అన్నయ్య ఇంగ్లాండు నుంచి తిరిగి వచ్చాక, ఇద్దరి మధ్యా చర్చలు జరుగుతూండేవి. ఆచార వ్యవహారాల మీద, ఆస్తికత్వం మీద, సోషలిజం మీదా. అన్నయ్య ఇంగ్లండు వెళ్ళగానే జంధ్యం తీసేశాడు. సైంటిస్టు అవడంతో బాటు, సోషలిజం, హేతువాదం పట్ల అవగాహన, అభిమానం ఏర్పడడంతో మన ఆచార వ్యవహారాలన్నిటినీ మూఢమైనవిగా చూడటం అలవరచుకున్నాడు.
వంశోద్ధారకుడి వ్యవహారం గమనించారు. ”ఎదుటివారిని మార్చలేకపోతే వారితో చేరిపోవాలి” అన్న సూత్రాన్ని పాటించారు నాన్నగారు. ఆయన కూడా జంద్యం తీసేశారు. నామం పెట్టుకోవడం మానేశారు. మడి కట్టుకోవడం మానేశారు. తద్దినాలు పెట్టడం మానేశారు. హేతువాదిగా, మానవతావాదిగా మిగిలారు. గత పదిహేను సంవత్సరాలుగా అదే విధంగా ఉన్నారు. దానికి తోడు వేదాంత దృక్పథం.
మా అక్క కొడుకు పరీక్ష తప్పాడుట. బి.ఎ. పరీక్షలో ఒక పార్టు మాత్రమే పాసై తక్కిన పార్టులు రెండూ తప్పాడుట. ఆ విషయాన్ని నాకు తెలియబరుస్తూ –
”.. అక్టోబరు పరీక్షలోనైనా విజయాన్ని ప్రసాదించమని వేడుకోవడానికి కాబోలు తిరుపతి వెళ్ళాడు తల్లితో కలిసి… మూఢ విశ్వాసాలకూ, తెలివితక్కువతనానికి అంతులేదు. దైవం, భక్తి, వ్యాపార విషయాలైపోయాయి. బేరాలు చెయ్యడం జరుగుతోంది దేవుడితో – పాసవుతాననీ, పిల్లలు పుడతారనీ, ఉద్యోగం దొరుకుతుందనీ, ట్రాన్స్‌ఫర్ అవుతుందనీ, లేక మంత్రి పదవి లభిస్తుందనీ నువ్వు నాకు వరమియ్యి – బదులుగా నేను నీ గుడికి వచ్చి నిన్ను దర్శించుకుంటాను. నా జుట్టు కూడా ఇచ్చుకుంటాను. (అది మళ్ళీ పెరుగుతుందని కచ్చితంగా తెలుసు నాకు) – అంటారు భక్తులు – దైవభక్తులు. దేవుడు ఎంత వెర్రి వెంగళాయి. ఎంతగా పొగడ్తలకి లొంగిపోయేవాడు. ఎంత అమాయకుడు, పసివాడు – వాళ్ళు సమర్పించుకునే కానుకలకు తబ్బిబ్బైపోయి వాళ్ళు కోరినవన్నీ తక్షణం తీర్చేస్తాడు! మనం ఎంత ఘోరమైన దుస్థితికి దిగజారిపోయాం!