ఇది అబద్ధమయితే ఎంత బాగుణ్ణు! -అజయ్‌ వర్మ అల్లూరి

కొన్ని రోజుల క్రిందట నేనొక పనిమీద హైదరాబాద్‌ వెళ్ళాను. రచయిత్రి ఓల్గా గారు నాకు నాలుగైదు సంవత్సరాల వెనక పరిచయమై, మేము బాగా ఆప్తులమయ్యాం. నేను ఓల్గా గారి ఇంటిలోనే బసచేసి కొందరి రచయితలనీ, స్నేహితులనీ కలుసుకున్నాను. ఓల్గా- కుటుంబరావు గారి ఆతిథ్యం మరువలేనిది. ఒకరోజు ఉదయాన్నే ‘మీకింకా ఎవరెవరిని కలవాలని ఉంది హైదరాబాద్‌లో?” అనడిగారు కుటుంబరావుగారు. వెంటనే నాలో వెలిగిన పేరు ‘అబ్బూరి ఛాయాదేవి’.

ఛాయాదేవి గారి పేరుని నేను మొదటిసారిగా విన్నది నా పదవ తరగతి వేసవి సెలవుల్లో. మా అన్నయ్య నా కన్నా ఒక సంవత్సరం పెద్ద. అతను ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ ముగించుకుని సెకండ్‌ ఇయర్‌కి వచ్చాడు. మా నాన్నగారు అన్నయ్య చదువుతున్న కాలేజీలోనే నన్ను కూడా ఫస్ట్‌ ఇయర్‌ అడ్మిషన్‌ చేయించారు. మా అన్నయ్య చదువుకున్న ఫస్ట్‌ ఇయర్‌ ఇంగ్లీష్‌ పాఠ్య పుస్తకంలో ఒక్కొక్క పాఠాన్ని చూస్తూ ఉండగా నన్ను ఆకట్టుకున్న పాఠం – బోన్సాయ్‌ బ్రతుకు కథ పేరు కింద Abburi Chayadevi అని ఉంది.

‘అరే తెలుగు పేరులా ఉందే!’ అని రచయిత్రి వివరాలు చూస్తే అది నిజంగా ఒక తెలుగు కథే అని, ఇంగ్లీషు అనువాదం పాఠ్యాంశంగా పెట్టారని తెలిసింది. నా మాతృభాష తెలుగు కనుక

ఉండబట్టలేక ఆ కథని వెంటనే చదివాను. నచ్చింది. సరళమైనప్పటికీ అద్భుతమైన కథ! (కానీ అదే సంవత్సరం మాకు సిలబస్‌ మారిపోయి నేను ఆ కథని అకడమిక్‌గా చదవలేకపోయాను). అప్పటినుంచి ఛాయాదేవి గారి పేరు ఏదో రకంగా నేను వింటూనే ఉన్నాను. ఆమె పుస్తకాలను పోస్టులో తెప్పించుకుని చదివాను. ‘బోన్సాయ్‌ బ్రతుకు’తో పాటు ‘తన మార్గం’, ‘సుఖాంతం’, ‘స్పర్శ’ మరెన్నో కథలు నాకు చాలా బాగా నచ్చాయి. రెండు, మూడు కథలని కన్నడలోకి అనువదించాను ఉండబట్టలేక. ఆమెను ఎప్పటికైనా కలవాలన్న కోరిక గట్టిగా నాటుకుపోయింది.

ముందుగా ఓల్గా గారూ, కుటుంబరావు గారూ, నేనూ ముగ్గురం కలిసి కొండాపూర్‌లో ఆమె నివాసముంటున్న వృద్ధాశ్రమానికి వెళ్ళాలనుకున్నాం. కానీ వాళ్ళిద్దరికీ వేరే పనులు ఏర్పడడం వలన కుదరలేదు. మరుసటి రోజు నేనొకణ్ణే అయినా సరే వెళ్ళి తీరాలని నిశ్చయించుకున్నాను. ఓల్గా గారు ఫోన్‌ చేసి వెళ్ళమన్నారు. ఫోన్‌ నంబర్‌ ఇవ్వనా అనడిగారు. నా దగ్గర ఉంది మేడమ్‌, వద్దు అన్నాను.

అబ్బూరి ఛాయాదేవి గారిని కలవడానికి వెళ్ళబోతున్నానని తెలిసి మిత్రుడు రమేశ్‌ కార్తీక్‌ నాయక్‌ (‘బల్దేర్‌ బండి’ కవి) తనూ వస్తానన్నాడు నాతోపాటు. సరే అని ఇద్దరమూ కలిసి సికింద్రాబాద్‌ బస్టాండ్‌ చేరుకున్నాము. నాకు ఓల్గా గారు ‘ఫోన్‌ చేసి వెళ్ళు’ అన్న మాట గుర్తొచ్చింది. ఫోన్‌ చెయ్యాలా? చేస్తే ఏమవుతుంది? ‘ఫరవాలేదు వచ్చి కలవండి’ అనంటే రెక్కలు కట్టుకుని హాయిగా వెళ్ళి రావచ్చు కానీ ‘ఆరోగ్యం బాగా లేదు. ప్రస్తుతం ఎవరినీ కలవలేను’ అనంటే ఏం చెయ్యాలి! ఒకవేళ చెప్పా పెట్టకుండా వెళ్ళి అక్కడ హాజరవుతే? ఆమె అనారోగ్యంతో మాట్లాడకపోయినా కనీసం ముఖదర్శనమైనా కలుగుతుందిగా అనిపించింది. అందుకే ఫోన్‌ చెయ్యకుండా ఇద్దరం కొండాపూర్‌ బస్సు ఎక్కాం. మధ్యాహ్నం రెండు దాటింది.

బస్సు ఎక్కినప్పటి నుండి ఒకటే దిగులు – ఆమెను కలవగలనా? చూడగలనా? ఆమెతో రెండు మాటలు మాట్లాడితే ఎంత బాగుంటుంది. మాట్లాడగలనా? అని. దేవుడిపై నాకు పెద్దగా నమ్మకం లేదు. కానీ ఆ రోజు బస్సులో దేవుణ్ణి ఎన్నిసార్లు వేడుకున్నానో తెలియదు. ఎలాగైనా ఛాయాదేవి గారిని, నన్నూ కలిసేలా చెయ్యమని ప్రార్థించాను. రమేష్‌తో మనల్ని కలవనిస్తారో లేదో, ఆమె ఆరోగ్యం ఎలా ఉందో ఏమిటోనని అన్నాను. అతను తప్పక కలుస్తారులే అన్నాడు చిన్నగా నవ్వుతూ.

కొండాపూర్‌లోబస్సు దిగిన తరువాత, అక్కడినుండి ఆటోలో వెళ్ళాల్సి వచ్చింది ఆమె ఉంటున్న ఆశ్రమానికి. ఎండ వేడి తట్టుకోలేక ఒక చల్లని వాటర్‌ బాటిల్‌ కొనుక్కున్నాం. ‘సి.ఆర్‌.ఫౌండేషన్‌ వెళ్తావా?’ అనడిగాం దగ్గరలో ఉన్న షేర్‌ ఆటోవాడిని. అతను కూర్చోమన్నాడు. ఆటో ఎక్కిన ఐదు నిమిషాల్లో దిగాము ఫౌండేషన్‌కు ఎదురుగా ఇవతలి రోడ్డులో. ‘ఏమైనా ఫ్రూట్స్‌ పట్టుకెళ్దామా?’ అన్నాడు రమేష్‌. ఆమెకు ఏ ఫ్రూట్స్‌ ఇష్టమో తెలియదు కనుక వద్దన్నాను. రోడ్డు దాటి ఫౌండేషన్‌ లోపలికి చేరుకున్నాము.

దూరంలో ఒక టేబుల్‌, మూడు నాలుగు కుర్చీలూ కనబడ్డాయి. ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు ఉన్నారక్కడ. మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా వివరాలు చెప్పి ‘అబ్బూరి ఛాయాదేవి’ గారిని కలవాలి అన్నాము. వాళ్ళలో ఒకతను ఏదో లిస్టు తిరగేసి ఆమెది ఫలానా రూం నంబర్‌ అని చెప్పాడు. మా ఇద్దరి వివరాలు రిజిస్టర్‌ బుక్‌లో రాసి వెళ్ళమన్నాడు. నేను నా వివరాలు రాశాను. రమేశ్‌ రాయబోతుంటే ‘ఒకరివి చాలులెండి’ అన్నాడు మళ్ళీ అతనే. ఎందుకన్నా మంచిదని, నేను రాసిన వివరాలని ఫోటో తీసుకున్నాను. ఒకవేళ ఛాయాదేవి గారిని కలవలేకపోతే, మేమిలా ఆమెను కలవడానికి వచ్చామన్న ఈ జ్ఞాపకమైనా ఉంటుందని. అక్కడనుండి నేరుగా వృద్దాశ్రమ బిల్డింగుకు వెళ్ళాం.

‘రూం నంబర్‌ 126 ఎక్కడుందండి?’ ఎవరినో అడిగాము.

‘ఇలా అటు వెళ్ళి కుడివైపుకి తిరిగితే లిఫ్ట్‌ ఉంటుంది. పైకెళ్ళండి అటు మూలలో ఉంటుంది’ అన్నారాయన.

లిఫ్టు ఎక్కి పైకి చేరుకోగానే ఒక పనిమనిషి ఎదురయ్యింది.

‘రూం నం 126 ఎక్కడుందమ్మా?’ అనడిగాము.

ఆమె ఆ రూము ఎటుందో చెప్పి, లిఫ్టులోకి చేరుకుంది. నేను ఆత్రంగా వెళ్ళి ఆమెను అడిగాను. ఆమె ఇంకా లిఫ్టు బటన్‌ నొక్కలేదు.

‘అబ్బూరి ఛాయాదేవిగారు మీకు తెలుసా? ఆమె ఆరోగ్యం ఎలా ఉంది? ఇప్పుడు వెళ్తే కలుస్తారా?’ అనడిగాను.

‘తెల్సు. ఫరవాలేదు. కాస్త నీరసంగా ఉన్నారు. కలుస్తారో ఏమో తెలీదు’ అందామె.

మేమిద్దరం వెంటనే అటు వెళ్ళి కుడివైపుకి తిరిగి ప్రతి డోరు నంబరూ చూస్తూ నడిచాము. అక్కడి సంఖ్యల వరుసని చూస్తే రూము చివరిలో ఉందని అనిపించింది. అటువైపుకు చూస్తే గోడ దగ్గర ఒకామె ఏవో కుట్టుకుంటూ కూర్చున్నట్లు కనిపించారు. నేను ఆమెనే ఛాయాదేవి గారనుకున్నాను. అచ్చం ఫోటోల్లో, వీడియోల్లో చూపినట్లే ఉన్నారు దూరం నుంచి. ఆమె మమ్ములని దూరంనుంచే గమనించి మళ్ళీ పనిలో నిమగ్నమయ్యారు. మేము దగ్గరికి వెళ్ళాం ఆత్రంగా.

‘ఎవరండి మీరు? ఎవరు కావాలి?’ అన్నారామె.

‘మేము ఛాయాదేవి గారిని కలవడానికి వచ్చాం. ఆమె మీరే కదూ?’ అనడిగాను.

‘అబ్బే! కాదండి. ఆవిడ మా అక్క. లోపల పడుకుంది. మీరిలా కూర్చోండి. నేను వెళ్ళి చూస్తాను ఆమె నిద్ర లేస్తుందా అని’.

టైము చూసుకున్నాను. మూడు గంటలు. ఆమె లోపలికెళ్ళి లైటు వేశారు. నేను అవతల నుండే తొంగి చూస్తూ నించున్నాను ఛాయాదేవి గారు కనపడతారా అని. ఆమె కాళ్ళు పైకి ముడుచుకుని పడుకున్నారు. లైటు వేసినా చలించలేదు. నిద్రపోతున్నారని చెల్లెలు గారు బయటకు వచ్చారు తట్టి లేపకుండా.

‘ఆమె నిద్రపోతోందండి. నేను లోపల కూర్చున్నా ఇరిటేషన్‌ ఫీలవుతోంది ఈ మధ్య’ అన్నారామె.

‘ఆవిడ ఆరోగ్యం ఎలా ఉంది?’

‘మొన్ననే అన్ని చెకప్స్‌ చేయించాము. ఏ వ్యాధీ లేదు. కానీ ఆమె బొత్తిగా తినడం మానేసింది. దానివల్ల నీరసం. ఈ రోజు పడిపోయింది బాత్‌రూమ్‌లో.’

‘అయ్యో’ అన్నాము నేనూ, రమేష్‌

‘పడిపోయినట్లు కూడా చెప్పదు. నేను చూసి వెళ్ళి చెయ్యి పట్టుకోబోయినా చెయ్యి ఇవ్వదు. తనే లేస్తాను అంటుంది. ఈ రోజు లేవడానికి తనకు ఓపిక చాల్లేదు. దేక్కుంటూనే వచ్చింది మంచందాకా. ఎవరిమీదా ఆధారపడకూడదంటుంది. ఈ వయస్సులో అన్నీ కుదురుతాయా చెప్పండి.’

నాకు ‘తన మార్గం’ కథలో వర్థనమ్మ పాత్రే గుర్తుకొచ్చింది.

‘మరి ఆవిడ మమ్మల్ని కలుస్తారా? చాలా ఆశతో వచ్చాము. కనీసం ఆమెను చూసైనా వెళ్ళాపోతాము’ అన్నాన్నేను.

‘మూడున్నరకి టీ బెల్లు కొడతారు. అప్పుడెలాగో లేస్తుంది. వెళ్ళి అడుగుతాను. మీ పేరేమన్నారు?’

‘నేను అజయ్‌. మాది కర్నాటక. మాతృభాష తెలుగే. అతను రమేష్‌. ఇక్కడే హైద్రాబాద్‌లో ఉండి చదువుకుంటున్నాడు. నేను నాలుగు రోజుల క్రితం ఓల్గా గారింటికి వచ్చాను, ఒక పని మీద హైద్రాబాద్‌కి’

‘ఓ అవునా. ఓల్గా కూడా ఇక్కడికి వచ్చారు అప్పుడోసారి. నేను ఆమె రాసిన యశోబుద్ధ పుస్తకం చదివాను ఇటీవల’

‘అవునా. వాళ్ళకి రావడానికి కుదరలేదు. మీ పేరు ఏంటండి?’ అనడిగాను.

‘అదే ఓల్గా గారి పుస్తకంలోని… యశోధర’.

‘అలాగా’

‘ఛాయాదేవి గారు ఎప్పటినుంచి ఉంటున్నారు ఈ ఆశ్రమంలో?’

‘తను 2012లో వచ్చింది. అప్పుడు తనొక్కతే అటువైపు వేరే రూములో ఉండేది. మా ఆయన పోయాక నేనూ ఈమెతో

ఉందామని ఇక్కడికి వచ్చేశాను కొన్నేళ్ళ కిందట. అప్పుడు మాకు ఈ రూము ఇచ్చారు’.

ఇలా ఆవిడ కొన్ని విషయాలు చెబుతూ పోయారు.

‘మీతో ఒక్క ఫోటో తీయించుకోవచ్చా… గుర్తుగా?’ అడిగాను.

‘అబ్బే వద్దండి. మరోలా అనుకోవద్దు. నేను మా అక్కంత పెద్ద వ్యక్తినేం కాదు. ఏదో అన్నమాచార్య కీర్తనలు పాడతాను. ఎక్కువగా చదువుకోలేదు. చదువుపై ఇష్టం ఉండేది కాదు చిన్నప్పుడు. నాకు ఫోటోలన్నా ఇష్టం ఉండదు. తనకైతే చాలా పిచ్చి ఫోటోలంటే. తనకు హుషారు ఉండి మీతో రెండు మాటలు మాట్లాడితే తనే చెబుతుంది ఫోటో తీయమని’.

బెల్లు మ్రోగింది. టైము చూస్తే సరిగ్గా మూడున్నర. పక్క రూమువాళ్ళు చిన్న గ్లాసులు చేత్తో పట్టుకుని టీకని బైటికి వచ్చారు.

‘మాకు టీ ఇక్కడికి తెచ్చిస్తారండి. మీరు కూడా తాగుదురుగాని. మరో మాట. ‘పడిపోయారంటగా!’ అని అక్కని అడగవద్దు. అలా అంటే ఆమెకు ఇష్టం ఉండదు’.

ఆమె లోపలికి వెళ్ళి లైటు వేసారు. ఏవో చిన్న గుసగుసల్లాంటి మాటలు వినబడ్డాయి. ఛాయాదేవిగారు లేచారని నాకు సంతోషం కలిగింది.

‘లోపలికి రండి బాబూ’ అన్నారు యశోధర గారు.

ముఖం నిండా వెలుగులు చిమ్ముతూ మేము లోపలికి వెళ్ళాము. ఛాయాదేవిగారు మంచం మీద కూర్చుని

ఉన్నారు. నా ముఖంలో ఆనందం చూసి ఆమె చిరునవ్వు చిందించారు. కళ్ళద్దాలు పెట్టుకోలేదు. అందుకే వేరేలా కనబడుతున్నారు. నేనెప్పుడూ ఆమెను కళ్ళద్దాలతోనే చూశాను ఫోటోల్లో. బాగా చిక్కిపోయారు.

‘నమస్తే మేడం. నేను మీకూ, మీ కథలకూ పెద్ద అభిమానిని. మాది కర్నాటక. అక్కడ మైసూరు యూనివర్శిటీలో ఫిజిక్సులో ఎమ్మెస్సీ చదువుతున్నాను.’

‘అవునా. ఇలా కూర్చోండి’

నేను చెబుతోంటే ఆమె శ్రద్ధగా వింటున్నారు. అన్ని వివరాలూ చెప్పాను.

ఫోనులో ఒక ఫోటో చూపిస్తూ ‘మీ పక్కని కూర్చున్నది ఎవరో గుర్తున్నారా?’ అనడిగాను.

‘ఎందుకు గుర్తులేదు. సత్యవతి. పి సత్యవతి ఈమెనెలా మర్చిపోతాను!’

నేను చిన్నగా నవ్వాను. యశోధరగారు మా ముగ్గురికి టీ తెచ్చి ఇచ్చారు. రమేష్‌ పుచ్చుకున్నాడు. నేను టీ తాగనంటే, వెంటనే రస్కులు ప్లేటులో పెట్టి ఇచ్చారు. రస్కులు కూడా నేను తినలేదు. నా ఆత్రమంతా ఛాయాదేవి గారితో మాట్లాడాలనే. టీ వేడిగా ఉండడం వల్ల ఛాయాదేవి గారు కాసేపటి తరువాత పుచ్చుకుంటానని చెప్పారు.

‘నేను మా అన్నయ్య పుస్తకంలో చదివాను మీ ‘బోన్సాయ్‌’ కథని. మీవి మూడు కథలు అనువదించాను కన్నడలోకి. కర్నాటకలో కూడా మీ కథలకి చాలామంది అభిమానులున్నారు’.

‘నేను నమ్మలేకపోతున్నాను. ఆశ్చర్యంగా ఉంది. రియల్లీ ఐ డోంట్‌ డిజర్వ్‌ ఇట్‌’.

‘నో యూ రియల్లీ డిజర్వ్‌ ఇట్‌. మీకు తెలియదు’ అన్నాను నవ్వుతూ.

రమేష్‌ కూడా నవ్వాడు.

‘మీరు ఇంత పెద్ద రచయిత్రి. ఇలా ఆశ్రమంలో ఉండడం ఏంటి అనుకున్నాను. తర్వాత తెలిసింది. ఎవరిమీదా ఆధారపడకూడదని, మీరు మీ ఇష్టంతోనే వచ్చారని.’

ఆమె ఊ.. అన్నారు తప్ప ఏమీ మాట్లాడలేదు. కానీ పెదాల మీద నవ్వు చెదరలేదు.

‘ఈ రోజు పొద్దున్న పడిపోయాను బాత్రూములో’ అన్నారు.

నేనూ, రమేష్‌ ఒక్కసారిగా యశోధర గారి వంక చూసి ‘అయ్యో’ అన్నాము.

‘మరి మనం కలుసుకున్నందుకు ఏమైనా గుర్తులు ఉంచుకుంటారా?’ అన్నారు ఛాయాదేవిగారు.

నాకు వెంటనే యశోధరగారి మాట గుర్తొచ్చింది.

‘ఇదిగో చూశారా అండి ఫోటో తీయించుకోవడానికి ఛాయాదేవిగారి ఆతృత!’ అన్నాను యశోధరగారితో.

యశోధర గారు నవ్వి బయటకు వెళ్ళిపోయారు, బహుశా ఫోటోలో ఉండకూడదని.

నేనూ, ఛాయాదేవి గారు మాట్లాడుతుండగానే రమేష్‌ ఫోటోలు, వీడియోలు తీయడం మొదలుపెట్టాడు. మా సంభాషణ సాగింది.

‘నేను రుక్మిణి గోపాల్‌ గారికి థాంక్స్‌ చెప్పుకోవాలి. ఆవిడ వల్లే మీరు కథలు రాయడం మొదలుపెట్టారటగా!”

‘అవును. మా అన్నయ్య భార్య. పోయినేడాది చనిపోయింది. మా తోటికోడలు కూడా చనిపోయింది. నాకంటే చిన్నవాళ్ళందరూ చనిపోతున్నారు. నేనే ఇంకా పోవడంలేదు. సిగ్గేస్తుంది.’

అలా అన్నందుకు ఏం చెప్పాలో నాకు తోచలేదు.

‘ఆవిడ తలగడ కింద ఒక తాళం చెవి ఉంది. తీసుకుని లేచారు. నేను చెయ్యి పట్టుకోబోతోంటే ఫరవాలేదు అన్నారు. బీరువా దగ్గరకు వెళ్ళి తాళం తీసి ఒక పుస్తకం తీశారు చీరెల కింద నుంచి. తలుపు తాళం వేస్తుంటే పడడంలేదు. నేను వెయ్యనా అని అడుగుదామనుకున్నాను. అడగలేదు. దాన్ని అలాగే వదిలి వచ్చి నాకు పుస్తకం ఇచ్చి కూర్చున్నారు.

‘ఇది ఇటీవల సప్తవర్ణి వారు వేసిన పుస్తకం’.

‘ఓ!’ అన్నాను పుస్తకాన్ని మెత్తగా తాకుతూ. ‘Why should n’t girls laugh?’ అనే పుస్తకమది.

ఛాయాదేవి గారు పుస్తకం పుచ్చుకుని పేజీలు తెరుస్తూ ప్రతి దానిలోని ప్రతి విషయాన్ని చెబుతూ వెళ్ళారు.

ఢిల్లీలో నెహ్రూగారిని కలవడం, పాములవాడు నెహ్రూ గారి మెడలో విషం తీసిన పాముని వేయడం, అప్పుడు ఇందిరాగాంధీ గారు అక్కడికి వచ్చి ‘వాట్‌ నాన్సెన్స్‌ ఈజ్‌ గోయింగాన్‌’ అనడం, ఇందిరాగాంధీ గారు ఈమెకు ఝాన్సీ లక్ష్మీబాయిలా కనపడడం, ఈమె ఝాన్సీ లక్ష్మీబాయి బొమ్మ తయారుచేసి ఆమెకు పంపడం, ఆమె మెచ్చుకుని ఈమెకు ఉత్తరం రాయడం… ఇలా అన్నీ చెబుతున్నారు.

‘మీరు ‘ఛాయా చిత్ర కథనం’ చూశారా.. రాజమండ్రి నుంచి రాజమండ్రి దాకా అనుంటుందే… అది చూశారా?’ అనడిగారు.

‘ఫోన్‌లో కవర్‌ పేజీ చూశాను. పుస్తకం చూడలేదు’ అన్నాను.

‘అదుగో అక్కడ పైన ఉంది ఇటివ్వండి’ అని రమేష్‌కు చెప్పారు. అతను తీసి నా చేతికి ఇచ్చాడు.

‘ఉందా.. రాజమండ్రి నుంచి రాజమండ్రి దాకా అని?’ అనడిగారు.

‘ఉంది మేడమ్‌’.

ఆమె ఆ పుస్తకాన్ని తీసుకుని మరికొన్ని విషయాలు వివరించసాగారు. చిన్నప్పుడు ఆవిడ తీయించుకున్న మొదటి ఫోటో నుంచి అన్ని ఫోటోల సందర్భాన్నీ వివరిస్తున్నారు.

ఇంతలోగా యశోధరగారి మొబైల్‌ రింగయ్యింది. రమేష్‌ ‘మేడమ్‌… మేడమ్‌’ అన్నాడు బయట కూర్చున్న ఆమెకు వినపడేలా.

‘అమ్మలూ’ అని ఛాయాదేవి గారు కూడా అతనితో గొంతు కలిపారు.

‘అరే! అమ్మలు’ అంటే బోన్సాయ్‌ బ్రతుకు కథలోని చెల్లెలి పాత్ర కదూ!’ అన్నాను మురిసిపోతూ.

‘అవును. ఇది ఆమె పేరే. ఇంట్లో అందరూ ‘అమ్మలూ’ అని పిలిచేవాళ్ళం ఈమెను. నన్ను ‘ఛాయలూ’ అనేవారు.’

నేను ‘తన మార్గం’ పుస్తకాన్ని ఇస్తూ మీ సంతకం కావాలి నాకు అడిగాను జేబులోంచి పెన్‌ తీసిచ్చి.

ఆమె పేజీలు తిరగేశారు. ఇండెక్సు చూసుకున్నారు. సంతకం ఎక్కడ పెట్టాలో చూశారు. నేను ఫలానా పేజీలో పెట్టమన్నాను.

‘నా రైటింగ్‌ మొత్తం చెడిపోయింది. వంకరగా రాస్తాను సారీ’ అంటూనే ఇలా సంతకం పెట్టారు.

‘చిరంజీవి

అజయ్‌ కుమార్‌ వర్మకి

ఆశీస్సులతో

అబ్బూరి ఛాయాదేవి’

‘ఈ రోజు తారీఖు ఎంత?’

’21’

‘21.6.2019’ అని రాసారు ఆమె పేరు కింద.

‘సారీ, వంకరగా రాసానా?’

‘అయ్యో! భలేవారే. చాలా బాగా రాశారు మేడమ్‌’ నా పేరులో కుమార్‌ లేదు అని చెప్పడమెందుకని ఊరుకున్నాను.

‘ఇంగ్లీషులో అయితే బాగా రాయగలను ఒంకరగా కాకుండా’ అన్నారు.

రమేష్‌ వెంటనే, తన బ్యాగులోంచి తను కథలు రాసే నోటుబుక్కు తీసిచ్చి ‘మీరేమైనా రెండు లైనులు రాస్తారా ఇంగ్లీషులో.. ఈ పేజీపై గుర్తుగా’ అనడిగాడు.

ఆమె కాదనకుండా అతని చేతిలో పెన్ను పుచ్చుకుని, అరనిమిషం ఆలోచించి ఇలా రాసారు..

Dear Ramesh,

Thank you for coming to see me

along with your friend and my admirer

Ajaya Varma

admirer అనే పదం రాస్తూ… ‘ఎందుకు నా మీద మీకింత అడ్మిరేషన్‌?’ అనడిగారు నన్ను.

‘ఏమో మేడం, మీరు అచ్చం మా అమ్మమ్మలా అనిపిస్తారు నాకు. మీ కథలూ, మీరూ అంటే చాలా ప్రేమ’.

‘ఏంటో మీ పిచ్చి ప్రేమ’.

‘పిచ్చి ప్రేమేం కాదులెండి’ అన్నాడు రమేష్‌ నవ్వుతూ.

‘Chayadevi ‘ అని సంతకం చేస్తుండగా…

‘వీళ్ళిద్దరి ఆరోగ్యం బావుందా? ఓల్గానూ, కుటుంబరావూ’

‘బాగానే ఉంది’

‘సత్యవతి వాళ్ళందరూ కూడా వచ్చారు ఇక్కడికి.’

‘ఎవరు పి.సత్యవతిగారా? కొండవీటి సత్యవతిగారా?’

‘అందరూ.. పి.సత్యవతి కూడా’

యశోధరగారు లోపలికి వచ్చారు. ఫోన్‌ మాట్లాడడం అయ్యాక మొబైల్‌ని లోపల పెట్టడానికి.

‘మేడమ్‌. ుThanks for coming to see me అని రాశారే. నిజంగా మీకు థాంక్స్‌ చెప్పాలి మేము. మీరు కలుస్తారో లేదో అని అనుకున్నాము’ అన్నాను.

‘పాపం నిన్ను కలవాలని మూడింటి నుంచే వేచి ఉన్నారు. సాయంత్రం అయినా ఫరవాలేదు. నిన్ను కలవాలన్నారు. నేను నిన్ను నిద్ర లేపలేదు’. ‘అయ్యో! నిద్రేమీ లేదు. అలా పడుకున్నానంతే. సారీ’ అన్నారు.

‘అయ్యో మేడమ్‌! మీరు మాకు సారీ చెప్పడమేంటి. ఫరవాలేదు’ అన్నాము.

అప్పటికే వర్షం మొదలయింది. మాకస్సలు తెలియలేదు. యశోధరగారు చెప్పారు. ఛాయాదేవి గారి మాటలు, జోకుల వర్షంలోనే మేము అంతగా తడిసిపోతూ బయటి లోకాన్ని మర్చిపోయి వింటున్నాము. రమేష్‌ వివిధ భంగిమల్లో మా ఫోటోలని తీస్తూనే ఉన్నాడు మా సంభాషణ వింటూనే.

ఛాయాదేవి గారు సంతకం పెట్టి పెన్నును దూరంగా పెట్టారు. కాసేపటికి దాని ఎర్రని క్యాప్‌ మెరుస్తోన్నట్లుగా కనిపించిందో, కావాలనే అడిగారో తెలియదు…

‘ఏంటది ఎర్రగా?’

‘పెన్ను మేడం. పెన్ను క్యాప్‌’ ఇద్దరం ఏకథాటిగా అన్నాం.

‘బ్లడీ పెన్‌’ అన్నారామె. మేము నవ్వాము.

బయట నీళ్ళ వర్షం… లోపల ఛాయాదేవి గారి జోకుల వర్షం. భలే ఉంది. నాకు వెంటనే ఓల్గా గారు గుర్తొచ్చారు. నేను వారి ఇంట్లో మూడు రోజులు ఉన్నప్పుడు ఒక్క వాన చుక్కయినా కురవలేదు. ‘పక్షులు కూడా మనలాగే వాన కోసం ఎదురుచూస్తున్నాయి. పాపం కురుస్తే బాగుణ్ణు’ అన్నారు ఓల్గా గారు ఒకరోజు బాల్కనీలో కూర్చున్నప్పుడు. అదే విషయం చెప్పాను ఛాయాదేవిగారితో.

ఆమె చిరునవ్వు నవ్వారు.

‘మేడం చూశారా. మిమ్మల్ని కలవగానే వర్షం మొదలైంది. మనిద్దరం కలుసుకున్నందుకు ఇది మంచి గుర్తు కదా’ అన్నాను.

‘ముందే తెలిసుంటే ఓల్గా గారు నిన్ను మూడు రోజుల కిందటే పంపేసేవారు ఛాయాదేవి గారి దగ్గరికి’ అన్నాడు రమేష్‌.

అందరమూ నవ్వుకున్నాము యశోధరగారితో సహా.

‘ఇప్పుడు ఉట్టి వర్షమే. మీకు తెలుసా మా పెళ్ళి టైములో ఎంత వరదో!’ అన్నారు ఛాయాదేవిగారు.

‘తెలుసు. వరద రాజేశ్వరరావుగారి పెళ్ళి వేళ ‘వరద’లే వరదలు. ఎందుకు తెలియదు. మీరొకచోట రాసారుగా, చదివాను’

మళ్ళీ అందరం నవ్వుకున్నాము.

ఛాయాదేవి గారు ‘ఛాయాచిత్ర కథనం’, మరో ఇంగ్లీష్‌ పుస్తకం కానుకగా ఇచ్చారు.

పుస్తకం తిరగేస్తుంటే, ఛాయాదేవి గారు అప్పుడెప్పుడో లంబాడీ డ్రెస్‌ వేసుకుని తీయించుకున్న ఫోటో కనబడింది. రమేష్‌ వెంటనే ఆనందంతో తన పుస్తకం ‘బల్దేర్‌ బండి’ని తీసి ఛాయాదేవి గారికి ఇచ్చాడు.

‘మేడమ్‌, నేను లంబాడీని. ఇది మా జీవితాలపై నేను రాసిన కవిత్వం’ అన్నాడు.

ఆమె చాలా సంతోషంగా చూశారు ఆ పుస్తకాన్ని. అతనితో ‘మా తండా’ అనే కవిత చదివి వినిపించుకున్నారు.

‘మీరే రాశారా. చాలా బాగుంది. Hearty Congratulations’ అన్నారు అతని భుజం తట్టుతూ.

‘మేడమ్‌ టీ తాగుతారా. ఇప్పుడు కాస్త చల్లబడిందేమో’

రమేష్‌ టీ గ్లాస్‌ అందించాడు. ఆమె టీ తాగుతూ రమేష్‌ మాటలు వింటున్నారు.

‘మీ జీవితాలపై జూతీశీరవ కూడా రాయండి. So, once upon a time – I became a part of your community అన్నమాట’

‘నడుం లాగుతోంది. పడుకుని మాట్లాడతాను’ అన్నారు.

వర్షం తగ్గడంలేదు. తగ్గేదాకా ఇక్కడే ఉండండి అన్నారు. మళ్ళీ మాటలు మొదలయ్యాయి. వారి ఢిల్లీ రోజులు, సాహిత్య అకాడెమీ గురించి కబుర్లు, ‘వరద’గారి సెన్సాఫ్‌ హ్యూమర్‌, పాత జోకులు… అన్నీ.

రమేష్‌ వంక చూసి ‘మీరు నా బాల్యపు స్నేహితుడు’ అన్నారు.

‘ఎందుకో?’ అన్నాన్నేను.

‘ఫోటోలు తీశారుగా. నాకు ఫోటోలు తీసేవారంటే ఇష్టం’ అన్నారు.

మేమిద్దరం నవ్వుకున్నాం ఆమె అన్న మాటలకి సంతోషంగా. టైం ఐదున్నర దాటింది.

‘ So I am meeting two brilliant boys’ అన్నారు.

మా ముఖాల్లో చిరునవ్వు, ఆనందం.

రమేష్‌కి సాహిత్య అకాడమీ అవార్డు ఫలకం కనిపించింది గది మూలల్లో. వెంటనే దాన్ని చేతిలోకి తీసుకోబోయాడు.

నేను వద్దు వద్దు అన్నాను.

ఛాయాదేవి గారు లేచి కూర్చున్నారు.

రమేష్‌ ”ఈ అవార్డుతో మీకు మరో రెండు ఫోటోలు తీస్తాను. సరేనా?” అన్నాడు.

ఛాయాదేవి గారు సరే అన్నారు. రమేష్‌ ఆమెకు కుడివైపున అవార్డు ఫలకం పెట్టాడు. నేను ఎడం వైపున ‘తన మార్గం’ పుస్తకం పెట్టాను. ఫోటోలు తీశాడు… ఒకటి, రెండు, మూడు. నేను ఆ ఫలకాన్ని తీసి జాగ్రత్తగా అక్కడే పెట్టేశాను.

‘ఏంటి మూలలో పెట్టారు అవార్డుని, ఎవరికీ కనబడకూడదనా?’

‘నేను కథలు రాయడానికి నా భర్త ‘మూల’పురుషుడు. అందుకే ఆ కథల వల్ల వచ్చిన అవార్డు కూడా మూలనే!’ అని మరో జోకు విసిరారు.

‘నన్నడిగితే ఈ విషయంలో ఇలా అస్సలు ఒప్పుకోనండి. మా భర్త మాత్రం నాకు ప్రధాన పురుషుడే’ అన్నారు యశోధరగారు.

‘టైముకి బాగా తినండి’ అన్నాము నేనూ, రమేష్‌ ఛాయాదేవిగారితో.

‘ఏదీ హితముగా అనిపించడంలేదు’

‘మీ చెల్లెలుగారు మీకు తోడుగా ఉన్నారుగా. కాస్త తినండి’ అన్నాను.

‘అయ్యో! అలా అనకండి బాబూ. తను ఒప్పుకోదు. మీరు వెళ్ళిన తరువాత నన్ను తిడుతుంది. తనకు ఎవరి తోడూ వద్దు. ఎవరిమీదా ఆధారపడకూడదంటుంది’ అన్నారు యశోధరగారు.

ఛాయాదేవి గారు మంచం మీద వాలారు. రమేష్‌ వర్షం తగ్గిందా అని చూడడానికి బయటకు వెళ్ళాడు. నేను పడుకుని ఉన్న ఛాయాదేవి గారినే చూస్తూ ఉన్నాను. నా కంటిలో తడి. ఛాయాదేవి గారు నా కళ్ళనే చూస్తున్నారు. నా కంటి తడిని కనిపెట్టారేమో. నేను ముఖం తిప్పుకున్నాను, ఆమెకు ఇష్టముండదని.

‘కాస్త తగ్గింది వెళ్దామా’ అన్నాడు రమేష్‌ లోపలికొచ్చి.

మేమిద్దరం ఆమెకు నమస్కరించి గది బయటకు వచ్చాము. చెప్పులేసుకుంటుంటే ఆమె లేచి చేతి కర్ర పుచ్చుకుని బాత్రూంవైపు వెళ్తున్నారు. మేము బయటినుంచే చూశాము.. చిరునవ్వు నవ్వారు వెళ్ళిరండి బాబూ అన్నట్లుగా.

అలా మేము అక్కడినుండి వచ్చేశాము. దారినిండా ఛాయాదేవి గారి మాటలని, జోకులని నెమరు వేసుకున్నాము.

నేను అక్కడినుంచి మా బంధువుల ఇంటికి సంగారెడ్డికి వెళ్ళాను. మేము తీసుకున్న ఆ ఫోటోలను తిరగేస్తుండగా ఒక చిత్రం తెలిసింది. నేను ఆ రిజిస్టర్‌లో వివరాలు రాసిన ఫోటో తీశానుగా ఎందుకైనా మంచిదని. ఆ ఫోటో చూస్తే అక్కడ నా పేరు రాయకుండా ‘Abburi Chayadevi’ అని రాశాను. నేనే నమ్మలేకపోతున్నాను! ఛాయాదేవి గారిని కలవాలన్న ఆరాటంలో నా పేరు రాయడం మర్చిపోయి…

‘నా తల నిండా ఆమె ఎంతగా నిండిపోయారో… ఛాయాదేవి గారు అన్నది నిజమే. నాది నిజంగా పిచ్చి ప్రేమ’ అని నాలో నేను నవ్వుకున్నాను. నాలుగు రోజుల తరువాత అక్కడినుండి కర్నాటకకు బయలుదేరి వచ్చేశాను.

మళ్ళీ ఇప్పుడు సరిగ్గా వారం రోజుల తరువాత, 28వ తేదీ ఉదయం ఓల్గా గారి మెసేజ్‌ ‘Ajay! Chayadevi garu is no more. sad!Sad!Sad!’ అని.

ఇది అబద్ధమయితే ఎంత బావుణ్ణు!

ఏ ఋణానుబంధమో ఏమో ఆశ్రమానికి వెళ్ళి ఆమెను కలుసుకుని మాట్లాడిన ఆఖరు విజిటర్‌ని నేనేనేమో… నాతోపాటు రమేశ్‌ కూడా.

ఛాయాదేవి గారు తమ పుస్తకంలో రాసుకున్న మాట గుర్తొచ్చింది…

“who can stop the flow of life?

And if life is coming to an end

who ca make it continue to flow”

నిజమేగా…

Share
This entry was posted in ప్రత్యేక సంచిక - అబ్బూరి ఛాయాదేవి . Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.