ఆనంద ‘ఛాయ’లు -శివాజీ

దివంగత ఆగ్రశ్రేణి కమ్యూనిస్టునేత చండ్రారాజేశ్వరరావు ‘సి.ఆర్‌’గా విఖ్యాతుడు. ఆయన పేరుతో కొండాపూర్‌లో స్థాపితమైన సి.ఆర్‌. ఫౌండేషన్‌లో పలువురు ప్రముఖులు తమ విశ్రాంత జీవితాన్ని వైవిధ్యంగా గడుపుతున్నారు. కథ-నవల-హాస్యం-అనువాద-పర్యాటక సాహిత్యాలలో విశేష కృషి చేసిన ప్రముఖ స్త్రీవాద రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత (2005) అబ్బూరి ఛాయాదేవి సి.ఆర్‌.ఫౌండేషన్‌లో ‘ఏం చేస్తున్నారు?’… సీనియర్‌ జర్నలిస్ట్‌. ఆర్టిస్ట్‌ శివాజీ ఆ వైనాన్ని ముచ్చటిస్తున్నారు…

పురాణ పురుషులకు శాపం కూడా వరంగా మారుతుంటుంది కదా… అలాగే వృధ్ధాప్యం కూడా కొద్ది మందికి వరంగా పరిణమిస్తుంది. చూపుని బట్టే స్థితి… అని నగరంలోని సి.ఆర్‌ ఫౌండేషన్‌ వారి వృద్ధాశ్రమంలో పచ్చటి చెట్ల నీడలో నడిచే పెద్దలు అంటారు. కమ్యూనిస్టు పార్టీల్లో ఆరితేరినవారు, ఇతరాలుగా వెలిగి చల్లారినవారు కొందరు ఏకాంతంలో ఒంటిరిగానూ కనిపిస్తారక్కడ. కానీ ఇదే ఆశ్రమంలో మహా మనోవికాసంతో మిలమిలలాడే కళ్లతో పనిచేసుకుపోతూ పలకరించే అబ్బూరి ఛాయాదేవిలో ఒంటరితనపు ఛాయ లేనేలేదు. క్షణం తీరిక, దమ్మిడీ ఆదాయంతో నిమిత్తంలేని భాగ్యవంతురాలు ఛాయాదేవిగారు. హస్తకళల వైవిధ్యం, ఏకాగ్రతా వైభోగం! వెరిసి ఆవిడ ఉన్న గది బొమ్మల ప్రపంచం! అందరికీ ఛాయాదేవి సాహిత్యం తెలుసు. కానీ ఆమె చకచకా వేళ్లు కదిలిస్తూ అనేకానేక బొమ్మలు తయారు చేయడం అందరికీ తెలీదు. ఇప్పుడామెది అదే లోకం… మనసు పడ్డ లోకం.

మనం ఎవరైనా కనపడగానే కుశలం తెలుసుకుని మహా గలగల ప్రవాహంతో తన బొమ్మల తయారీ విశేష వివరాలు, చంటి పిల్లలు తాము చేసేవన్నీ ఏకరవు పెట్టినట్లు చెబుతారు. చిన్నవాళ్ళకి చప్పున చిన్నపాటి సౌందర్యలోకం మెరిసి కనిపిస్తుంది. కవితకే కాదు, కాదేదీ ఛాయాదేవి పనితనానికి అనర్హం. రాయి, రప్ప, ఊడిన బొత్తం, రాలిన పూలు, విరిగిన అద్దం, చిట్టిగవ్వ, అట్టముక్క, తెగిన దారం, చితికిన పలక, సీసా బిరడా, పాపగాజు, సెంటుబుడ్డి… అవసరం తీరిపోయినవన్నీ, అత్యవసరమన్నట్టు ఆవిడ చుట్టూ చేరతాయి. కళకళలాడే చక్కటి బొమ్మలు కొలువవుతాయని, ఈ వివరాలు చెబుతోంటే ఛాయగారి చేతి బొమ్మలే చూడాలో, చెప్పే జోకులే వినాలో మనకు మరేదీ తోచదు. పక్కవారికీ ఆక్కరలేని వస్తు పరిచయం డిమాండ్‌ పెరిగినట్టు ఆన్నీ ఆవిడ గడపకి చేరాల్సిందే ఇక చూడండి. రేగిపండంతరాయి కారల్‌మార్క్స్‌ గాను… బొద్దుగా ఉన్న పొట్టిసీసా జయలలిత… వంకర తిరిగిన రాయే వినాయకుడు. చిట్టి పెంకు గురజాడ… చిల్లర పూసే చేపకన్నూ… గోడమీద అరలో సంప్రదాయపు చాటనిండా పాండవుల భారతం… ‘చాట భారతం’. ఎండుగడ్డి, ఊలుదారం కలిపి మీసాలు, విగ్గులు, గడ్డాలు, జడలునూ, వెడ్డింగు, గ్రీటింగ్‌ కార్డు ముక్కలు ‘బెస్ట్‌ విషెస్‌’ చెప్పే ముఖారవిందాలు! ఉదా రంగు కాగితం ముక్కలు కొలాజ్‌ మహానీయులు. కేరికెచర్‌లూ… గదినిండా కిక్కిరిసిన కాలక్షేపం! వృధాపోయే మాటే లేదు. చేజారే వస్తూవే లేదక్కడ. కత్తిరించడం, అంటించడం, రంగులు అద్ది పటం కట్టడం, కుట్టడం, అల్లడం, ఆమె చేతివేళ్ళే చిన్నారి యంత్రాలు.! పాత కాగితం చుట్ట చుడితే అదే పటానికి ఫ్రేము. బొమ్మలకు ముచ్చిరీకులే అచ్చ బంగారు ఆభరణాలు… పైగా, ‘ఫేషన్‌ మారిపోవడం వల్ల పాత డిజైన్‌లు గల వోణీ ముక్కలే దొరకడం లేదీ బొమ్మలకు” అంటూ ఆవిడ ఫిర్యాదు! మాంచి మందు సీసాను చూపిస్తూ ”మావారు అలా పావనం చేస్తే నేను ఇలా పవిత్రం చేస్తున్నా”నంటూ సీసాబొమ్మగా మారిన వైనం చెప్పారావిడ! ఓ రాత్రివేళ నిద్ర పట్టకపోతే చదువు సాగకపోతేనూ చేసే పని ఇదేనంటూ సగం ప్రాణం పోసుకున్న, సగం ముస్తాబయిన బొమ్మల వరుస చూపెట్టేరు. గోడల మీద వాలుగా వరుసన వున్న ఫ్రేములు చూపిస్తూ… ”సీతాదేవి ఉన్న ఆ పటం అలా వాలుగా ఉందేమనా?!” అనీ… డౌన్‌ఫాల్‌ ఆఫ్‌ సీత!… మాయ లేడికి మోహపడి కదా తిప్పలు పడ్డది?! అన్నారు. అలాగే డొల్లవెలక్కాయతో చేసిన బొమ్మ చూపుతూ ”రాజకీయాల్లాగే”.. అంతా డొల్లే!” అన్నారు. చటుక్కున నవ్వు ఆపుకుంటూ. ఇతరుల కొలాష్‌ బొమ్మ ఒకటి చూపిస్తూ ”ఇక్కడ బొమ్మ ప్రకృతిలో ఈ రాళ్ళు ఏమిటో తెలుసా? అక్కినేని బట్టతల!” (సినిమా బొమ్మల నుంచీ కత్తిరింపు చర్య!) అని భేషుగ్గా నవ్వేరు… ఇలా హ్యూమరసం మాకు అందిస్తూ ఛాయాదేవి తమ చిన్నారి మ్యూజియం చూపెట్టారు. వచ్చిపోయే రచయితలు… కవులు… కళాకారులతో అదనపు సరదాగల ఛాయాదేవికి తోచకపోవడం కూడానా?!” సత్సంగత్వే నిస్సంగత్వం కోరుకున్న వాళ్ళు ఇలా వెళ్ళి చూస్తే అదే తెలుస్తుంది. (సాక్షి పేపర్‌ నుంచి…)

Share
This entry was posted in ప్రత్యేక సంచిక - అబ్బూరి ఛాయాదేవి . Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.