మంచి కథల ఛాయమ్మ -శిఖామణి

28 జూన్‌న హైదరాబాద్‌లో కన్నుమూసిన అబ్బూరి ఛాయాదేవి లోకమెరిగిన రచయిత్రి. తెలుగులో స్త్రీ వాదం పాదుకొనక ముందే ఆ చైతన్యంతో గొప్ప రచనలు చేసిన కవయిత్రి, ఆమెకు ముందు తరువాత వచ్చిన రచయిత్రులు అటు పుట్టింటి పేరునూ, ఇటు అత్తింటి పేరునూ తమ పేర్లకు జోడించుకుంటున్న సమయంలో తన పుట్టింటి పేరును త్యాగం చేసిన రచయిత్రి మద్దాలి ఛాయాదేవి. శ్రీ శ్రీ కే గురువనిపించుకున్న అబ్బూరి రామకృష్ణారావు గురించి తెలియంది ఎవరికి? అబ్బూరి సాహిత్యంతో, కుటుంబంతో నాకూ అంతో ఇంతో పరిచయం ఉంది. ఆంధ్రా యూనివర్శిటీలో నా సహాధ్యాయి చప్పా సూర్యనారాయణ, అబ్బూరి రామకృష్ణారావు కృతులపై పరిశోధన చేయగా నేను పఠాభిపై చేశాను. ఆ రకంగా అబ్బూరి రచనలను చదివే అవకాశం, ఆంధ్ర యూనివర్శిటీ ఫైన్‌ ఆర్ట్స్‌ ఆచార్యుడిగా ఉన్న అబ్బూరి గోపాలకృష్ణను తరచూ కలుసుకోవడం ఆ కుటుంబానికి దగ్గరజేసింది.

1990లలో హైదరాబాద్‌ తెలుగు యూనివర్శిటీలో ఉద్యోగంలో కుదురుకున్నాక, ఛాయాదేవి సహచరుడు అబ్బూరి వరద రాజేశ్వరరావు అధికార భాషా సంఘం అధ్యక్షులుగా నియమితులయ్యారు. ఆయన్ని ఆయన కార్యాలయంలో గాక నిమ్స్‌లోనే కవులు, రచయితలతో కలిసి చూడ్డానికి వెళ్ళాం. ఆయన గతించాక ఒక రకంగా ఛాయాదేవి పంజరం విడిచిన పక్షి అయ్యారు. అప్పట్లో ఆమెను పరామర్శించడానికి సి.మృణాళినితో వెళ్ళినపుడు ఆమె ఇప్పుడు హాయిగా ఉన్నానని మా మొహంమీదే కుండ బద్దలు కొట్టినట్టు చెప్పడం ఇంకా గుర్తు. ఈ అనుభవాలు చాలామంది ఎరుగుదురు. రచనలకంటే మిన్నగా జీవించిన స్త్రీ వాది ఛాయమ్మ. బాగ్‌లింగంపల్లి వైపు ఎప్పుడు సభలకు వెళ్ళినా మిత్రులతో కలిసి ఆమె ఇంటికి వెళ్ళేవాణ్ణి. రకరకాల మొక్కలతో ఆమె ఇల్లు ఒ ఉద్యానవనాన్ని తలపించేది. గేటు తీయగానే ఒకటో రెండో పిల్లులు పలుకరిస్తూ అటూ ఇటూ పరుగులెత్తేవి. ఆమె వేసిన పెయింటింగ్స్‌, చేసిన బొమ్మలు, అలంకరణ సామగ్రితో ఇల్లు కళాత్మకంగా ఉండేది.

ఆమె పుస్తకాల అల్మారా ఆమెలానే ఎంతో ఒద్దికగా ఉండేది. మాటల మధ్యలో వరద గురించి, ఆమె ఢిల్లీ ఉద్యోగం గురించి, ‘కవిత’ సంకలనాల గురించి చెప్పేది. ఈ లోపు గాజు గిన్నెలు అందిస్తూ క్యారెట్‌, బీట్‌రూట్‌ హల్వా, చక్కెర వేయకుండా చేశానని చేతుల్లో పెట్టేది. ఛాయాదేవి నా కవిత్వాభిమానే కాదు, నా ప్రసంగాల అభిమాని కూడా! ఒకసారి ప్రెస్‌ క్లబ్బులో కత్తి పద్మారావు ‘నల్ల కలువ’ కవితా సంపుటి గురించి మాట్లాడుతూ ‘ఆకాశంలో చుక్కలు సముద్రం వార ఎండబెట్టిన పిత్త పరిగెల్లా ఉన్నాయి’ అన్న వాక్యాన్ని విశ్లేషిస్తూ, దాదాపు ఇరవై రకాల చేపల పేర్లు చెప్పాను. సభ తర్వాత ఛాయమ్మ ఇన్ని రకాల చేపల పేర్లు మీకు ఎలా తెలుసు అంటే, ఈ చేతులు చిన్నప్పుడు కాలవల్లో చేపలు పట్టాయి అమ్మా! అన్నాను. ఆ రోజు ఆమె నేను మీ ప్రసంగ అభిమానిని అంటే వల్లమాలిన సిగ్గేసింది. ఆమె బాగ్‌లింగంపల్లి నుండి కొండాపూర్‌ సీఆర్‌ ఫౌండేషన్‌కు వెళ్ళే క్రమంలో చాలామందికి ఇచ్చినట్టే నాకూ కొన్ని పాత సాహిత్య పత్రికలు ఇచ్చారు. కొండాపూర్‌ వెళ్ళిపోయాక ఆమెను కలుసుకుంది తక్కువే అయినా, తరచూ ఫోన్‌లో మాట్లాడుకునేవాళ్ళం. చిన్నవాళ్ళనయినా గౌరవంగా సంబోధించి మాట్లాడే అరుదైన సంస్కారం ఆమెది. ముఖ్యంగా నేను ‘కవి సంధ్య’ పత్రిక ప్రారంభించినప్పుడు ఆమె ఇచ్చిన నైతిక మద్దతు అపూర్వం. ‘కవి సంధ్య’ పేరుతో ఐదు వేల రూపాయలకు చెక్కు పంపారు. అప్పటికి అకౌంట్‌ లేదంటే నా పేరు మీద మళ్ళీ పంపారు. ముందటి చెక్కు తిరిగి పంపమంటారా అంటే, వద్దు అకౌంటు తెరిచాక అదీ వాడుకోండి అన్న ఔదార్యం వారిది. గత ఫిబ్రవరిలో మిత్రుడు ప్రసాదమూర్తితో కలిసి ఆమె దగ్గరకు వెళ్ళి గంటకు పైగా గడిపాం. అంత వయసులోనూ నవ్వుతూ, హుషారుగా ఎన్నెన్ని సంగతులు చెప్పుకొచ్చారో! మొన్నటికి మొన్న ‘కవి సంధ్య’ కందుకూరి శతవర్థంతి సంచిక అందుకుని మురిసిపోతూ తమ రాజమండ్రి అనుభవాలను గుర్తు చేసుకుంటూ, మే 25 తేదీతో ఉత్తరం రాశారు, పదహారు వందల రూపాయల చెక్కుతో సహా! బహుశా ఆమె రాసిన చివరి ఉత్తరం అందుకున్న అదృష్టం నాకు ‘కవి సంధ్య’కు దక్కింది అనుకుంటాను. కథల ఛాయమ్మకు నా కన్నీటి నివాళి!

సుహృల్లేఖ

ప్రియమైన డా|| శిఖామణి గారికి హృదయపూర్వక అభినందనలు.

ఈ సారి ‘కవి సంధ్య’ని కందుకూరి శత వర్ధంతి సంచికగా ఎంతో విజ్ఞానదాయకంగా ప్రచురించడం అందరి అదృష్టం.

ముఖ్యంగా ప్రస్తుతం వృద్ధాప్యంలో మానసికంగానూ, శారీరకంగానూ కృశిస్తున్న నాకు బాల్యానుభవాలు గుర్తు చేసుకునే అదృష్టం కలిగించారు.

నేను పుట్టినప్పటినుంచీ మేం ‘వీరేశలింగం గారి వీథి’లో ఉండేవాళ్ళం. మద్దులవారి ఇంట్లో అద్దెకి ఉండేవాళ్ళం. నేను వీరేశలింగం హైస్కూలులో చదువుకున్నాను. భమిడిపాటి కామేశ్వరరావుగారు మాకు మేథమేటిక్స్‌తో పాటు, మరో క్లాసులో ఇంగ్లీషు-తెలుగు అనువాదం నేర్పించేవారు.

ఆయన మా నాన్నగారికి స్నేహితులే! మా నాన్నగారు మద్దాలి వెంకటాచలం గారు లాయర్‌. నేను బి.ఎ. రాజమండ్రిలో పూర్తి చేశాక హైదరాబాద్‌లో మా అన్నయ్య డా|| ఎమ్‌.జి.కృష్ణ దగ్గరుండి ఎం.ఎ. చేశాను. మా నాన్నగారి సహకారంతో నాకు ఆలిండియా రేడియో కార్యక్రమాలు సన్నిహితమయ్యాయి. ఆ సందర్భంలోనే పెళ్ళి ఏర్పాటైంది. పెళ్ళి రాజమండ్రిలోనే. భమిడిపాటి కామేశ్వరరావుగారిని కలిసి మా మామగారు, మా వారూ (అబ్బూరిగారు) చాలా సంతోషించారు. వీరేశలింగం గారి వీథి వారిని ఇంకో రకంగా కలిపింది.

నా దస్తూరి చెడిపోయింది క్షమించండి. ప్రేమతో చిన్న కానుక స్వీకరించండి. -అబ్బూరి ఛాయాదేవి, 25-5-2019

Share
This entry was posted in ప్రత్యేక సంచిక - అబ్బూరి ఛాయాదేవి . Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.