తెలుగు సాహిత్యంలో కథలకు ఒక విశిష్ట స్థానం ఉంది. కథ అన్ని వయసుల వారినీ ఆకట్టుకుంటుంది. కథానికలో కథ క్లుప్తంగా ఉండి ఆద్యంతం ఏకోన్ముఖంగా సాగుతూ మంచి ఇతివృత్తంతో చక్కటి శిల్పంతో సరళమైన భాషతో, అద్భుతమైన ముగింపుతో పాఠకుల హృదయంలో చెరగని ముద్ర వేస్తుంది. తెలుగు కథ తెలుగుదనాన్ని సంతరించుకొని తనకంటూ ప్రత్యేకమైన బాణీలో విలక్షణతను పొంది ఎందరో రచయితల కలాల నుండి ఆణిముత్యాలుగా జాలువారి తెలుగుతల్లి కంఠసీమను అలంకరించాయి. అందులో ఒక ఆణిముత్యం అబ్బూరి ఛాయాదేవి.
మహిళా రచయిత్రులలో నన్ను అమితంగా ఆకర్షించిన ఒక సుకుమారి, నెమ్మదిగా ఉంటూనే పదునుగా కథలు రాయగల చక్కని రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అబ్బూరి ఛాయాదేవి. స్త్రీల అంతరంగిక భావనలనూ, అనుభూతులనూ వ్యక్తీకరించడంలో ఆమెకు ఒక ప్రత్యేకత ఉంది. తెలుగు సాహిత్యంలో తనకంటూ ఒక ముద్ర ఉంది.
1933లో రాజమండ్రిలో జన్మించారు, హైదరాబాద్ నిజాం కాలేజీలో చదివారు. అబ్బూరి రామకృష్ణారావు కుమారుడు అబ్బూరి వరద రాజేశ్వరరావు గారిని వివాహం చేసుకున్నారు. 1954లో తొలి కథ తెలుగు స్వతంత్రలో అచ్చయింది. 1954-55లో వరద రాజేశ్వరరావుతో కలిసి కవిత అనే పేరుతో రెండు ఆధునిక కవితా సంకలనాలు చేశారు. తర్వాత కొన్ని కవితా సంకలనాలను అనువాదం కూడా చేశారు. లైబ్రరీ సైన్స్‌లో డిప్లొమా చేసి న్యూఢిల్లీలో లైబ్రేరియన్‌గానూ, జవహర్‌లాల్ నెహ్రు విశ్వవిద్యాలయంలో డిప్యూటీ లైబ్రేరియన్‌గానూ పనిచేశారు. డాక్యుమెంటేషన్ కోసం ఫ్రాన్స్ వెళ్ళొచ్చారు. ఉద్యోగ విరమణ చేసి ఆంధ్ర యువతి మండలి సహాయ కార్యదర్శిగా వనిత మాసపత్రికకు సంపాదకత్వం వహించారు. ఉదయిని పత్రికలో వ్యాసాలు రాశారు. కథా రచన కాక క్రాఫ్ట్ వర్క్‌లో ఆసక్తి ఎక్కువ. అనేక కళాత్మక వస్తువులు తయారుచేశారు. అనేక పత్రికలకు పుస్తక సమీక్షలు చేశారు. అనేక రేడియో కార్యక్రమాలలో పాల్గొన్నారు.
ఉద్యమ పబ్లికేషన్స్ ద్వారా అబ్బూరి ఛాయాదేవి కథలు పుస్తకం సుమారు 25 కథలతో వెలువడింది. అనంతరం అనేక పత్రికలలో ఆమె కథలు ప్రచురించబడ్డాయి. అనేక సంకలనాలను సేకరించి రూపొందించారు. 21 శతాబ్దం మహిళా రచయిత్రులు అనే సంకలనం వెలువరించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు. అనేక సాహితీ పత్రికలలో ఆమె కథలు రెగ్యులర్‌గా వస్తుంటాయి. కలిగించకు మౌన మృదంగాన్ని అనే స్వేచ్ఛా ప్రచురణలు పుస్తకంలో ఓల్గా, అబ్బూరి ఛాయాదేవి కథలను గురించి చక్కని వ్యాసం రాశారు. సాధారణంగా సౌమ్యంగా ఉండే సహృదయి అబ్బూరి ఛాయాదేవి. ఇక ఆమె కథల విషయానికి వస్తే ముందుగా వస్తువు… కథలకు ఎంచుకునే ఇతివృత్తం అబ్బూరి ఛాయాదేవి గారి కథల్లో ప్రధానంగా స్త్రీ జీవితంలో ఎదుర్కొనే సమస్యలపై ఎక్కువగ దృష్టి కేంద్రీకరించారు. అందులో ప్రప్రథమంగా నాకు నాలాంటి చాలామందికి నచ్చిన కథ సుఖాంతం. స్త్రీ నిరంతర పరిశ్రమకు, విశ్రాంతి లేకుండా అలసిపోయి చివరకు తన విశ్రాంతి తీసుకోవాలనే ప్రగాఢమైన కోరికను వినూత్నంగా మలిచి చూపించారు. ఇదే కథను గురించి ఓల్గా పూలకత్తులు అనే శీర్షికలో ఆంధ్రప్రభలో చూడడానికి అందమైన కత్తుల్లా కనిపించే ఈమె కథలు దగ్గరికి వెళ్ళి చూస్తే ఛాందన భావాలను పురుష దురహంకారాన్ని, సామాజిక దుర్నీతులను ఖండిస్తున్నాయని అన్నారు. సుఖాంతం కథ ఇందుకు నిదర్శనం. ఇతివృత్తంలో వైవిధ్యం రీత్యా కథారచనలో విలక్షణతతో ఆమె కథలు ప్రసిద్ధి పొందాయి. పెళ్ళికాని ఆడపిల్లల అభిప్రాయాలు వాళ్ళ ధైర్యం, పిరికితనం సరైన జీవన మార్గాన్ని ఎంచుకోలేకపోవడం వీటన్నింటినీ జోడించి ఒక కథను రాశారు. అదే విమర్శకులు, వివాహ వ్యవస్థను చిత్రీకరిస్తూ ఎవరిని చేసుకోను, ఎదురు తిరిగిన నిజం ఆదిలోనే హంసపాదు వంటి కథలు రచించారు. స్త్రీకి ఉద్యోగం సామాన్యమైంది నేడు. అబ్బూరి ఛాయాదేవి గారి రచనల సమయంలో స్త్రీలు ఉద్యోగం చేసే పరిస్థితులు చాలా తక్కువగా
ఉండేవి. ఉద్యోగం చేస్తూ స్త్రీలు ఎదుర్కొనే సమస్యలను చిత్రీకరించిన కథలు ఉపగ్రహం, శ్రీమతి ఉద్యోగిని, కర్తకర్మక్రియ మొదలైనవి. స్త్రీ జీవితంలో స్వేచ్ఛను వివరించే అత్యద్భుత కథ బోన్సాయ్ బ్రతుకులు. పదవతరగతి ద్వితీయ భాష తెలుగు వాచకంలోను, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఇంగ్లీష్ పుస్తకంలో ఆంగ్లానువాదంగా ఈ కథ ఉండేది. స్వేచ్ఛగ పెరగాల్సిన స్త్రీ జీవితాన్ని పూలకుండీలలో సుకుమారంగా పెంచే బోన్సాయ్ వృక్షాలుగా స్త్రీల జీవితానికి అద్దం పట్టే రచన బోన్సాయ్ బ్రతుకులు.
సాంఘిక సమస్యల గురించి రచించిన కతలు గోదావరి, లీల మానవుడు, ఆఖరికి ఐదు నక్షత్రాలు మరో అద్భుత రచన. మీరందరూ చిరంజీవి ఠాగూర్ సినిమాను చూసే ఉంటారు. ఆ సినిమాకు ఐదు సంవత్సరాల క్రితమే ఆసుపత్రిలో జరిగే అన్యాయాల గురించి రచించారు అబ్బూరి ఛాయాదేవి గారు. చనిపోయిన పేషెంట్‌ని దాచుకొని సీరియస్‌గా ఉన్నట్లు ఫీల్ క్రియేట్ చేసి చివరికి బాడీతో పాటు బారెడంత బిల్లును ముట్టచెప్పి ఆఖరికి ఐదు నక్షత్రాలు చూపించిన ఉదంతం ఈ కథ.
ఇక కుటుంబ సమస్యలలో వృద్ధాప్యం గురించిన ఉడ్ రోజ్, జైలు కథలు, మానవ సంబంధాల గురించి స్పర్శ… తండ్రీ కూతుళ్ళ అనుబంధాన్ని ఎవరి కోసం బ్రతకాలి వంటి కథలు ఉన్నాయి.
అత్యాచారం అనేది ఒక సంస్థ తమ ప్రయోజం కోసం చేసే సన్మానం గురించి… ఇలా ఏ కథకాకథ మంచి కథా వస్తువుతో రాశిలో కొంచెమయినా వాసిలో పేరెన్నికగన్న కథలుగా మనకు కనిపిస్తాయి.
వీరి కతలు కథా కథనంలో ఉత్తమ పురుషలో స్వతంత్రంగా సరళంగా ఉంటాయి. శ్రీమతి అరుణ వ్యాస్ గారు అబ్బూరి ఛాయాదేవి గారి కథ కథనం మధ్యతరగతి అంతరంగ చిత్రణ అంటూ ఆంధ్రప్రభ వారి పత్రికలో 1992లో ఒక వ్యాసంలో పేర్కొన్నారు. దీనికి ఒకే ఒక మచ్చుతునక లాంటి ఉదాహరణ… సుఖాంతం కథలో ఆఖరి నిమిషంలో రచయిత చెప్పిన మాటలు ”ఒక్కసారి హాయిగా నిద్రపోయిన రోజు నాకు గుర్తులేదు. జీవితమంతా మొహం వాచినట్లు అనిపిస్తోంది ఒక్కసారి నిశ్చింతగా నిద్రపోయే వరం దేవుడివ్వకూడదూ?” అంటూ చెప్పుకోవడం మన హృదయాలను కలచివేస్తుంది.
శైలి… అబ్బూరి ఛాయాదేవి గారి శైలిని గురించి పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు ఇలా అన్నారు. ఏ విషయం చెప్పడానికైనా, చెప్పకపోవడానికయినా ఈమెకు కావలసినంత ధైర్యం పుష్కలంగా ఉంది. సంకోచం, బిడియం కూడా లేదు. నాలుగు దశాబ్దాలుగా కథలు అల్లుతున్నారు. కథనశైలి ”సింపుల్” ఆంధ్రభూమి పత్రికతో 1972లో. ఇక వస్తు విన్యాస శిల్పం, పాత్ర చిత్రణ శిల్పం, కథన శిల్పం, సంఘటన ఘటనా శిల్పం, వర్ణన శిల్పం… ఇలా అనేక రకాల శిల్పాలను అనల్పంగా కలిగి ఉన్న రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి.
నిర్దిష్టమైన అవగాహన ఉన్న రచయిత్రి కావడంవల్ల ఎంతటి జటిలమైన గుణాలతో కథలను చదివించే గుణం కలగిన మంచి కథా రచయిత్రి మన అబ్బూరి ఛాయాదేవి. తెలుగు సాహిత్యంలో స్త్రీలకు సంబంధించి రచనలు చేసిన రచయిత్రులలో తనకంటూ ఒక విశిష్ట స్థానాన్ని ఏర్పరచుకున్న అబ్బూరి ఛాయాదేవి గారి రచనలపై ఎం.ఫిల్‌లో పరిశోధన చేస్తే అదృష్టం నాకు కలిగింది.
1922లో సెంట్రల్ యూనివర్శిటీలో ఎం.ఫిల్ ఎంట్రన్స్ పరీక్ష రాసినప్పుడు మెరిట్‌లో నాకు సీటు వచ్చిన నాకు ఒకటిన్నర సంవత్సరాల బాబు. ప్రైవేట్ పాఠశాలలో ఉద్యోగం. రెండింటినీ సంభాళించుకుని 3 బస్సులు మారి యూనివర్శిటీకి చేరి డా.శరత్ జ్యోత్స్నా రాణిగారి పర్యవేక్షణలో ఎం.ఫిల్ చేయసాగాను. డిసర్టేషన్ (లఘు సిద్ధాంతం)గా అబ్బూరి ఛాయాదేవి కథలను ఎంచుకోమన్న సలహా సోదరుడు డా.సమ్మెట నాగమల్లీశ్వరరావుది. నన్ను స్వయంగా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి పరిచయం చేసి తన గురించి చెప్పింది కూడా నాగమల్లీశ్వరరావే. అంతవరకు అబ్బూరి ఛాయాదేవి కథలు రేఖామాత్రంగా చదివిన నేను స్వయంగా ఛాయాదేవిగారింటికి వెళ్ళి, కలిసి కథల పుస్తకం చదివాక… నా ఆనందం అంతా ఇంతా కాదు. అంతవరకు ఏ రచయిత్రులనూ కలవలేదు. మాట్లాడలేదు. పైగా ఒంటరిగా బాగ్ లింగంపల్లిలో (ప్రతి దానికీ ఎవరో ఒకరిమీద ఆధారపడే జనం మధ్య) ఉంటూ రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూ తనదంటూ ఒక ప్రత్యేకత సంతరించుకున్న అబ్బూరి ఛాయాదేవి గారు నాకొక దేవతలా కనిపించారు. మాటలో సౌమ్యం, విషయం పట్ల స్పష్టత, భాష పట్ల అనురాగం సాహిత్యంలో అవగాహన ఆమెకున్నంతగా మరెవ్వరికీ లేదనడం అతిశయోక్తి కాదు. తను స్వయంగా వ్యక్తిగతంగా లైబ్రేరియన్‌గా ఉండి ఎన్నో పుస్తకాలు చదివానని కుటుంబ వాతావరణం, స్వాతంత్య్ర సమరయోధులుగా మామగారు, నాటకరంగం, సంపాదకత్వంలో బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన భర్త వీరి ప్రభావం తనను స్థిరంగా తనకు ఎదురయ్యే పరిస్థితులకు తట్టుకుని నిలబడే శక్తి సామర్ధ్యాలను ఇచ్చాయన్నారు. అబ్బూరి ఛాయాదేవి కథల పుస్తకంలో ఒక్కొక్క కథని ఏయే సందర్భాలలో రాశారో వివరించారు. చివరకు పుస్తకానికి ఒక చీర అంచు పెట్టడం కూడా ఆ కథలు స్త్రీల జీవనాలను గురించినవని తెలియచెప్పడం కోసం పెట్టానన్నారు.
ఇవి కాకుండా అబ్బూరి ఛాయాదేవి స్వయంగా టీ పెట్టి ఇచ్చి తాగుతుండగా అక్కడే తిరుగాడే పిల్లులను చూపించి అవి తన జీవితంలో కథలో ఎలా పాత్రను పోషించాయో వివరించారు. వారిల్లు ఒక మ్యూజియంలా, హస్తకళల ప్రదర్శనా క్షేత్రంగా ఉండేది. చిన్న చిన్న బొమ్మలు, కొబ్బరి చిప్పపై వేసిన పెయింటింగ్, రకరకాల వస్తువులు స్వయంగా తానే చేశానని చూపించారు. నా ఎం.ఫిల్ పూర్తయ్యాక తమ హర్షాన్ని ప్రకటించారు.
చాలా కాలం తర్వాత నేను తిరిగి నా తెలుగులో నాటక రచన పుస్తకంతో వారింటికి వెళ్ళాను. అప్పుడు ఆమె భర్త అబ్బూరి రాజేశ్వరరావు గారు నాటకరంగం కోసం చేసిన కృషిని వివరిస్తూ దానికి సంబంధించిన రెండు పుస్తకాలు అందచేశారు. అప్పుడే తెలిసింది నా తర్వాత మరో అమ్మాయి ఆమె రచనల మీద పరిశోధన చేస్తోందని. పుస్తకం వేయాలన్న ఆర్థిక వెసులుబాటు నాకు లేక ఛాయాదేవిగారి మీద రాసిన లఘు సిద్దాంతం ప్రచురించలేకపోయాను. వేస్తే బాగుండేదనే ఆమె ఆలోచన నాకు తెలిసినప్పుడు ఒకసారి వెళ్ళి కలవాలనుకున్న సందర్భంలో నాకు తను హోమ్‌లో చేరారని తెలిసి అక్కడ ఆమెను అలా ఊహించుకోలేకపోయాను. చాలా మానసిక స్థైర్యంతో తీసుకునే ఆమె జీవన నిర్ణయాలు ఎప్పటికప్పుడు నన్ను ఆశ్చర్యపరిచేవి. ఆ శక్తి సామర్ధ్యాలకు జోహార్లు అందించారు. హోమ్‌లో చేరాక నలుగురికీ తన వంతు సహకారం అందిస్తూ మరో పక్క రచనా వ్యాసంగం చేస్తూ, భూమికలో పాలుపంచుకుంటూ, అందరికీ కథలు చదివి వినిపించేవారు అని విని మనసులోనే నమస్సులు అందచేశాను.
భూమికతో అబ్బూరి ఛాయాదేవి గారి అనుబంధం:
ప్రపంచీకరణ నేపథ్యంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలు అనే వ్యాసరచన పోటీలో నేను అప్పటికే మహిళలపై పలు వ్యాసాలు రాసిన రచయిత్రిగా పాల్గొన్నాను. నాకు బహుమతి వచ్చింది అన్న సంతోషం కన్నా ఆ వ్యాసాల న్యాయ నిర్ణేత అబ్బూరి ఛాయాదేవిగారు అని తెలిసి మరింత ఆనందం కలిగింది. ఆమె ఎంపిక చేసేలా నేను రచించానన్న సంతృప్తి కలిగింది. బహుమతి ప్రదానోత్సవ సభలో సత్యవతి గారు, తమిరి జానకి గారు, రేణుక అయోలా, భార్గవి గారు, శిలాలోలిత గారు పరిచయమయ్యారు. తిరిగి చాలా సంవత్సరాల తర్వాత స్త్రీలు కుటుంబ జీవనం, గృహ హింస అనే అంశంపై భూమిక నిర్వహించిన వ్యాసరచన పోటీలో చాలాకాలం తర్వాత అంశం నచ్చి పాల్గొన్నాను. దానికి కూడా బహుమతి లభించింది. అప్పుడు కొండవీటి సత్యవతి, ప్రశాంతి, శిలాలోలిత గార్లు సభలో ఉండగా వారు భూమిక వెన్నంటి అబ్బూరి ఛాయాదేవి గారి కృషి గురించి చెబుతూ ఉంటే ఆమె చేస్తున్న సాహితీ సేవకు వయసు ఆటంకం కాదని గ్రహించాను. సంకల్పంతో దేనినైనా సాధించవచ్చని ఆమె జీవితం ద్వారా నేను నేర్చుకున్నాను. వయసు ఉడిగిపోయి నా వల్ల కాదు అని చేతులెత్తేసిన వారికి అబ్బూరి ఛాయాదేవి గారు ఆదర్శం. ప్రతిదానికి ఒకరిపై ఆధారపడి ఎవరు సహాయం చేస్తారు అని వెంపర్లాడే వారికి ఛాయాదేవి గారు మార్గదర్శకురాలు. స్థిరమైన భావ స్పష్టత అచంచల ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం ఛాయాదేవి గారు.
ఊపిరి ఉన్నంతవరకు సాహితీ సౌరభాలను అందరికీ పంచుతూనే ఉన్నారు. ఒంటరితనానికి సాహిత్యాన్ని జోడించుకున్నారు. సమాజంతో సాహిత్యాన్ని ముడివేశారు. స్త్రీల పక్షాన నిలిచారు. స్త్రీల వ్యక్తిత్వానికి అద్దంలా నిలిచారు. సాహితీ సుక్షేత్రంలో తన వంతు మొలకలను వేశారు. అవి మహావృక్షాలై మనమధ్య మనకు అండగా తోడు నీడగా మనతోనే నిలిచి ఉన్నాయి. ఆ చెట్ల కింద కూర్చుని ఆమె జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ హృదయపూర్వక అంజలి ఘటిద్దాం.