నాకు అమ్ముమ్మ నా 8వ తరగతి (2007) నుండి తెలుసు. మా సిబిఎస్‌ఇ, ఎన్‌సిఇఆర్‌టి ఇంగ్లీష్ లిటరేచర్ పాఠ్యపుస్తకంలో అమ్ముమ్మ రాసిన ‘The Bonsai Life’ కథ ఉంది. పి.బి.షెల్లీ, షేక్‌స్పియర్‌లతో పాటుగా అబ్బూరి ఛాయాదేవి అని భారతీయ మహిళా రచయిత్రి పేరు చూడగానే భలేగా అనిపించింది. మళ్ళీ మొన్న ఈ మధ్య అమ్మ న్యూస్ పేపర్‌లో ఒక వ్యాసం చదివాను, మీరు కూడా వినాలి అని బోన్సాయ్ బతుకులు కథను చదివి వినిపించడం మొదలుపెట్టగానే నేను గర్వంగా చెప్పాను, నేను దాన్ని ఆల్రెడీ స్కూల్‌లోనే చదివేశానని.
2018లో అమ్ముమ్మతో పరిచయం ఏర్పడింది. అమ్మమ్మ సి.ఆర్.ఫౌండేషన్‌లో ఉన్నారని తెలిసి కలవాలని నేను, అమ్మ, పెద్దమ్మ, చిన్నక్క వెళ్ళాము. చలికాలం కావడంతో బాగా ఇబ్బంది పడుతున్నారు. మేము తలుపు కొట్టగానే తలుపు తీసుకుని లోపలికి రండి అన్నారు. లోపలికి వెళ్ళాక పాపం కష్టంమీద లేచి కూర్చున్నారు. స్వెటర్ వేసుకుని స్కార్ఫ్ కట్టుకుని ఉన్నారు. కొంతసేపు మాట్లాడుకున్నాక అమ్మమ్మ యాక్టివ్ అయ్యారు. తను ఆలిండియా రేడియోలో పనిచేసినప్పటి కబుర్లు, వరద రాజేశ్వరరావు తాతమ్మతో సరదాగా వేసుకున్న జోకులు లాంటివి ఎన్నో కబుర్లు చెబుతూ, జోకులు వేస్తూ సరదాగా, ప్రేమగా మాట్లాడారు.
మీరు ఏం చేస్తారు అని అడిగినపుడు నేను అపోలో హాస్పిటల్‌లో రెసిడెంట్ డాక్టర్‌గా పనిచేస్తున్నానని చెప్పాను. వెంటనే అమ్మమ్మ అపోలోకి వెళ్తే అప్పుల్లో పడతారు, అది అప్పుల్లో హాస్పిటల్ అని జోక్ వేశారు.
రూమ్‌లో అమ్మమ్మతో పాటు యశోధర అమ్మమ్మ కూడా ఉన్నారు. వారిని సాహస సిస్టర్స్ అంటారని చెప్పారు. ఛాయాదేవి అమ్మమ్మ షటిల్‌లో ప్రఖ్యాతి పొందారు, యశోధరా అమ్ముమ్మ సంగీతంలో పేరు పొందారు.
నేను రాసిన కవితల పుస్తకం ‘Ponder over thoughts’ ఇచ్చాము అమ్ముమ్మకి. ఒక్క రోజులో చదివేసి ఈ మెయిల్ చేశారు, అలాగే ఫోన్ చేసి మరీ మాట్లాడారు. ‘మీరు డాక్టర్‌గా బిజీ అయినా కూడా కవితలు రాయడం తిరిగి ప్రారంభించండి’ అని చెప్పారు. ఎప్పుడు కాల్ చేసినా ప్రేమగా, ఆప్యాయంగా మాట్లాడేవారు. చిన్నదాన్నయినా ‘మీరు’ అని సంభోదించేవారు.
రూమ్ నుండి బయల్దేరుతున్నప్పుడు నీకివ్వడానికి ఇంకేమీ లేవు, కాబట్టి ఇది తీసుకెళ్ళండి అని డ్రై ఫ్రూట్స్ ఇచ్చారు. వెళ్ళిన ప్రతిసారీ డ్రై ఫ్రూట్స్ ఇచ్చేవారు. ఇంకా మేమెళ్లొస్తామండి, మీరు రూమ్‌లో ఉండండి, కిందకి రావొద్దు అంటే కూడా హుషారుగా రూమ్ నుండి బయల్దేరి అక్కడ ఉన్న లైబ్రరీలోని బుక్స్ చూపించారు. కింద కామన్ రూమ్‌లో అమ్మమ్మ చేసుకున్న బొమ్మల బీరువా లాక్ తెరిచి ఒక్కో బొమ్మ జాగ్రత్తగా బయటికి తీసి దాన్ని ఎలా తయారు చేశారు, దేనితో తయారు చేశారు అని ఓపికగా చెప్పి, మళ్ళీ బీరువాలో భద్రపరుచుకుని లాక్ చేసుకున్నారు.
అమ్మమ్మ జీవితం నుండి మా తరం వారు చాలా క్వాలిటీస్ నేర్చుకోవాలి. ఎంత చిన్నవారయినా గౌరవం ఇచ్చి మాట్లాడాలి, ముందు చూపు జీవితంలో చాలా ముఖ్యం. జీవితంలో ఒక వృత్తిలో నైపుణ్యం పొందడమే కాకుండా, ప్రతి మనిషికి మనసుకి నచ్చిన వ్యాపకాలలో కూడా నైపుణ్యం పొందాలి.
అమ్ముమ్మ నా కవితల బుక్ చదివి పెట్టిన ఈ మెయిల్ ఇది:
My dear Dr. Maithri, Thank you for coming along with your mother and other close family members to see me. I enjoyed reading your collection of poems and notes. You are fortunate to have such affectionate and encouraging relatives. Even though you have become a Doctor, please continue your literary creativity. Your first poem ‘Freedom’ is very inspiring. Please spread your love for freedom and your humanitarian outlook to others through your future poems and articles. I again request you to contact Dr. Surya Prakasah Vinjamuri and Dr. Kameshwari and go to see their ‘Life-HRG-Open House’ at Kothapeta. His Cell.No. 9849020242. Wishing you a Happy and Successful New year.
A. Chaya Devi