోత పని యెవరన్నా జేత్తరా! మేమెందుకు జేత్తన్నం గీ గలీజు పనంటె మాకింకో పనిలేదు. ఎవ్వలు సేయని రోత పనులన్ని మేమే జెయ్యాలె, మా రాత గిట్ల పాడాయె, మా రాత పాడుగాను. ఇంకోకామె గూడ ”అవు పదిమంది జేసే పనిని ఒగలిద్దరితోని జేపిచ్చి మా ఉసురు బోస్కుంటండ్రు. అరెరె నాలుగు నెలలమ్మా మా పిల్లలు మేము ఎట్ల బత్కాలె సెప్పు. గింత రోత ఎత్తిపోసి ఆస్పత్రిని సుబ్రంగుంచినా గింత నెవరు లేకపాయె మా గురించెవలు మాట్లాడ్తరు?”

”20 ఏండ్ల సంది ఔట్‌ సోర్సింగ్‌ జేత్తన్నం ఔటు సోర్సింగ్‌ల మన్నువడ, దుబ్బవడ, గియ్యాల గాకున్నా రేపన్నా… ఏ అయ్యకన్నా, ఏ అమ్మకన్నా గింత దయబుట్టి పర్మనెంటు జెయ్యకపోతరా అని సేత్తన్నం జీతాలు లేకున్నా. ఏ నెల సక్కగ జీతా లియ్యరి, గా ఏజన్సి కాలిపోను, కూలిపోను. జీతాలు రాకున్నా గింత రోత పని గలీజు పని ఎందుకు జేత్తన్నమ్‌, ఇంకో పని దొరక్క, ఆకలికి పిలగాండ్లు సచ్చిపోతరని. గీ రోత యెత్తిపొయ్యలేక కడుపుల పేగులు నోట్లెకత్తయి. ఎవడో ఏజెన్సోనికి అప్పజెప్పి గౌరుమెంటు సేతులు దులుపుకున్నది. ఆ ఏజెన్సోడేమో జీతాలియ్యక మా నోట్లె మట్టిగొట్టవట్టె. అప్పుల్దెచ్చుకుని ఎంతకాలం దింటము” అని గోసంత వల్కపోస్కున్నరు.

గవర్నమెంటు ఆస్పత్రులన్నిట్ల

శుభ్రం తక్కువ. రెండు మూడు వార్డులకు ఒక్కల్నేస్తరు తుడ్వనీకి, వూడ్వనీకి కడగనీకి. ఈ ఆస్పత్రుల పరిశుభ్రత ప్రభుత్వాలకు పట్టది. దీంట్లకొచ్చేది అంతా అణగారిన కులాల జనము.

ఇక బడుల్ల, దావుకానలల్ల, రైల్వేలల్ల, వూల్లె, సిన్న సిటీలల్ల, పెద్ద సిటీలు గ్రేటర్‌ సిటీలల్ల పారిశుధ్యం పనులకాడ వున్నదంతా మాదిగ, రెల్లి, మెహతర్‌ కులాల మహిళలే. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లు గ్రూపు వన్నుంచి, ఫోర్‌దాకా పర్మనెంట్‌ రిక్రూట్‌ మెంట్‌ ఉన్నట్లు పారిశుధ్యాలు లేంది ప్రగతిలేదని మాట్లాడే ప్రభుత్వాలు పారిశుధ్య కార్మికులను పర్మనెంట్‌ రిక్రూట్‌మెంట్‌ ఎందుకు చేయరు? జీతాలు చెల్లించండి అని సమ్మె చేస్తున్న ఆస్పత్రి ఔట్‌సోర్సింగ్‌ పారిశుధ్య కార్మికుల బాధ ప్రభుత్వాలకు పట్టడం లేదు. ఎందుకంటే వీరి సమ్మె వల్ల ఆస్పత్రి వ్యర్థాలన్నీ పోగుబడి ఇన్‌ఫెక్షన్స్‌ అయి చచ్చిపోయేదెవరు? అణగారిన కులాల జనం. ఆధిపత్య కులాలు ప్రభుత్వాసు పత్రులకే పోరు, వాల్లకు నష్టముండదని ప్రభుత్వాల నుంచి ఎలాంటి స్పందన లేదు.

వీల్లే కాదు గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికులు కూడా రాష్ట్రవ్యాప్తంగా సమ్మె జేస్తున్నరు. వీరి స్థితి మరీ అన్యాయంగా ఉంది. పల్లెలు వూడ్వడానికి సెత్త ఎత్తనీకి వాల్లే చీపుర్లు గంపలు తెచ్చుకొంటరు. నెలనెలకిచ్చే రెండు వేల రూపాయలు గూడ సక్కంగ ఇవ్వరు. తెలంగాణ రాష్ట్రం వచ్చినంక 2015 లో, 2018లో పారిశుధ్య కార్మికులు సమ్మె జేసినపుడు గ్రామ పంచాయితీ పారిశుధ్య కార్మికులకు రూ.8,500 జీతం చెల్లిస్తానని ముఖ్యమంత్రి ప్రకటించాడు. కానీ ఇప్పటిదాకా ఉత్తర్వులు లేవు. పారిశుధ్య కార్మికుల్ని దేవుల్లన్న ముఖ్యమంత్రినే ఇట్లా జేసిండు.

ఇక ఆంధ్రప్రదేశ్‌ కొత్త ముఖ్య మంత్రి బడుల్లో కక్కొసులు కడిగేవాల్లకు 18 వేల జీతమివ్వాలని ప్రకటిస్తే… గంట పనికి 18 వేలా వద్దనే అధికారులతో ‘మీరు నేను లక్ష రూపాయిలిచ్చినా కడగగలమా’ అనే డైలాగులేసి నిధుల కొరత అని తన ప్రకటనను ఉపసంహరించుకుండు. వేరే విషయాల్లో… నిధులు లేవన్నా పట్టుబట్టి బిల్లులు రూపొందించుకుంటుండు. ఈ పట్టులు పారిశుథ్య కార్మికులైన మహిళల పట్ల ఎందుకుండదో…

ఇక భోపాల్‌ ఎంపీకి టాయిలెట్స్‌, పారిశుధ్యాల సమస్యల గురించి ప్రజలు విన్నవిస్తే…ఆ ఎంపీ కోపం నషాళానికంటి ‘నేను టాయిలెట్లు, డ్రైనేజీలు శుభ్రం చేయడానికి ఎంపీ కాలేద’ని గరమైంది. ఈ పాలక కులాలకు పారిశుధ్య కార్మికులంటే చులకన, ఏహ్యభావన. ఎందుకంటే… వీల్లంతా అంటరాని మహిళలైనందువల్ల.

Share
This entry was posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.