అబ్బూరి ఛాయాదేవిగారితో నాకు గతంలో పరిచయం మాత్రమే ఉండేది. కానీ నేను భూమికలో పనిచేసేటపుడు ఆమెతో నాకు దగ్గరితనం పెరిగింది. భూమిక కార్యాలయానికి దగ్గర్లోనే వారి ఇల్లు ఉండడం, ఛాయాదేవిగారు తరచూ భూమికకి వస్తూ పోతూ ఉండడం, ఏదో పనిమీద నేను కూడా వారి ఇంటికి వెళ్తూ వస్తూ ఉండటం దీనికి కారణం. ఆమె రూపం ఎంత అందంగా ఉంటుందో, ఆమె వ్యక్తిత్వం అంతకంటే అందంగా ఉంటుంది. ఆమె వేసుకునే దుస్తులు, పెట్టుకునే బొట్టు, మాట్లాడే మాటలు, మనుషుల్తో మసులుకునే తీరు అన్నీ కూడా ప్రత్యేకంగానే ఉండేవి. ఆమెను చూడగానే ఎవరికైనా గౌరవభావం ఏర్పడేది. ఆమెను ఒక అమ్మలా పలకరించాలని, ఆమె నుంచి ఆప్యాయతను పొందాలని అనిపిస్తూ ఉండేది. భూమిక సత్యవతిగారు రచయిత్రుల చిరునామాలతో అప్పట్లో ఒక డైరీ తీసుకురావాలనుకున్నారు. అందరి చిరునామాలు, వివరాలను సేకరించే బాధ్యతలను నాకప్పగించారు. వాటి గురించి ఛాయాదేవిగారితో చర్చించడం, వారి సలహాలు తీసుకోవడం చేస్తుండేదాన్ని. ఆమె కూడా ఎంతో ప్రేమతో నాకు వివరాలు తెలియజేసేవారు. ఆమెకు తెలిసిన సమాచారం చెప్పేవారు. అలా మా ఇద్దరి అనుబంధం పెనవేసుకు పోయింది. మనుషుల్నే కాదు, జంతువుల్ని కూడా ఆమె ఎంతో ప్రేమగా చూసేవారు. ఈ మాట ఎందుకంటున్నానంటే వారి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా పిల్లి పిల్లలుండేవి. అవి ఆమె చుట్టూ తిరుగుతుండేవి. మాతో మాట్లాడుతూనే వాటికి పాలు పోసి, వాటిని బుజ్జగిస్తూ ఉండేవారు. భూమికలో నాకు మరపురాని మధురమైన జ్ఞాపకం అబ్బూరిగారు. నా కవితల్ని బాగా ఇష్టపడేవారు, ప్రోత్సహించేవారు. నా కవితల గురించి నాతో చర్చించేవారు. వాస్తవాల్ని చాలా ధైర్యంగా రాస్తావని అదే నీలో నాకు నచ్చిన గుణమని మెచ్చుకునేవారు. అంతేకాదు, నా కవితల గురించి నాతో చర్చించేవారు. వాస్తవాల్ని చాలా ధైర్యంగా రాస్తావని అదే నీలో నాకు నచ్చిన గుణమని మెచ్చుకునేవారు. అంతేకాదు, నా కథా సంకలనం చీకట్లో వేగుచుక్కకు ఓల్గా గారితో పాటు అబ్బూరి ఛాయాదేవిగారు కూడా ముందుమాట రాశారు. అది నాకు చాలా సంతోషకరమైన విషయం. ఆ సంకలనానికి శ్రీమతి సుశీలా నారాయణరెడ్డి అవార్డును అక్కినేని నాగేశ్వరరావుగారి చేతులమీదుగా తీసుకోవడం మరో తీపి జ్ఞాపకం.
మేము వాకపల్లి వెళ్ళినపుడు అబ్బూరి ఛాయాదేవి గారు, కొండవీటి సత్యవతి గారు తదితర రచయిత్రులందరితో పాటు నేను కూడా ఆ టూర్‌లో ఉండడం, గిరిజన మహిళల్ని కలవడం, మాతోపాటు జర్నలిస్టులు కూడా ఉండి మా ఫోటోలు, ఈనాడు పేపర్లో ప్రచురించడం, అక్షరాలతో ఓదార్పు అనే టైటిల్‌తో ప్రచురించడం, ఆ పేపర్ కటింగ్ ఇంకా నా దగ్గర భద్రంగా ఉండడం, ఇదొక మరపురాని జ్ఞాపకం. అలాగే నేను ఒక పత్రికలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నప్పుడు ఆ ఎడిటర్‌తో నాకు సమస్య వచ్చినపుడు చాలామంది నన్ను స్ట్రగుల్ చేయవద్దని నిరుత్సాహపరిచారు. ఆఖరికి కొన్ని మహిళా సంఘాలు కూడా లేనిపోని సమస్య తెచ్చుకోవడమెందుకు, వదిలెయ్ అని నన్ను వెనక్కు లాగారు. కానీ అబ్బూరి ఛాయాదేవి గారు మాత్రం ‘ఎవరైతే నీకేంటి, నీ పోరాటం కరక్టే. నువ్వు స్ట్రగుల్ చెయ్యి, వాడికి పనిష్మెంట్ ఇవ్వాలి, ఇంకో మహిళ విషయంలో టార్చర్ పెట్టకుండా ఉండాలంటే నువ్వు తప్పకుండా వాడికి ఎదురు నిలబడి పోరాడాల్సిందే’ అని నాకు చాలా ధైర్యాన్నిచ్చారు. ఇలా ఆమె కథల్లోనే కాకుండా నిజజీవితంలో కూడా ఎంతో మంచి సలహాలు ఇచ్చేవారు. అలాంటి మంచి మనసున్న, మానవత్వమున్న గొప్ప వ్యక్తిత్వం ఉన్న ప్రముఖ రచయిత్రి, నాకు మాతృ సమానురాలు, సాహితీ లోకాన్ని విడిచి వెళ్ళిపోవడం చాలా బాధగా ఉంది. ఆమెని ఇటీవల కాలంలో కలవలేకపోయినందుకు ఎంతో బాధ కలిగింది. సిఆర్ ఫౌండేషన్‌లో ఉన్నారని తెలుసు. ఎప్పటికప్పుడు క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకుంటూ ఉండేదాన్ని. ఇటీవల కూడా ఆ ఫౌండేషన్ మేనేజ్‌మెంట్ కమిటీ మెంబర్లు ప్రస్తుతం నేను ఉంటున్న స్మైల్స్‌కి వచ్చినపుడు వారినడిగి ఆమె గురించి తెలుసుకున్నాను. అబ్బూరి ఛాయాదేవి గారితో నాకున్న అనుబంధం గురించి, ఆమె గొప్ప వ్యక్తిత్వం గురించి వారితో నేను ఆ రోజు చెప్పడం జరిగింది. వెళ్ళి చూడాలనుకుంటూ ఉండగానే ఇలా అదృశ్యమైపోయారు. ఆమె రచనలు, ఆమె సలహాలు అన్నింటిలోను నాకు ఎప్పుడూ తోడుగా నా హృదయంలో చిరస్థాయిగా సజీవంగా నిలిచే ఉంటాయి. ఇదే నేను ఆమెకిచ్చే అక్షర నివాళి.